modi

అభివృద్ధి, సంక్షేమాలకు మరింత ఊపు

మూడో విడత నరేంద్ర మోదీ ప్రభుత్వం 100 రోజులు అనేక విధాలుగా చరిత్రాత్మకమైనవి. దేశం ఈ వంద రోజుల్లో అనేక కొత్త అభివృద్ధి ప్రాజెక్టులను చూసింది. 70 ఏళ్ళు పైబడిన వారందరికీ ఆర్థిక స్తోమతతో నిమిత్తం లేకుండా ఉచిత వైద్య బీమా, ఏకీకృత పెన్షన్ పథకం, కనీస మద్దతు ధర పెంపుతో సహా రైతులకు మేలు చేకూర్చే పథకాల అమలు, పరిశ్రమల అభివృద్ధికి, పేదల సంక్షేమానికి పథకాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మూడు కోట్ల కొత్త ఇళ్ల నిర్మాణానికి ఆమోదం, స్వచ్ఛమైన ఇంధన వనరుల అభివృద్ధికి ప్రోత్సాహం, విధానపరమైన నిర్ణయాలతో సహా వివిధ కార్యక్రమాల ద్వారా ప్రధానమంత్రి 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న ప్రతినకు దాదాపు ఒక కొత్త కోణాన్ని ఆవిష్కృతం చేశారు.

ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చే ప్రభుత్వం మొదటి 100 రోజుల్లో నెరవేర్చవలసిన లక్ష్యాలకు గాను 100 రోజుల ప్రణాళికలను రూపొందించవలసిందిగా ఆయన ఏడాది మొదట్లోనే అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అభివృద్ధి కార్యక్రమాలకు అంతరాయం కలగకూడదని, కొత్త ప్రభుత్వం వచ్చే తరుణంలో కూడా అన్ని ప్రాజెక్టులు సాఫీగా అమలు జరగాలన్న ఉద్దేశంతో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. ఎప్పుడైనా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొదటి 20-25 రోజులు సంబరాలతో కాలం గడిచిపోవడాన్ని మనం గతంలో చూశాం. రెండు, మూడు నెలల తరవాతే అసలైన పాలన మొదలయ్యేది. కానీ ప్రధానమంత్రి మోదీ ఈ ధోరణికి స్వస్తి పలిగారు.  మౌలిక సదుపాయాలను పటిష్టం చేయాలన్న లక్ష్యాన్ని కొనసాగిస్తూ ప్రధానమంత్రి మూడు లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చారు. వీటిలో రూ.76,200 కోట్ల వ్యయంతో మహారాష్ట్రలోని వధవన్ లో అభివృద్ధి చేస్తున్న ఒక ప్రధాన ఓడరేవు కూడా ఉంది.  అలాగే ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద 62,500 కిలోమీటర్ల గ్రామీణ రహదారుల కోసంరూ. 49,000 కోట్లు కేటాయించారు. దీనివల్ల 25,000 గ్రామాలకు ప్రయోజనం. నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వం మూలధన వ్యయాన్ని రూ.11.11 లక్షల కోట్లకు పెంచిన ఫలితంగా పెద్దయెత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. ఈ వంద రోజుల్లో ప్రభుత్వం ఆమోదించిన ముఖ్యమైన ప్రాజెక్టుల్లో రూ.50,600 కోట్లతో నిర్మిస్తున్న 936 కిలోమీటర్ల పొడవైన ఎనిమిది జాతీయ ‘అత్యంత వేగవంతమైన’ రోడ్డు కారిడార్లు, 12 కొత్త పారిశ్రామిక స్మార్ట్ సిటీలు ఉన్నాయి. మొదటి 100 రోజుల్లో 15 వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. ఎనిమిది కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చారు. విమాన అనుసంధానం పెంచేందుకు వారణాసి, బగ్దొర (పశ్చిమబెంగాల్), బెహత (బీహార్) విమానాశ్రయాల స్థాయి పెంపు, అభివృద్ధికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హిమాచల్ ప్రదేశ్ ను షింకా లు సొరంగం ద్వారా లద్దాఖ్ తో కలిపే భారీ ప్రాజెక్టు పని కూడా ప్రారంభమైంది. 

మోదీ మూడవ ప్రభుత్వ పాలనను కిసాన్ సమ్మాన్ నిధి 17వ వాయిదా విడుదలతో ప్రారంభించారు. ఆయన ప్రభుత్వం తీసుకున్న రెండో నిర్ణయం ఖరీఫ్ పంటల మద్దతు ధరలను పెంచడం. అలాగే ‘డిజిటల్ కృషి మిషన్’ కింద సాగు రంగంలో ఉత్పాదకతను పెంపొందించేందుకు రూ.14,200 కోట్ల విలువైన ఏడు పథకాలను ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుకు రూ.12,000 కోట్లు కేటాయించారు. రూ.2,000 కోట్ల ‘మిషన్ మౌసమ్’ కూడా రైతులకు లబ్ధి చేకూరుస్తుంది. వ్యవసాయ రంగంలో స్టార్టప్పులను, గ్రామీణ వ్యాపారాలను ప్రోత్సహించడానికి ప్రారంభించిన ‘అగ్రి ష్యూర్ నిధి’ వ్యవసాయ రంగంలో విప్లవానికి తెర తీస్తుంది. దేశంలో 113 కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వైద్యరంగంలో మౌలిక సదుపాయాలను పటిష్టం చేయడానికే కాక ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను పెంచడానికి కూడా దోహదం చేస్తుంది. మోదీ 3.0 మొదటి 100 రోజులు ప్రధానమంత్రి ప్రాధాన్యాలను స్పష్టంగా తెలియజేశాయి- అవి భారత్ ను సుసంపన్నం చేయడం, అభివృద్ధి చేయడం, బలమైన శక్తిగా తీర్చిదిద్దడం.

అనిల్ బలూని,
ఎంపీ