Hydrozen Train

దేశ రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయం: స్వదేశీ హైడ్రోజన్ రైలు పరుగులు

Hydrozen Rail దేశ రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. పూర్తి స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన తొలి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 17న ప్రారంభించారు. జూలై 18 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిన ఈ రైలు హరియాణాలోని జింద్ నుంచి సోనిపట్ వరకు 89 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. మార్గమధ్యంలో 12 స్టేషన్లలో ఆగుతుంది. ప్రస్తుతం సోనిపట్–దిల్లీ మధ్య 44 కిలోమీటర్ల సెక్షన్‌లో పరీక్షలు కొనసాగుతున్నాయి. అవి పూర్తయిన తర్వాత ఈ రైలును జింద్ నుంచి దిల్లీ వరకు నడపనున్నారు.

‌’మేక్ ఇన్ ఇండియా’ విజయానికి నిదర్శనం

హైడ్రోజన్ రైలును ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో భారతీయ రైల్వే వ్యవస్థలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పారు. పూర్తిగా దేశీయ సాంకేతికతతో తయారైన ఈ రైలు ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన హైడ్రోజన్ రైలుగా దీనిని అభివర్ణించారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావాన్ని ప్రస్తావించిన ఆయన, హోర్ముజ్ జలసంధి గుండా భారత్‌కు పెద్ద ఎత్తున ముడిచమురు, గ్యాస్, ఎరువులు వస్తాయని, గత కొన్ని నెలలుగా ఆ ప్రాంతం యుద్ధ ప్రభావంలో ఉన్నప్పటికీ భారత రైల్వే కార్యకలాపాలు, దేశ అభివృద్ధి ఆగలేదన్నారు. “2014కు ముందు ఇలాంటి పరిస్థితులు వచ్చి ఉంటే రైల్వే వ్యవస్థ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేది. అప్పట్లో ఎక్కువ రైళ్లు డీజిల్‌పై ఆధారపడేవి. డీజిల్ సరఫరా నిలిచిపోతే దేశం పెద్ద సంక్షోభంలో పడేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ముందుగానే ఆలోచించి ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసుకున్నందువల్లే ఇది సాధ్యమైంది” అని ప్రధాని వ్యాఖ్యానించారు. హైడ్రోజన్ రైలును ప్రారంభించిన అనంతరం రూ.14,700 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు.

‌స్వదేశీ సాంకేతికతతో నిర్మాణం

ఈ హైడ్రోజన్ రైలును పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. రైలు కోచ్‌లను చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో తయారు చేశారు. హైదరాబాద్‌కు చెందిన ‘మేధా సర్వో డ్రైవ్స్’ సంస్థ ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించింది. హైడ్రోజన్‌ను విద్యుత్తుగా మార్చి రైలు మోటార్లకు అందించే హైడ్రోజన్-టు-ఎలక్ట్రిక్ కన్వర్షన్ వ్యవస్థను ఆ సంస్థ అభివృద్ధి చేసి అమర్చింది. ఈ రైలు సాధారణ రైళ్ల మాదిరిగా ఇంజిన్‌తో కాకుండా మెట్రో రైళ్ల తరహాలో 10 బోగీలతో కూడిన ఒకే ట్రెయిన్‌సెట్‌గా రూపొందించారు. ఇందులో ఎనిమిది ప్రయాణికుల కోచ్‌లు, రెండు డ్రైవింగ్ పవర్ కార్లు ఉంటాయి. ఈ పవర్ కార్లు 3,200 హార్స్‌పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. జర్మనీ, జపాన్, ఫ్రాన్స్, చైనా వంటి దేశాల్లో ప్రస్తుతం నడుస్తున్న హైడ్రోజన్ రైళ్లు సాధారణంగా రెండు నుంచి నాలుగు కోచ్‌లతో మాత్రమే ఉంటాయి. ఆ దృష్ట్యా చూస్తే, 10 బోగీలతో రూపొందిన భారత హైడ్రోజన్ రైలు ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైడ్రోజన్ ఆధారిత ప్యాసింజర్ రైలు. ఇందులో ఒకేసారి సుమారు 2,600 మంది ప్రయాణించే అవకాశం ఉంది.

‌హైడ్రోజన్ రైలు ఎలా పనిచేస్తుంది?

సాధారణ విద్యుత్ రైళ్లు పైభాగంలో ఉండే విద్యుత్ తీగల నుంచి విద్యుత్ తీసుకుని నడుస్తాయి. అయితే హైడ్రోజన్ రైలుకు అలాంటి ఓవర్‌హెడ్ వైర్ల అవసరం ఉండదు. ఇది హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ సాంకేతికతతో స్వయంగా విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటుంది. రైలు పైభాగంలో ఏర్పాటు చేసిన ట్యాంకుల్లో నిల్వ చేసిన హైడ్రోజన్‌ను, గాలిలోని ఆక్సిజన్‌తో కలిసి ఫ్యూయెల్ సెల్‌లోకి పంపుతారు. అక్కడ జరిగే రసాయన చర్య ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అదే విద్యుత్ రైలు చక్రాలను తిప్పే ఎలక్ట్రిక్ మోటార్లకు చేరి రైలును ముందుకు నడిపిస్తుంది. ఈ ప్రక్రియలో ఉప ఉత్పత్తిగా కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదలవుతుంది. కార్బన్ ఉద్గారాలు, ఇతర కాలుష్య కారకాలు వెలువడవు. అందువల్ల ఇది పూర్తిగా పర్యావరణహిత రవాణా వ్యవస్థగా గుర్తింపు పొందుతోంది.

సాధారణ రైళ్లతో పోలిస్తే హైడ్రోజన్ రైలు శబ్దం చాలా తక్కువ. ఇందులో వినిపించే శబ్దం ప్రధానంగా ఫ్యూయెల్ సెల్‌ను చల్లబరిచే ఫ్యాన్లు, ఎలక్ట్రిక్ మోటార్లు, అలాగే రైలు గాలిని చీల్చుకుంటూ వెళ్లేటప్పుడు ఏర్పడే శబ్దం మాత్రమే. ప్రయాణ సమయంలో అదనంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్తుతో పాటు బ్రేకులు వేసినప్పుడు ఉత్పత్తి అయ్యే రీజనరేటివ్ విద్యుత్తును రైలు అడుగు భాగంలో ఏర్పాటు చేసిన లిథియం-అయాన్ బ్యాటరీల్లో నిల్వ చేస్తారు. అవసరమైన సమయంలో ఆ విద్యుత్తును మళ్లీ వినియోగించడం ద్వారా రైలు మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది.

రైలుకు అవసరమైన హైడ్రోజన్‌ను నింపేందుకు జింద్‌లో పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో హైడ్రోజన్ నిల్వ, ఇంధనం నింపే కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వ, సరఫరా వంటి వ్యవస్థలను కూడా భారత్ స్వయంగా అభివృద్ధి చేసుకున్న దేశాల జాబితాలో చేరింది. హైడ్రోజన్ రైలు ప్రారంభం భారత రైల్వే రంగంలో సాంకేతిక పురోగతికి ప్రతీకగా నిలవడంతో పాటు, స్వదేశీ సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మరో కీలక ఘట్టంగా నిలిచింది.