జంగిల్‌రాజ్‌ మళ్లీ రావద్దు

bihar pracharamబిహార్ ఎన్నికల ప్రచారంలో బిజెపి దూసుకుపోతుంది. ఎన్డీఏ కూటమి అధికారం నిలబెట్టుకుంటుందని ఇప్పటికే సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. “రఫ్తార్‌ పకడ్‌ చుకా బిహార్‌, ఫిర్‌ సే ఎన్డీఏ సర్కార్‌” నినాదంతో డబుల్ ఇంజన్ సర్కార్‌కు మరో అవకాశం ఇవ్వాలంటూ ఎన్డీఏ నేతలు ప్రచారం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా సహా కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు బిహార్ ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. స్థానిక నాయకుల ప్రచారం పతాకస్థాయికి చేరుకుంది. ప్రధాని పలు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ‘నమో యాప్’ ద్వారా బిజెపి కార్యకర్తలతోనూ సంభాషించారు. వివిధ సందర్భాల్లో మోదీ ప్రసంగిస్తూ.. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ) పాలనపై ఆయన నిప్పులు చెరిగారు. బిహార్‌లో లెక్కలేనన్ని అరాచకాలు సృష్టించిన జంగిల్‌రాజ్‌ను వందేళ్లయినా మర్చిపోలేమని అన్నారు. అప్పటి అకృత్యాలను దాచిపెట్టేందుకు విపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల మది నుంచి చెరిగిపోవని చెప్పారు. జంగిల్‌రాజ్‌ నుంచి బిహార్‌కు విముక్తి కల్పించేందుకు ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌తో పాటు ఎన్డీఏ ఎంతగానో కష్టపడిందని తెలిపారు.

రాష్ట్రంలో చట్టబద్ధమైన పరిపాలనను నెలకొల్పామని, ఇప్పుడు ప్రజలు తాము బిహారీలమని గర్వంగా చెప్పుకుంటున్నారని తెలిపారు. విపక్ష మహాగఠ్‌బంధన్‌ నేతలు బెయిల్‌పై బయట ఉన్నారని, అది నేరగాళ్ల కూటమి (లాఠ్‌బంధన్‌) అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావించారు. తమ పాలనలో సమగ్ర అభివృద్ధి జరిగిందని, పాఠశాలలు, ఆసుపత్రులు, రైలు మార్గాలు నిర్మించామని గుర్తుచేశారు. కేంద్రం, రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వాలు ఉండడం వల్లే ఈ ప్రగతి సాధ్యమైందని చెప్పారు. మరోసారి దగా చేయడానికి వస్తున్న నేరగాళ్ల కూటమికి ప్రజలు గట్టి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఆ కూటమికి ప్రజాసేవ అంటే ఏమాత్రం తెలియదని, తమకే ప్రయోజనాలు కావాలని పేర్కొన్నారు. నక్సలిజం, మావోయిస్టు ఉగ్రవాదం వల్ల బిహార్‌ యువత ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని తెలిపారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోయారని చెప్పారు. అప్పటి పాలకులు ఎన్నికల్లో నెగ్గడానికి మావోయిస్టులను వాడుకున్నారని మోదీ మండిపడ్డారు. కడుపుమండిన ప్రజలు ఓటు అనే ఆయుధంతో జంగిల్‌రాజ్‌ను ఓడించారని వివరించారు. ఆనాటి అరాచక పాలన మళ్లీ రావాలని ఎవరూ కోరుకోవడం లేదని అన్నారు. బిహార్‌ ప్రజలకు ఓటు విలువ అర్థమైందని చెప్పారు. జంగిల్‌రాజ్‌ కాలం నాటి వేధింపులు, ఘోరాల గురించి యువతకు తెలియజేయాలని సూచించారు. 

modi takur“2005లో బిహార్ ప్రజలు జంగిల్‌రాజ్‌కు ముగింపు పలికారు. ఆర్జేడీ–కాంగ్రెస్ అరాచక పాలనకు చరమగీతం పాడేశారు. ఈ విషయం ఇప్పటి యువత తెలుసుకోవాలి. యువత భుజస్కంధాలపై పెద్ద బాధ్యత ఉంది. సుపరిపాలనను ఆదరించాలి. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి. గుజరాత్, మధ్యప్రదేశ్, హరియాణాతో పాటు మహారాష్ట్రలోనూ బిజెపి మళ్లీ అధికారంలోకి వచ్చింది. బిహార్‌లో సైతం పాత రికార్డులను తిరగరాయడం తథ్యం. విపక్ష ఇండియా కూటమిలో కీచులాటలు జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం లేదు. అది మహాగఠ్‌బంధన్ కాదు, మహాలాఠ్‌బంధన్.’’ అని అన్నారు.

గతంలో ఆర్జేడీ–కాంగ్రెస్ పాలనలో పెట్టుబడిదారులు బిహార్‌ను వదిలి వెళ్లిపోయారని, అప్పటి పాలకులు భూములు లాక్కొని యువతకు ఉపాధి కల్పించలేదని తెలిపారు. బిహార్ ఇప్పుడు మొబైల్ ఫోన్ ఫ్లాష్‌లైట్‌తో వెలిగేలా ఉందని, లాంతరు (ఆర్జేడీ గుర్తు) అవసరం లేదని అన్నారు. ఎన్డీఏ పాలనలో బిహార్ అభివృద్ధికి మూడు రెట్లు అధిక నిధులు అందించామని చెప్పారు. బిహార్ స్వయం సమృద్ధిగా మారిందని, చేపలు, మఖానా ఎగుమతికి కేంద్రం మఖానా బోర్డును ఏర్పాటు చేసిందని తెలిపారు. గతంలో 18 జిల్లాల్లో నక్సలిజం ఉందని, ఇప్పుడు అది కొద్ది ప్రాంతాలకు మాత్రమే పరిమితమైందని చెప్పారు. దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని హామీ ఇచ్చారు. బిహార్‌కు గర్వకారణమైన సీతారాం కేసరిని కాంగ్రెస్ అవమానించిందని, నెహ్రూ–గాంధీ కుటుంబం ఆయనను బయటకు నెట్టిందని ఆరోపించారు.

షహబుద్దీన్‌ తనయుడికి టికెట్టా?

ఇక అమిత్ షా బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నారు. ఆయన అనేక జిల్లాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ విపక్ష ఆర్జేడీపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతివ్వాలని ప్రజలను పిలుపునిచ్చారు.​ ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ షహబుద్దీన్‌ తనయుడికి టికెట్‌ ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. షహబుద్దీన్ కాలంలో ప్రజలు భయంతో జీవించారని, కానీ నితీశ్‌ కుమార్–మోదీ డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వంలో ఎవరూ హాని చేయలేరని చెప్పారు. ​బిహార్‌ నుంచి అక్రమ వలసదారుల్ని పూర్తిగా నిర్మూలిస్తామని హామీ ఇచ్చారు. బిహార్‌లో ‘డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం’ ప్రజలకు అభివృద్ధి, రక్షణ, పారదర్శక పరిపాలన అందించిందని పేర్కొన్నారు.​

వికాసానికి, వినాశానికి మధ్య పోరు

బిహార్ అసెంబ్లీ ఎన్నికలను అధికార ఎన్డీఏ వికాసానికి, విపక్షాల ఇండియా కూటమి వినాశానికి మధ్య జరుగుతున్న పోరుగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా అభివర్ణించారు. ఎన్డీఏ అభ్యర్థుల తరఫున ఎన్నికల సభల్లో పాల్గొని ప్రసంగించారు. ఇరవయ్యేళ్ల పాలనలో సీఎం నితీశ్‌కుమార్‌ రాష్ట్రంలో జంగిల్‌రాజ్‌ను అంతం చేశారని చెప్పారు. బిహార్‌ సర్వతోముఖాభివృద్ధికి ఎన్డీఏ పాటుపడుతోందని అన్నారు. పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. అందుకే ఈ ఎన్నికలు వికాసానికి, వినాశానికి మధ్య జరుగుతున్న పోరాటం వంటివని పేర్కొన్నారు.

నవంబర్ 14న ఫలితాలు

మొత్తం 243 సీట్లు ఉన్న బిహార్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలిదశలో నవంబర్ 6న 121 స్థానాల్లో, రెండోదశలో నవంబర్ 11న 123 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్డీఏ 242 స్థానాల్లో పోటీ పడుతుంది. ఇందులో బిజెపి, జనతాదళ్ (యునైటెడ్) చెరీ 101 స్థానాల్లో పోటీ పడుతున్నాయి. ఇక లోక్ జనశక్తి పార్టీ 28 స్థానాల్లో, హిందుస్తాన్ అవాం మోర్చా, రాష్ట్రీయ లోక్ మోర్చా చెరీ 6 స్థానాల్లో బరిలో దిగుతున్నాయి. ఇండీ కూటమి నుంచి రాష్ట్రీయ జనతాదళ్ 143, కాంగ్రెస్ 61, మిగతా స్థానాల్లో ఇతర పార్టీలు పోటీలో ఉన్నాయి. నవంబర్ 14న ఈ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.