మోదీ రోడ్ షోకు బ్రహ్మరథం
హైదరాబాద్ మల్కాజిగిరి ప్రాంతం మోదీ… మోదీ… నినాదాలతో దద్దరిల్లింది. మార్చ్ 15న ఇక్కడ జరిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్‌షోకు నగర ప్రజలు, అభిమానులు పోటెత్తారు. మీర్జాలగూడ నుంచి మల్కాజ్ గిరి చౌరస్తా వరకు సాగిన ఈ రోడ్ షో పొడవునా ప్రధానికి బ్రహ్మరథం పట్టారు. జనసమూహాన్ని చూసిన మోదీ.. రెట్టించిన ఉత్సాహంతో రెండు చేతులు ఊపుతూ ముందుకు సాగారు. కిలోమీటరున్నర పొడవునా జరిగిన ఈ రోడ్ షోకు భారీఎత్తున తరలివచ్చిన అభిమానులు, ప్రజలు మోదీపై పూలవర్షం కురిపించారు. మహిళలు బతుకమ్మలతో స్వాగతం పలికారు. మోదీ.. మోదీ.. మళ్లీ మీరే ప్రధాని అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.
ప్రచారరథంపై ప్రధానితో పాటు సికింద్రాబాద్ అభ్యర్థి అయిన రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి, మల్కాజ్ గిరి అభ్యర్థి ఈటల రాజేందర్ ఉన్నారు. అడుగడుగునా కార్యకర్తలు, ప్రజలు నినాదాలు చేస్తుండగా.. ప్రచారరథం ముందుకు సాగింది. అభిమానులు కోలాటాలు, డీజే డప్పులతో రోడ్‌షోను మారుమోగించారు. రోడ్డుకు ఇరువైపులా భారీ సంఖ్యలో ఎదురుచూస్తున్న అభిమానులను పలకరిస్తూ.. రెండు చేతులూ ఊపుతూ.. అభివాదం చేస్తూ మోదీ ముందుకు కదిలారు. మిద్దెలపై నుంచి చూస్తున్న ప్రజలకు ఆయన చేతులెత్తి నమస్కరించారు. రోడ్ షో ప్రారంభానికి కొన్ని గంటల ముందు నుంచే పెద్దఎత్తున ప్రజలు రోడ్డుకు ఇరువైపులా బారులుతీరి ప్రధానమంత్రి రాకకోసం ఎదురు చూశారు. మోదీని చూసి యువత ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. ఆయన చిత్రపటాలను చేత పట్టుకుని మురిసిపోయారు. దారి పొడవునా స్వాగత వేదికలు ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలతో ఆయా ప్రాంత నాయకులు స్వాగతం పలికారు. ‘ఫిర్ ఏక్ బార్.. మోదీ సర్కార్’ అంటూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు నగరంలోని పలు ప్రాంతాల నుంచి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు రోడ్డుకు తరలివచ్చారు. వారంతా మోదీ వెంట నడిచారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి చౌరస్తా జనసంద్రంగా మారింది. మల్కాజిగిరి చౌరస్తా వద్ద రోడ్‌షో ముగించిన ప్రధాని ప్రచారరథం దిగి అక్కడ కాసేపు గడిపారు. పలువురు బిజెపి నాయకులతో ముచ్చటించి.. అందరికీ అభివాదం చేశారు. మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను భుజం తట్టి అభినందించారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో రాజ్‌భవన్‌కు వెళ్లారు.