పౌరులకు రక్షణ కవచంగా మోదీ దౌత్యనీతి
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికాలు వైమానిక దాడులకు దిగినప్పుడు వాటి పరిణామాలు కేవలం యుద్ధ రంగానికే పరిమితం కాలేదు. ఈ ఘర్షణ ప్రపంచ ఇంధన మార్కెట్లను అతలాకుతలం చేసింది, సరఫరా గొలుసులను విచ్చిన్నం చేసింది, చమురు ధరలను పెంచింది. ప్రపంచవ్యాప్తంగా రవాణా ఖర్చులను పెంచేసింది. తన ఇంధన అవసరాల కోసం చాలా వరకు దిగుమతులపైనే ఆధారపడే భారతదేశానికి ఈ ప్రమాదాలు అత్యవసర సవాళ్లుగా మారాయి. ఇక భారతీయ ముస్లింల విషయానికొస్తే ఈ అనిశ్చితి వారి వ్యక్తిగత జీవితాలపై మరింత తీవ్రమైన ప్రభావం చూపింది.
పశ్చిమ ఆసియా ఆకాశాన్ని డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలు ముంచెత్తుతున్న తరుణంలో హజ్ యాత్రకు సిద్ధమవుతున్న అనేక కుటుంబాలలో తీవ్ర ఆందోళనలు మొదలయ్యాయి. విమానాలు రద్దవుతాయేమోనని, ప్రయాణ ఖర్చులు తారస్థాయికి చేరుతాయేమోనని, భద్రతా పరమైన సమస్యల వల్ల తమ జీవితకాల కల అయిన ఈ పవిత్ర యాత్ర ఎక్కడ ఆగిపోతుందోనని వారు ఆవేదన చెందారు. అయితే ఇంత తీవ్రమైన అనిశ్చితి నెలకొన్నప్పటికీ హజ్ యాత్ర అత్యంత సునాయాసంగా, సాఫీగా సాగింది. నిజానికి, సౌదీ అరేబియాలో జరిగిన వార్షిక ‘ఖితామాహు మిస్క్’ వేడుకలో యాత్రికుల సేవలను సమన్వయం చేయడంలో, సమాచార మార్పిడిలో అద్భుతమైన ప్రతిభ కనబరిచినందుకు గాను మన హజ్ మిషన్ చరిత్రలోనే తొలిసారిగా రెండు ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకుంది. లక్షా 75 వేల మందికి పైగా భారతీయ హజ్ యాత్రికులకు సమన్వయంతో కూడిన విమాన సర్వీసులు, వసతి, వైద్య సదుపాయాలు, అత్యవసర సేవలను విజయవంతంగా అందించడం జరిగింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ చేసే విదేశీ పర్యటనలను, ముఖ్యంగా ప్రపంచ సంక్షోభాల సమయంలో ఆయన విదేశాలకు వెళ్లడాన్ని విమర్శకులు తప్పుబడుతుంటారు. నేటి ఆధునిక ప్రపంచంలో దౌత్యనీతి కేవలం రెండు దేశాల మధ్య సంబంధాలకే పరిమితం కాలేదనే వాస్తవాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. ఇది పూర్తిగా తమ పౌరులను రక్షించుకోవడానికి సంబంధించినది. యుద్ధాలు, ఇంధన సంక్షోభాలు, బలహీనమైన సరఫరా గొలుసులు, వాతావరణ మార్పుల ప్రభావాలు, సాంకేతిక ఆధిపత్య పోరాటాలు — ఇలా ఎక్కడ ఏ సంక్షోభం తలెత్తినా దాని ప్రభావం ప్రపంచమంతటా ప్రతిబింబిస్తుంది. ఇటువంటి ప్రపంచంలో విదేశాంగ విధానమే అసలైన రక్షణ కవచం. భవిష్యత్తులో ఎలాంటి సంక్షోభం ఎదురైనా, భారతదేశం దాన్ని తట్టుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ప్రధాని మోదీ ఇటీవల చేపట్టిన ఐదు దేశాల పర్యటన కేవలం ఒక లాంఛనప్రాయమైనది కాదు, అత్యంత వ్యూహాత్మకమైనది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనలో తక్షణ, అత్యంత కీలకమైన అంశమైన ఇంధనంపైనే ఆయన పూర్తి దృష్టి పెట్టారు.
చమురు మార్కెట్లలో తీవ్ర అస్థిరత నెలకొని ఉన్న సమయంలో ఇరుపక్షాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేశాయి. భారతదేశ ముడి చమురు నిల్వలను విస్తరించడం, ఎల్‌ఎన్‌జి, ఎల్‌పిజి బంధాలను బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. పెద్ద మొత్తంలో నిల్వలు ఉండటం అంటే సరఫరాలో తలెత్తే అంతరాయాల నుంచి రక్షణ పొందడమే. విభిన్న దేశాలతో భాగస్వామ్యాలు కలిగి ఉండటం అంటే ధరల పెరుగుదల నుండి రక్షణ కల్పించుకోవడమే. నెదర్లాండ్స్ పర్యటనలో ప్రధానంగా సెమీకండక్టర్ల దృష్టి పెట్టారు. ఇటీవల ఎదురైన చిప్స్ కొరత ఇతరులపై ఆధారపడటం ఎంతటి ప్రమాదకరమో అనే కఠిన వాస్తవాన్ని మనకు గుర్తుచేసింది. డచ్ సంస్థలతో భాగస్వామ్యం ద్వారా అత్యాధునిక తయారీ రంగం, లాజిస్టిక్స్, చిప్ సాంకేతికతను మనం అందుకోగలుగుతాం. స్వీడన్, నార్వే పర్యటనలు దీనికి మరో కీలకమైన కోణాన్ని జోడించాయి. అక్కడ ప్రధాన అంశం భవిష్యత్ ఆర్థిక వ్యవస్థ: అంటే కృత్రిమ మేధ (ఏఐ), స్వచ్ఛమైన ఇంధనం. అత్యాధునిక వస్తూత్పత్తి రంగం,ఆవిష్కరణలు. ఈ రంగాలలో ముందంజలో ఉన్న దేశాలే భవిష్యత్తులో ప్రపంచగమనాన్ని శాసిస్తాయి. నార్డిక్ దేశాలతో భాగస్వామ్యం భారతదేశానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడమే కాకుండా, దేశంలో చోటుచేసుకుంటున్న పరివర్తనను మరింత వేగవంతం చేస్తుంది.
ఇటలీ పర్యటన వ్యూహాత్మక అనుసంధానంపై ప్రత్యేక దృష్టి సారించింది. ద్వైపాక్షిక సంబంధాలను ‘ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచడం ఇరు దేశాల దృఢ సంకల్పాన్ని సూచిస్తుంది. అలాగే ‘భారత్-మధ్యప్రాచ్య-యూరప్ ఆర్ధిక కారిడార్’ (ఐఎంఇసి)కి లభించిన మద్దతు కూడా అంతే కీలకం. దీని వెనుక ఉన్న సందేశం స్పష్టం: రవాణా మార్గాలను వైవిధ్యభరితం చేయడం, అడ్డంకులను తగ్గించడం, స్వయంప్రతిపత్తిని బలోపేతం చేయడం. మొత్తంగా చూసుకుంటే ఈ విదేశీ పర్యటన ద్వారా దాదాపు 40 బిలియన్ డాలర్ల పెట్టుబడి అవకాశాలకు తలుపులు తెరిచినట్టు వార్తలు వెల్లడిస్తున్నాయి. అయితే దీని అసలైన విలువ కేవలం ఈ అంకెలకే పరిమితం కాలేదు. ఇది అంతర్జాతీయ సంబంధాలు, సాంకేతికతను అందుకోవడం, భవిష్యత్తు సవాళ్లకు సిద్ధంగా ఉండటంలో ఉంది. బలమైన భాగస్వామ్యాలు, వైవిధ్యభరితమైన సరఫరా గొలుసులు, వ్యూహాత్మక నిల్వలు ఉన్న దేశాలు మాత్రమే సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోగలవు. గత దశాబ్ద కాలంలో భారత్ తన దౌత్య పరిధిని కేవలం ప్రతిష్ట కోసం కాకుండా, దేశ రక్షణ కోసమే విస్తరించింది. ఈ ఏడాది జరిగిన హజ్ యాత్ర ఒక ఉదాహరణ అయితే, ప్రధాని విదేశీ పర్యటనలు మరొక ఉదాహరణ. ఇవన్నీ ఒకే ఒక్క ప్రధాన లక్ష్యాన్ని స్పష్టం చేస్తున్నాయి — అదే ‘పౌరుల సంక్షేమానికి అధిక ప్రాధ్యాన్యం’. వారి ప్రయాణాలు సురక్షితంగా ఉండేలా చూడటం, దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండేలా చూసుకోవడం, ఎలాంటి సంక్షోభాలనైనా తట్టుకునేలా దేశాన్ని సన్నద్ధం చేయడం మోదీ ప్రభుత్వ ప్రాధాన్యాలు. ఈ అనిశ్చిత ప్రపంచంలో పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించే (స్థితిస్థాపకత) గుణం మాత్రమే అసలైన శక్తి. ఆ శక్తిని సంతరించుకోడానికి దౌత్యనీతే ఈ సమయంలో ఒక ప్రధాన సాధనం.
కౌసర్ జహాన్,
దిల్లీ రాష్ట్ర హజ్ కమిటీ అధ్యక్షురాలు

