Nitin Nabin Yuva

యువతే వికసిత్ భారత్ నిర్మాతలు

Yuva Samvadబిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆగస్టు 18న ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులతో నిర్వహించిన ‘యువ సంవాద్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు నితిన్ నబీన్ సమాధానమిస్తూ దేశ భవిష్యత్తును నిర్మించడంలో యువతే అత్యంత శక్తిమంతమైన సాధనమని పేర్కొన్నారు. యువతలో అపారమైన శక్తి, ప్రతిభ, ఆలోచనా సామర్థ్యం ఉన్నాయని, ఈ శక్తిని సరైన దిశలో మళ్లిస్తే దేశాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్లవచ్చని అన్నారు. యువత తమ శక్తిని సరైన మార్గంలో వినియోగించాలని, వారి విజయం కుటుంబానికే కాకుండా సమాజానికి, మొత్తం దేశానికి గర్వకారణంగా మారాలని తెలిపారు. ”2047 నాటి వికసిత్ భారత్ పునాది నేటి యువత చేతుల్లోనే ఉంది. ఏ వ్యవస్థనైనా విమర్శించడం లేదా దెబ్బతీడయం చాలా సులువు. కానీ కొత్తదాన్ని నిర్మించడం ఎంతో కష్టమైన విషయం. కాబట్టి యువత విధ్వంసం వైపు కాకుండా నిర్మాణం వైపు, విమర్శల వైపు కాకుండా పరిష్కారాల వైపు, నైరాశ్యం వైపు కాకుండా సానుకూల ఆలోచనల వైపు అడుగులు వేయాలి,” అని పిలుపునిచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులతో కలిసి పనిచేసే అవకాశాన్ని కల్పించే ఇంటర్న్‌షిప్‌లు, నాయకత్వ కార్యక్రమాల ద్వారా యువతకు పాలన, పరిపాలనాంశాలపై మెరుగైన అవగాహన కల్పించవచ్చని తెలిపారు. విధాన రూపకల్పనలో భాగస్వామ్యమంటే నిర్ణయాధికార ప్రక్రియలో భాగం కావడమేనని ఆయన వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక అగ్రగామి సంస్థలు, పరిశోధనా కేంద్రాలలో భారతీయ యువత కీలక పాత్ర పోషిస్తోందని బిజెపి జాతీయ అధ్యక్షుడు గుర్తుచేశారు. ఒకప్పుడు అవకాశాల అన్వేషణలో భారతీయ యువత విదేశాలకు వెళ్లేవారని, కానీ నేడు అంతర్జాతీయ స్థాయి సంస్థలను నిర్మించగల సామర్థ్యాన్ని వారు సంతరించుకున్నారని అన్నారు. దేశంలో స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ వేగంగా విస్తరిస్తోందని, యువ పారిశ్రామికవేత్తలు ఉద్యోగాలు వెతికే స్థాయి నుండి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదుగుతున్నారని కొనియాడారు. తయారీ రంగం, మొబైల్ ఉత్పత్తి, రక్షణ పరికరాలు, సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా సెంటర్ల వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో భారత్ నూతన అవకాశాలను సృష్టిస్తోందన్నారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయ పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు మాతృదేశానికి తిరిగి వచ్చి, భారత్ అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి ఇది సరైన సమయమని పేర్కొన్నారు.

రాబోయే కాలంలో కృత్రిమ మేధ విద్యా రంగాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుందని, ప్రతి విద్యార్థి సామర్థ్యాలు, అవసరాలకు అనుగుణంగా వ్యక్తిగత అభ్యాస పద్ధతులను అభివృద్ధి చేసే అవకాశం ఉందని నితిన్ నబీన్ చెప్పారు. జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు సాంకేతికతను సమర్థంగా నేర్చుకోవాలని, భవిష్యత్తులో విద్యావ్యవస్థలో ఏఐ ఆధారిత సాధనాలు వినియోగం మరింత పెరుగుతుందని స్పష్టం చేశారు. సోషల్ మీడియా నేడు యువత జీవితంలో ముఖ్యమైన భాగమైందని, అయితే సోషల్ మీడియాలో కనిపించే ప్రతి సమాచారాన్ని నిజమని నమ్మకూడదని సూచించారు. ”తప్పుడు సమాచారం, మార్ఫింగ్ చేసిన చిత్రాలు, ఏఐతో సృష్టించిన నకిలీ కంటెంట్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో, యువత వాస్తవాలను నిర్ధారించుకునే అలవాటును పెంపొందించుకోవాలి,” అని అన్నారు. హక్కుల గురించి మాట్లాడేటప్పుడు యువత తమ బాధ్యతలు, కర్తవ్యాలను కూడా గుర్తుంచుకోవాలని, సానుకూల సమాచారాన్ని పంచుకోవడం, సమాజానికి ఉపయోగపడే ఆలోచనలను ప్రోత్సహించడం ద్వారా సోషల్ మీడియాను సానుకూల మార్పునకు మాధ్యమంగా మార్చవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమం ముగింపులో నబీన్ విద్యార్థులతో ఇష్టాగోష్టి నిర్వహించారు.