పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా తెలంగాణ పరిస్థితి
(జూన్ 30న మేడ్చల్ మల్కాజ్ గిరి ఘట్కేసర్ లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం
ఆమోదించిన రాజకీయ తీర్మానం)
తెలంగాణలో నేడు పరిస్థితి ‘పైరు పచ్చగా ఉన్నా.. పందికొక్కులు మేసినట్లు’ తయారైంది. స్వరాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు పూర్తయినా.. అమరుల త్యాగాలు, నీళ్లు-నిధులు-నియామకాల ఆకాంక్షలు నెరవేరలేదు. పదేళ్ల బీఆర్ఎస్ కుటుంబ నియంతృత్వం, అహంకార పాలనతో విసిగిపోయిన ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్‌ను నమ్మి అధికారంలోకి తీసుకొచ్చారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ 6 గ్యారెంటీలు, 66 హామీలు, డిక్లరేషన్ల పేరుతో ప్రజల్లో భారీ ఆశలు రేపింది. గ్యారెంటీ కార్డులు పంచి, 100 రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తామని నమ్మించింది. విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు, యువత, బీసీలు.. ఇలా ప్రతి వర్గానికీ భరోసా ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక ఆ హామీలన్నీ గాలిలో కలిశాయి. రెండున్నరేళ్లు దాటుతున్నా, దేవుళ్లపై ఒట్టేసి ఇచ్చిన హామీల అమలులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి, నయవంచన, అవినీతి, భూముల అమ్మకాలు, మంత్రుల కుర్చీలాటలు, ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడానికే పాలన పరిమితమైంది. కాంగ్రెస్ వంచనపై విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, పెన్షనర్లు సహా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా తెలంగాణ పరిస్థితి మారింది. ఈ ప్రజావ్యతిరేక ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేయాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గం బలంగా సంకల్పించింది.
నీళ్ల నినాదానికి పాతర
కాళేశ్వరం మహా కుంభకోణం – పెండింగ్ ప్రాజెక్టుల నిర్లక్ష్యం :
గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును తమ సొంత ఏటీఎంలా వాడుకుంది, అవినీతికి అడ్డాగా మార్చింది. ఫలితంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పిల్లర్లు కుంగిపోయాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పరిశీలనలోనూ నిర్మాణ నాణ్యత లోపాలు స్పష్టంగా బయటపడ్డాయి. అయినా బాధ్యులపై ఇప్పటివరకు కఠిన చర్యలు లేవు. అయితే అవినీతిపరులను జైలుకు పంపిస్తామన్న కాంగ్రెస్, ఇప్పుడు ప్రాజెక్టులో జరిగిన భారీ అవినీతిని పక్కనబెట్టి కేవలం నాణ్యత ప్రమాణాలపైన మాత్రమే సీబీఐ విచారణ కోరింది. బీఆర్ఎస్ పెద్దలతో కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందానికి ఇదే స్పష్టమైన నిదర్శనం.
కృష్ణా నది తీరాన ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచే నీటిపారుదల శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో కృష్ణా నదిపై ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయింది. ఇది వారి అసమర్థతకు స్పష్టమైన నిదర్శనం. పలువురు కార్మికుల ప్రాణాలను బలిగొన్న ఎస్ఎల్బీసీ (SLBC) సొరంగ ప్రమాదం.. నీటిపారుదల రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం ఎంత తీవ్రమైందో చూపించింది. ముందుచూపు లేదు, సరైన పర్యవేక్షణ లేదు, బాధ్యత కూడా లేదు. పాలమూరు-రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ వంటి రాష్ట్రానికి అత్యంత కీలకమైన ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. ప్రజలకు నీళ్లు అందించడంపై దృష్టి పెట్టాల్సింది పోయి, ప్రాజెక్టులను రాజకీయాలకే పరిమితం చేసింది. భద్రతా ప్రమాణాలను పట్టించుకోకపోవడం వల్లే ఈ విషాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యాన్ని బిజెపి రాష్ట్ర కార్యవర్గం తీవ్రంగా తప్పుపడుతోంది.
నిధుల విధ్వంసం
తప్పుల మీద తప్పులు.. అప్పుల మీద అప్పులు!
కాంగ్రెస్ అస్తవ్యస్త పాలనతో తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టింది. నేడు రాష్ట్ర ప్రజలపై సుమారు రూ.8 లక్షల కోట్ల అప్పుల భారం మోపింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జెన్కో, డిస్కంలు, సింగరేణిని నష్టాల్లోకి నెడితే… ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులపై అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లోనే రూ.69,300 కోట్ల అప్పులు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రికార్డు సృష్టించింది. నేడు పుట్టిన బిడ్డతో సహా ప్రతి వ్యక్తిపై రూ.2 లక్షలకుపైగా అప్పు భారం పడింది. ”అప్పు చేసి పప్పు కూడు” అన్నట్లు పాలన సాగిస్తూ, భవిష్యత్ తరాలపై కూడా భారాన్ని మోపుతోంది. ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వడాన్నే చారిత్రాత్మక విజయంగా చెప్పుకునే దుస్థితికి ఈ ప్రభుత్వం దిగజారింది. రాష్ట్రానికి ఎక్కడా అప్పు పుట్టడం లేదని, అప్పు అడగడానికి వెళ్తే చెప్పులు ఎత్తుకుపోయే దొంగలను చూసినట్లు చూస్తున్నారని సీఎం స్వయంగా చెప్పడం రాష్ట్ర ఆర్థిక దివాళాకోరుతనానికి అద్దం పడుతోంది. అప్పుల తెలంగాణగా రాష్ట్రాన్ని మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేస్తోంది.
ఎన్నికల వేళ అమరవీరుల త్యాగాలను అడ్డంగా వాడుకుని అధికార పీఠం ఎక్కిన కాంగ్రెస్, ”అవసరం తీరాక అడ్డం తిరిగినట్లు” నేడు వారి కుటుంబాలను నట్టేట ముంచింది. ప్రతి అమరవీరుడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, నెలకు రూ.25,000 గౌరవ పెన్షన్, 250 గజాల ఇంటి స్థలం, ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత అంటూ దేవుళ్ల మీద ఒట్లు వేసి హామీలు ఇచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తిగా విస్మరించింది. ఢిల్లీ హైకమాండ్‌కు మూటలు పంపడానికి నిధులు ఉన్నాయి.. కానీ తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడానికి మాత్రం ఈ చేతగాని ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. అమరవీరుల కుటుంబాల పట్ల కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణం. అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీల ప్రకారం తక్షణమే ప్రభుత్వ ఉద్యోగం, నెలకు రూ.25,000 గౌరవ పెన్షన్, 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేస్తోంది.
నియామకాలు ఒట్టిమాటే
నిరుద్యోగులను నిట్టనిలువునా ముంచిన కాంగ్రెస్ సర్కార్
ఎన్నికల సమయంలో క్రమం తప్పకుండా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని నమ్మబలికి, అధికారంలోకి వచ్చి రెండున్నర ఏండ్లు అయినా, ఇంతవరకు ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. పాత నోటిఫికేషన్ల నియామకాలు పూర్తిచేసి మేము ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇంతవరకు జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించలేదు. రాష్ట్రంలో ఏ ఒక్క యూనివర్సిటిలో ప్రొఫెసర్ల మాట అటుంచితే కనీసం అటెండర్ పోస్టు కూడా నింపలేదు. డి.ఎస్.సి.తోపాటు ఏ ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్లు ఇవ్వకుండా లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడటాన్ని బిజెపి రాష్ట్ర కార్యవర్గం తీవ్రంగా దుయ్యబడుతోంది.
ధాన్యం కొనుగోళ్లలో భారీ అవినీతి :
క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని ఎన్నికల సమయంలో గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక ఆ హామీని నీరుగార్చింది. కేవలం 7 రకాల సన్న ధాన్యానికే బోనస్ పరిమితం చేసి, దొడ్డు వడ్లు పండించే మెజారిటీ రైతులను ఘోరంగా మోసం చేసింది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైస్ మిల్లర్లతో కుమ్మక్కై రైతుల కష్టాన్ని దోచుకునేలా వేల కోట్ల అవినీతికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపింది. ఐకేపీ కేంద్రాల్లో కొనుగోళ్లు సక్రమంగా జరగక రైతులు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఎదురైంది. ఒకవైపు రైతులకు నష్టం.. మరోవైపు మిల్లర్లకు లాభం చేకూరేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్లతో కుమ్మక్కై జరుగుతున్న అవినీతిపై వెంటనే సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేస్తోంది. అదేవిధంగా, క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ను దొడ్డు వడ్లతో సహా అన్ని రకాల ధాన్యానికి ఎలాంటి షరతులు లేకుండా చెల్లించాలని డిమాండ్ చేస్తోంది.
విద్య నిర్వీర్యం – యూనివర్సిటీల భూములపై కాంగ్రెస్ కన్ను:
కేంద్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి, రీసెర్చ్ సెంటర్లకు భారీగా నిధులు ఇస్తుంటే… తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్నే నిర్వీర్యం చేస్తోంది. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు లేరు, మౌలిక వసతులు లేవు, విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. కానీ ఇవేమీ పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ యూనివర్సిటీలను బలహీనపరచి, వాటి భూములను కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపుతోంది.”చదువు కాదు.. భూములే ముఖ్యం” అన్నట్టుగా కాంగ్రెస్ పాలన సాగుతోంది. విద్యను కాపాడాల్సిన ప్రభుత్వం, యూనివర్సిటీల ఉనికినే ప్రమాదంలోకి నెడుతోంది.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కాంగ్రెస్ మోసం :
కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది. 14 లక్షల మంది విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.8,000 కోట్ల బకాయిలను విడుదల చేయకపోవడంతో విద్యాసంస్థలు సర్టిఫికెట్లు నిలిపివేస్తూ విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి మార్చుకోవడం లేదు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పేరుకుపోయిన రూ.8,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేస్తోంది.
సింగరేణిని ముంచుతున్న కాంగ్రెస్ సర్కార్
రూ.1,600 కోట్ల బొగ్గు మాయం!
తెలంగాణ కొంగుబంగారం సింగరేణిలో రూ.1,600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు మాయమవడం వెనుక పాలకపక్ష పెద్దల హస్తం ఉందనే అనుమానాలు ఉన్నాయి. విద్యుత్ డిస్కంల ద్వారా సింగరేణికి రావాల్సిన రూ.51,500 కోట్ల బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించడం లేదు. శాశ్వత ఉద్యోగులను తీసేసి అవుట్సోర్సింగ్ పెంచడం వల్ల 40 వేల మంది కార్మికుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. బొగ్గు కుంభకోణంపై సమగ్ర విచారణ జరపడంతో పాటు రూ.51,500 కోట్ల బకాయిలను వెంటనే సింగరేణికి విడుదల చేయాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేస్తోంది.
ఇందిరమ్మ ఇళ్లు – కాంగ్రెస్ సర్కార్ ‘ఝూటా’ లెక్కలు!
గత పదేళ్ల బీఆర్ఎస్ డబుల్ బెడ్రూమ్ మోసాల బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నడుస్తోంది. సొంత జాగా ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇల్లు నిర్మించేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చినా, రెండేళ్లు గడిచినా క్షేత్రస్థాయిలో ఇళ్లు నిర్మించి ఇవ్వడంలో ఘోరంగా విఫలమైంది. మొదటి విడతలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను రూ.22,500 కోట్లతో నిర్మిస్తున్నామని, ఇప్పటికే లక్షకు పైగా ఇళ్లు పూర్తయ్యాయని కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారు. కాని ఇందిరమ్మ ఇళ్లు కేవలం కాగితాల మీదే కాపురం చేస్తున్నాయి. జీహెచఎంసీ పరిధిలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా నిర్మించలేదు.. అలాంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు లేదు. కాంగ్రెస్ నాయకుల మాటలకు, ప్రభుత్వ లెక్కలకు ఎక్కడా పొంతన లేదు. అందుకే ఇందిరమ్మ ఇళ్ల అసలు లబ్ధిదారులు ఎంతమంది? ఎన్ని ఇళ్లు పూర్తయ్యాయి? ఎంత నిధులు ఖర్చు చేశారు? అనే పూర్తి వివరాలతో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేస్తోంది.
మూసీ ‘లూటీ’ – హైడ్రా అరాచకం :
హైదరాబాద్ అభివృద్ధి మెస్సీలు, మరడోనాలు వస్తే కాదు.. ప్రభుత్వానికి విజన్‌తో కూడిన యాక్షన్ ప్లాన్ ఉంటేనే జరుగుతుంది. నగరానికి కావాల్సింది సెలబ్రిటీ షోలు కాదు, ట్రాఫిక్, డ్రైనేజీ, మౌలిక వసతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం. ”పేరుకు పెద్ద ఊరు… పనికి పాడుబీడు” అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం పబ్లిసిటీ స్టంట్లకే పరిమితమైంది.’ఫోర్త్ సిటీ’, ‘ఫ్యూచర్ సిటీ’ పేర్లతో హడావిడి చేస్తూ, కాంగ్రెస్ పెద్దలు ఆక్రమించుకున్న భూముల విలువ పెంచుకునేందుకే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూసీ సుందరీకరణను బిజెపి స్వాగతిస్తుంది. కానీ అభివృద్ధి పేరుతో పేదలు, మధ్యతరగతి ప్రజలను బుల్డోజర్లతో రోడ్డున పడేయడం అన్యాయం. హైడ్రా ఇప్పటివరకు పేదలు, మధ్యతరగతి ప్రజలపైనే ప్రతాపం చూపుతోంది. కానీ అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భారీ కట్టడాల జోలికి మాత్రం వెళ్లడం లేదు. ”బలవంతుడిపై మౌనం… బలహీనుడిపై ప్రతాపం” అన్నట్టుగా ప్రభుత్వ తీరు ఉంది. మత రాజకీయాల కోణంలో వ్యవహరిస్తూ, సల్కం చెరువులో ఓవైసీ నిర్మించిన ఫాతిమా కాలేజీపై హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అక్కడ ”సామాజిక కోణం”, ”విద్యార్థుల చదువుకు అంతరాయం కలగకూడదు” అంటున్న ప్రభుత్వం.. ఇదే సామాజిక కోణం పేదల ఇళ్ల విషయంలో ఎందుకు చూడడం లేదు? వారి పిల్లల చదువు, కుటుంబాల భవిష్యత్తు, జీవనోపాధి ప్రభుత్వం కంటికి కనిపించడం లేదా? ఒకరికి ఒక న్యాయం.. పేదలకు మరో న్యాయమా? ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరి. అందుకే హైడ్రా బాధితులకు చట్టబద్ధమైన పునరావాసం కల్పించిన తర్వాతే కూల్చివేతలు చేపట్టాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేస్తోంది.
లగచర్ల గిరిజనులపై నిర్బంధం – భూ దాహానికి నిదర్శనం :
ఫార్మా విలేజ్ పేరుతో వికారాబాద్ జిల్లా లగచర్లలో గిరిజన, దళిత రైతుల భూములను బలవంతంగా దుర్మార్గంగా లాక్కునే ప్రయత్నం చేసింది. తమ హక్కుల కోసం ప్రశ్నించిన రైతుల ఇళ్లలోకి అర్ధరాత్రి చొరబడి అక్రమ అరెస్టులు చేయించింది. ఖమ్మం వెలుగుమట్ల భూబాధితుల విషయంలోనూ ప్రభుత్వం ఇదే మొండివైఖరిని ప్రదర్శించింది. ఈ ఘటనలు రాష్ట్ర ప్రభుత్వ భూ దాహానికి అద్దం పడుతున్నాయి. ”కంటపడిన భూమి కబ్జా.. అడ్డు వస్తే అణచివేత” అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అందుకే, లగచర్ల, వెలుగుమట్ల బాధితులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేస్తోంది.
శాంతిభద్రతల క్షీణత – ఎంఐఎం చెప్పుచేతల్లో కాంగ్రెస్:
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు పెరుగుతుండగా, హిందూ ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. గత బీఆర్ఎస్ పాలనలో కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉంటే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎంతో దోస్తీ చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ”ముస్లిం ఈజ్ కాంగ్రెస్.. కాంగ్రెస్ ఈజ్ ముస్లిం” అని ప్రకటించడం సంతుష్టీకరణ రాజకీయాలకు పరాకాష్ట. చట్టబద్ధంగా జరుగుతున్న ఎస్ఐఆర్ పైన కూడా రాజకీయం చేయడం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ఓటుబ్యాంకు రాజకీయాలకు నిదర్శనం. రోహింగ్యాలకు అక్రమ ఆధార్, ఓటర్ కార్డుల జారీ కాంగ్రెస్-ఎంఐఎం కుమ్మక్కుకు నిదర్శనం. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా నాయకత్వంలో దేశంలో నక్సలిజాన్ని అంతమొందించే ప్రయత్నాలు జరుగుతుంటే.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అర్బన్ నక్సల్స్‌ను పెంచి పోషిస్తోంది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జాతీయ భద్రతను, రాష్ట్ర శాంతిభద్రతలను పణంగా పెడుతోంది. ఓవైపు డ్రగ్స్, గంజాయి నిర్మూలనపై గొప్పలు చెబుతూనే.. మరోవైపు రాష్ట్రంలో మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా స్వైరవిహారం చేస్తున్నాయి. పాఠశాలల నుంచి ప్రైవేట్ యూనివర్సిటీల వరకు డ్రగ్స్ మహమ్మారి విస్తరించి యువత భవిష్యత్తును చిత్తు చేస్తోంది. యువత మత్తు ఉచ్చులో చిక్కుకుంటున్నా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. ”పాముకు పాలు పోస్తే విషమే పెరుగుతుంది” అన్నట్లుగా కాంగ్రెస్ ప్రమాదకర శక్తులను పెంచి పోషిస్తోంది. హైదరాబాద్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇంట్లో హత్య, నేపాలీ గ్యాంగ్‌ల దోపిడీలు, కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్‌లో వరుస దొంగతనాలు రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంతగా దిగజారాయో చూపిస్తున్నాయి. దొంగలకు భయం లేదు… ప్రజలకు భరోసా లేదు అన్నట్టుగా పరిస్థితి మారింది. చట్టబద్దంగా జరుగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్.ఐ.ఆర్.)ను వ్యతిరేకించడం చూస్తుంటే బి.ఆర్.ఎస్, కాంగ్రెస్ పార్టీల మత సంతుష్టీకరణ రాజకీయాలకు అద్దం పడుతున్నది. ఎం.ఐ.ఎం, కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలు అక్రమ వలసదారుల ఓట్లకోసం ఎస్.ఐ.ఆర్.ను రాజకీయ చేయడాన్ని రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలను పక్కనపెట్టి రాష్ట్రంలో శాంతిభద్రతలను పటిష్టం చేయాలి. రోహింగ్యాల అక్రమ నెట్వర్క్, డ్రగ్స్-గంజాయి మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు హిందూ ఆలయాలకు పూర్తి రక్షణ కల్పించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేస్తోంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అణచివేత :
ఎన్నికల సమయంలో డిక్లరేషన్లు, గ్యారంటీల పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలతో పాటు విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున హామీలు ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక ఆ హామీలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. గ్యారంటీలు గొప్పగా చెప్పినా, అమలులో మాత్రం ఘోరంగా విఫలమైంది. బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాలయాపన కొనసాగుతోంది. మహిళలకు మహాలక్ష్మి కింద నెలకు రూ. 2,500 ఇస్తామని చెప్పి రెండేళ్లు దాటినా పైసా ఇవ్వలేదు. ఆర్టీసీ కార్మికుల ప్రభుత్వ విలీన ప్రక్రియను అటకెక్కించారు. చేయూత పథకం కింద ఆసరా వృద్ధులకు రూ.4,000, దివ్యాంగులకు రూ.6,000 పెన్షన్ ఇస్తామన్న హామీని అమలు చేయలేదు. ఉద్యోగులకు డీఏలు, బకాయిలు చెల్లించకుండా వేధిస్తోంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు, విద్యార్థులకు భరోసా, బలహీన వర్గాలకు న్యాయం.. ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అమలు చేయలేదు. అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి. మహాలక్ష్మి స్కీమ్ సహా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలి. ఆసరా పెన్షన్లను పెంచి, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు న్యాయం చేయాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేస్తోంది.
ఎన్నికల ముందు 6 గ్యారంటీలు, 66 హామీలు, డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ బాహుబలి రేంజ్లో బిల్డప్ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక పరిపాలనలో పూర్తిగా రంగు వెలిసిపోయి బ్లాక్ అండ్ వైట్‌గా మారింది. హామీల అమలులో ఘోరంగా విఫలమై అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది. కాంగ్రెస్ వైఫల్యాలు, అవినీతి, నయవంచనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. పదేండ్ల బీఆర్ఎస్ పాలన, రెండున్నరేళ్ల కాంగ్రెస్ అరాచక, అవినీతి, కుటుంబ పాలన పట్ల విసిగిపోయిన ప్రజలు బిజెపి ప్రభుత్వం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ప్రజలు పాతాళంలో కలపడం ఖాయం. ఎన్నికలెప్పుడు వచ్చినా తెలంగాణలో బిజెపికి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాబోయేది బిజెపిదే… ఎగరబోయేది కాషాయ జెండానే. గొల్లకొండ కోటపై కాషాయ జెండా ఎగరడం, డబుల్ ఇంజిన్ సర్కార్‌తో తెలంగాణలో సుపరిపాలన రావడం ఖాయం. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు కాంగ్రెస్‌ను బిజెపి వెంటాడుతూనే ఉంటుంది. ప్రజా పోరాటాలకు ప్రతి కార్యకర్త సిద్ధం కావాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గం పిలుపునిస్తోంది.

