Chalao Assembly

ఉధృతంగా బిజెపి అసెంబ్లీ ముట్టడి

Chalo Assembly 1ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బిజెపి – తెలంగాణ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూ.15 వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ సెప్టెంబర్ 7న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అసెంబ్లీ వైపు కదిలాయి. వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ వద్ద నిరసనలో పాల్గొన్న రాంచందర్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకొని గోల్కొండ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. రాంచందర్‌రావుతో పాటు పెద్దసంఖ్యలో బిజెపి, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 600 మందికి పైగా బిజెపి, బీజేవైఎం శ్రేణులను పోలీసులు అక్రమంగా నిర్బంధించారు.

ప్రజాస్వామ్యబద్ధంగా ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా చేసేందుకు బిజెపి అనుమతి కోరితే, అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంది. విద్యార్థుల సమస్యలపై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం పోలీసు బలంతో ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో సోయిలేని కాంగ్రెస్ సర్కార్‌కు సురుకు తగిలించేందుకు బిజెపి నాయకులు, కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి దిగారు. నిరసనలో పోలీసులు, బిజెపి శ్రేణుల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో పలువురు నాయకులు, కార్యకర్తలు గాయపడ్డారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ కళ్యాణ్‌ నాయక్‌కు స్వల్ప గాయాలయ్యాయి. రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ పుల్లారావుకు చేతికి గాయమైంది. జనగాం జిల్లా అధ్యక్షుడు చౌడ రమేష్‌ తీవ్ర గాయాలతో అస్వస్థతకు గురయ్యారు. పోలీసుల తోపులాటలో రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్‌ ప్రభా గౌడ్‌ కాలికి గాయమై, ఆసుపత్రి పాలైంది. అసెంబ్లీ వద్ద నిరసన సందర్భంగా అమీర్‌పేట్‌ మాజీ కార్పొరేటర్‌ కేతినేని సరళను పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను కుల్సుంపుర పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని ఆసుపత్రిలో ఐసీయూలో చేర్చి చికిత్స అందించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల సాధన కోసం బిజెపి నిరంతరం పోరాడుతోందని ఎన్. రాంచందర్ రావు గుర్తుచేశారు. గతంలో యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8 లక్షల మంది విద్యార్థుల నుంచి సంతకాలు సేకరించి, ఆ విజ్ఞాపన పత్రాలను ఇవ్వడానికి ప్రయత్నిస్తే సీఎం రేవంత్ రెడ్డి కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదన్నారు. ప్రజా సమస్యను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదించేందుకు వెళ్లినా అక్రమంగా అరెస్టు చేశారని, అంతకుముందు నిరాహార దీక్షకు, సెప్టెంబర్ 6న ధర్నా చౌక్‌లో విద్యార్థి మహాధర్నాకు కూడా పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కనుసన్నల్లోనే పోలీసు యంత్రాంగం నడుస్తోందని, అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. అరెస్టులు, అక్రమ కేసులతో తమ పోరాటాన్ని ఆపలేరని, విద్యార్థుల ఫీజుల బకాయిలు విడుదల చేసేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగిస్తామని తేల్చిచెప్పారు.

బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుందే మాట్లాడుతూ, విద్యార్థులకు రావలసిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను విడుదల చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. శాంతియుతంగా ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసుకుంటామంటే అడ్డుకున్నందుకే అసెంబ్లీని ముట్టడించాల్సి వచ్చిందన్నారు. ఈ ఆందోళన కేవలం ఆరంభం మాత్రమేనని, ముందుముందు అసలు సినిమా చూపిస్తామని హెచ్చరించారు. బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగబద్ధంగా కల్పించిన నిరసన హక్కును రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తోందని, వారంలో నాలుగు ఐదు సార్లు ముందస్తు అరెస్టులు చేస్తూ నిరంకుశంగా పాలిస్తోందని విమర్శించారు. గతంలో కేసీఆర్ కూడా పోలీసులను నమ్ముకునే ప్రజా ఉద్యమాలను అణచివేయాలని చూసి చివరికి గద్దె దిగాల్సి వచ్చిందని గుర్తుచేశారు. Chalo Assembly 2

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పేరుకుపోవడంతో వేలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని బిజెపి నేతలు విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశంపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్‌ చేశారు. అరెస్టులు, నిర్బంధాలకు తాము భయపడబోమని బిజెపి స్పష్టం చేసింది. రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను పూర్తిగా విడుదల చేసే వరకు పోరాటం ఆగదని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. విద్యార్థుల హక్కుల కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించింది. ఫీజు బకాయిల సమస్యపై ప్రభుత్వం వెంటనే స్పష్టమైన నిర్ణయం తీసుకుని, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని బిజెపి డిమాండ్‌ చేసింది.

ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులు, నిరసన తెలిపితే లాఠీలతో సమాధానం చెప్పడం ప్రజాపాలన కాదని కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ల రూ.15 వేల కోట్ల బకాయిలను విడుదల చేయడంతో పాటు 22ఏ భూముల వ్యవహారంపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ వైపు శాంతియుతంగా వెళ్తున్న రాంచందర్‌రావును బలవంతంగా అరెస్టు చేయడం, బిజెపి నేతలు, కార్యకర్తలను నిర్బంధించడం ప్రభుత్వ అసహనానికి నిదర్శనమన్నారు. బారికేడ్లు, అరెస్టులు, లాఠీలతో ప్రజల సమస్యలను అణచివేయలేరని స్పష్టం చేశారు. విద్యార్థులు, 22ఏ బాధితులకు న్యాయం జరిగే వరకు బిజెపి పోరాటం ఆగదని హెచ్చరించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన రూ.15 వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని, 22ఏ జాబితా నుంచి పేదల ప్రైవేట్‌ భూములను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ బిజెపి శాంతియుతంగా అసెంబ్లీ ముట్టడికి వెళ్లిందని రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్‌ తెలిపారు. రాంచందర్‌రావు సహా బిజెపి నేతలు, బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండించారు. పోలీసుల తోపులాటలో మహిళా నేతలు, ఇతర నాయకులు గాయపడటం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు. 22ఏ భూముల వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని, ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు బిజెపి రాజీలేని పోరాటం కొనసాగిస్తుందని హెచ్చరించారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తోందని ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల కోసం శాంతియుతంగా నిరసన తెలిపిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం రాజ్యాంగబద్ధ హక్కులను కాలరాయడమేనని విమర్శించారు. ‘చోటా హిట్లర్‌’ పాలన కొనసాగుతోందని ఆరోపించిన ఆమె.. అరెస్టులకు బిజెపి భయపడదని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

బిజెపి నాయకుల అరెస్టులు‌‌

గోల్కొండ పోలీస్ స్టేషన్‌: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఎన్.గౌతం రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్.వి.సుభాష్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుందే. 

కుల్సుంపురా పోలీస్ స్టేషన్‌: డా. జి. మనోహర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎం. జయశ్రీ, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సైనీ మల్లేష్, జి. కృష్ణారెడ్డి, బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, ఈవీ రమేష్, సూర్యప్రకాశ్ శర్మ.

అప్జల్ గంజ్ పోలీస్ స్టేషన్: బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. కాసం వెంకటేశ్వర్లు, రఘునాథరావు, బిజెపి సీనియర్ నాయకుడు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధులు సోలంకి శ్రీనివాస్, చికోటి ప్రవీణ్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, సామ రంగారెడ్డి. 

అసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్‌: బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. కళ్యాణ్ నాయక్.

రాహుల్ గాంధీకి ఇటాలియన్‌లో‌ లే‌‌ఖ

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల సమస్యపై వినతి పత్రాలు, దీక్షలు, ధర్నాలు, ముట్టడిలు చేపట్టినా విద్యార్థుల గళం (ఛాత్రోం కీ గూంజ్) మీకు చేరడం లేదా అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాచందర్ రావు లేఖ రాశారు. అయితే ఈ లేఖ ఇటాలియన్‌లో రాయడం విశేషం. రాష్ట్రంలో సాగుతున్న ఆందోళనలు, విద్యార్థుల నిరసనలు, పోలీసుల లాఠీఛార్జులు, అరెస్టులు వంటివేవీ రాహుల్ గాంధీని గానీ, తెలంగాణ ప్రభుత్వాన్ని గానీ కదిలించలేకపోయాయని, అందుకే ఆయన “మాతృభాష” అయిన ఇటాలియన్‌లో లేఖ రాస్తున్నట్లు రామచందర్ రావు ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ తక్షణమే జోక్యం చేసుకొని, విద్యార్థులకు  ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఈ లేఖలో రాంచందర్ రావు డిమాండ్ చేశారు.