D.K. Aruna

మహిళలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి

Telangana Mahila Morchaకాంగ్రెస్‌ మహిళలను నమ్మించి మోసం చేసిందని, వంద రోజులు గడుస్తున్నా ఆరు గ్యారంటీ పథకాల ఊసే లేదని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె. అరుణ విమర్శించారు. సాధ్యం కానీ హామీలు ఇచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారని, లోక్‌సభ ఎన్నికల్లోనూ అవే హామీలు వల్లె వేస్తున్నారని అన్నారు. ఉచితాల పేరుతో మహిళలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా ప్రశ్నించాలని  కోరారు. ప్రజలు ముఖ్యంగా మహిళలు అప్రమత్తంగా ఉంటూ కాంగ్రెస్‌ నేతలను నిలదీయాలని సూచించారు. మార్చ్ 22న మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ‘‘ప్రశ్నిస్తున్న తెలంగాణ మహిళా  శక్తి’’ సదస్సుకు ఆమె హాజరై ప్రసంగించారు. అన్నింట్లో సగభాగంగా ఉన్న మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారని వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో మహిళా ఎంపీని గెలిపించుకోవాలని, మహిళలు ఏకమైతే బిజెపి గెలుపును ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. పాలమూరులో ఇప్పుడు పోటీలో ఉన్నోళ్లు కేవలం ఓట్ల కోసం వచ్చిన వాళ్లేనని తెలిపారు. వారెవరికీ పాలమూరుతో పేగుబంధం లేదని, కానీ నేను లోకల్.. ఈ ప్రాంత బిడ్డగా ఓట్లు అడిగే హక్కు తనకు మాత్రమే ఉందన్నారు. ఈ దేశం బాగుండాలి అంటే మరోసారి మోదీ ప్రధాని కావాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ సదస్సులో పాల్గొన్న బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డా.శిల్పారెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ మహిళలకు దేశంలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని కొనియాడారు. సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్‌ ఏనాడూ మహిళా సాధికారతకు కృషి చేయలేదని విమర్శించారు. ఎన్నో ఏళ్లుగా కట్టుబాట్ల చెరలో కొనసాగుతూ కుటుంబ జీవనాన్ని కోల్పోయిన ముస్లిం మహిళలకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వమే ముమ్మారు తలాఖ్‌ నిషేధించి చేయూత ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో గడిచిన పదేళ్ల బీఆర్ఎస్ పాలన తరహాలోనే వంద రోజుల కాంగ్రెస్‌ పాలన కొనసాగిందని ఆమె ఆరోపించారు. గత బీఆర్ఎస్ హామీలిచ్చి మోసం చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలతో కాలం గడుపుతోందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా డీకే అరుణ గెలుపులో బిజెపి మహిళా మోర్చాల భాగస్వామ్యం సింహభాగాన ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డా. సమత, సుధా, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజా రెడ్డి, మక్తల్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పావని, నారాయణపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాల మహిళా మోర్చా అధ్యక్షురాళ్లు లక్ష్మి, పద్మవేణి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.