Modi Schemes 00

దారిద్య్ర నిర్మూలనలో మోదీ పథకాల కీలక పాత్ర

బిజెపి ప్రభుత్వానికి ముందు 60 ఏళ్లలో కాంగ్రెస్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఆహారం, దుస్తులు, నివాసం, గ్రామీణ ఉపాధి హామీ పథకానికే (ఎన్ఆర్ఇజిఎస్) పరిమితమయ్యాయి. మోదీ ప్రభుత్వానికి ముందు 6 దశాబ్దాలలో కాంగ్రెస్ చేసింది అత్యంత స్వల్పం. గత పదేళ్లలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పిఎంఏవై) కింద దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి 4 కోట్ల ఇళ్లను మోదీ ప్రభుత్వం మంజూరు చేసింది. పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలను అందిస్తున్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇప్పుడు 14 కోట్ల గ్రామీణ కుటుంబాలకు సురక్షితమైన తాగునీరు చేరుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ప్రాయోజిత ఆరోగ్య బీమా పథకమైన పిఎం జన్ ఆరోగ్య యోజన (పిఎం-జెఏవై) కింద 12 కోట్ల బలహీనవర్గాల కుటుంబాలకు చెందిన 55 కోట్ల మందికి పైగా వ్యక్తులకు ఆరోగ్య సేవలు ఉచితంగా లభిస్తున్నాయి. మొత్తం 10.27 కోట్ల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు అల్పాదాయ కుటుంబాలకు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి అందించారు.

ఒక మనిషి ప్రాథమిక అవసరాలను తీర్చడానికి అవసరమైన ఆర్థిక ఆస్తులు లేదా ఆదాయం లేకపోవడాన్ని పేదరికంగా నిర్వచించారు. పేదరికం సామాజిక, ఆర్థిక, రాజకీయాలతో సహా వివిధ రూపాలను తీసుకోవచ్చు. ఆహారం, బట్టలు, నివాసం వంటి ప్రాథమిక వ్యక్తిగత అవసరాలను తీర్చడానికి అవసరమైన వనరుల మొత్తం లేకపోవడంగా సంపూర్ణ పేదరికాన్ని నిర్వచించారు. స్వచ్ఛ భారత్ అభియాన్ ఇళ్లలో మరుగుదొడ్లు, స్థానికంగా ఉమ్మడి నిర్వహణ మరుగు దొడ్ల నిర్మాణం ద్వారా బహిరంగ మలవిసర్జనను తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. అలాగే వీధులు, రహదారులు, నివాసాల చుట్టూ పరిశుభ్రతను ప్రోత్సహిస్తుంది. ఉజ్వల యోజన ద్వారా వంట గ్యాస్ కనెక్షన్‌లను అందించడానికి చేసిన ప్రయత్నాలు 10.27 కోట్ల మందికి పైగా లబ్ధి చేకూర్చాయి. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ద్వారా జీరో బ్యాలెన్స్ ఖాతాలను తెరవడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన భారతదేశం అంతటా 4 కోట్ల గృహాలను నిర్మించి, పేద కుటుంబాలకు చేయూతనిచ్చింది.

2015 జూన్ 1 న ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు. తక్కువ ఖర్చుతో కూడిన, పర్యావరణ అనుకూల గృహాల నిర్మాణాన్ని ప్రోత్సహించడం ద్వారా పేదలకు సహాయం చేయడం దీని లక్ష్యం. ఏయే ప్రాంతాల్లో వీటి నిర్మాణాన్ని ప్రోత్సహించాలనే దాన్ని బట్టి పీఎంఏవై పథకాలను రెండు రకాలుగా వర్గీకరించారు.
1) ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-రూరల్
ఆర్థికంగా వెనుకబడిన, తక్కువ ఆదాయ కుటుంబాలు తక్కువ వడ్డీపై గృహనిర్మాణానికి రుణాలు పొందడంలో సహాయం చేయడానికి పీఎంఏవై-రూరల్ (గ్రామీణ) పథకం అమలు చేస్తున్నారు. 
2) ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్
దాదాపు 2 కోట్ల ఇళ్ళు నిర్మించడం దీని లక్ష్యం. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం దేశవ్యాప్తంగా 4,041 నగరాలు, పట్టణాలలో అమలవుతోంది. కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి అందిన అభ్యర్ధనల మేరకు పీఎంఏవై-అర్బన్ ప్రోగ్రామ్ అమలును డిసెంబర్ 31, 2024 వరకు పొడిగించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన బడ్జెట్ 2023లో 66 శాతం పెంచి రూ.79,000 కోట్లు కేటాయించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం మే 01, 2016న ‘స్వచ్ఛ్ ఇంధన్, బేతర్ జీవన్’ నినాదంతో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయువై) అనే సామాజిక సంక్షేమ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వాయు కాలుష్యం, పొగ కారణంగా వంట గదుల్లో పేద మహిళల ఆరోగ్య సమస్యలు, అడవుల క్షీణతను తగ్గించడంతో పాటు, వంట గ్యాస్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి కనెక్షన్‌కు రూ.1,600 ప్రభుత్వ మద్దతుతో మూడు సంవత్సరాలలో 5 కోట్లకు పైగా పేద కుటుంబాలకు వంటగ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రారంభమైన మొదటి సంవత్సరంలో 1.5 కోట్ల కనెక్షన్లు జారీ చేయాలనీ లక్ష్యంగా పెట్టుకోగా దానికి మించి 2.2 కోట్ల కనెక్షన్లు జారీ  చేశారు. అక్టోబర్ 2017 నాటికి 3 కోట్ల కనెక్షన్లు లబ్ధిదారులకు అందాయి. ఈ కార్యక్రమం కింద 8వ కోటి లబ్ధిదారుడికి 2019 సెప్టెంబరు 7న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా గ్యాస్ సిలిండర్‌ను అందజేశారు. 2021 ఆగస్ట్ 10న ఉజ్వల కార్యక్రమం రెండవ దశను ప్రధానమంత్రి ప్రారంభించారు. మొదటి దశ ఉజ్వల్ యోజనలో గ్యాస్ కనెక్షన్లు పొందలేకపోయిన కోటి కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

వలస కార్మికులు స్వీయ ధృవీకరణ ద్వారా ఉజ్వల 2.0 కింద ఉచిత వంట గ్యాస్ కనెక్షన్‌ని పొందవచ్చు. చిరునామా రుజువు వంటి పత్రాలు అవసరం లేదు. పీఎంయువై మొదటి దశలో కనెక్షన్లు ఇవ్వని అల్పాదాయ వర్గాల వారికి డిపాజిట్ లేకుండా ఉజ్వల 2.0 కింద గ్యాస్ కనెక్షన్లు ఇస్తారు. మొత్తం క్రియాశీల గృహ గ్యాస్ వినియోగదారుల సంఖ్య ఏప్రిల్ 2014 నాటికి 14.52 కోట్లు ఉండగా 2023 మార్చి నాటికి అది 31.36 కోట్లకు పెరిగింది. ఈ భారీ పెరుగుదల ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ఫలితమే. ఇది వంటగ్యాస్ పంపిణీని 2016లో 62 శాతం నుంచి 2022 నాటికి 104.1 శాతానికి పెంచింది. 2015-16, 2019-21 మధ్య మొత్తం దేశంలో పేదల శాతం 24.8 శాతం నుంచి 14.9 శాతానికి గణనీయంగా తగ్గిందని నీతి ఆయోగ్ జూలై 17, 2023న ప్రకటించింది. ఈ తరుగుదల పోషకాహారం, విద్య, పరిశుభ్రత, వంట కోసం సబ్సిడీ గ్యాస్ లభ్యతలో పురోగతి ఫలితమే. భారతదేశంలో దాదాపు 13.50 కోట్ల మంది వ్యక్తులు 2015-16, 2019-21 మధ్య అనేక రకాల పేదరికం నుంచి విముక్తులైనట్టు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

దేవెన్ ఎస్ తకల్కర్