Salute Telangana Rally

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలుస్తాం

Salute Telangana Rallyనేడు బిజెపి నుంచి 8 మంది ఎమ్మెల్యేలు.. 8 మంది ఎంపీలు ఉన్నాం..  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 88 శాసనసభ్యులతో తెలంగాణ గడ్డపై బిజెపి జెండా కచ్చితంగా ఎగరేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారి హైదరాబాద్ విచ్చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి, పార్టీ పట్ల అభిమానాన్ని అంకితభావాన్ని చాటుకున్నారు.

ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను, గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ‘‘తెలంగాణకు వందనం’’ పేరుతో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ పొడవునా ప్రజలు బిజెపి నాయకులకు బ్రహ్మరథం పట్టారు. ‘భారత్ మాతాకీ జై..’ ‘జై బిజెపి..’ ‘మోదీ.. మోదీ..’ నినాదాలు పెద్దపెట్టున వినిపించాయి. బిజెపి నాయకులు ప్రజలకు అభివందనం చేస్తూ ముందుకు సాగారు. రాష్ట్ర కార్యాలయం వద్ద ఇటీవల ఎన్నికైన ఎంపీలను సత్కరించారు.

బిజెపి రాష్ట్ర కార్యాలయ సభ వద్ద ఏర్పాటు చేసిన స్వాగత సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ‘‘ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన బిజెపి అభ్యర్థులందరితో పాటు ప్రతి నాయకుడు, కార్యకర్తలంతా భగభగమండే ఎండలను సైతం లెక్కచేయకుండా ఎంతో కష్టపడి ప్రజల ఆశీస్సుల కోసం అహర్నిశలు కష్టపడి పని చేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి నుంచి పోటీ చేసిన అభ్యర్థుల తరఫున, విజయం సాధించిన 8 మంది శాసనసభ సభ్యులు, 8 మంది పార్లమెంటు సభ్యుల తరఫున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కార్యకర్తలందరికీ శిరస్సు వంచి సెల్యూట్ చేస్తున్నాను. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి పార్టీ జెండా చేతబూని, గ్రామగ్రామన అన్ని వర్గాల ప్రజలను సంఘటితం చేస్తూ ముందుకెళ్లాలని కార్యకర్తలందరినీ కోరుకుంటున్నాను. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో రానున్న రోజుల్లో తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తాం.’’ అని అన్నారు.

ఈ సభలో బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ ‘‘కార్యకర్తల పునాదుల మీద ఏర్పడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కార్యకర్తల కృషి, పట్టుదలతో, నమ్మిన సిద్ధాంతం కోసం, జాతీయ భావన కోసం దశాబ్దాలుగా అనేక పోరాటాలు చేస్తున్నాం. తెలంగాణలో బిజెపి పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యుల గెలుపును కార్యకర్తలకు అంకితం చేస్తున్నాం. హైదరాబాద్ నడిబొడ్డున ఆనాడు యువమోర్చా అధ్యక్షులుగా నందరాజ్ గౌడ్ నమ్మిన సిద్ధాంతం కోసం చివరి ఊపిరి వరకు దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. పేద కుటుంబంలో పుట్టిన నందరాజ్ గౌడ్ పార్టీకి అనేక రకాలుగా సేవలందించి, జిహాది ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. విశ్వహిందూ పరిషత్ సభ్యులు పాపయ్య గౌడ్, దేవేందర్ సైతం నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేశారు. జగిత్యాలలో జితేందర్ రెడ్డి, నల్లగొండలో మైసయ్య గౌడ్ లాంటి అనేక మంది త్రివర్ణ జెండా కోసం, దేశ సమగ్రత కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలర్పించారు. అనేక మంది కార్యకర్తల త్యాగాల స్ఫూర్తితో దశాబ్దాలుగా పని చేస్తున్నాం. కార్యకర్తలు పట్టుదలతో, శ్రమతో మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో 8 మంది బిజెపి ఎంపీలను గెలిపించారు. పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలందరికీ సెల్యూట్. మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీని చూడాలని తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి, 8 మంది బిజెపి ఎంపీలుగా గెలిపించిన ప్రజలందరికీ మరోసారి సెల్యూట్. కిషన్ రెడ్డి రాజకీయ ఓనమాలు దిద్దుకుని, పార్టీ కార్యాలయంలో ప్రస్థానాన్ని ప్రారంభించి, 40 ఏళ్లుగా సేవలందించి కేంద్రమంత్రి అయ్యారు. బండి సంజయ్ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి రాజకీయ ఓనమాలు దిద్దుకుని కార్పొరేటర్ నుంచి కేంద్రమంత్రి అయ్యారు. దేశం కోసం శ్రమించిన ఇద్దరు కార్యకర్తల కృషిని గుర్తించి ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు సెల్యూట్ చేస్తున్నాం. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడమే లక్ష్యంగా మేమంతా సమన్వయంతో పని చేస్తాం. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ప్రజల ఆశ్వీర్వాదంతో తెలంగాణ నుంచి నలుగురు ఎంపీలుగా గెలిచారు. బండి సంజయ్ కుమార్ అధ్యక్షతన దుబ్బాకలో జరిగిన ఉపఎన్నికల్లో గెలవడంతో పాటు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించాం. నేడు కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్లమెంటు ఎన్నికల్లో 8 సీట్లు సాధించడం హర్షణీయం. నమ్మిన సిద్ధాంతం కోసం, జాతీయ భావనతో అహరహం శ్రమించిన కార్యకర్తలను భారతీయ జనతా పార్టీ తప్పకుండా గుర్తిస్తుంది. రాబోయే ఐదేళ్లు మనకు విశ్వాసపరీక్ష. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు మొదట ప్రాధాన్యత ఇచ్చి పెద్దపీట వేస్తాం. కాంగ్రెస్ గత పార్లమెంటు ఎన్నికల్లో అనేక కుట్రలు, కుతంత్రాలతో సమాజాన్ని విడదీసే ప్రయత్నాలు చేసింది. అయినా, అభివృద్ధి ఎజెండాతో, పేదరిక నిర్మూలన కోసం కృషి చేసిన నరేంద్ర మోదీని ప్రజలందరూ మూడోసారి ప్రధానమంత్రిగా ఆశీర్వదించారు. 2029లో తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకెళ్తాం.’’ అని అన్నారు. బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద స్వాగత సభ అనంతరం బిజెపి ఎంపీలందరూ పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు.