రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు
(రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలతో అరిగోస పడుతున్న రైతులకు భరోసా కల్పించే దిశగా
వ్యవసాయ తీర్మానం)
వరంగల్ రైతు డిక్లరేషన్‌తో అన్నదాతలకు అనేక హామీలు గుప్పించిన కాంగ్రెస్ అధికారంలోకొచ్చాక అందులో ఒక్క హామీని అమలు చేయలేదు. రుణమాఫీ నుంచి రైతు భరోసా వరకు, పంట బీమా నుంచి బోనస్ వరకు ఈ రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగాన్ని తీవ్ర అనిశ్చితిలోకి నెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాల వల్ల తెలంగాణలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. దుక్కి దున్నడం నుంచి పండిన పంట అమ్మకం వరకు అన్ని దశల్లో అన్నదాతలు అరిగోస పడుతున్నారు.
”వ్యవసాయ రుణాలు లేని రైతులు ఎవరైనా ఉంటే, వెంటనే వెళ్లి రుణాలు తీసుకోండి, మేం అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9న మాఫీ చేస్తాం” అని 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి, నాటి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేరలేదు. ఎన్నో వాయిదాల అనంతరం అరకొరగా చేసిన రుణమాఫీ రైతులకు శాపంగా మారింది. రూ.2 లక్షల లోపు రుణాలు ఉన్న అందరికీ ఏకకాలంలో మాఫీ చేస్తామని చెప్పి, అనేక ఆంక్షలు, రేషన్ కార్డుల నిబంధనలు పెట్టి సగానికి పైగా రైతులకు రుణమాఫీ వర్తింపజేయకుండా వంచించింది. అర్హులైన ప్రతి రైతుకూ తక్షణమే ఎలాంటి ఆంక్షలు లేకుండా పూర్తి రుణమాఫీ వర్తింపజేయాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేస్తోంది.
ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా గత యాసంగికి సంబంధించిన రైతు భరోసా బకాయిలను ఇప్పటివరకు విడుదల చేయలేదు. గత యాసంగి రైతు భరోసా బకాయిలు తక్షణమే విడుదల చేసి, హామీ మేరకు ఇకపై ఎకరాకు రూ.15,000 చొప్పున సీజన్ ప్రారంభంలోనే కౌలు రైతులు సహా రైతులందరికీ పెట్టుబడి సహాయం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేస్తోంది. అదేవిధంగా, ల్యాండ్ లైసెన్స్‌డ్ కల్టివేటర్స్ యాక్ట్-2011ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, కౌలు రైతులకు నేరుగా సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, రుణాలు, పరిహారం, కనీస మద్దతు ధర ప్రయోజనాలు అందేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేస్తోంది. హామీ మేరకు తక్షణమే రైతు కూలీలకు కూడా ఏడాదికి రూ.12,000 చొప్పున, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి లెక్క గట్టి అందించాలని బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలో పండే అన్ని రకాల వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని గప్పాలు కొట్టిన కాంగ్రెస్, తీరా అధికారంలోకి వచ్చాక సన్నొడ్లకే బోనస్ వర్తిస్తుందంటూ మెలికలు పెట్టింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వరికి క్వింటాలుకు రూ.2443 కనీస మద్దతు ధర చెల్లిస్తుంది. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్ ఇవ్వాలి. దొడ్డు వడ్లతో సహా కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పేర్కొన్న అన్ని రకాల పంటలకు- వరి ధాన్యం, మొక్కజొన్న, కందులు, సోయాబీన్, పత్తి, మిర్చి, పసుపు, ఎర్ర జొన్న, చెరుకు, జొన్నలు- రూ.500 బోనస్ తక్షణమే చెల్లించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేస్తోంది.
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేసింది. ఎన్నికల సమయంలో వరంగల్ డిక్లరేషన్‌లో ఆఖరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకొచ్చాక దానికి తూట్లు పొడిచింది. రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం మేరకు కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు రాష్ట్రానికి నిధులు విడుదల చేస్తోంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోళ్లు జరపక కేంద్రంపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు, ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై తాలు, తరుగు పేరుతో రైతులను దోచుకుంటోంది. ఐకేపీ కేంద్రాల్లో సకాలంలో ధాన్యం కొనుగోళ్లు జరపకపోవడంతో రైతులు వారాల పాటు ఎదురుచూస్తూ రోడ్డు మీదే గడపాల్సి వచ్చింది. గత యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఇప్పటికీ పూర్తికాలేదు. తడిసిన ధాన్యానికి మద్దతు ధర కల్పించకుండా, రకరకాల నిబంధనలతో బోనస్ మొత్తాన్ని తగ్గించే కుట్ర పన్నింది. ఈ తరుణంలో ‘రైతు గోస – బిజెపి భరోసా’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ కేంద్రాలను బిజెపి బృందం సందర్శించింది. ఐకేపీ కేంద్రాల్లో ప్రతి సీజన్ లో సమస్యలెదురవుతున్నా వాటిని పరిష్కరించాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి రాకపోవడాన్ని బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం తీవ్రంగా ఖండిస్తోంది.
గత కొన్ని సీజన్‌లుగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నా దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగానే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రస్తుత ఖరీఫ్ కోసం ఇప్పటివరకు స్పష్టమైన వ్యవసాయ ప్రణాళికను ప్రకటించలేదు. జిల్లా వారీగా పంటల ప్రణాళిక, ఎరువులు, విత్తనాల లభ్యత, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మార్కెటింగ్ సదుపాయాలపై సమగ్ర కార్యాచరణ ప్రణాళికను తక్షణమే విడుదల చేయాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేస్తోంది.
నకిలీ విత్తనాలు రైతుల నడ్డి విరుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరిస్తోంది. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇందులో భాగంగా ప్రతి జిల్లాకు ఐపీఎస్ స్థాయి అధికారిని విజిలెన్స్ ఇన్‌చార్జిగా నియమించి, ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి, నకిలీ విత్తన వ్యాపారులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేస్తోంది. కొందరు అక్రమార్కులు కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసే విత్తనాలను నల్ల బజారుకు తరలించి, అధిక ధరలకు విక్రయిస్తూ రైతులను దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయాలని, కృత్రిమ కొరత సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా కేంద్రం నిర్ణయించిన ధరలకే రైతులకు విత్తనాలు అందేలా చూడాలని బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం కోరుతుంది.
కేవలం ఎనిమిది రకాల వరి రకాలను మాత్రమే సాగు చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త ఆంక్షలు రైతుల హక్కులను కాలరాయడమే! రైతుల్లో భయాందోళనలు గురిచేస్తున్న ఎనిమిది రకాల వరి సాగు నిబంధనను వెంటనే ఉపసంహరించుకోవాలని బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేస్తోంది.
ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు భరోసా కల్పించే ఫసల్ బీమా యోజనను రాజకీయ కారణాలతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదు. అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించినా, కార్యరూపం మాత్రం దాల్చలేదు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచే పీఎం ఫసల్ బీమా యోజనను అమలు చేయాలని, అన్ని పంటలు, అర్హులైన రైతులను ఇందులో చేర్చాలని, రాష్ట్ర ప్రభుత్వం తన ప్రీమియం వాటాను సకాలంలో చెల్లించాలని బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేస్తోంది.
భూసార పరీక్షల నిర్వహణలో, సాయిల్ హెల్త్ కార్డుల జారీలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. తక్షణమే భూసార పరీక్షలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రతి గ్రామంలో భూసార పరీక్షలు నిర్వహించి, రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు పంపిణీ చేయాలని, అదేవిధంగా నేల స్వభావానికి అనుగుణమైన పంటలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయంపై రాష్ట్రవ్యాప్తంగా రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల కోసం డివిజన్ స్థాయిలో ప్రాసెసింగ్ యూనిట్లు, మార్కెటింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తృణ ధాన్యాల (శ్రీ అన్న) సాగుకు విశేష ప్రాధాన్యం ఇస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో మిల్లెట్స్‌కు గుర్తింపు తీసుకురావడంతో పాటు, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ద్వారా విత్తనాలు, సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ, కనీస మద్దతు ధర వంటి అనేక ప్రోత్సాహకాలు అందిస్తోంది. అయితే తెలంగాణలో ఈ అవకాశాలను వినియోగించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలో తృణ ధాన్యాల సాగు విస్తరణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, నాణ్యమైన విత్తనాలు, ప్రోత్సాహకాలు, కొనుగోలు కేంద్రాలు, ప్రాసెసింగ్ యూనిట్లు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి రైతులకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు చేపట్టాలని బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి 125 రోజుల ఉపాధి హామీ కల్పించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సుస్థిర ఆస్తుల నిర్మాణానికి వీబీ జీ రామ్ జీ- వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం గ్రామీణ కూలీల ఉపాధికి భరోసా ఇస్తుంది. వారికి రోజుకు రూ.300కు పైగా ఆదాయం సమకూరుతుంది. కానీ, రాజకీయ కారణాలతో తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల గ్రామీణ ఉపాధి కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వీబీ జీ రామ్ జీ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేస్తోంది.
రాష్ట్ర అవసరాల్లో 32 శాతం కూరగాయలు మాత్రమే ఇక్కడ ఉత్పత్తి అయితే, దాదాపు 68 శాతం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. రాష్ట్రంలో కూరగాయల సాగు గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉంది. తద్వారా రైతులకు ఆదాయం సమకూరడమే కాకుండా, ప్రజలకు తక్కువ ధరకే కూరగాయలు అందుబాటులోకి వస్తాయి. అంతేకాదు, పంట మార్పిడి వల్ల నేల సారం కూడా మెరుగవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూరగాయలతో పాటు పండ్లు, పూల సాగును ప్రోత్సహిస్తూ రైతులకు సబ్సిడీలు అందించాలని బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం వ్యవసాయాభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం అనేక విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టింది. కిసాన్ సమ్మాన్ నిధి నుంచి సబ్సిడీ యూరియా, సాయిల్ హెల్త్ కార్డ్, ఫసల్ బీమా, ఈనామ్ వరకు ఎన్నో పథకాలు అన్నదాతకు ఎనలేని మేలు చేస్తున్నాయి. అయితే, వాటి ఫలాలు రైతులకు అందకుండా గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు కుట్ర పన్నాయి. కాంగ్రెస్ అరాచక పాలనలో అరిగోస పడుతున్న అన్నదాతకు అండగా నిలుస్తూ అనేక ఉద్యమాలు, పోరాటాలు చేస్తున్నాం, ఇక ముందూ చేద్దాం. బిజెపి డబుల్ ఇంజన్ సర్కార్‌తో రాష్ట్రంలో రైతుల కష్టాలకు తెరపడుతుందన్న నమ్మకం అన్నదాతల్లో కల్పించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గం పిలుపునిస్తోంది.

