ఎమర్జెన్సీ.. రాజ్యాంగాన్ని నీరుగార్చే కుట్ర

1975 జూన్ 25న భారతదేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించారు. ప్రజల రాజ్యాంగ హక్కులను కాలరాసి, వారిపై భయానక అకృత్యాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ విమర్శకులను, ప్రతిపక్ష నాయకులను కటకటాల వెనక్కి నెట్టారు. వారిలో కొందరు జైలులోనే చివరి శ్వాస విడిచారు, స్వేచ్ఛను మళ్ళీ అనుభవించలేకపోయారు. ఐదు దశాబ్దాల తర్వాత కూడా ఎమర్జెన్సీ భారతదేశ ప్రజాస్వామ్య ప్రస్థానంలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. దీనిని గుర్తుచేసుకోవాలి, స్మరించుకోవాలి, ఖండించాలి. ఎందుకంటే ఎమర్జెన్సీ విధించడానికి అసలు కారణం మనకు తెలిసిన దానికంటే చాలా భయంకరమైనది. రాయ్‌బరేలీ నుండి ఇందిరా గాంధీ ఎన్నికను రద్దు చేస్తూ జస్టిస్ జగన్మోహన్‌లాల్ సిన్హా ఇచ్చిన తీర్పుతో ఆమె కలత చెంది ఎమర్జెన్సీ విధించారని చాలా మంది నమ్ముతారు. అయితే జూన్‌లో దేశంలో ఒక ‘అంతర్గత ముప్పు’ను పసిగట్టి తాను ఎమెర్జెన్సీ విధించినట్టు ఇందిరా గాంధీ స్వయంగా అంగీకరించారు. 

ఎమర్జెన్సీ అమలు చేయడానికి సంబంధించిన కుట్ర ఆ సంవత్సరం జనవరి ప్రారంభం నుంచే జరుగుతోందని ఆధారాలు సూచిస్తున్నాయి. జర్నలిస్ట్ కూమీ కపూర్ తన ‘ది ఎమర్జెన్సీ: ఎ పర్సనల్ హిస్టరీ’ పుస్తకంలో అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సిద్ధార్థ శంకర్ రే స్వయంగా చేత్తో రాసిన ఒక నోట్‌ను (జనవరి 8, 1975) ప్రస్తావించారు. అందులో అరెస్టు చేయాల్సిన వ్యక్తుల జాబితాలను పంపవలసిందిగా ఆయన ఇందిరను అభ్యర్ధించారు. ఆ జాబితాలో తీసుకోవలసిన అనేక ఇతర చర్యలు కూడా పేర్కొన్నారు. ఆగస్టు 11న కాంగ్రెస్ అధికార పత్రిక నేషనల్ హెరాల్డ్ ఒక సంపాదకీయంలో ఎమర్జెన్సీకి అసలు కారణాన్ని పేర్కొంది. భారతదేశం ఏక పార్టీ ప్రజాస్వామ్యంగా మారడానికి సమయం వచ్చిందని అందులో చెప్పింది.

ఇందిరా గాంధీ సన్నిహితులు అధ్యక్ష తరహా పాలన కోసం ఒత్తిడి చేస్తున్నారని ‘ఇందిరా గాంధీ అండ్ ది ఇయర్స్ దట్ ట్రాన్స్‌ఫార్మ్డ్ ఇండియా’ పుస్తకంలో చరిత్రకారుడు శ్రీనాథ్ రాఘవన్ రాశారు. ఈ వ్యవస్థ ఒక పరిమిత నియంతృత్వం. ఇందులో ఒక పార్టీకి విధేయమైన న్యాయవ్యవస్థ, అధికార యంత్రాంగం ఉంటాయి. 1975 సెప్టెంబర్‌లో ఇందిరా గాంధీకి ఆమె సన్నిహితుడు, అనుభవజ్ఞుడైన దౌత్యవేత్త బి.కె. నెహ్రూ ఒక లేఖ రాశారు. అందులో ఎమర్జెన్సీని “ప్రజా మద్దతుతో, అపారమైన ధైర్యం, బలంతో నిర్వర్తించిన ఒక గొప్ప ఘనకార్యం”గా ప్రశంసించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం “మన అవసరాలను” తీర్చలేకపోయింది అని ఆయన ఇందిరా గాంధీకి రాశారు. “మీకు మూడింట రెండు వంతుల మెజారిటీ ఉన్నందున ఇప్పుడు ఈ మౌలిక మార్పులను రాజ్యాంగంలో చేయండి,” అని ఆమెను కోరారు. ఇందిరా గాంధీ తన పార్టీ నాయకులతో ఈ ఆలోచనలను చర్చించడానికి అంగీకరించకపోతే ఈ లేఖను ప్రధానిని సంతోషపెట్టడానికి ఉద్దేశించిన చర్యగా కొట్టిపారేసేవారు. ఈ ఆలోచనలకు బాబూ జగ్జీవన్ రామ్, విదేశాంగ మంత్రి స్వరణ్ సింగ్ వంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుల నుండి ఉత్సాహభరితమైన మద్దతు లభించింది. ఇందిర ఆదేశాల మేరకు ఈ సహాయకులు బి.కె. నెహ్రూ చేసిన ప్రతిపాదనలను పరిశీలించి, “మన రాజ్యాంగంపై ఒక తాజా పరిశీలన: కొన్ని సూచనలు” అనే పేరుతో ఒక పత్రం రూపొందించారు. 1975లో రూపొందించిన ఈ పత్రం శక్తివంతమైన అధ్యక్షుడితో కూడిన అధ్యక్ష తరహా పాలన, న్యాయ వ్యవస్థలో నియామకాలను, శాసనాలను నియంత్రించడానికి ‘ఉన్నత న్యాయవ్యవస్థ మండలి’ని ప్రతిపాదించింది. వాస్తవంలో ఇది సుప్రీంకోర్టు పాత్రను తగ్గిస్తుంది.

బి.కె. నెహ్రూ ప్రతిపాదనను, రాజ్యాంగ సవరణ కోసం పార్టీ డిమాండ్‌ను పరిశీలించాలన్న ఇందిరాగాంధీ పిలుపునకు ప్రతిస్పందనగా కాంగ్రెస్ అధ్యక్షుడు డి.కె. బారువా 1976 ఫిబ్రవరి 26న గత అనుభవాల నేపథ్యంలో.. రాజ్యాంగ సవరణ అంశాన్ని అధ్యయనం చేయడానికి ఒక కమిటీని నియమించారు. స్వరణ్ సింగ్ నేతృత్వంలోని 12 మంది సభ్యుల ఈ కమిటీ 1976 ఏప్రిల్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడికి తాత్కాలిక ప్రతిపాదనలను సమర్పించింది. వీటిని అప్పుడు కొద్ది మంది ఎంపిక చేసిన నాయకులకు పంపిణీ చేశారు. అప్పటి భారత లా కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పి.బి. గజేంద్ర గడ్కర్.. ఇందిరా గాంధీకి ఒక లేఖ రాశారు. రాజ్యాంగానికి సవరణ అవసరమే అయినప్పటికీ, “తాత్కాలిక నిర్ణయాలు (అడ్-హాకిజం) అవాంఛనీయమైనవి. సిద్ధాంతపరమైన అతివాద వైఖరులను అవలంబించడం అసంబద్ధం, అవాంఛనీయం,” అని అందులో పేర్కొన్నారు. “సమస్యను లోతుగా పరిశోధించడానికి, చర్చించడానికి ఒక ఉన్నత-స్థాయి కమిటీని నియమించా”లని ఆయన సలహా ఇచ్చారు. దురదృష్టవశాత్తు, అలాంటి కమిటీని ఇందిరా గాంధీ నియమించలేదు. దేశ రాజ్యాంగానికి సంబంధించిన సవరణల అంశాన్ని ఒక రాజకీయ పార్టీ కమిటీకి వదిలివేయకూడదని, దీనికోసం అన్ని పక్షాలు, వ్యక్తుల అభిప్రాయాలను వినడానికి ఒక నిపుణుల కమిటీని నియమించడం మంచిదని జస్టిస్ గజేంద్ర గడ్కర్ తన అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు బారువా నియమించిన కమిటీ “హడావుడిగా పని చేసిందని, విషయాలను చాలా నిర్లిప్తంగా చర్చించిందని, రాజకీయ దృష్టితో సిఫార్సులు చేసిందని” కూడా ఆయన స్పష్టం చేశారు. “మినీ-రాజ్యాంగం” అని పిలువబడే 42వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగంలో సమూలమైన మార్పులను తీసుకువచ్చింది. స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల ఆధారంగా చేసిన ఈ సవరణ ప్రాథమిక లక్ష్యం కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని పెంచడం, న్యాయవ్యవస్థ ప్రభావాన్ని తగ్గించడం. 42వ సవరణ పార్లమెంటు ఆమోదించిన చట్టాలను సమీక్షించే, రద్దు చేసే న్యాయస్థానాల అధికారాన్ని తగ్గించింది. అధికారణాలు 32, 131, 226లను సవరించడం ద్వారా ఈ పనిచేశారు. ఇది హైకోర్టుల రిట్ పిటిషన్లు జారీ చేసే అధికారాన్ని కూడా తగ్గించింది. ఈ అధికారాన్నే బి.ఆర్. అంబేద్కర్ భారత్ రాజ్యాంగం గుండె, ఆత్మ అని అభివర్ణించారు.

42వ సవరణ కేంద్రం, రాష్ట్రాల మధ్య అధికార సమతుల్యతను మార్చివేసింది. తమ సొంత వ్యవహారాలపై రాష్ట్రాల నియంత్రణను తగ్గించారు. దీనివల్ల అధికార పరిధి, పాలనపై ఉద్రిక్తతలు, సంఘర్షణలు ఏర్పడ్డాయి. అధికారం కేంద్రీకృతం కావడం వల్ల ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం కష్టమైంది. ఎమర్జెన్సీ సమయంలో పార్లమెంటరీ కార్యకలాపాల ప్రచురణను మీడియాలో నిషేధించారు. “గురిచూసి కొట్టిన ఒక్క దెబ్బతో ఈ సవరణ రాజ్యాంగ సమతుల్యతను పార్లమెంటుకు అనుకూలంగా మార్చింది,” అని ‘ది స్టేట్స్‌మెన్’ పత్రిక వ్యాఖ్యానించింది. నాయకులను మూకుమ్మడిగా జైళ్ళలోకి తోసినప్పటికీ ప్రజల హక్కులు, ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ప్రతిపక్షం – ఇది తరువాత జనతా పార్టీగా ఏర్పడింది – పోరాటాన్ని కొనసాగించడంతో దేశంలో నియంతృత్వాన్ని విధించడానికి కాంగ్రెస్ చేసిన ప్రయత్నం విఫలమైంది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ సమాజం నుంచి కూడా వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. భారత ఉపఖండంలో ప్రజల హక్కులను చేజిక్కించుకోవడానికి జరిగిన ఇటువంటి ప్రయత్నాలు జరిగిన దేశాల్లో సంభవించిన రాజకీయ పరిణామాలతో ఆమె కలత చెందారు.

రాజ్యాంగ ప్రతులతో తిరుగుతున్న కాంగ్రెస్ నాయకులు దారుణమైన పార్టీ గతాన్ని ప్రజలు మర్చిపోయేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. భారత రాజ్యాంగం అత్యున్నత స్థానంలో ఉందని జూన్ 25 గుర్తుచేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బిజెపి, దేశం కలిసి దానిని రక్షించడం కొనసాగిస్తూనే ఉంటాయి.

భూపేంద్ర యాదవ్,
కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి