Emergency

ఎమర్జెన్సీ చట్టాలు.. నియంతృత్వానికి నిలువుటద్దం

దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా గతాన్ని తలుచుకుంటుంటే ఆనాటి భయంకర పరిస్థితులు కట్టలు తెంచుకొని, ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. అందులో కొన్ని బాధించేవి ఉన్నాయి, ఆవేదనాభరితమైనవి ఉన్నాయి, కన్నీరు చెరమర్చేవి ఉన్నాయి, ఆశ్చర్యం కలిగించేవీ ఉన్నాయి. ఎమర్జెన్సీ కాలంలో ‘మీసా’ చట్టం కింద అరెస్టయ్యేనాటికి నాకు 30 సంవత్సరాలు. వరంగల్ కేంద్ర కారాగారంలో నన్ను బంధించారు. ఒకరోజు ఏదో కారణంతో నన్ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. నన్ను చూడడానికి నా పెద్ద కుమారుడు వివేక్ ను తీసుకొని, నా శ్రీమతి అక్కడికి వచ్చింది. చాలా రోజుల తర్వాత కన్న కొడుకు కంటికి కనిపించేసరికి ఆత్రంగా ఎత్తుకొని, ముద్దాడాలని ఆరాటపడ్డాను. కానీ, నా చేతికి బేడీలు ఉండడం వల్ల నా కొడుకును ఎత్తుకోలేకపోయాను. ఈ సంఘటన ఇప్పటికీ పదే పదే జ్ఞప్తికి వచ్చి నాలో ఒక రకమైన భావోద్వేగాన్ని నింపుతుంది. మరొక సందర్భంలో నా కూతురు వినయను తీసుకొని శ్రీమతి జైలుకు వస్తే జైలు అధికారులు ములాఖత్ నిరాకరించారు. అయితే ఒక చిన్న కేసులో శిక్షను అనుభవిస్తున్న మల్లారెడ్డి చెస్యాల గారు ఏదోవిధంగా జైలరును ఒప్పించి, నా కూతురిని మాత్రం జైలు లోపలికి తీసుకొచ్చి, నాకు చూపించి, తిరిగి తీసుకెళ్లారు. అయితే, నేను, నా మిత్రబృందం బిడ్డను చూసి ఆనందించాం. కానీ ఆమె మాత్రం నన్ను గుర్తు పట్టలేదు. ఒక తండ్రిగా అప్పుడు నాకు కలిగిన ఆవేదన మరపురానిది. దశాబ్దాలు గడిచిన మనస్సులో ఇప్పటికీ తాజాగా ఉన్న ఎన్నో మరపురాని సంఘటనలకు ఇవి మచ్చుతునకలు.

అప్రజాస్వామిక చట్ట సవరణలు

లాల్ కృష్ణ అద్వానీ బెంగళూరు కారాగారంలో ఉన్నప్పుడు ‘ప్రిజనర్స్ స్క్రాప్ బుక్’ (Prisoner’s Scrapbook) అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకాన్ని నాకు ఇచ్చి చదవమన్నారు. అందులో పేజీ 32, 33లో ఉన్న అంశం ఆనాటి పరిస్థితులను, ఇందిరా గాంధీ మనస్తత్వాన్ని, ఆమెకున్న అభద్రతా భావాన్ని విశదీకరిస్తాయి. అప్పుడు జరిగిన ఒక సంఘటన అందరినీ ఆలోచింపచేస్తుంది. ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని, ఆరు సంవత్సరాల పాటు ఆమె ఎన్నికలలో పోటీ చేసే అర్హత లేదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. అయితే కోర్టు ఏ చట్టాలు, ఉత్తర్వుల ప్రకారం ఆమె లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసిందో, వాటన్నింటికీ సవరణలు తీసుకొచ్చి, అవి ఆమెకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పునకు ముందు నుంచే అన్వయించేలా (Retrospective) చట్టాలు చేసింది. కొత్తగా చేసిన సవరణల వల్ల ఆమె సుప్రీం కోర్టులో ఉన్న కేసు తప్పకుండా గెలుస్తుందని తేటతెల్లమైంది. అయితే, ఆ తీర్పు వరకు వేచి ఉండకుండా, ఎవరైనా ప్రధానమంత్రి, స్పీకర్ లపై ఎన్నిక చెల్లదని పిటీషన్ వేస్తే విచారించే అధికారం కోర్టుకు లేకుండా, కేవలం పార్లమెంట్ ఏర్పాటు చేసిన ఒక ఫోరం ముందు మాత్రమే సవాల్ చేయాలని 40వ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. అంతేకాదు, ఈ బిల్లులోని క్లాజ్ 4లో ఇది వరకు హైకోర్టు ఇచ్చిన తీర్పులు చెల్లవు అని ఉంది. ఇది భారత పార్లమెంట్ చరిత్రలో అత్యంత అప్రజాస్వామిక బిల్లులలో ఒకటి అని చెప్పవచ్చు. ఇలాంటి అప్రజాస్వామికమైన, అసంబద్ధమైన, అనైతికమైన బిల్లును గురించి తెలుసుకొని జైలులో ఉన్న అద్వానీ, వారితో ఉన్న పెద్దలు ఆశ్చర్యపోయారట. ఈ సవరణ తన కేసుకు కూడా అన్వయించుకొని, అసలు ఆమెపైన కేసు పెట్టడమే చెల్లదని చెప్పడం ప్రపంచంలో ఏ ప్రజాస్వామిక సమాజంలో అయినా నభూతో నభవిష్యత్ అని అతిసామాన్యుడు కూడా చెప్తాడు. కానీ ఎమర్జెన్సీ కాలంలో అది జరిగిందనేది వంద శాతం వాస్తవం. ఈ తరానికి ఊహకు కూడా అందని ఇలాంటి రాజ్యాంగ విరుద్ధమైన అరాచకాలెన్నో జరిగాయి.

ఇది ఇందిరా గాంధీ నియంతృత్వానికి అద్దం పట్టే ఒక ఘటన మాత్రమే. ఆమె కోర్టులపైన, రాజ్యాంగంపైన ఎంత పగ పెంచుకున్నారో ఈ క్లాజ్ చూసి అర్థం చేసుకోవచ్చు. ఇందిరానే ఇండియా, ఇండియానే ఇందిరా అంటూ అమె సన్నిహితులు పొగడ్తలతో ముంచారంటే విచక్షణకు ఉన్న అన్ని సరిహద్దులను చెరిపేశారని స్పష్టమవుతుంది. ఈ పొగడ్తలు ఆమెలో అంతర్గతంగా దాగి ఉన్న విచ్చలవిడితనానికి తలుపులు తెరిచాయి. తన ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు చెల్లదని చెప్పటానికి ఇందిరా గాంధీ ఈ సవరణ చేసింది. దీంతో న్యాయవ్యవస్థకున్న అధికారాలను రద్దు చేసింది.

ప్రజాస్వామ్య విలువలు ధ్వంసం

ఎలక్షన్ ‘లా’ను సవరించడం వల్ల ఇదివరకే ఇచ్చిన అలహాబాద్ కోర్టు తీర్పునకు విరుద్ధంగా ఆమె ఎన్నిక చెల్లుతుందన్నట్టుగా వర్తింప చేసిన తర్వాత, సుప్రీం కోర్టు కూడా చేసేదేం లేక జస్టిస్ సిన్హా తీర్పును పక్కన పెట్టక తప్పదు. కానీ, క్లాజ్ 4 కేవలం ఆమె ఎన్నిక చెల్లదని ఇచ్చిన తీర్పును రద్దు చేయడమే కాదు, మొత్తం ప్రజాస్వామ్య విలువలను ధ్వంసం చేసింది. దీనిపై అద్వానీ, ఇతరులు జైల్లో చర్చించుకుంటున్నప్పుడు భాయ్ మహవీర్ ఒక కథ చెప్పాడట. అది; పాశ్చాత్య సమాజంలో అత్త గారి గురించి వ్యంగ్య కథలు చాలానే ఉన్నాయి. ఒక అత్తమ్మ మిత్రుల దగ్గరికి పోయి అక్కడే చనిపోతుంది. అల్లుడికి టెలిగ్రామ్ ఇస్తూ.. మీ అత్తమ్మను పూడ్చివేయాలా? లేక కాల్చివేయలా? మీ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాం.. అని అంటారు. దానికి ఆ అల్లుడు, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా, ‘‘ఏ అవకాశం తీసుకోకండి, రెండు క్రియలు జరిపించండి’’ అని తిరుగు టెలిగ్రాం ఇస్తారు. ఇప్పుడు చెప్పుకున్న కథలో అల్లుడు మాదిరిగా, అప్పటి న్యాయ శాఖ మంత్రి గోఖలే కూడా ఏ అవకాశం తీసుకోకుండా, ఇటు ఎలక్షన్ కమిషన్ ను సవరించారు, అటు పార్లమెంటులో సవరణ తీసుకొచ్చి అమె సీటు రద్దు కాకుండా చూసి, రెండు వైపుల నుండి జాగ్రత్త పడ్డారు, అని అద్వానీ, వారి సహచరులు అనుకున్నారట. 1975 ఆగస్ట్ 11న ఇందిరా గాంధీ ఎన్నిక పిటిషన్ ను విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించడమే ఈ సవరణ పట్ల వారు తొందరపడడానికి కారణం. నవంబర్ 7న సుప్రీంకోర్టు ఆమె ఎన్నిక చెల్లుతుందని కూడా తెలిపింది. సవరణల చట్రంలో బందీ అయిన కోర్టు అంతకుమించి ఏం చేస్తుందని అనుకున్నామని అద్వానీ తన పుస్తకంలో రాశారు.

ఏదిఏమైనా అప్పుడు జరిగిన ఎన్నికలలో ప్రజలు నియంతృత్వానికి వ్యతిరేకంగా చరిత్రాత్మక తీర్పునిచ్చి వీటన్నింటికీ సమాధానం చెప్పారు. మొరార్జీ దేశాయ్ ప్రధాన మంత్రిగా జనతా ప్రభుత్వం కొలువుదీరింది. ఎమర్జెన్సీ కాలంలో తీసుకొచ్చిన నల్ల చట్టాలను జనతా ప్రభుత్వం రద్దు చేసింది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మరొకసారి అలాంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత ప్రజలపైనే ఉంది.

సీ.హెచ్. విద్యాసాగర్ రావు,
మాజీ గవర్నర్