రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా అవతరణ దినోత్సవ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న హైదరాబాద్ నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బిజెపి శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి, జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డా. గౌతంరావు, వేముల అశోక్, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, సీనియర్ నాయకులు రాములు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ, భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చినా, తెలంగాణకు నిజమైన స్వేచ్ఛ 2014 జూన్ 2వ తేదీనే లభించిందని స్పష్టం చేశారు. తెలంగాణ సాధనలో ఎందరో తామే తెచ్చామని ప్రగల్భాలు పలుకుతున్నారని, కానీ 1947 నుండి 2014 వరకు తెలంగాణ కోసం నిరంతరం కొట్లాడింది, పార్లమెంట్‌లో ఇచ్చింది, ఇప్పుడు అభివృద్ధి చేస్తోంది కూడా బిజెపియేనని సగర్వంగా ప్రకటించారు. తెలంగాణకు మొదటి బలిదేవుడు నెహ్రూ అని, రజాకార్ల అరాచకాల్లో తెలంగాణ నలుగుతున్నా నెహ్రూ పట్టించుకోలేదని, సర్దార్ వల్లభాయ్ పటేల్ ‘ఆపరేషన్ పోలో’ ద్వారానే సెప్టెంబర్ 17న తెలంగాణకు విమోచనం కలిగిందని వివరించారు. ఆ తర్వాత కూడా నెహ్రూ బలవంతంగా తెలంగాణను ఆంధ్రలో కలిపారని, 1969 తొలిదశ ఉద్యమంలో 369 మంది యువకులను కాంగ్రెస్ తూటాలకు బలి తీసుకుందని, అందుకు రెండో బలిదేవత ఇందిరాగాంధీ అని దుయ్యబట్టారు. 2004లో యూపీఏ అధికారంలోకి వచ్చినా తెలంగాణ ఇవ్వకుండా 1000 మందికి పైగా యువతను బలితీసుకున్న మరో బలిదేవత సోనియా గాంధీ అని ఆరోపించారు. కానీ బిజెపి ఎన్నడూ వెనకడుగు వేయకుండా, ‘ఒక్క ఓటు – రెండు రాష్ట్రాలు’ అనే తీర్మానంకి కట్టుబడి ఉందన్నారు. త్యాగాలతో సిద్ధించిన తెలంగాణలో కొన్ని కుటుంబాలు లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకుని ఫామ్‌హౌస్‌లలో ఎంజాయ్ చేస్తుంటే, ఉద్యమకారులు మరియు అమరవీరుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత రేవంత్ రెడ్డి సర్కార్ ఒక ‘వీక్లీ వేజ్ గవర్నమెంట్’లా మారిందని, ప్రతి వారం దిల్లీకి మూటలు పంపితే తప్ప ముఖ్యమంత్రి పదవి కొనసాగని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కలెక్షన్, కమీషన్: బండి సంజయ్
6 గ్యారంటీలు, వడ్ల కొనుగోలు అంశంపై ప్రజలను పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విబేధాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కాళేశ్వరం విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు సహకరించిందనే విషయాన్ని మర్చిపోయారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ కుక్కలు చింపిన విస్తరిలా మారిందన్నారు. తెలంగాణ బాగుపడాలంటే కేంద్ర నిధులు అవసరమన్నారు. రాష్ట్రంలో ట్రిపుల్ సీ సినిమా కనిపిస్తోందని, కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కలెక్షన్, కమీషన్ అని ఎద్దేవా చేశారు.
”తెలంగాణ కోసం అమరవీరులైన వారిని స్మరించుకునే సమయం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామే తప్ప తెలంగాణ ఆశయాలు, లక్ష్యాలను మాత్రం చేరుకోలేకపోయాం. సమైక్య రాష్ట్రంలో, ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా దిగజారిందో కళ్ల ముందు కన్పిస్తోంది. బీఆర్ఎస్ పాలన ప్రజలు పెనం మీద ఉంటే… కాంగ్రెస్ పాలనలో పొయ్యిలో పడ్డట్లయింది. కుక్కల చింపిన విస్తరిలా తెలంగాణ మారింది. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటంబం బాగుపడింది. లక్షల కోట్ల రూపాయలు సాధించుకున్నారు. 1400 మందిని బలి తీసుకుంటే తప్ప కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వలేదు. తెలంగాణ ఇస్తారా? మేమే బిల్లు పెట్టి ఇవ్వాలా? అని సుష్మాస్వరాజ్ నిలదీస్తే తప్ప కాంగ్రెస్ తెలంగాణను ఏర్పాటు చేయలేకపోయింది. తెలంగాణ ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించింది బిజెపియే. తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సమయంలో కేసీఆర్ కనీసం సభకు కూడా రాలేదు. తెలంగాణపై జరిగిన చర్చలో కూడా పాల్గొనలేదు. రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం దోచుకుంది.
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. కానీ కేంద్రం ఇస్తున్న నిధులను కూడా వాడుకోలేని దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానిది. అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతూ కేంద్ర నిధులను దుర్వినియోగం చేస్తోంది. మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం లేదు. భూసేకరణ చేయడం లేదు. ఇదేందని ప్రశ్నిస్తే… కేంద్రంపై ఎదురుదాడి చేస్తూ బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు. ప్రధానిని కలుస్తారు. కేంద్ర మంత్రులను కలుస్తారు. బయటకొచ్చి ప్రధాని, కేంద్ర మంత్రులను దూషిస్తారు. ఇట్లయితే నిధులు ఎట్లా వస్తాయో ఆలోచించాలి. ఇచ్చిన హామీలను విస్మరించుకుండా చిట్టచివరి వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలను అందిస్తున్న ఘనత మోదీ ప్రభుత్వానిదే.” అని అన్నారు.
కాంగ్రెస్ కబంధ హస్తాల్లో తెలంగాణ: ఏలేటి
బిజెపి శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వస్తే నిజాం, రజాకార్ల క్రూర పాలన వల్ల తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17న విమోచనం కలిగిందన్నారు. ఆనాడు సంఘ్ పరివార్, సాయుధ పోరాట యోధులు ప్రజల వెంట నిలిచి స్వేచ్ఛను సాధిస్తే, ఆ తర్వాత నెహ్రూ కుతంత్రాల వల్ల తెలంగాణ మళ్లీ ఆంధ్ర పాలకుల చేతిలో చిక్కి శోషణకు గురైందన్నారు. ఎందరో యువకుల బలిదానాలతో మలిదశ ఉద్యమంలో సాధించుకున్న తెలంగాణలో నేడు ప్రజలు తీవ్ర నిరాశ, నిస్ప్రహల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేవలం దోపిడీ మాత్రమే జరిగిందని, మార్పు వస్తుందని కాంగ్రెస్‌ను నమ్మితే తెలంగాణ ప్రజలు మళ్లీ కబంధ హస్తాల్లో చిక్కుకున్నారని విమర్శించారు. ఏ నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమించామో అవి నేటికీ నెరవేరక నిరుద్యోగ యువత తల్లడిల్లుతోందన్నారు. తెలంగాణ ప్రజలు కలలు గన్న నిజమైన స్వేచ్ఛ, సామాజిక తెలంగాణ కేవలం భారతీయ జనతా పార్టీ వల్లే సాధ్యమవుతుందని నొక్కి చెప్పారు. రాబోయే 2028 లేదా 2029 లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని, ఆ తర్వాతే యువతకు ఉద్యోగాలు, రైతులకు నీరు అందుతాయని స్పష్టం చేశారు. రాబోయే ప్రజాస్వామ్య యుద్ధంలో కార్యకర్తలంతా కలిసికట్టుగా ముందుకు సాగాలని మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అన్యాయం: దత్తాత్రేయ
హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, 2005లో బిజెపి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో తెలంగాణకు అనుకూలంగా జాతీయ కార్యవర్గంలో తీర్మానం చేసిన మొట్టమొదటి రాజకీయ పార్టీ బిజెపియేనని గుర్తుచేశారు. నీళ్లు, నియామకాల ప్రాతిపదికన తెలంగాణ వస్తే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం గానీ, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం గానీ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశాయన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో భారీ అవినీతికి పాల్పడిందని విమర్శిస్తూనే, ఇప్పటివరకు ఆ అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. గోదావరి నది నుండి 2000 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తున్నా ప్రాజెక్టుల రిపేర్లు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.
