India Shining

అభివృద్ధి, ఆధునికీకరణకు అనుకూలమైన తీర్పు

2024 లోక్‌సభ ఎన్నికల ఫలితం అనేక విధాలుగా చరిత్రాత్మకమైనది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి భారత ప్రజలు వరుసగా మూడోసారి అధికారాన్ని అందించారు. 1962 తర్వాత మూడోసారి ఒక ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం ఇదే తొలిసారి. కోవిడ్-19 మహమ్మారి, ప్రపంచ ఆర్థిక మాంద్యం, యూరప్, పశ్చిమాసియాలలో యుద్ధాలతో భౌగోళిక రాజకీయ అస్థిరత, ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల పునరాగమనం, రోజురోజుకూ అస్థిర మవుతున్న పాకిస్తాన్, చైనాతో పెరుగుతున్న శత్రుత్వం వంటి సవాళ్లను ఎదుర్కొన్న ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తన రెండవ పదవీకాలంలో చాలా క్లిష్టమైన దారిలో ముందుకు సాగింది. ఈ ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం దేశంలో శాంతిని కాపాడింది.

అంతేగాక, మోదీ ప్రభుత్వం అంతర్జాతీయ వ్యవహారాలలో భారత్ ప్రభావాన్ని పెంచింది. దేశ సరిహద్దులను కాపాడింది.  దేశీయ ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించింది. అభివృద్ధి, సంక్షేమ విధానాలు, జాతీయ భద్రత, ఆధునికీకరణ వంటి లక్షణాలతో కూడిన ప్రధాని మోదీ పదేళ్ళ నాయకత్వానికి ఓటర్లు సానుకూలంగా ఓటు వేశారు. ఆయన ఈ రోజు ప్రజాస్వామ్య ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన, బలీయమైన ప్రజా నాయకుడు. ప్రధానమంత్రి మోదీ కొనసాగింపు, స్థిరత్వం, నిశ్చయాత్మక నాయకత్వానికి ప్రజలు మద్దతు ఇచ్చారని ఫలితాలు సూచిస్తున్నాయి.

భారత్ లో ఎన్నికల విజయం వివిధ కులాలు, వర్గాలను సమర్థంగా సమీకరించడం, సామాజిక వైరుధ్యాలను పరిష్కరించడం, విభిన్న వర్గాల ఆకాంక్షలను తీర్చడం వంటి విషయాల్లో పార్టీ ఎంత సమర్థంగా వ్యవహరిస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుందని కూడా ఈ ఎన్నికలు మరోసారి స్పష్టం చేశాయి. కులం, మతం, ప్రాంతం ఆధారంగా భయాందోళనలను, ద్వేషాన్ని రెచ్చగొట్టాలని కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి అత్యంత విభజనాత్మక ప్రచారాన్ని నిర్వహించింది. బిజెపి తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగం, రిజర్వేషన్లు ప్రమాదంలో పడతాయని తప్పుడు ప్రచారం చేశారు. దీనికి భిన్నంగా బిజెపి జాతీయవాదం, అభివృద్ధి, ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం, అభివృద్ధి చెందిన భారతదేశం కోసం ఒక దార్శనికత ఆధారంగా ప్రచారాన్ని నిర్వహించింది.

రిజర్వేషన్ల గురించి తప్పుడు ప్రచారాలు, భయాందోళనలతో కొన్ని రాష్ట్రాల్లో ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ, వెనుకబడిన కులాలు, దళితుల్లో గణనీయమైన భాగం బిజెపి వెనుకే నిలిచారు. అభివృద్ధి, రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఆకాంక్షలతో పాటు హిందూ గుర్తింపు కోసం ఈ వర్గాలు ప్రధాని మోదీ నేతృత్వంలోని బిజెపికి అచంచల మద్దతుదారులుగా మారారు. సమాన హక్కులను వాగ్దానం చేయడం, కుల సరిహద్దులను చెరిపివేయడం, వేగవంతమైన ఆర్థికాభివృద్ధిని సాధించడం ద్వారా ప్రస్తుతం ఆధునికత కోసం విస్తృతమైన ఆకాంక్షను ప్రతిబింబించే ఏకైక భావజాలం హిందుత్వ మాత్రమే. 

ప్రతిపక్షాలు కుల అస్తిత్వాల ఆధారంగా ప్రజలను విభజించే ఎజెండాను ముందుకు తెచ్చినా బిజెపి హిందుత్వ భావజాలంతోనే సమర్థంగా ఎదుర్కోగలిగింది. దాదాపు 100 సంవత్సరాల తర్వాత మతపరమైన రిజర్వేషన్లను తిరిగి ప్రవేశపెట్టడం ద్వారా జాతీయ ఏకాభిప్రాయాన్ని, భారత గణతంత్రం మౌలిక సూత్రాలను బలహీనపరిచేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాన్ని ఈ ఎన్నికల ఫలితం భగ్నం చేశాయి. ముస్లిం రిజర్వేషన్లను ప్రవేశపెట్టడానికి కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అడ్డగోలుగా చేసిన రాజ్యాంగ వ్యతిరేక ప్రయత్నాలను ఈ ఎన్నికల్లో తిరస్కరించారు. దేశ విభజనకు ముందు అమల్లో ఉన్న ఈ మతపరమైన ప్రత్యేక సదుపాయాలను రాజ్యాంగ సభ గట్టిగా వ్యతిరేకించిన విషయం ఇక్కడ గమనార్హం. అదేవిధంగా, చరిత్రలో భారత్ లోని చాలా ప్రాంతాల్లో పాలన సాగించిన ముస్లిం ఉన్నత వర్గాలకు దొడ్డిదారిలో రిజర్వేషన్లు కల్పించి దళితులకు, ఓబిసి కులాలకు రిజర్వేషన్లను తగ్గించేందుకు జరిగిన ప్రయత్నాలను కూడా ఓటర్లు భగ్నం చేశారు. 

ఈ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కూటమి ఉచితాల నమూనాను తోసిరాజని బిజెపి సంక్షేమ విధానాలకు అనుకూలంగా స్పష్టమైన తీర్పు ఇచ్చారు. 2014 నుంచి ప్రధాన మంత్రి మోదీ అమలు చేసిన కొత్త సంక్షేమ నమూనాలో ప్రజలకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించడం, పేదల సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రైవేటు వస్తువులను, సేవలను ప్రభుత్వమే అందించడం, ప్రభుత్వం అందించే ప్రయోజనాలను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందించడం ప్రధానాంశాలు.

ఆధునిక రాజకీయ దృశ్యంలో డిజిటల్ మౌలిక సదుపాయాలు, పాలన ప్రాముఖ్యతను ఈ ఎన్నికలు మరింత నొక్కిచెప్పాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమాలకు ప్రాముఖ్యం, ఇ-గవర్నెన్స్, డిజిటల్ అక్షరాస్యత, డిజిటల్ వేదికల ద్వారా ఆర్థిక సమ్మిళితత్వానికి ప్రోత్సాహం, యువత, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఓటర్లను ఆకర్షించింది. మొదటి సారిగా కోట్ల మంది ప్రజలు ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందారు. తద్వారా పేదలు, అట్టడుగున ఉన్న వారు ప్రభుత్వం నుంచి తమకు న్యాయంగా అందవలసిన వాటి కోసం స్థానిక నాయకులు, పెత్తందారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడవలసి పని లేకుండా పోయింది. 

ఇది దశాబ్దాలుగా సాగుతున్న రాజకీయ పెత్తందారీ విధానానికి ముగింపు పలికింది. పౌరుల చేతికి అధికారం ఇచ్చింది. 25 కోట్ల మంది ప్రజలను బహుముఖ పేదరికం నుంచి బయటపడేసింది. అందుకే ప్రజలు బిజెపికి మద్దతునిచ్చేందుకు నిర్ణయించుకున్నారు. అసంబంద్ధమైన, ఆచరణ సాధ్యంకాని ఉచితాల హామీలను తిరస్కరించారు. ఈ హామీలు వారికి లంచం ఇచ్చే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. బాధ్యతాయుతమైన, వృద్ధి అనుకూల ఆర్థిక విధానాలు, మౌలిక సదుపాయాల కల్పనపై ఓటర్లు విశ్వాసం ఉంచారు. మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే, దక్షిణ, తూర్పు భారతదేశంలో, ముఖ్యంగా బెంగాల్, ఒడిశాలలో బిజెపి గణనీయంగా విస్తరించడం. ఇక్కడ సొంత జాగీరుల్లా ఈ రాష్ట్రాలను పాలించిన ప్రాంతీయ పార్టీల ప్రభావం క్షీణిస్తోంది. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో బిజెపి పనితీరు, కేరళ, తమిళనాడులలో పెరుగుతున్న ఓట్ల శాతం పాటు, భాష, ప్రాంతం ఆధారంగా కాంగ్రెస్ కూటమి అవలంబించిన ‘విభజించు-పాలించు’ రాజకీయాల వైఫల్యాన్ని సూచిస్తున్నాయి. అనువంశిక పార్టీలకు గట్టి సవాలును విసరడం ద్వారా బిజెపి ఎన్నికల ప్రక్రియలో సమష్టి భాగస్వామ్యాన్ని బలోపేతం చేసింది. దేశంలో ప్రజాస్వామ్యం పరిధిని విస్తరించింది.

చివరిగా, లోక్‌సభ 2024 తీర్పు ప్రధాని మోదీ నాయకత్వానికి, బిజెపి విధానాలకు ప్రజల మద్దతుకు మాత్రమే కాదు, భారతీయ ఓటర్ల మారుతున్న ఆకాంక్షలకు ప్రతిబింబం కూడా. ఎన్డీయే కూటమికి లభించిన స్పష్టమైన విజయం, అభివృద్ధి, సామాజిక న్యాయం, జాతీయ భద్రతకు ప్రాధాన్యతనిచ్చే స్థిరత్వం, దూరదృష్టి గల నాయకత్వం కోసం ప్రజల ఆకాంక్షను వెల్లడిస్తోంది. 

అభినవ్ ప్రకాష్,
బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు