యాట మధుకర్ కుటుంబానికి అండగా బిజెపి
మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామానికి చెందిన వేమనపల్లి మండల బిజెపి అధ్యక్షుడు యాట మధుకర్ ఆత్మహత్యకు గురైన విషాద ఘటన పట్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అక్టోబర్ 14న మధుకర్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పార్టీ కోసం నిస్వార్థంగా పోరాడిన మధుకర్ కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్యం, అక్రమ కేసులు, వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. బిజెపి కార్యకర్తలందరికీ పార్టీ అండగా ఉంటుందని.. ఏ ఇబ్బంది వచ్చినా పార్టీకి తెలియజేయాలని.. ఎవరూ ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడకూడదని రాంచందర్ రావు సూచించారు. మధుకర్ మృతికి బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని రామగుండం సీపీకి ఫిర్యాదు చేశారు. నేరస్తులను ఎంతటివారైనా గుర్తించి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాంచందర్ రావు వెంట బిజెపి రాష్ట్ర కార్యదర్శి భరత్, బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్.వి. సుభాష్ తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. ‘‘ZPTC ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి తప్పక విజయం సాధిస్తాడనుకున్న మధుకర్ కాంగ్రెస్ రాజకీయ బెదిరింపులు, పోలీసుల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. వేమనపల్లి మండలం బిజెపి అధ్యక్షుడిగా మధుకర్ నీల్వాయి ప్రాంతంలో సేవలందిస్తూ, పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేశారు. బిజెపిలో తిరగొద్దని కాంగ్రెస్ నాయకులు మధుకర్ ను బెదిరించారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా బెదిరింపులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవడం లేదు. మంచిర్యాల జిల్లా, పరిసర ప్రాంతాల్లో బిజెపి కార్యకర్తలపై వేధింపులు కొనసాగుతున్నాయి. తప్పుడు కేసులు పెట్టి జైలులో పెడుతున్నారు. బిజెపి కార్యకర్తలపై వేధింపులు జరిగితే పార్టీ ఊరుకోదు. కాంగ్రెస్ అరాచకాలు, అన్యాయానికి వ్యతిరేకంగా బిజెపి పోరాటం కొనసాగుతుంది.’’ అని అన్నారు.
కాంగ్రెస్ ప్రేరేపిత హత్య
అక్టోబర్ 12న యాట మధుకర్ కుటుంబాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ఆత్మహత్య కాదని, కాంగ్రెస్ ప్రేరేపిత హత్య అని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల అరాచకాలు, దౌర్జన్యాలతోపాటు పోలీసుల వేధింపులు తాళలేకే మధుకర్ ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అరాచకాలపై పోరాడి ఓడిస్తే… అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అంతకు మించి అరాచకాలు, దౌర్జన్యాలు చేస్తోందన్నారు.
కాంగ్రెస్ నేతల వేధింపులు, ఇంటిపై దాడి చేసి దౌర్జన్యం చేయడమే కాకుండా మధుకర్పైనే అత్యాచార యత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి తీవ్రంగా వేధించారని కుటుంబ సభ్యులు వాపోయారు. పోలీసుల వేధింపులు, కాంగ్రెస్ గూండాలు దౌర్జన్యాలు భరించలేకే మధుకర్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు రోదిస్తూ చెప్పారు. మధుకర్ తీవ్ర పేదరికంలో కొట్టు మిట్టాడుతున్నారని, సొంత ఇల్లు కూడా లేదని చెబుతూ తలుపులు కూడా లేని ఇంటిని చూపించారు. మధుకర్ కుటుంబానికి తక్షణ సాయంగా రూ.లక్ష అందజేశారు.