రామో విగ్రహవాన్ ధర్మః : ధర్మానికి ప్రతిరూపం శ్రీరాముడు
వేదాలలో నిక్షిప్తమైన ధర్మం సాకారంగా అందరికీ దర్శనీయం కాకపోవడంతో ఆచరణయోగ్యమైన ధర్మానికి ప్రతిరూపంగా శ్రీరామచంద్రుడు అవతరించారని వేలాది సంవత్సరాలుగా విజ్ఞులు విశ్వసిస్తున్న విశిష్టమైన నమ్మకం. త్రేతాయుగంలో సూర్యవంశంలో దశరథ మహారాజు, కౌసల్య దేవిల తనయుడు శ్రీరామచంద్రుడు జగదభి రాముడు షోడశ (16) మహా గుణాలు కలిగిన పురుషోత్తముడు. త్రేతాయుగం నుంచి నేటి వరకు, భవిష్యత్తులో అనంత కాలం వరకు యావత్ ప్రపంచానికి మార్గదర్శకుడిగా నిలువగలిగిన ధర్మమూర్తి శ్రీరామచంద్రుడు. మహర్షి వాల్మీకీ శ్రీమద్రామాయణంలోనూ, గోస్వామి తులసీదాస్ రాంచరిత్ మానస్ లోనూ వర్ణించిన స్థలాలు భారతదేశంలోనూ, శ్రీలంకలోనూ ఉన్నాయి. దశావతారంలో ఏడో అవతారమైన శ్రీరామచందుడి గురించి ఎంత వర్ణించిననూ తక్కువే.
తండ్రి మాట జవదాటని తనయుడిగా, సోదరులను అభిమానించిన అన్నగా, భార్య కోసం వేల కిలోమీటర్లు ప్రయాణించి, భక్తులను, మిత్రులను కలుపుకొని అభేద్యమైన వారధిని నిర్మించి, భీకర యుద్ధంలో ముల్లోకకంఠకుడైన రావణాసురుడిని వధించి, రాజధర్మం కోసం ప్రజాభిప్రాయం ప్రకారం సతీవియోగం పొంది, ఆమె కోసం పరితపించే భర్తగా ప్రజల మాటకు విలువిచ్చే రాజుగా ఆదర్శాల కోసం త్యాగమయ జీవితం గడిపిన శ్రీరామచంద్రుల వారు ఎల్లప్పటికీ విశ్వం మొత్తానికి దైవమే.
ఉత్తర ప్రదేశ్ లో సాకేతపురంగా కూడా పిలవబడే పవిత్ర సరయు నదీ ఒడ్డున ఉన్న ముఖ్యపట్టణం అయోధ్య. బౌద్ధ, జైన మతాలకు సైతం అయోధ్యతో పవిత్ర అనుబంధం ఉంది. మన దేశానికి వచ్చిన హుయెన్ త్సాంగ్ లాంటి విదేశీ యాత్రికులు కూడా అయోధ్యను గొప్పగా వర్ణించారు. సమస్త హిందువులు పూజించే సప్త పవిత్ర నగరాల్లో అయోధ్య మొదటిది. రామాలయాన్ని శ్రీరాముడి తనయుడు కుశుడు నిర్మించాడనేది హిందువుల విశ్వాసం. విక్రమాదిత్యుడి కాలంలో రాముడి గుడిని పునర్‌వైభవం చేశారని చరిత్రకారులు చెప్పారు. దురాక్రమణదారుడైన బాబర్ ఆదేశంతో సేనాపతి మీర్ బాకీ సైన్య విధ్వంసంతో రామజన్మభూమి మందిరం కూలగొట్టి, ఆ స్థానంలో 1528-30లో ఒక మసీదు కట్టారు. గత 500 సంవత్సరాలుగా లక్షలాది హిందువులు అయోధ్య రామమందిరం పునర్నిర్మాణం కోసం ప్రాణత్యాగం చేశారు. విశ్వ హిందూ పరిషత్ ఉద్యమం, అయోధ్య గుడి తెరుచుకోవాలన్న ఫైజాబాద్ కోర్టు ఆదేశంతో దేశంలో అయోధ్య గుడి విషయం ప్రజల్లోకి తీవ్రంగా వెళ్లింది. ఇక లాల్ కృష్ణ అద్వానీ సోమ్ నాథ్-అయోధ్య రథయాత్రతో పాటు బిజెపి నడిపిన అన్ని అయోధ్య ఉద్యమాలు ప్రపంచంలోని ఏ శక్తీ కూడా అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని అడ్డుకునే స్థితిలో లేకుండా చేశాయి.
చారిత్రాత్మక దినమైన నవంబర్ 9, 2019న దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన అయోధ్య తుదితీర్పుతో రామజన్మభూమి స్థలంలో భవ్య రామమందిర నిర్మాణానికి న్యాయపరమైన చిక్కులు పూర్తిగా తొలగిపోయాయి. న్యాయస్థానం ఆదేశంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక్క రూపాయి నిధితో రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు చేసింది. భవ్య రామమందిరం నిర్మాణం కోసం ఆ ట్రస్ట్ దేశవ్యాప్తంగా నిధి సేకరణ చేపట్టడంతో దేశ ప్రజల భక్తిప్రపత్తులతో విరాళాలు ఇవ్వడంతో 2020 ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భూమిపూజతో భవ్య రామమందిర నిర్మాణం ఆరంభమైంది. ఈ నెల 22న రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టతో దేశ ప్రజలందరికీ అయోధ్య రామజన్మభూమి మందిరం దర్శన భాగ్యం కలగనుంది. గత డిసెంబర్ 30న ప్రధాని మోదీ చేతుల మీదుగా ‘‘మహర్షి వాల్మీకీ’’ అంతర్జాతీయ విమానాశ్రయం, విస్తరించిన, ఆధునీకరించిన ‘‘అయోధ్య ధామ్’’ రైల్వే స్టేషన్ ప్రారంభంతో అయోధ్య నగరంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలెన్నో యావత్ దేశానికి తెలిసాయి. భవిష్యత్తులో ‘‘శ్రీరామచంద్రుల వారి అయోధ్య’’ ప్రపంచంలోనే ఒక గొప్ప పవిత్ర తీర్థ క్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా ఆవిర్భవించనుంది. ఈ భవ్య రామమందిరం కోసం ప్రాణాలర్పించిన లక్షలాది హిందువులు భగవంతుడి కృపకు పాత్రులు. ఉద్యమం చేసిన కోట్లాది మంది హిందువులు ధన్యులు.
జై శ్రీరాం. భారత్ మాతా కీ జై.