బిజెపిలోకి బీబీ పాటిల్
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బిజెపిలో చేరికలు ఊపందుకుంటున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మద్దతుగా సిటింగ్ ఎంపీలు సైతం బిజెపిలో చేరుతున్నారు. నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు బిజెపిలో చేరిన మరుసటి రోజే జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్కు రాజీనామా చేసి బిజెపిలో చేరారు. మార్చ్ 1న దిల్లీ బిజెపి కేంద్ర కార్యాలయంలో బిజెపి రాష్ట్ర ఇన్ చార్జ్, జాతీయ కార్యదర్శి తరుణ్ చుగ్, ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు, ఎంపీ డా. కె.లక్ష్మణ్, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమక్షంలో బీబీ పాటిలో కాషాయ కండువా కప్పుకున్నారు. లాంఛనంగా పార్టీ సభ్యత్వం ఇచ్చి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ పదేండ్లలో చేసిన ప్రగతిని చూసి పాటిల్ బిజెపిలో చేరారని, ఆయనకు స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు. మూడేండ్లలో కేసీఆర్ కుటుంబ అవినీతి రాజకీయాలు నచ్చని దాదాపు 60 మందికి పైగా నేతలు తమ పార్టీలో చేరినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని, ఆ పార్టీ పేరును… బాప్, బేటా, బేటీ(బీబీబీ) పార్టీ గా మార్చుకోవాలన్నారు. అందులో వాళ్ల కుటుంబ సభ్యులు, వారి వెనుక నడిచేటోళ్లు మాత్రమే మిగిలారని ఎద్దేవా చేశారు. బంగారు తెలంగాణ కోరుకునే వారు బిజెపిలో చేరాలని పిలుపునిచ్చారు. అసత్య హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై మూడు నెలల్లోనే వ్యతిరేకత మొదలైందన్నారు.
బీఆర్ఎస్ పార్టీ రెక్కలు తెగిన పక్షిలా తయారైందని కె.లక్ష్మణ్ అన్నారు. ఆ పార్టీ రోజుకో ఎంపీ వికెట్ కోల్పోతుందన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ముగిసిన అధ్యాయమని, గడిచిన చరిత్రని అన్నారు. బీఆర్ఎస్ నుంచి మరింత మంది బిజెపి వైపు చూస్తున్నారని, ఆ పార్టీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమన్నారు. గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. మోదీ గ్యారంటీ అంటే అభివృద్ధి.. ప్రజల నమ్మకం.. విశ్వాసం అని చెప్పారు. బీఆర్ఎస్ నేతల ప్రాజెక్టుల పర్యటన ఒక డ్రామా అని కొట్టిపారేశారు. లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతుందన్నారు. సామాజిక కోణాలు, గెలుపు అవకాశాలు దృష్టిలో ఉంచుకుని అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాల్లో బిజెపి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో బిజెపి తిరుగులేని శక్తిగా ఎదుగుతుందన్నారు.
బీబీ పాటిల్ మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి చేసే శక్తి, ఆలోచనలు ప్రధానికి ఉన్నాయని, అందుకే బిజెపిలో చేరినట్లు తెలిపారు. మోదీ దేశాన్ని ఆత్మనిర్భర్ భారత్ గా నిలిపారని అన్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. మోదీ నేతృత్వంలో బిజెపిలో పని చేస్తానన్నారు. అనంతరం బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను బీబీ పాటిల్ మర్యాదపూర్వకంగా కలిశారు.