సొంతంగా 370, కూటమితో 400 సీట్లు లక్ష్యం
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి సొంతంగా 370 సీట్లు, మిత్రపక్షాలతో కలిసి ఎన్డీయే కూటమి 400 సీట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని, పని చేస్తున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం బిజెపి మేనిఫెస్టో ‘‘సంకల్ప పత్రం’’ ప్రజల మేనిఫెస్టోగా రూపొందించే పనిలో బిజెపి ఉంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజాభిప్రాయాన్ని విస్తృతంగా సేకరించి, వారి ఆలోచనలకు అనుగుణంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా అభిప్రాయ సేకరణ కోసం రూపొందించిన వికసిత్ భారత్ పత్రాన్ని మార్చ్ 2న బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విడుదల చేశారు. దీంతో వికసిత్ భారత్ పోస్టర్, సూచనల పెట్టె, స్టిక్కర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ విజయ సంకల్ప యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా మంచి స్పందన వస్తోందన్నారు. తెలంగాణలో మెజారిటీ సీట్లు సాధించి కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వంలో రాష్ట్ర భాగస్వామ్యం గణనీయంగా ఉండేందుకు ప్రజలే బిజెపికి మద్దతుగా వస్తున్నారు. నేడు భారతదేశం ఎంతో ప్రగతి సాధిస్తుందని, మారుమూల ప్రాంతాలకూ సంక్షేమ పథకాలు చేరుతున్నాయన్నారు. అందుకే బిజెపి జెండాను చూడగానే ప్రజలే స్వచ్ఛందంగా ‘ఇది మన మోదీ గ్యారంటీ’ అని అంటున్నారని కిషన్ రెడ్డి తెలిపారు.