Narendra Modi

నరేంద్ర మోదీ.. యుగానికొక్కడు

(వికసిత్ భారత్ లక్ష్య సాధనకు పునాది వేస్తూ విజయవంతంగా 12 సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసిన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందిస్తూ తీర్మానం) 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ పాలన భారత చరిత్రలో మేలిమలుపు అనడంలో అతిశయోక్తి లేదు. ”విశ్వాసం, అభివృద్ధి, సంక్షేమం” అనే మూడు ప్రధాన స్తంభాలపై నిర్మితమైన ఈ కాలం నవ భారత నిర్మాణ యుగం అని చెప్పవచ్చు. 2014లో ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ విజయవంతంగా 12 సంవత్సరాలు పూర్తి చేశారు. అంతేకాదు, ఈ 2026 జూన్ 10 నాటికి అత్యధిక కాలం పదవిలో కొనసాగుతూ ప్రజలు ఎన్నుకున్న ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మరో ఘనత సాధించారు. ఈ 12 ఏళ్ల కాలంలో భారతదేశం ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, అంతర్జాతీయ రంగాల్లో గణనీయమైన పరివర్తన చెందింది. ప్రజల విశ్వాసాన్ని చూరగొంటూ, అభివృద్ధిని వేగవంతం చేస్తూ, పేదల సంక్షేమమే కేంద్రబిందువుగా సాగిన మోదీ పాలన ‘వికసిత్ భారత్’కు గట్టి పునాది వేసింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల విజయం కంటే ప్రజల విశ్వాసం గొప్పది. 2014 నుంచి 2024 వరకు వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించారంటే కేవలం మోదీ సమర్థ నాయకత్వం, సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమ పాలనపై ప్రజల్లో ఉన్న విశ్వాసమే కారణం. 

మోదీ పట్ల ప్రజల్లో విశ్వాసం ఉంది కాబట్టే ప్రధాని పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ పిలుపులు ప్రజా ఉద్యమాలుగా మారాయి. కోవిడ్ వేళ కరోనా వారియర్స్‌ను సత్కరించాలన్నా, హర్ ఘర్ తిరంగా, స్వచ్ఛ భారత్ అభియాన్, ఫిట్ ఇండియా ఉద్యమం, ఏక్ పేడ్ మా కే నామ్, వోకల్ ఫర్ లోకల్.. ఏ పిలుపైనా సరే ప్రజలు స్వచ్ఛందంగా స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాహసోపేత నిర్ణయాలతో సంక్లిష్ట పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొన్న తీరు వల్ల ఈ విశ్వాసం ఏర్పడింది. కోవిడ్ మహమ్మారిని అదుపు చేసేందుకు చేపట్టిన చర్యలు, జాతీయ భద్రత విషయంలో రాజీలేని ధోరణి, ‘మన్ కీ బాత’, ‘పరీక్షా పే చర్చా’ వంటి కార్యక్రమాలతో ప్రత్యక్ష ప్రజా సంభాషణలు ఈ విశ్వాసాన్ని మరింత బలోపేతం చేశాయి. అందుకే ప్రజలు మోదీ ప్రభుత్వ నిర్ణయాలకు అండగా నిలిచి, తమ సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మోదీ ప్రభుత్వ 12 ఏళ్లలో మౌలిక వసతుల రంగంలో మార్పు అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది. జాతీయ రహదారుల విస్తరణ, రైల్వేల ఆధునీకరణ, విమానాశ్రయాల నిర్మాణం, మెట్రో నెట్వర్క్ విస్తరణ దేశ అభివృద్ధిలో ప్రధాన భాగాలుగా నిలిచాయి. చీనాబ్ వంతెన, అటల్ టన్నెల్, పంబన్ బ్రిడ్జ్ వంటి ప్రాజెక్టులు కేవలం నిర్మాణాలు మాత్రమే కాదు, దేశ సాంకేతిక సామర్థ్యానికి చిహ్నాలుగా నిలిచాయి. వందేభారత్ రైళ్లు, అమృత్ భారత్ స్టేషన్లు, రైల్వే విద్యుదీకరణ భారత్ రవాణా వ్యవస్థను కొత్త దశకు తీసుకెళ్లాయి. మెట్రో రైలు వ్యవస్థ, విమానాశ్రయాలు పెరిగాయి. డిజిటల్ మౌలిక సదుపాయాల్లోనూ దేశం విప్లవాత్మకంగా ముందంజ వేసింది. జన్ ధన్-ఆధార్-మొబైల్ త్రయం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నేరుగా ప్రజల ఖాతాల్లోకి చేరే వ్యవస్థ ఏర్పడింది. దీని ద్వారా రూ.51 లక్షల కోట్లకు పైగా నిధులు నగదు బదిలీ ద్వారా నేరుగా లబ్ధిదారులకే చేరాయి. అంతేకాదు, ఈ వ్యవస్థ కోట్లాది నకిలీ లబ్ధిదారులను ఏరివేసింది. తద్వారా ప్రభుత్వ ఖర్చులో పారదర్శకత పెరిగింది. ఇక యూపీఐ విప్లవం భారతదేశాన్ని ప్రపంచ డిజిటల్ చెల్లింపుల రాజధానిగా నిలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిజిటల్ సేవలు విస్తరించాయి. సామాన్యుడి జీవితంలో సాంకేతికత భాగమైంది.

అభివృద్ధితో పాటు వారసత్వ పరిరక్షణకు కూడా సమాన ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వంగా మోదీ పాలన ప్రత్యేకతను సంతరించుకుంది. అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మాణం, కాశీ విశ్వనాథ్ కారిడార్, మహాకాళ్ లోక్, కేదార్‌నాథ్ పునర్నిర్మాణం వంటి కార్యక్రమాలు భారత సాంస్కృతిక చైతన్యానికి కొత్త శోభనిచ్చాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వారసత్వాన్ని గుర్తుచేస్తూ పంచతీర్థాల అభివృద్ధి, బిర్సా ముండా జయంతిని జనజాతీయ గౌరవ్ దివస్‌గా ప్రకటించడం, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నిర్మాణం వంటి చర్యలు చారిత్రక వ్యక్తులకు కొత్త గుర్తింపు తెచ్చాయి. బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కు సంబంధించిన ఐదు ప్రదేశాలను ‘పంచతీర్థ’గా అభివృద్ధి చేయడం కేవలం స్మారక చిహ్నాలను నిర్మించడం మాత్రమే కాదు, ఇది సామాజిక న్యాయం, సమ్మిళితత్వం, రాజ్యాంగ విలువలను జాతీయ చైతన్యంలో పొందుపరిచే ప్రయత్నం. మవు నుండి లండన్, నాగ్ పూర్, దిల్లీ, ముంబై వరకు, బాబాసాహెబ్ జీవితంతో ముడిపడిన ప్రదేశాలు నేడు స్ఫూరి కేంద్రాలుగా మారాయి.

గిరిజన యోధుడు బిర్సా ముండా జయంతిని ‘జనజాతీయ గౌరవ్ దివస్’ (గిరిజన గౌరవ దినోత్సవం) గా ప్రకటించడం ద్వారా, భారతదేశ చరిత్ర కేవలం రాజభవనాలకే పరిమితం కాదని, అడవులు, గిరిజనులు, పోరాటాల చరిత్ర కూడా అనే సందేశాన్ని మోదీ ప్రభుత్వం అందించింది. ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన వీరులకు జాతీయ గుర్తింపు ఇచ్చి మోదీ ప్రభుత్వం వారిని సత్కరించింది. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు అంకితం చేసిన అద్భుతమైన ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం మాత్రమే కాదు, నవ భారతదేశం ఉన్నతమైన ఆలోచనకు చిహ్నం. గొప్ప పోరాటం, దృఢ సంకల్పం ద్వారా భారతదేశ ఐక్యత ఎలా ఏర్పడిందో భవిష్యత్ తరాలకు ఇది తెలియజేస్తుంది. మన వీర సైనికుల గౌరవార్థం నిర్మించిన జాతీయ యుద్ధ స్మారక చిహ్నం కూడా ఈ జాతీయ చైతన్యానికి చిహ్నం. ఇది కేవలం రాతి నిర్మాణం మాత్రమే కాదు, దేశ రక్షణ కోసం సర్వస్వం అర్పించిన వారి అమర త్యాగాలకు సజీవ నిదర్శనం. రాజ్‌పథ్‌ను కర్తవ్య పథ్‌గా మార్చడం, ఇండియా గేట్ వద్ద నేతాజీ విగ్రహం ఏర్పాటు, కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం వలసవాద చిహ్నాల నుంచి భారతీయత వైపు సాగిన ప్రయాణానికి ప్రతీకలుగా నిలిచాయి.

మోదీ ప్రభుత్వ సంక్షేమ విధానాలకు పేదలు, రైతులు, మహిళలు, యువతే కేంద్రబిందువు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా కోట్లాది మంది రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందుతోంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా కోవిడ్ సమయంలో 81 కోట్ల మందికి పైగా ఉచిత రేషన్ అందించారు. ఈ పథకాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. జన్‌ధన్ ఖాతాలు, ముద్ర రుణాలు, ఆయుష్మాన్ భారత్, ఉజ్జ్వల యోజన, ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్ వంటి పథకాలు కోట్లాది కుటుంబాల జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరిచాయి. ప్రత్యేకించి మహిళల సాధికారతపై దృష్టి సారిస్తూ ఉజ్జ్వల గ్యాస్ కనెక్షన్లు, సుకన్య సమృద్ధి పథకం, లఖ్‌పతి దీదీ కార్యక్రమాలు అమలు చేశారు. దేశంలో 25 కోట్ల మంది కడు పేదరికం నుంచి విముక్తి పొందడం ఈ పథకాల విజయానికి ఆనవాళ్లు.

గత 12 సంవత్సరాల్లో భారత విదేశాంగ విధానం కొత్త దిశను సంతరించుకుంది. మోదీ ప్రభుత్వంలో జీ20 అధ్యక్ష బాధ్యతలను విజయవంతంగా నిర్వహించిన భారతదేశం ప్రపంచ దేశాల కితాబు అందుకుంది. కరోనా వేళ వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమం కింద 99 దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించడం భారత ప్రతిష్టను మరింత ఇనుమడింప చేసింది. మోదీ పాలనలో కుదిరిన అనేక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు భారతదేశాన్ని ప్రపంచ వేదికపై కీలక భాగస్వామిగా నిలిపాయి. సాంస్కృతిక సంపదను తిరిగి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాల ఫలితంగా 668 అరుదైన కళాఖండాలు భారతదేశానికి తిరిగి వచ్చాయి. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా పాటించడానికి 177 దేశాలు మద్దతు ఇచ్చాయి. ప్రపంచంలోని వివిధ దేశాలు ప్రధాని నరేంద్ర మోదీకి 32 అంతర్జాతీయ అవార్డులు ప్రదానం చేశాయి. ఈ పురస్కారాలు వ్యక్తిగత విజయాలకు కాదు, 140 కోట్ల భారతీయుల సామర్థ్యానికి, పెరుగుతున్న భారత ప్రతిష్టకు చిహ్నం.

మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలు దేశీయ తయారీ, ఆవిష్కరణలకు కొత్త ఊపునిచ్చాయి. మొబైల్ ఫోన్ తయారీ, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి, సెమీకండక్టర్ రంగాల్లో భారత్ కొత్త అవకాశాలను సృష్టించింది. రక్షణ రంగంలో స్వదేశీ తయారీ పెరగడం ద్వారా దేశం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించింది. స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలో ప్రపంచంలోని ప్రధాన కేంద్రాల్లో భారత్ ఒకటిగా మారింది. వేలాది కొత్త సంస్థలు, వందలాది యూనికార్న్‌లు యువతకు కొత్త అవకాశాలను తెరిచాయి. 2014లో దేశంలో కేవలం 500 స్టార్టప్‌లు, కేవలం 4 యునికార్న్‌లు మాత్రమే ఉన్నాయి. నేడు 2.06 లక్షల స్టార్టప్‌లు, 150 యునికార్న్‌లకు పెరిగాయంటే ఈ పథకం సాధించిన విజయాన్ని అర్థం చేసుకోవచ్చు.

మోదీ ప్రభుత్వం ఈ 12 సంవత్సరాలలో భారతదేశ రక్షణ రంగం స్వావలంబన వైపు కీలకమైన ముందడుగు వేసింది. భారతదేశాన్ని ప్రధాన ఆయుధ దిగుమతిదారు నుండి ముఖ్యమైన తయారీదారు, ఎగుమతిదారుగా మార్చింది. భారతదేశ రక్షణ పరికరాలలో కనీసం 65% ఇప్పుడు దేశీయంగా తయారవుతున్నాయి. 2014 ముందు భారతదేశం కేవలం రూ.686 కోట్ల విలువైన రక్షణ పరికరాలను ఎగుమతి చేసింది. నేడు, మన రక్షణ ఎగుమతులు రూ.38,400 కోట్లు దాటాయి. నేడు, ప్రపంచవ్యాప్తంగా 100 కి పైగా దేశాలు భారతదేశ స్వదేశీ ఆయుధాలను కొనుగోలు చేస్తున్నాయి. సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ వైమానిక దాడులు, ఆపరేషన్ సిందూర్ వంటి చర్యలు ఉగ్రవాదానికి దీటుగా జవాబు చెప్తూ భారత్ సైనిక సామర్థాన్ని ప్రపంచానికి చాటడమే కాదు, మన చర్యలను సమర్థించేలా చాకచక్యమైన దౌత్యనీతిని నెరిపింది. నరేంద్ర మోదీ పాలనలో ఇలా అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందుతూ ‘వికసిత్ భారత్’ లక్ష్యానికి గట్టి పునాది పడింది.

మోదీ సహకారంతో తెలంగాణ అభివృద్ధి‌‌

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఎలాంటి వివక్ష లేకుండా తెలంగాణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, లక్షల కోట్ల రూపాయల విలువైన నిధులు, ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు అందించింది. ఆర్థిక సంఘం సిఫారసులు, స్థానిక సంస్థలకు కేటాయింపులు కలిపి దాదాపు 49 శాతం వరకు కేంద్ర వనరులు రాష్ట్రాలకే చేరుతున్నాయి. ఇది దేశ చరిత్రలోనే రాష్ట్రాలకు జరిగిన అత్యధిక వనరుల బదిలీ. ఈ క్రమంలో తెలంగాణకు కేంద్రం ద్వారా పన్నుల పంపిణీ, గ్రాంట్లు, ప్రత్యేక సహాయం రూపంలో గణనీయమైన నిధులు అందాయి. గత 12 ఏళ్ల కాలంలో మోదీ ప్రభుత్వం తెలంగాణకు మొత్తం రూ.13 లక్షల కోట్ల నిధులు విడుదల చేసింది.

కాజీపేట వ్యాగన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్, నిజామాబాద్ జాతీయ పసుపు బోర్డు, సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం, బీబీనగర్ ఎయిమ్స్, రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ, వరంగల్ టెక్స్‌టైల్ పార్క్, జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ వంటి తెలంగాణ కలల ప్రాజెక్టులెన్నో మోదీ ప్రభుత్వంలో సాకారమయ్యాయి. బుల్లెట్ రైలు కారిడార్లు (చెన్నై, బెంగళూరు, పుణే), రీజినల్ రింగ్ రోడ్, హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ వంటి భారీ ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. బడ్జెట్‌లో రాష్ట్రానికి రైల్వే కేటాయింపులు రూ.258 కోట్ల నుంచి రైల్వే రూ.5,336 కోట్లకు పెరిగింది. వందేభారత్ రైళ్లు, కొత్త రైల్వే ట్రాక్‌ల నిర్మాణం, డబ్లింగ్, 100 శాతం విద్యుదీకరణ, 40కి పైగా అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు, రైల్ అండర్ బ్రిడ్జిలు, రైల్ ఓవర్ బ్రిడ్జిలు రాష్ట్ర రైల్వే ముఖచిత్రాన్ని సమూలంగా మార్చింది. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు విస్తరణకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. తెలంగాణలో జాతీయ రహదారుల నిడివి 2500 కి.మీలు నుంచి 5000 కి.మీ దాటింది. భారతమాల ప్రాజెక్టు, ఆర్థిక కారిడార్లు తెలంగాణ అభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నాయి. ఉడాన్ పథకం కింద హైదరాబాద్ నుండి 22 కొత్త విమాన మార్గాలు ప్రారంభమయ్యాయి. నవోదయ విద్యాలయాలు, నైపర్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, బీబీనగర్ ఎయిమ్స్ విద్యారంగం అభివృద్ధికి దోహదపడుతున్నాయి. 

జన్‌ధన్, ముద్రా, స్వనిధి, జల్ జీవన్ మిషన్, ఉజ్వల, జనఔషధి, ఆయుష్మాన్ భారత్, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, కిసాన్ క్రెడిట్ కార్డ్, సామాజిక భద్రతా పథకాల కింద కోట్లాది తెలంగాణ ప్రజలు అనేక రకాలుగా ప్రయోజనం పొందుతున్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేకపోయినా మోదీ ప్రభుత్వం ఎలాంటి వివక్ష లేకుండా రాష్ట్ర అభివృద్ధికి విశేషంగా సహకరిస్తోంది.

ఈ 12 సంవత్సరాల మోదీ ప్రభుత్వంలో భారతదేశం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించి, మూడో స్థానం లక్ష్యంగా దూసుకెళ్తోంది. 2047 నాటికి ”వికసిత్ భారత్” లక్ష్య సాధనకు గట్టి పునాది వేసిన అద్భుతమైన 12 సంవత్సరాలు పూర్తి చేసిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జేజేలు పలుకుతూ, బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం మనఃపూర్వకంగా అభినందిస్తోంది.