రాజు బలవంతుడైనందుకే దొంగలంతా ఐక్యమయ్యారు
పురాతనమైన భారతదేశ చరిత్రలో రామాయణ, మహాభారత కాలంలోనే సమున్నత ఆదర్శాల కోసం జీవితాలనే అర్పించినవాళ్లను మనం చూశాం. తదనంతరం వేల సంవత్సరాల క్రితమే చాణక్యుడు రాజకీయ, ఆర్థిక విషయాల గురించి భవిష్యత్తు తరాలకు పనికొచ్చేవిధంగా గొప్ప గొప్ప సూక్తులు చెప్పాడు. అందులో నేటి పరిస్థితులకు కూడా సరిపోయినది ‘రాజు బలవంతుడైతే దొంగలంతా ఏకమవుతారు’ అనేది ఒకటి.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆరు దశాబ్దాల తర్వాత ఒక సమర్థుడైన, త్యాగభావన గల, కఠోర పరిశ్రమ చేసే ప్రధాని లభించడం, ఈనాటి పెను రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక మార్పులకు ఎంతో జీవం ఇచ్చింది. 13 ఏళ్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా, గత 12 ఏళ్లుగా దేశ ప్రధానిగా 6 ఎన్నికల్లో ఎక్కడా ఓటమెరుగక, పార్టీని, తనను విజయపథంలో నిరంతరం నడిపిస్తూ, ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా, యావత్ ప్రపంచం సంభ్రమాశ్చర్య పడేలా ప్రధాని నరేంద్ర మోదీ పని చేస్తుండడం ప్రపంచ చరిత్రలో తొలిసారి అని చెప్పవచ్చు. అందుకే, గత దశాబ్ద కాలంగా మోదీ ప్రపంచ నెంబర్ వన్ నాయకుడిగా ఉంటూ వస్తున్నాడు. గుజరాత్ లో మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాలు, కేంద్రంలో మూడు లోక్ సభ ఎన్నికల్లో రికార్డు విజయాలే కాకుండా 2024 లోక్ సభ ఎన్నికల తర్వాత జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా రికార్డు మెజారిటీతో భారతీయ జనతా పార్టీ హరియాణా, మహారాష్ట్ర, దిల్లీ, బీహార్, అస్సాం, బెంగాల్ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించడం చూసిన ప్రతిపక్షాలు, ఇక బిజెపిని, ముఖ్యంగా మోదీ నాయకత్వంలో ఉన్న బిజెపిని ఎన్నికల్లో ఎదుర్కోవడం సాధ్యం కాదని గ్రహించి, దేశ వ్యతిరేక శక్తులతో కుమ్మక్కయి శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ తరహాలో కేంద్ర ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రలకు ఇప్పుడు బలమైన అడుగులు వేస్తున్నారు.
వరుసగా ఘోర పరాజయాలు, సోనియా కుటుంబం లేకుంటే పార్టీ బతకలేని దయనీయ స్థితి, అసమర్థుడైన రాహుల్ గాంధీని నాయకుడిగా స్వీకరించాల్సిన దుస్థితి, వెరసి కాంగ్రెస్ ప్రజాస్వామ్యంపై నమ్మకం కోల్పోయి కుట్రలు, కుయుక్తుల దిశగా అడుగులు వేస్తోంది. దశాబ్దంన్నర క్రితం నూతన రాజకీయ విధానం అని చెప్తూ వచ్చిన కేజ్రీవాల్ గత దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీతో పాటు స్వయంగా తాను కూడా ఎమ్మెల్యేగా ఓడిపోవడం, పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పట్ల తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో కేజ్రీవాల్ నియంతృత్వ ధోరణి భరించలేక పార్లమెంటు సభ్యులే పార్టీని వీడుతున్న పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఆమ్ ఆద్మీ లేబుల్ పనికిరాదని, కొత్త లేబుల్ అసవరమని గ్రహించిన కేజ్రీవాల్ ఇప్పటి కుట్రలో ఒక ప్రధాన భాగస్వామి. రాజకీయ సలహాదారుగా ప్రఖ్యాతి గాంచిన ప్రశాంత్ కిషోర్ ఎన్నికల రణరంగం అరంగ్రేట్రంలో బొక్కబోర్లా పడడంతో కొత్త తరహా ఆలోచనల్లో అతని పాత్ర కూడా ఉందన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. దేశంలో ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారి, తర్వాత వంశపారంపర్య పార్టీలుగా మారుతుండడం, వాటి దోపిడీ అధికమవుతుండడంతో ప్రజల్లో వస్తోన్న వ్యతిరేకత నుంచి దృష్టి మరల్చడం కోసం ఆ ప్రాంతీయ పార్టీలు కూడా ఈ అరాచక శక్తులతో కుమ్మక్కయ్యాయని స్పష్టమవుతుంది.
పరీక్షా పత్రం లీక్ కావడం దురదృష్టకరమైనదే. దేశంలో ఇప్పటికి ఎన్నోసార్లు పరీక్షా పత్రాలు లీకయ్యాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలో ఈ లీకులకు అంతమే లేకపోయింది. రెండోసారి నీట్ పత్రిక లీకవడంతో ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో కొంత అసంతృప్తి వచ్చిన మాట వాస్తవమే. 2024 నీట్ పేపర్ లీక్ లో హజారీబాగ్ లోని మతోన్మాదులైన ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ కారణం అవడం, అది స్థానికంగా కొద్ది మందికే పశ్నాపత్రాలు అందడంతో రీఎగ్జామ్ అవసరం లేకుండా, కొద్దిపాటి మార్పులతో కౌన్సిలింగ్ చేపట్టేందుకు సుప్రీంకోర్టు సంపూర్ణ అనుమతిచ్చింది. ప్రశ్నాపత్రాల లీక్ లను నిరోధించేందుకు చట్టం తీసుకురావాలని సుప్రీం సూచన మేరకు 2024లోనే ప్రశ్నాపత్రం లీక్ చట్టం రూపొందించారు. ఇంజనీరింగ్, మిగతా పోటీ పరీక్షల్లా నీట్ యూజీ ఎగ్జామ్ ఆన్ లైన్ విధానం చేయకపోవడానికి బలమైన కారణమే ఉంది. మోదీ ప్రభుత్వ కాలంలో 50 వేల నుంచి 1 లక్ష 30 వేలకు పెరిగిన ఎంబీబీఎస్ సీట్లకు దాదాపు 25 లక్షల మంది పోటీ పడడం వల్ల ఒకే ఆన్ లైన్ పేపర్ తో ఎగ్జామ్ అసాధ్యం. వేరువేరు పేపర్ల వల్ల కొన్ని ప్రశ్నాపత్రాలు సులువుగా, మరికొన్ని కఠినంగా ఉండి, ర్యాంకుల్లో సమన్యాయం స్ఫూర్తికి విఘాతం కలిగే అవకాశం ఉంది. అందుకే ఇప్పటివరకు ఆన్ లైన్ ఎగ్జామ్ కు వెళ్లలేదు. కానీ ఇప్పుడు దేశంలోని సంఘవిద్రోహ శక్తులు టెక్నాలజీని దుర్వినియోగపరిచే పరిస్థితులు వస్తుండడంతో నీట్ 2026 లీక్ తర్వాత వచ్చే సంవత్సరం నుంచి ఆన్ లైన్ ఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
వ్యవస్థీకృతం కాని, సోషల్ మీడియా లేబుల్ లా ఉన్న ఒక సంస్థ వ్యంగ్యకరమైన బొద్దింకల పేరుతో యువతను రెచ్చగొడుతూ, ఈ నీట్ పరీక్ష లీకును ఆసరాగా తీసుకొని, దిల్లీలో జూలై 20న జరిగిన మార్చ్ టు పార్లమెంట్ ర్యాలీ నిర్వహించింది. అయితే, ఇందులో పాల్గొన్నవారిలో దాదాపు 70 శాతం పైగా విద్యార్థులు కాని వారే! వారు దేశద్రోహ ఎజెండాతో ఆర్టికల్ 370 మళ్లీ తెస్తామని, జెన్ జెడ్ ఉద్యమంతో భారత్ లోనూ నేపాల్ లాంటి పరిస్థితి తెస్తామని, ఔరంగజేబు ఫోటోలతో, పాలస్తీనా జెండాలతో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో జాతీయ భావానికి వ్యతిరేకంగా, హిందుత్వానికి వ్యతిరేకంగా చేసిన నినాదాలు, ఇచ్చిన ఉపన్యాసాలు చూస్తే ఇది నీట్ పరీక్ష లీక్ కోసం కాదు, దేశం విచ్ఛిన్నం కోసమే అని స్పష్టమవుతుంది. ఆ క్రమంలోనే మహిళా జర్నలిస్టుపైనే కాకుండా, మార్చ్ లో పాల్గొనేందుకు వచ్చిన విద్యార్థినిలపై, మహిళలపై అఘాయిత్య యత్నాలు జరిగాయి. పోలీసుల మీద రాళ్ల దాడులు, గాజుసీసాలు విసరడాలు, పెప్పర్ స్ప్రేలు.. ఇది ఒక క్రమశిక్షణా ర్యాలీ కాకుండా, అరాచక శక్తుల హింసాత్మక ర్యాలీని తలపించింది. పరిస్థితులను అదుపులో తేవడానికి పోలీసులు లాఠీచార్జీ, టియర్ గ్యాస్ వంటివి ప్రయోగించాల్సి వచ్చింది. దీంతో వందల మంది పోలీసులు, కొంతమంది నిరసనకారులు క్షతగాత్రులయ్యారు.
గత 12 ఏళ్ల కాలంలో మోదీ ప్రభుత్వంలో ఒక్క కుంభకోణం లేకపోవడం, ప్రభుత్వ అద్భుత నిర్ణయాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో 17 కేసులు వేసినప్పటికీ, అన్నింటినీ కొట్టివేయడంతో నిరాశ నిస్పహలో ఉన్న కాంగ్రెస్ ఈ దిల్లీ ర్యాలీని రాజకీయ అవసరాల కోసం వాడుకునే ప్రయత్నం చేసింది. రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రధాని ఇంటి ముందుకు దొంగల్లా వచ్చి నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎంతో సంయమనంతో విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధతో పరీక్షల విధానంలో సమూల మార్పులు, ప్రశ్నాపత్రాల లీకులకు వ్యతిరేకంగా కఠిన దండనలను విధించే నిర్ణయాలు తీసుకొని, ప్రజల ముఖ్యంగా విద్యార్థుల విశ్వాసాన్ని చూరగొంది. బేషజాలకు పోకుండా విద్యార్థుల భవిష్యత్ కోసం విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడాన్ని యావత్ దేశం హర్షించింది. విద్యార్థులు కూడా తమ ఉద్యమాన్ని విరమించినట్టు ప్రకటించడం హర్షణీయం. ఏమైనప్పటికీ అసాంఘీక శక్తుల, అవకాశవాద రాజకీయ పార్టీల ఐక్యత రాజు బలవంతుడయితే దొంగలంతా ఇలానే ఏకమవుతారనేది స్పష్టం చేస్తుంది.

