హైదరాబాద్‌లో రూ. 1 లక్ష కోట్ల ప్రైవేట్ ఆస్తులకు 22ఏ సంకెళ్లు!
హైదరాబాద్‌లో హైడ్రా ఎంపిక చేసిన కూల్చివేతలపై వివాదం తర్వాత, రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏ కింద నిషేధిత జాబితాలో భూములు, ఆస్తులను చేర్చడం ఆస్తి యజమానులలో ఆందోళన కలిగిస్తోంది. వారు తమ తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి తమ ప్లాట్లు లేదా ఫ్లాట్లను అమ్ముకోలేకపోతున్నారు. సెక్షన్ 22ఏ నిర్దిష్ట భూములు, ఆస్తుల అమ్మకం, బదిలీ లేదా తాకట్టును నిషేధిస్తుంది. చెల్లుబాటయ్యే జీహెచ్ఎంసీ లేదా హెచ్ఎండిఏ భవన నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు, ఆస్తి పన్ను రసీదులు, ఇతర పత్రాలు ఉన్నప్పటికీ, హైదరాబాద్‌లోని అనేక అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లు, అలాగే రంగారెడ్డి, మెడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, ఇతర జిల్లాల్లోని స్వతంత్ర గృహాలు, ఖాళీ స్థలాలను నిషేధిత కేటగిరీ ఆస్తులుగా వర్గీకరిస్తున్నారు. అతిపెద్ద ఆందోళన ఏమిటంటే, తమ ఆస్తులను సెక్షన్ 22ఏ పరిధిలోకి తీసుకువచ్చారనే విషయం చాలా మంది యజమానులకు తెలియదు. వారు తమ ప్లాట్లు లేదా ఫ్లాట్లను అమ్మడానికి లేదా బదిలీ చేయడానికి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను సంప్రదించినప్పుడు మాత్రమే ఈ ఆంక్ష గురించి తెలుస్తున్నది.
గత ఏడాది అక్టోబర్‌లో, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ నిషేధిత కేటగిరీలో చేర్చిన భూములు, ఆస్తుల వివరాలను నిర్దేశిత ఫార్మాట్లో కోరిన తర్వాత ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. వివరాలు అందించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించగా, రెవెన్యూ శాఖ మండలం, గ్రామం లేదా పట్టణం, సర్వే నంబర్, సబ్-డివిజన్ వివరాలు, ప్లాట్ నంబర్, టౌన్ సర్వే నంబర్, ఇంటి నంబర్, భూమి విస్తీర్ణం, అది రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వానికి చెందినదా అనే వివరాలతో కూడిన సమాచారాన్ని సమర్పించింది. అయితే, అనేక సందర్భాల్లో రెవెన్యూ శాఖ ప్లాట్ నంబర్లు, టౌన్ సర్వే నంబర్లు లేదా ఇంటి నంబర్లను పేర్కొనకుండా కేవలం సర్వే నంబర్లను మాత్రమే పంచుకున్నట్లు సమాచారం. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం 22ఏ పేరిట దోపిడీకి తెరతీసి, అడ్డగోలుగా ప్రజల ఆస్తులు, భూములను నిషేధిత జాబితాలో పెట్టి కమీషన్లు దండుకుంటున్నదని ఈ సందర్భంగా ఆరోపణలు చెలరేగుతున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరవ్యాప్తంగా లక్షల కోట్ల విలువజేసే ఆస్తులపై కాంగ్రెస్ సర్కార్ కుట్ర పన్నిందని విమర్శలు వినవస్తున్నాయి. ధరణి పోర్టల్‌ను రద్దు చేసిన రేవంత్ ప్రభుత్వం, ధరణి కంటే సమర్థవంతమైన రెవెన్యూ విధానం అంటూ తీసుకువచ్చిన భూభారతితో సామాన్యులను నానా ఇబ్బందులు పెడుతున్నది. పాతకాలపు లొసుగులు, ధరణిలోని లోపాలను సవరించి, రాష్ట్ర పౌరులకు మెరుగైన రెవెన్యూ సేవలు అందిస్తామని చెప్పి నగరవ్యాప్తంగా ఉన్న లక్షల కోట్ల విలువ చేసే అసైన్డ్, ప్రభుత్వ భూములు, ప్రైవేట్ ఆస్తులను కూడా వివాదాల్లోకి నెట్టి నిషేధిత సంకెళ్లు వేసింది. పేద, మధ్యతరగతి జనాలతోపాటు, సంపన్నులు, విదేశీ సంస్థలు కొలువుదీరిన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, షేక్‌పేట, అమీర్‌పేట, ఖైరతాబాద్, పంజాగుట్ట వంటి ప్రైమ్ ఏరియాల్లోని భూములను నిషేధించి చోద్యం చూస్తున్నది.
పేద, మధ్య తరగతి ప్రజల ఆస్తులకు కోల్పోయిన రక్షణ
ఇన్నాళ్లూ తాము ఉండే ఇండ్లు, ఖాళీ జాగలపై ఉన్న సర్వ హక్కులను హరించేలా నిషేధిత జాబితాలో చేర్చి అవసరానికి అమ్ముకొనే వీల్లేకుండా చేసి జనాలను అరిగోస పడుతుంది. భూభారతిని ఆసరాగా చేసుకొని ప్రభుత్వ, వక్ఫ్, యూఎల్సీ భూములను చెరబట్టింది. ఈ చర్యలతో పేద, మధ్యతరగతి ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయి గుండెలు బాదుకునే పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్క గ్రేటర్ పరిధిలోనే వేలాది ఎకరాల భూములు, దశాబ్దాలుగా తమ ఆధీనంలో ఉన్న ఆస్తులపై హక్కులను కాలరాసింది. అధికారంలోకి రావడంతోనే రెవెన్యూ, రియల్ ఎస్టేట్ రంగానికి కీలకమైన హైదరాబాద్ భూములపై కన్నేసిన కాంగ్రెస్ పెద్దలు ధరణి ఆధునికీకరణ పేరిట భూభారతి అంటూ రెవెన్యూ రికార్డులను లోపాలు బయటపడకుండా రెవెన్యూ దస్ర్తాల ప్రక్షాళనకు కాంగ్రెస్ సర్కార్ గుట్టుగా తెరలేపిందనే అనుమానాలు కలుగుతున్నాయి.
భూభారతిని తీసుకువచ్చి కలెక్టర్లు, అధికారుల వద్ద ఉన్న అధికారాలను, అప్పిలేట్ అథారిటీలను మళ్లీ పాతకాలపు రెవెన్యూ వివాదాల్లోకి నెట్టి జనాలపై 22ఏ జాబితాను ప్రయోగించింది. పేద, మధ్యతరగతి, సంపన్న వర్గాలు అనే తేడా లేకుండా, వ్యవసాయ, వ్యవసాయేతర భూములనే తేడా లేకుండా, చివరికి హెచ్ఎండీఏ, హుడా, జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న లే అవుట్లలోని ప్లాట్లు, ఇండ్లను కూడా నిషేధించి నిర్బంధించింది. ఇక్కడే గందరగోళానికి తెరలేపిన కాంగ్రెస్ సర్కార్ తెరవెనుక వేల కోట్ల భూములను మాయం చేసే కుట్రలను పకడ్బందీగా అమలు చేస్తున్నది. వారతస్వంగా, దశాబ్దాల కష్టార్జితాన్ని, పన్నులు చెల్లించి కాపాడుకున్న ఆస్తులను రాత్రికి రాత్రే 22ఏ జాబితాలో చేర్చడంతో సామాన్యుడు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో 40-50 శాతం భూములన్నీ గ్రేటర్ పరిధిలో ఉండగా వీటన్నింటి విలువ లక్షల కోట్లు విలువ చేస్తుంది.
ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడంపై రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తిన ప్రజాందోళనతో కాంగ్రెస్ ప్రభుత్వం తర్జనభర్జన పడుతున్నది. దాదాపు 6 నెలలుగా సాగుతున్న ఈ వ్యవహారంపై ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యకు పరిష్కారం చూపకుండా నిషేధిత జాబితాను అప్డేట్ చేయడంలో పొరపాటు జరిగిందని, అధికారుల తరపున క్షమాపణలు కోరుతున్నానని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఇక్కడే అధికారుల తప్పిదంతో పొరపాటున ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులు కూడా నిషేధిత జాబితాలో పడ్డాయంటూ రాష్ట్రంలో 22ఎ నిషేధిత భూముల సమస్యను పరిష్కరించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు ఆస్తులను 22ఏ జాబితా నుంచి తొలగిస్తామని ఆయన చెప్పారు. అయితే, ప్రభుత్వ ప్రమేయం లేకుండా అధికారులు నిర్ణయం ఎలా తీసుకుంటారనే ప్రశ్న తలెత్తుతుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి వరకు వేలాది ఫిర్యాదులను పరిష్కరించలేని సర్కార్ ఇప్పుడు 15 రోజుల్లోనే పరిష్కరిస్తామని చెప్పి మభ్యపెడుతున్నది. దేశవ్యాప్తంగా అర్బన్ సీలింగ్ యాక్ట్ రద్దు చేశారు, 2008లో వైఎస్సార్ ప్రభుత్వం ఆ చట్టాన్ని ఎత్తేసింది. కానీ రేవంత్ సర్కార్ సీలింగ్ పరిధిలోని భూములన్నింటినీ 22ఏలో పెట్టింది. చలాన్ డబ్బులు కూడా తిరిగివ్వకుండా ప్రభుత్వం నిలువునా దోచుకుంటున్నది. తక్షణమే భూములన్నింటినీ నిషేధిత జాబితా నుంచి తొలగించి, ఈ దోపిడీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలి. ఈ భూములపై శ్వేతపత్రం విడుదల చేస్తే అసలు గుట్టు బహిర్గతం అవుతుంది.
పడిపోయిన రిజిస్ట్రేషన్లు
భూయజమానులకు భూతంలా మారిన ఈ 22ఏతో ప్రభుత్వ రిజిస్ట్రేషన్ల ఆదాయంపై తీవ్రప్రభావం పడింది. ఈ దెబ్బతో భూములు, ఇండ్ల క్రయ విక్రయాలు పడిపోవడంతో రిజిస్ట్రేషన్ల ఆదాయం పాతాళానికి పడిపోయింది. 22ఏ నిషేధిత భూముల భయంతో కొనుగోలుదారులు వెనుకంజ వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అనవసరంగా ఇప్పుడెందుకు కొనుగోలు చేయడమనే ఆలోచన చేస్తున్నారు. గత నెల మొదటి వారంలో 22,136 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా, ప్రభుత్వానికి రూ.216.66 కోట్ల ఆదాయం సమకూరింది. 22ఏ వివాదం బయటకు రావడంతో రెండో వారంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల సంఖ్య 16,268కి పడిపోయింది. ఆదాయం భారీగా తగ్గి రూ.173.85 కోట్లకు పడిపోవడం గమనార్హం. అంటే తొలి వారంతో పోల్చితే రెండో వారంలో 5,868 డాక్యుమెంట్లు తగ్గగా, రూ.42.81 కోట్ల ఆదాయం తగ్గిపోయింది. మూడో వారం మరింత దారుణంగా ఉండటం గమనార్హం. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల సంఖ్య 12,999కి పడిపోగా, ఆదాయం రూ.152.08 కోట్లకు తగ్గిపోవడం గమనార్హం.
ప్రవీణ్

