nirmala sitaraman

మధ్య తరగతి అంటే ప్రధానికి ఎంతో గౌరవం

nirmala sitaraman2026 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్ మధ్యతరగతి, పన్ను చెల్లింపుదారుల చేతుల్లోకి డబ్బు తిరిగి వెళ్ళేలా చేస్తుందని, ఇది “దేశాన్ని నడిపించడానికి సహాయపడుతుంద”ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దీనిని తాను “కోల్పోయిన ఆదాయం”గా భావించడం లేదని పేర్కొన్నారు. బడ్జెట్ అనంతరం దూరదర్శన్ కు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ లోని ముఖ్యాంశాలు: 

ప్ర: పన్ను శ్లాబులను మార్చడం ద్వారా ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల ఆదాయాన్ని ఎందుకు వదులుకుంది? ఈ చర్యను ఆర్థికంగా ఎలా సమర్థించుకుంటారు?

జ: ముందు ప్రధాన మంత్రికి నేను కృతజ్ఞతలు చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే ఆయన మార్గదర్శకత్వం ద్వారానే ఆదాయాల లెక్కలను పక్కన పెట్టి డబ్బును తిరిగి ప్రజల చేతుల్లో పెడుతున్నాం. ఈ వ్యక్తులు లేదా వర్గం ఎవరు? వారు పన్ను చెల్లింపుదారులు. ఉచిత ఆహార ధాన్యాలు ఇవ్వడం, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వృద్ధులకు పెన్షన్ ఇవ్వడం … మనం ఇలా వివిధ వర్గాల వారికి చేయూతనిస్తున్నాం. కానీ ఒక వర్గం పన్ను చెల్లింపుదారులు దేశాన్ని నడపడానికి సహాయపడుతున్నారని, నిజాయితీగా పన్ను చెల్లించే వారికి కొంత ఉపశమనం లభించేలా మనం చేయాలని ప్రధాని సూచించారు. మేం మా లెక్కలతో తిరిగి ఆయన వద్దకు వెళ్ళినప్పుడు, ఆయన వెంటనే ఆమోదించారు. కాబట్టి, నేను దీనిని ఆదాయాన్ని కోల్పోవడంగా చూడటం లేదు, పన్నుచెల్లింపుదారుల చేతుల్లో ఎక్కువ డబ్బు ఉంచడంగా చూస్తున్నాను.

ప్రశ్న: ఎంఎస్ఎంఈలకు (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు) వచ్చే ఐదేళ్లకు అదనంగా రూ.1.5 లక్షల కోట్ల రుణ హామీ కేటాయింపులు చేశారు. రుణాలు ఏ రేటుకు లభిస్తాయి?

జ: ఎస్ఎంఎస్ఈ క్లస్టర్లలో శాఖలను ప్రారంభించామని సిడ్బీ (భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు)ని కోరనున్నుట్టు జూలై (2024) బడ్జెట్లో చెప్పాను. ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖకు సుమారు 180 క్లస్టర్లు ఉన్నాయి. ఈ ప్రతి క్లస్టర్ లోనూ సిడ్బీ బ్రాంచ్ లు ఉండాలని అనుకున్నాం. కానీ సిడ్బీ సాధారణంగా బ్యాంకుల ద్వారా రుణాలు ఇస్తుంది, అవి బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు నిధులు బదిలీ చేస్తాయి. అవి తిరిగి చిన్న ఫైనాన్స్ కంపెనీలకు బదిలీ చేస్తాయి. వారు అడుగడుగునా వడ్డీ రేట్లను పెంచుతారు. కాబట్టి, సిడ్బీ నేరుగా రుణాలిస్తే వడ్డీ రేట్లు సహేతుకంగా ఉంటాయి. ఎంఎస్ఎంఈల నుంచి వచ్చే సాధారణ ఫిర్యాదు ఏమిటంటే రుణదాతలు సాధారణంగా వారి వ్యాపార చక్రాన్ని అర్థం చేసుకోరు. సిడ్బీ స్వయంగా రుణాలిస్తే అది ఎస్ఎంఎస్ఈల మూలధన అవసరాలను అర్థం చేసుకుంటుంది. బ్యాంకులు తాము చేసే పనిని కొనసాగించవచ్చని, కానీ సిడ్బీ నేరుగా ఎంఎస్ఎంఈలకు రుణాలు ఇవ్వగలిగితే వడ్డీ రేట్లు మరింత వాస్తవికంగా ఉంటాయని మా ఉద్దేశం.

ప్ర: బడ్జెట్ పై మీకు, మీ మొత్తం బృందానికి ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ఈ బడ్జెట్ శక్తి గుణకంగా పనిచేసి వినియోగం, పెట్టుబడులు, వృద్ధిని ప్రోత్సహిస్తుందని అన్నారు. ఆర్థిక వ్యవస్థను 7శాతం కంటే తక్కువ వృద్ధి స్థాయి నుంచి 8-10 శాతం స్థాయికి తీసుకెళ్లడానికి బడ్జెట్ ఎలా సహాయపడుతుందో వివరిస్తారా?

జ: ఈ బడ్జెట్ ద్వారా మేం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతున్నాం, ప్రజలకు రుణ లభ్యత చాలా అవసరం. వేతనాలు పెరిగినప్పుడు, ప్రజలు విచక్షణ వ్యయాన్ని పెంచాలని కూడా ఆలోచిస్తారు, లేకపోతే వారు పొదుపు కోసం డబ్బును పక్కన పెట్టిన తర్వాత వారి ఖర్చులను కుదించుకుంటారు. పొదుపు పెరగాలని, ప్రజల చేతిలో కొంత డబ్బు మిగిలి ఉండాలని, దానిని పిల్లల ఆరోగ్యం, విద్య కోసం మళ్లించాలని మేం ఆశిస్తున్నాం. అలాగే మార్కెట్లో డిమాండ్ పెరుగుతుందని, ఇది అధిక ఉత్పత్తికి దారితీస్తుందని కంపెనీలు కూడా ఆశిస్తున్నాయి. మేం ప్రజలందరి చేతుల్లోనూ డబ్బు పెట్టడం లేదు, పన్ను చెల్లింపుదారులు, అంటే మధ్యతరగతి ప్రజల చేతుల్లోనే పెడుతున్నాం. ప్రధాని మోదీకి మొదటి నుంచి మధ్యతరగతిపై ఎంతో గౌరవం ఉంది. మేం పన్ను చెల్లింపుదారుల హక్కులను కూడా రూపొందించాం. పన్ను చెల్లింపుదారులను గౌరవించడం, వారిని నమ్మి వారి వ్యాపారాలను వారు సజావుగా నడిపిస్తూ దేశాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళేటట్టు చూడటంలో ఇది ఒక ముందడుగు. 

ప్రశ్న: భవిష్యత్తుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రపంచ మదుపుదారులకు చెప్పడానికి ఇది ఒక మార్గమా?

జ: ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందాలను సమీక్షిస్తున్నాం. నమూనా, నిబంధనలను మరింత పటిష్ఠంగా, చేయడానికి ప్రయత్నిస్తన్నాం. పెట్టుబడులను పెంచడానికి మేం ఏ చర్యలు అవసరమో అవన్నీ తీసుకుంటాం. 

ప్రశ్న: తోలు, పాదరక్షల ఉత్పత్తులు, బొమ్మల పరిశ్రమలకు మద్దతు ప్రకటించారు. వారు ఎలాంటి మద్దతును ఆశించవచ్చు?

జ: మేం చాలా ఉత్పత్తులకు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ కు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ) ఇస్తున్నాం. అది మంచి ఫలితాన్నిచ్చింది. ఇంకొన్ని రంగాలకు కాస్త ఊతమివ్వాల్సిన అవసరం ఉంది. ఈ మూడు రంగాల ఆవశ్యకతను అర్థం చేసుకుని వారికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నాం. తోళ్లకు సంబంధించి మేం దిగుమతి సుంకాన్ని, మరికొన్ని వస్తువులపై ఎగుమతి సుంకాన్ని సవరించాం. తద్వారా కొంత విలువైన ముడి పదార్థాలు భారతదేశం నుంచి ఎగుమతి కావచ్చు, చిన్న చర్మశుద్ధికారులు ప్రయోజనం పొందవచ్చు. ఈ చర్యలు కేవలం ఉత్పత్తిలో ఒక మార్గాన్ని ప్రోత్సహించడానికి మాత్రమే కాదు, ముడి పదార్ధాల ఉత్పత్తిలో ఖర్చులను తగ్గించడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. భారత్ లో అందుబాటులో లేని ముడిసరుకులను ఇతర ప్రాంతాల నుంచి తీసుకురావాల్సి వస్తున్నందున సుంకాలను కూడా తగ్గించాం. 

ప్రశ్న: ఇండియా పోస్ట్ ను ఎందుకు మారుస్తున్నారు? మీరు దానిని లాజిస్టిక్స్ సంస్థగా మార్చారు.

జ: నేటికీ తపాలా సిబ్బంది బహుముఖ పాత్రలు పోషిస్తున్నారు. దేశవ్యాప్తంగా పోస్టాఫీసులకు భారీ వ్యవస్థ ఉంది. వాటిని మనం సద్వినియోగం చేసుకోలేకపోతే అవి సంక్షోభంలో పడతాయి. ఇండియా పోస్ట్ కు ప్రజలతో ఉన్న అనుబంధాన్ని పునరుద్ధరించాలని, భారత్ వృద్ధిలో దాన్ని కూడా ఒక కీలక భాగంగా చేయాలని మేం అనుకుంటున్నాం. అంతేకాక, నేడు అనేక ప్రపంచ మార్కెటింగ్ కంపెనీలు దేశవ్యాప్త నెట్ వర్క్ ను కోరుకుంటున్నాయి గనుక తపాలా శాఖ లాజిస్టిక్స్ బాధ్యతలు చేపట్టాల్సిన అవసరం ఉంది. 

ప్ర: ఇప్పుడు బడ్జెట్ లో వికసిత్ భారత్ ను నిర్వచించినందున, ఈ నిర్వచనాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ వ్యూహాలు, విధానాలను రూపొందిస్తారా?

జ: కచ్చితంగా. రాష్ట్రాలు తమ సొంత ఆర్థిక వ్యవస్థలను నిర్మించుకునే దిశగా ఇది వారికి ఒక సూచన కూడా. వికసిత భారత్ హోదా సాధించే సూచికల గురించి గత ఏడాది కాలంగా చాలా లోతుగా చర్చించి కేంద్రంతో పాటు రాష్ట్రాలు ఒక మార్గాన్ని నిర్దేశించుకున్నాయి. ప్రతి లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన అంశాలు, ఖర్చుకు కేటాయింపులు తదితర అంశాలపై సవివరంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. రాష్ట్రాలకు వెళ్లే డబ్బును రాష్ట్రాల పోటీతత్వాన్ని మెరుగుపర్చడానికి కూడా మళ్లిస్తారు, తద్వారా రాష్ట్రాలు, కేంద్రం భారతదేశాన్ని ఆ దిశలో తీసుకెళ్లగలవు.

ప్రశ్న: రూ.10 లక్షల కోట్ల ఆస్తుల నగదీకరణ లక్ష్యానికి, పెట్టుబడుల ఉపసంహరణకు తేడా ఏమిటి?

జ: పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల నగదీకరణ పూర్తిగా భిన్నమైనవి. ఆస్తుల నగదీకరణ అంటే ఆస్తిని అమ్మడం కాదు, దాని వాడకాన్ని గరిష్ట స్థాయికి తీసుకెళ్ళడం, ప్రజలు దానిని ఉపయోగించడానికి మార్గాలను కనుగొనడం. వాటిని ప్రైవేటు వ్యక్తులు కూడా వాడుకోగలిగితే వేలంపాట పాడుకుని లీజుకు తీసుకుని డబ్బు సంపాదించమని అడగవచ్చు. ఆస్తులు మన దగ్గరే ఉంటాయి. నిరుపయోగంగా ఉండిపోయే ఇలాంటి ఆస్తులను సొమ్ము చేసుకోవడానికి ఇదొక మార్గం. ఇంతకు ముందు కూడా ఇదే చేశాం, స్పందన ఆధారంగా మరిన్ని ఆస్తులను గుర్తించాం.

ప్ర: ఈ బడ్జెట్ లో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అలాగే, మీరు ఏర్పాటు చేయాలనుకుంటున్న భారతీయ విజ్ఞాన భాండాగారం గురించి చెబుతారా?

జ: రాత ప్రతుల డిజిటలైజేషన్ ను దేశవ్యాప్తంగా చేపడతాం. ఎందుకంటే చాలా రాత ప్రతులు ప్రైవేటు చేతుల్లో ఉన్నాయి, వాటి కాపీరైట్ లేదా స్వాధీన హక్కులను మేం తీసుకోదలుచుకోలేదు. ప్రతి ఒక్కరికీ ఒకే చోట అందుబాటులో ఉండే వాటిని డిజిటలైజ్ చేయడానికి మాకు సహాయం చేయమని మేం వారిని అభ్యర్థించాలనుకుంటున్నాం. పరిశోధకులు ఈ భాండాగారాన్ని సృష్టించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ భాండాగారాన్ని (రిపాజిటరీ) అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నాం.

మహిళల కోసం మేం ప్రకటించిన ప్రతి పథకంలో మహిళలు, పేదలు, యువత, అన్నదాత (రైతులు) సహా నాలుగు వర్గాలకు ప్రయోజనాలు ఉన్నాయి. మహిళలకు గడువుతో కూడిన రుణం కొత్త పథకం. దీనికి ఇంకా పేరు పెట్టలేదు. గత తొమ్మిదేళ్లుగా మేం అమలు చేస్తున్న స్టాండప్ ఇండియా కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే మంచి విజయాలు సాధించాం. దీన్ని మరో 50 కోట్ల మందికి లబ్ధి చేకూర్చేలా విస్తరిస్తాం. సుదూర ప్రాంతాల్లోని బ్యాంకు శాఖలు రూ 2 కోట్ల పూచీకత్తు లేని గడువుతో కూడిన రుణాలను ఇవ్వగలుగుతాయి.

ప్రశ్న: స్వామిహెచ్ (సరసమైన, మధ్యశ్రేణి గృహ నిర్మాణ) పథకం కింద అదనంగా లక్ష యూనిట్లు పూర్తవుతాయన్నారు. ఈ సరసమైన గృహనిర్మాణ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన స్థాయిలో గృహనిర్మాణాలు జరుగుతాయా?

జ: ఆగిపోయిన ప్రాజెక్టులు దురదృష్టవశాత్తూ చాలానే ఉన్నాయి. కొన్నేళ్లలో ఇల్లు పూర్తవుతుందనే ఆశతో రుణాలు తీసుకుని ఈఎంఐలు చెల్లిస్తుండటంతో మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టుల్లో ఏళ్ల తరబడి జాప్యం జరుగుతోంది. 2019-2020 చివరిలో ప్రారంభించిన మొదటి ఎస్ఎంఐహెచ్ ఫండ్ మంచి, సానుకూల ఫలితాలను చూపించింది. ఈ నిధిని జాగ్రత్తగా పర్యవేక్షించి, డబ్బును విడతల వారిగా విడుదల చేస్తారు, కాబట్టి ఎవరూ డబ్బును వేరే వాటికి మళ్లించలేరు. అవి రెరా ఆమోదించిన ప్రాజెక్టులు, ఇది ఒక క్రమపద్ధతిలో నడిచే పథకం. ఇక్కడ మేం కూడా అభివృద్ధిని గమనిస్తూ ఉండవచ్చు. ప్రజలు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న తమ అపార్ట్మెంట్లను పొందడానికి ఇది కచ్చితమైన, సురక్షితమైన మార్గం అని మేం భావించాం.

ప్రశ్న: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్ డీఐ) పరిమితిని 74 శాతం నుంచి 100 శాతానికి పెంచడం వెనుక మీ లక్ష్యం ఏమిటి?

జ: ఇప్పటికీ విదేశాల నుంచి చాలా కంపెనీలు, ఇన్వెస్టర్లు బీమా రంగంపై ఆసక్తి కనబరుస్తున్నారు. సంస్థల యాజమాన్యాన్ని కోరుతున్నారు. దీని వల్ల డబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారత్ లో వసూలు చేసిన ప్రీమియంను భారత్ లో మదుపు చేయాలని స్పష్టంగా చెప్పాం. అందుకు అవసరమైన రక్షణ కవచాలను సిద్ధం చేశాం.

ప్రశ్న: జాతీయ తయారీ కార్యక్రమం కింద ఏం చేయాలనుకుంటున్నారు? దీని నుంచి మీరు ఏ ఫలితాలు ఆశిస్తున్నారు ?

జ: భారత్ లో ఎగుమతులకు అపార అవకాశాలున్నాయి. కానీ జీఎస్టీకి ముందు పోటీతత్వం అంతగా ఉండేది కాదు. నేడు అంతర్జాతీయంగా నెలకొని ఉన్న అస్థిర పరిస్థితులు మన కంపెనీలు ఎగుమతులకు కొత్త మార్కెట్లను కనుగొనడంలో సవాళ్లను సృష్టిస్తున్నాయి. ఈసీజీసీ లేదా ఎగ్జిమ్ బ్యాంక్ ద్వారా వారికి ఎగుమతి క్రెడిట్ మద్దతును అందించడానికి మేం ప్రణాళికలు రూపొందించాం. దీనిద్వారా వారికి మరింత మూలధనం అందుబాటులో ఉండి ఎక్కువ రుణాలు అందుతాయి. ఎగుమతిదారులు విద్యుత్ ఖర్చులు, అధిక లాజిస్టిక్ (బట్వాడా) ఖర్చుల సమస్యలను కూడా ఎదుర్కొంటారు, ముఖ్యంగా సరుకు ఛత్తీస్ గడ్ వంటి ప్రాంతాల నుంచి వచ్చి ఓడరేవులకు వెళుతున్నప్పుడు ఈ ఖర్చులు ఎక్కువ ఉంటాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. 32 ఎగుమతి ప్రోత్సాహక మండళ్లతో చర్చించి వాటికి అందించాల్సిన మద్దతుపై కార్యాచరణ రూపొందించాల్సి ఉంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో భాగస్వాములకు సమాన ప్రవేశం కల్పించడానికి సంస్థాగత యంత్రాంగం కూడా ఈ మిషన్ లో భాగం కానుంది. భారత్ నెట్ ను ఉపయోగించి డిజిటల్ డేటా బ్యాంక్, డ్యాష్ బోర్డును రూపొందించే యోచన కూడా ఉంది.

ప్ర: మారిటైమ్ డెవలప్ మెంట్ ఫండ్ కోసం రూ.25,000 కోట్లు కేటాయించారు?

జ: మనకు అనేక నౌకాశ్రయాలు ఉన్నాయి. వాటిలో ప్రతిదానిని వివిధ రకాలుగా ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది కాకుండా, మనదేశంలో షిప్ బ్రేకింగ్ కార్యకలాపాలు జరిగాయి. ఒకప్పుడు, మనం ప్రపంచంలోనే ప్రముఖ షిప్ బ్రేకింగ్ కేంద్రంగా ఉన్నాం. నేడు పోటీ స్వభావం మారిపోయింది. అంతేగాక పర్యావరణ స్పృహ పెరిగిన కారణంగా షిప్ బ్రేకింగ్ కు సమస్యలు ఎదురవుతున్నాయి. చిన్న నౌకలను కాకుండా ఒక నిర్దిష్ట సామర్థ్యం అంతకంటే ఎక్కువ స్థాయి గల నౌకలను నిర్మించడాన్ని కూడా మేం ప్రోత్సహించాలనుకుంటున్నాం. అందుకు మనం మద్దతు ఇవ్వాలి. అందుకే ఈ నిధిని ఏర్పాటు చేశాం.

ప్రశ్న: భారత్ ఇంధన పరివర్తనకు నమూనా ఏమిటి? అణుశక్తిపై ఎందుకు దృష్టి పెట్టారు?

జ: బడ్జెట్ లో ఇది చాలా ముఖ్యమైన ప్రకటన. గత బడ్జెట్లలో పంపింగ్ స్టోరేజీ కోసం జలవిద్యుత్ కేంద్రాల పథకాన్ని ప్రకటించాం. దీనివల్ల ఖర్చు తగ్గి అధిక విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. రాబోయే సంవత్సరాల్లో భారతదేశ ఇంధన వినియోగం పెరగబోతోంది, మనం శాశ్వత పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి మార్గాలను కనుక్కోవాలి. మళ్ళీ పాతకాలంలో మాదిరిగా బొగ్గు, థర్మల్ ప్లాంట్ల ఏర్పాటు చేసే ఉద్దేశం లేదు. అయితే అవసరమైన చోట చిన్న అణు రియాక్టర్లను ఏర్పాటు చేసేందుకు మనం సొంతంగా అభివృద్ధి చేసిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తాం. ప్రైవేటు రంగానికి కూడా ప్రవేశం కల్పిస్తాం. 

ప్రశ్న: ఎన్నో పన్ను రాయితీలు… మరోవైపు జీడీపీలో ద్రవ్యలోటు లక్ష్యం 4.4 శాతం… వీటన్నిటిని ఎలా నెరవేరుస్తారు?

జ: ఈ ప్రతిపాదనలతో మనం ఎంతదూరం వెళ్లవచ్చో ఆలోచించాం. ప్రజల చేతిలో ఎక్కువ డబ్బు ఉండటం వల్ల వినియోగం పెరిగినప్పుడు, ఈ డబ్బులో కొంత తిరిగి ఆర్థిక వ్యవస్థలోకి చేరుతుందని మేం గట్టిగా నమ్ముతున్నాం. రెండవది, నేను ఇప్పటికే ఆస్తి నగదీకరణ గురించి మాట్లాడాను. పన్నుల పరిధిని కూడా విస్తరిస్తాం.

ప్ర: ఇది ప్రజల బడ్జెట్ అని ప్రధాని అభివర్ణించారు. ఈ బడ్జెట్ ను మీరు ఎలా చూస్తారు?

జ: అవును, ఇది ప్రజల బడ్జెట్. ఎందుకంటే విద్యా సౌకర్యాలు కల్పించడం, పిల్లల పోషకాహారాన్ని మెరుగుపరచడం, వైద్య విద్యలో సీట్ల సంఖ్యను పెంచడం వంటి ప్రజల ఆకాంక్షలకు మేం స్పందిస్తున్నాం. 

నాగార్జున