ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతాలుగా రైల్వే స్టేషన్లు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారతీయ రైల్వే రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోందని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. గతంలో రైల్వే స్టేషన్ అంటే పాత భవనాలు, కనీస వసతులు లేని ప్రదేశాలుగా భావించేవారమని, కానీ నేడు మోడ్రన్ ఇంజనీరింగ్ మార్వెల్స్‌గా, విమానాశ్రయాలను తలపించేలా సుందరీకరణ జరిగిందని కొనియాడారు. తెలంగాణలోనే దాదాపు 41 రైల్వే స్టేషన్లను ఎలివేటర్లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు వంటి అత్యాధునిక వసతులతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరించినట్లు చెప్పారు. జూలై 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 75 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో రూ.35.61 కోట్ల వ్యయంతో సర్వాంగ సుందరంగా ఆధునీకరించిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో రాంచందర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత 12 సంవత్సరాల కాలంలో భారతీయ రైల్వే చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా అద్భుతమైన ప్రగతి, మార్పులు జరిగాయని పేర్కొన్నారు. విదేశాల్లోని యూరో రైల్ సిస్టమ్ కంటే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని ఈరోజు భారతదేశం ఉపయోగిస్తోందని, దేశవ్యాప్తంగా బ్రాడ్‌గేజ్ పనులు పూర్తవుతూ రైల్వే వ్యవస్థ రూపురేఖలు మారుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక శ్రద్ధను వివరించారు. 2014 కంటే ముందు ఉమ్మడి రాష్ట్రంలో రైల్వే బడ్జెట్ కేవలం రూ.500 కోట్లు మాత్రమే ఉండేదని, కానీ ప్రధాని మోదీ నేతృత్వంలో గత పన్నెండేళ్లుగా కేవలం తెలంగాణ రైల్వే రంగానికే బడ్జెట్‌ను రూ.4,900 కోట్లకు పెంచినట్లు వెల్లడించారు. ఈ భారీ కేటాయింపుల వల్లే రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్లు, ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి తెలంగాణలో ఐదు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని, భవిష్యత్తులో మూడు బుల్లెట్ రైళ్లు, మూడు హైస్పీడ్ రైళ్ల కారిడార్లు రాబోతున్నాయని.. దీనికి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ (భూసేకరణ) ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైందని అన్నారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ బుల్లెట్ రైల్ హబ్‌గా మారబోతోందని జోస్యం చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం ప్రజలందరూ రైల్వే ప్రయాణ సౌకర్యాలను విరివిగా ఉపయోగించుకోవాలని రాంచందర్ రావు పిలుపునిచ్చారు. ప్రధాని సూచించినట్లుగా కార్ పూలింగ్, రైల్వే ప్రయాణాల ద్వారా ఇంధనాన్ని ఆదా చేయవచ్చన్నారు. ఎంఎంటీఎస్ సేవలతో పాటు, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వేగంగా చేరుకోవడానికి వందే భారత్ వంటి ఆధునిక స్పీడ్ ట్రైన్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

