Modi, Atal, Vajpayee

వాజ్‌పేయి సేవలు చిరస్మరణీయం

జనసందేశ్ ప్రతినిధి

Modi, Atal, Vajpayee

దేశాభివృద్ధిని వేగవంతం చేయడానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి.. జీవితాంతం పాటుపడ్డారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. డిసెంబర్ 25న వాజ్‌పేయి 99వ జయంతి, సుపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని దిల్లీలో ‘సదైవ్‌ అటల్‌’ను ప్రధాని సందర్శించి, ఆయనకు నివాళులు అర్పించారు. దేశానికి వాజ్‌పేయి చేసిన సేవ చిరస్థాయిగా నిలిచిపోతుందని మోదీ పేర్కొన్నారు. ‘‘..ఆయన గొప్ప వక్త. ఆయన అంకితభావం అమృత కాలంలో భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి. దేనిలోనైనా హాస్యాన్ని వెతకగల సామర్థ్యం వాజ్‌పేయి సొంతం. పార్టీ సమావేశాల్లో వాతావారణం వేడెక్కుతున్న సమయంలో.. ఒక జోక్‌ పేల్చి నవ్వులు పూయించేవారు. ఆయనకు ప్రతి విషయంపై అవగాహన ఉండేది’’ అని ప్రశంసించారు. వాజ్‌పేయి జీవితంలోని వివిధ ఘట్టాల సమాహారంగా ఉన్న వీడియోను మోదీ- ‘ఎక్స్‌’ వేదికగా పంచుకున్నారు. ఆ వీడియోకు ఆయనే గళం అందించారు. ‘సైద్ధాంతిక పరిధుల్ని దాటి అందరి ఆమోదాన్ని సాధించి, ఇతర పార్టీల మద్దతులో 1999-2004 మధ్య సంకీర్ణ సర్కారును వాజ్‌పేయి విజయవంతంగా నడిపించారు. సుపరిపాలన సిద్ధాంతమే మా ప్రభుత్వానికి గుర్తింపుగా మారింది. మౌలిక వసతుల కోసం ప్రజలు ఎవరిచుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యం. పెద్దపెద్ద కుంభకోణాలు జరగకుండా ప్రభుత్వాన్ని నడపడం అసాధ్యం అనే భావన గతంలో ఉండేది. మా ప్రభుత్వం ఆ సంస్కృతిని బద్దలుకొట్టింది’ అని పేర్కొన్నారు.

స్వాతంత్య్ర సమరయోధుడు, విద్యావేత్త మదన్‌మోహన్‌ మాలవీయ జయంతి సందర్భంగా ఆయనకు కూడా ప్రధాని నివాళులర్పించారు. మాలవీయ ఎవరితో సరిపోల్చలేని వ్యక్తి అని, దేశంలో ప్రతి తరానికి ఆయన స్ఫూర్తి అని పేర్కొన్నారు. మాలవీయ ప్రసంగాలు, లేఖలతో 11 సంపుటాల్లో క్రోడీకరించిన తొలివిడత పుస్తకాలను విజ్ఞాన్‌భవన్‌లో ఆయన ఆవిష్కరించారు. వాజ్‌పేయి, మాలవీయలకు నివాళులర్పించినవారిలో ప్రధానితో పాటు రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి రాంనాథ్‌ గోవింద్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నిర్మలా సీతారామన్‌, కిరణ్‌ రిజిజు, హర్దీప్‌ సింగ్‌ పురి, అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ తదితరులు ఉన్నారు.

 అటల్ జీ అడుగుజాడల్లో మోదీ సర్కార్

రామ జన్మభూమి మందిర ఉద్యమానికి గళాన్నందించి, అయోధ్యలో రామమందిర నిర్మాణమే లక్ష్యంగా పనిచేసిన వాజ్ పేయి కలలను నేడు నరేంద్ర మోదీ ప్రభుత్వం సాకారం చేసిందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అటల్ జీ అడుగుజాడల్లో మోదీ సర్కార్ ముందుకెళ్తోందన్నారు. భారతదేశ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి, సుపరిపాలన దినోత్సవం సందర్భంగా కిషన్ రెడ్డి డిసెంబర్ 25న బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పలు ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. వాజ్ పేయిని స్మరించుకుంటూ పలు స్వచ్ఛంద సంస్థలు చేపట్టిన సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాజ్ పేయి జయంతి సందర్భంగా అమీర్ పేట్ గురుగోవింద్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో పేదలకు దుప్పట్లు పంపిణీ చేసి, అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ‘‘కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మచ్చలేని రాజకీయ నాయకుడిగా, ఉన్నత విలువలు కలిగిన వ్యక్తిగా అటల్ జీ చరిత్రలో నిలిచిపోతారు. ఒక్క సీటు తేడాతో ప్రభుత్వాన్ని కోల్పోవాల్సి వచ్చినా నిజాయితీగా వ్యవహరించిన గొప్ప నాయకుడు వాజ్ పేయి. పాకిస్థాన్ తో స్నేహహస్తం అందించి దిల్లీ నుంచి పాకిస్థాన్ వరకు బస్సులో ప్రయాణం చేశారు. భారత్ కు వెన్నుపోటు పొడిచి, కార్గిల్ లో భారత భూభాగాన్ని ఆక్రమించిన అదే పాకిస్థాన్ పై యుద్ధం చేసి బుద్ధి చెప్పారు. వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజనతో పేదలకు కోట్లాది ఇండ్లు కట్టించిన మహానుభావుడు. వాజ్ పేయి హయాంలో నిర్మించిన ఇండ్లే నేటికీ కనపడుతున్నాయి తప్ప.. నేటి తెలంగాణలో యూపీఏ ప్రభుత్వంలో, గత బీఆర్ఎస్ పాలనలో పేదలకు ఇండ్లను ఇచ్చింది లేదు. మారుమూల గ్రామాలకు ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా రోడ్లు నిర్మించారు. ప్రధాన మంత్రి స్వర్ణ చతుర్భుజి ద్వారా దేశంలో అనేక జాతీయ రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పొదుపు సంఘాలకు రుణసాయం అందించారు. వాజ్‌ ‌పేయి ఉపన్యాసం కోసం వేలాది మంది సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఆయనో మంచి కవి. అలాంటి మహానేత మనకు స్పూర్తిధాత.’’ అని అన్నారు.

G Kishan Reddy Distributes Fruits to public on ocastion of atal bihari watchpai birth anniversary