అమెరికాలో ట్రంప్‌తో భేటీకి రేవంత్ రెడ్డి ప్రయత్నించారా?
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యూకే పర్యటనకు అనుమతించిన కేంద్ర విదేశాంగ శాఖ అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడం కాంగ్రెస్ వర్గాలలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి తన పర్యటన వివరాలను పూర్తిస్థాయిలో అందించకపోవడం, పర్యటన ఉద్దేశాలను స్పష్టంగా చెప్పకపోవడంతోనే హోదాకు తగ్గట్టు పర్యటన లేదని విదేశాంగ శాఖ అధికారులు అనుమతి నిరాకరించినట్లు తెలుస్తున్నది. ముఖ్యమంత్రి హోదాలో అమెరికా పర్యటనకు వెళ్లాలనుకున్న రేవంత్ తన పర్యటన వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచాలనుకున్నాడన్నదీ ఇప్పుడు చర్చనీయాంశమైంది. అందరికీ బయట సోషల్ మీడియాలో, ప్రకటనల్లో చెప్తున్నట్టు అమెరికాలోని విశ్వవిద్యాలయాలను చూసేందుకు, అక్కడి చదువులపై అధ్యయనం చేసేందుకు మాత్రం కాదని కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో తేటతెల్లమైంది. పెట్టుబడుల కోసం కూడా కాదని తేలిపోయింది.
విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ”ముఖ్యమంత్రులు లేదా ఇతర ప్రముఖుల పర్యటనలకు రాజకీయ అనుమతి ఇచ్చే ముందు విదేశీ వ్యవహారాల శాఖ వాటిని పరిశీలిస్తుంది. అటువంటి సందర్భాల్లో ప్రతిపాదించిన కార్యక్రమం, వారి పదవికి, పర్యటన ఉద్దేశానికి అనుగుణంగా ఉండాలి. ఈ నిర్దిష్ట సందర్భంలో, అమెరికా పర్యటన విషయంలో ఆ నిబంధన పాటించటం లేదు. అందుకే అనుమతి నిరాకరించడం జరిగింది. అయితే, ఆయన యునైటెడ్ కింగ్‌డమ్ పర్యటనకు మాత్రం అనుమతి లభించింది,” అని తెలిపారు. ఇక్కడ బయటపెట్టని ఏదో వ్యవహారం ఉన్నదని కేంద్ర ప్రభుత్వ అధికారులు అనుమానిస్తున్నట్లు తెలుస్తున్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యేందుకు ప్రయత్నించినట్టు ఎన్‌ఆర్‌ఐ కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. రేవంత్ రెడ్డి తమ్ముడు, తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు గత కొన్ని రోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఏదో ఒక మీటింగ్‌లో కలిపించాలని, దాన్ని మీడియాలో ప్రచారం చేసుకోవాలని ప్లాన్ వేసినట్టు చెప్తున్నారు. మొదట వీటి గురించి చెప్పవద్దని, చెప్తే కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు భావించినట్టు తెలిసింది.
హైదరాబాద్ లో ఓ వీధికి ట్రంప్ పేరు పెట్టడం ద్వారా ముఖ్యమంత్రి అమెరికా అధ్యక్షుడి పట్ల తన ‘ప్రభుభక్తి’ని వెల్లడించుకోవడం ఇటీవల కలకలం రేపడం తెలిసిందే. అమెరికాకాకు వచ్చాక కలిస్తే అప్పుడేమీ చేయలేరనే ధీమాతోనే ఈ అంశాన్ని గోప్యంగా ఉంచారని భావిస్తున్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయం తెలియడంతో చివరి నిమిషంలో అమెరికా పర్యటనకు రేవంత్ రెడ్డి అధికారిక హోదాలో వెళ్లవద్దని తేల్చి చెప్పినట్టు సమాచారం. దౌత్య విషయాల్లో రాజీ పడలేమని, అందుకే పర్యటనకు అనుమతి నిరాకరిస్తున్నట్టు తేల్చి చెప్పారు. తొలుత నిర్ణయించుకున్న ప్రకారం లండన్‌లో అక్బరుద్దీన్ కుటుంబీకుల పెండ్లికి వెళ్లవచ్చని, అక్కడి నుంచి తిరిగి రావాలని తేల్చిచెప్పినట్టు తెలిసింది. రేవంత్‌రెడ్డి అమెరికా ప్రయాణానికి అనుమతి ఇవ్వకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లేమీ లేవని కేంద్ర విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇది పూర్తిగా ఆయన పర్యటనను బేరీజు వేసి తీసుకున్న నిర్ణయమని, ఆయన హోదాకు తగ్గట్టుగా పర్యటన లేకపోవడంతోనే అనుమతులు ఇవ్వలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేశారు. దీంతో కేంద్రం ప్రభుత్వం రేవంత్ రెడ్డిపై కక్ష కట్టిందనడానికి ఆవకాశమే లేదు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రెండుసార్లు అమెరికా పర్యటనకు వెళ్లిరావడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయాన్ని ఎంఈఏ అధికారులు గుర్తు చేస్తున్నారు. గతంలో ఆయన వెళ్తున్న ఉద్దేశం స్పష్టంగా ఉన్నదని, ఈసారి ఆ స్పష్టత లోపించడం వల్లే అనుమతులు నిరాకరిస్తున్నట్టు వెల్లడించారు.
కాగా, ముఖ్యమంత్రి విదేశీ పర్యటన అనుమతుల నిరాకరణపై కాంగ్రెస్ అనవసర రాజకీయ రాద్ధాంతం చేయడం మానుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు హితవు పలికారు. రేవంత్ రెడ్డి గతంలో విదేశాలకు వెళ్లినప్పుడు కేంద్రం ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదని, తాజా పర్యటనకు సంబంధించిన నిబంధనలు, విధివిధానాల ప్రకారమే నిర్ణయం జరిగిందని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో 2012లో నాటి అస్సాం కాంగ్రెస్ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ అమెరికా, ఇజ్రాయెల్ పర్యటనలను, అదేవిధంగా జార్ఖండ్ బిజెపి సీఎం అర్జున్ ముండా థాయిలాండ్ పర్యటనను కేంద్రం తిరస్కరించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమెరికా వీసా రాకుండా కుట్రపూరితంగా లేఖలు రాసిన చరిత్ర కాంగ్రెస్ ఎంపీలు, నాయకులకు ఉందని ఆయన దుయ్యబట్టారు.
ప్రవీణ్

