Revanth Rahul

రేవంత్ రెడ్డిపై నమ్మకం కోల్పోతున్న కాంగ్రెస్ నాయకత్వం

కేసీఆర్ ను ఎదురొడ్డి పోరాడి, ఆయనకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చిన యోధుడిగా గుర్తించి మొన్నటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిందే వేదంగా కాంగ్రెస్ అధిష్టానం చేస్తూ వస్తున్నది. పార్టీలో సీనియర్లను సైతం లెక్క చేయకుండా రేవంత్ రెడ్డి సూచించిన వారికే పార్టీలో, ప్రభుత్వంలో పదవులు; ఎన్నికల సమయంలో సీట్లు ఇస్తూ వచ్చారు. అయితే, ఇప్పడూ ఆయనపై ఆ నమ్మకం సడలినట్లు కనిపిస్తున్నది. ఎన్నిసార్లు దిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసినా అయన మాటలకు విలువ ఇవ్వడం లేదు. గత 8 నెలల్లో 20 సార్లు వెళ్లి వచ్చారు. ఇదివరకటి మాదిరిగా అడిగిందే తడవుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కలిసేందుకు కూడా అనుమతి ఇవ్వడం లేదు. మంత్రివర్గ విస్తరణకు ఎన్నిసార్లు ముహుర్తాలు పెట్టుకున్నా ఆయన ఇచ్చినా జాబితాను ఆమోదించడం లేదు. రేవంత్ రెడ్డి ఏకపక్ష ధోరణుల కారణంగానే లోక్ సభ ఎన్నికలలో పార్టీ ఆశించిన విధంగా సీట్లు కోల్పోయినట్లు భావిస్తున్నారు. 12 నుండి 14 సీట్లు గెలుస్తామని నమ్మించగా, బిజెపితో సమానంగా 8 సీట్లకు పరిమితం కావాల్సి రావడాన్ని సహించలేక పోతున్నారు. 

వాస్తవానికి దేశంలో కాంగ్రెస్‌ మూడు రాష్ర్టాల్లో మాత్రమే అధికారంలో ఉంది. అవి తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌. హిమాచల్ ప్రదేశ్ వనరులు చాలా పరిమితం. కర్ణాటకలో ముఖ్యమంత్రి స్వయంగా అవినీతి ఆరోపణల్లో ఇరుక్కున్నారు. అక్కడ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడటంతో ఏఐసీసీకి పెద్దగా నిధులు సమకూర్చే స్థితిలో లేదు. దానితో ఎక్కడ ఎన్నికలు జరిగినా తెలంగాణ నుండి నిధులు సమకూర్చాల్సి వస్తున్నది. ఇటువంటి పరిస్థితులలో రేవంత్ రెడ్డికి దిల్లీలో ఘనమైన పలుకుబడి ఉండాలి. కానీ ఆయన మాటలు చెల్లుబాటు కాకపోవడం గమనిస్తే ఆయన వ్యవహారశైలి పట్ల అసమ్మతితో ఉన్నట్లు స్పష్టం అవుతుంది. మరోవైపు రుణమాఫీ అమలు జరిపినందుకు విజయోత్సవ సభ జరిపేందుకు రావడానికి రాహుల్ గాంధీ సుముఖత వ్యక్తం చేయడం లేదు. అరకొర రుణమాఫీ చేయడం, రైతుల్లో వ్యతిరేకతపై రాహుల్‌గాంధీకి రాష్ట్ర పార్టీకి చెందిన నేతలే నివేదిక అందించినట్టు చెప్పుకుంటున్నారు. రేవంత్‌రెడ్డి మూడుసార్లు కలిసి విజ్ఞప్తి చేసినా రాహుల్‌ మొహం చాటేసినట్టు తెలిసింది. రుణమాఫీ పూర్తి కాలేదని, రైతులు వ్యతిరేకంగా ఉన్న సమయంలో తానెలా వస్తానని అన్నట్టు తెలుస్తోంది. 

గాంధీ కుటుంబాన్ని ప్రసన్నం చేసుకొనేందుకు అర్ధాంతరంగా ఆగస్టు 20న మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా సచివాలయం ముందు రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించాలని రేవంత్‌రెడ్డి భావించారు. సోనియాగాంధీ, రాహుల్‌, ప్రియాంకగాంధీని పిలుస్తున్నట్టు చెప్పారు. అయితే వారెవ్వరూ స్పందించక పోవడంతో విగ్రహావిష్కరణను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. తెలంగాణ తల్లి విగ్రహం కోసం కేటాయించిన స్థలంలో రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటుపై వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ భిన్న స్వరాలు వినిపించాయని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఏఐసీసీలో ఆయనకు అండగా ఉంటూ వస్తున్న ప్రధాన కార్యదర్శి కే సి వేణుగోపాల్ ను కేరళ కాంగ్రెస్ అధ్యక్షునిగా పంపించడంతో దిల్లీలో ఆయన గట్టి పట్టు కోల్పోయినట్లయింది. మరోవంక, రాహుల్ గాంధీతో ఏర్పడిన సాన్నిహిత్యం కారణంగా రేవంత్ రెడ్డి మొదట్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డిని పట్టించుకోవడం లేదు. పైగా రేవంత్ వ్యవహారసరళి పట్ల ఖర్గే అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ అధికారంలో ఉన్న పెద్ద రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచడం ఇష్టం లేకనే రేవంత్ రెడ్డి సూచించిన మహేష్ కుమార్ గౌడ్ ను టీపీసీసీ అధ్యక్షునిగా చేసినట్లు తెలుస్తున్నది. పైగా, నిర్ణయం తీసుకున్న రెండు వారాల తర్వాత అధికారిక ప్రకటన చేయడం గమనిస్తే ఈ విషయంలో ఏఐసీసీ తీవ్ర ఒత్తిడులు ఎదుర్కొన్నట్లు స్పష్టం అవుతుంది. మొత్తానికి సొంత నాయకులను కాదని, బయటి నుంచి తెచ్చుకున్న రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం క్రమంగా నమ్మకం కోల్పోతుంది.

ప్రవీణ్