అంబేద్కర్ బాటలో మోదీ పాలన
(ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని జనసందేశ్ పాఠకుల కోసం..)
ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు అనేక మంది మహనీయులు తమ కార్యకలాపాలు, సంస్కరణలు, ఉద్యమాలు, సేవల ద్వారా తమ జీవితాలను సమాజ సేవకే అంకితం చేశారు. అలాంటి మహనీయులలో డా॥ బాబాసాహెబ్ అంబేద్కర్ అగ్రగణ్యులు. సమాజంలో అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన ఆయన తనదైన మేధా సంపత్తితో మెరుగైన ప్రపంచాన్ని నిర్మించేందుకు కృషి చేసి విజయం సాధించారు. అట్టడుగున ఉన్న వారి మానవహక్కుల కోసం ఆయన జీవితాంతం పోరాడారు. వ్యక్తులందరికీ సామాజిక న్యాయం, సమాన గౌరవం దక్కడం కోసం నిరంతరం కృషి చేశారు. రాజ్యాంగ ముసాయిదాకు తుది రూపం ఇచ్చే కమిటీకి అధ్యక్షుడిగా ఉన్న అంబేద్కర్ భారత్‌ను సామాజిక న్యాయం ఉండే దేశంగా, దేశ సమైక్యతను పెంచే రీతిలో, సార్వభౌమత్వాన్ని పరిరక్షించే దిశలో విశేష కృషి చేశారు. దురదృష్టవశాత్తు ఆయనను కేవలం దళితుల బాంధవుడిగానే పరిగణించారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.
బాబాసాహెబ్ ను తక్కువ చేసిన కాంగ్రెస్
కేంద్రం, రాష్ట్రాలలో ఉన్న గత ప్రభుత్వాలు తెలియకో లేక ఉద్దేశపూర్వకంగానో దేశానికి ఆయన చేసిన సేవల గురించి ప్రజలకు తెలియజేయడంలో విఫలమయ్యారు. ఆర్థిక విషయాలలో ఆయనకు అపారమైన జ్ఞానం ఉండేదని అంగీకరించి తీరాలి. ఆయన రెండు విదేశీ యూనివర్సిటీల నుంచి పిహెచ్.డి.పట్టాలు పొందారు. 12 భాషలు తెలిసిన న్యాయకోవిదుడు, రచయిత. పరిపాలన గురించి క్షుణ్నంగా తెలిసిన వ్యక్తి, జ్ఞాన సంపన్నుడు. అనేక సమస్యలపై కాంగ్రెస్‌లో ఉన్న విభేదాల కారణంగా దేశ చరిత్రలో ఆయనకు న్యాయంగా దక్కాల్సిన సముచిత స్థానం దక్కనే లేదు. డా॥ అంబేడ్కర్‌ను మొదటి న్యాయశాఖ మంత్రిగా నియమించినప్పటికీ అప్పటి ప్రధానమంత్రి పండిట్ నెహ్రూ ఆయనను సమకాలీన రాజకీయాలలో ప్రధానమైన వ్యక్తిగా పరిగణించలేదు. స్వాతంత్య్రానికి ముందు కూడా నెహ్రూ తన డిస్కవరీ ఆఫ్ ఇండియా గ్రంథంలో అంబేద్కర్ పేరు ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. అదీగాక మహాత్మా గాంధీకీ అంబేద్కర్‌కు మధ్య ఉన్న అభిప్రాయభేదాలు అందరికీ తెలిసినవే. కానీ నెహ్రూకు అంబేద్కర్‌కు మధ్య జరిగిన చర్చలు, సంవాదాలు, భేదాభిప్రాయాల గురించి పెద్దగా తెలియదు. జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలన్న నెహ్రూ ప్రతిపాదనను అంబేద్కర్ సుముఖంగా లేరు.
జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని అంబేద్కర్ వ్యతిరేకించారు. 370వ అధికరణాన్ని చేర్చడం ద్వారా దేశ భద్రత విషయంలో తాను రాజీ పడలేనని అంబేద్కర్ నిర్మొహమాటంగా చెప్పారు. సర్దార్ పటేల్, డా॥ అంబేద్కర్ లాంటి వారు దేశ సామాజిక ఐక్యత కోసం పాటుపడ్డారు. అలాగే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక, సామాజిక ఐక్యత కోసం కృషి చేస్తున్నారు. ‘‘డా॥ అంబేద్కర్ సమత, మమతల కోసం పాటుపడ్డారు. దీని ద్వారా సామాజిక సామరస్యం ఏర్పడింది’’ అని మోదీ అంటారు. జాతీయవాద సంస్కర్త అయిన అంబేద్కర్ వారసత్వాన్ని పెంపొందించడం కోసం అంబేద్కర్ జన్మభూమి అయిన మధ్యప్రదేశ్‌లోని మవు ప్రాంతం (యుద్ధ సైనిక ప్రధాన కార్యాలయం), శిక్షా భూమి (లండన్), చైతన్య భూమి (ముంబై), దీక్షా భూమి (నాగపూర్), మహా పరివర్తన్ భూమి (దిల్లీ) అనే పంచతీర్థాలను అభివృద్ధి చేస్తున్నారు.
అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా
2019 ఆగస్టులో 370వ అధికరణాన్ని రద్దు చేయడం ద్వారా మోదీ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఇది అంబేద్కర్ దృక్పథానికి పట్టం కట్టినట్టయింది. అందుకే ప్రస్తుతం జమ్మూ-కశ్మీర్ ప్రజలు దృక్పథంతో కూడిన అభివృద్ధిని అనుభవిస్తున్నారు. దీనివల్ల తొమ్మిది రాజ్యాంగ సవరణలను, 106 చట్టాలను జమ్మూ-కశ్మీర్లో అమలు చేసే అవకాశం వచ్చింది. అంబేద్కర్ నుంచి స్ఫూర్తి పొంది మోదీ ప్రభుత్వం కార్మికుల జీవన నాణ్యతను మెరుగు పరచడానికి చర్యలు తీసుకుంటోంది. కేంద్ర కార్మిక చట్టాలను సులభతరం చేసి, హేతుబద్ధం చేసి, ఏకీకృతం చేసి నాలుగు కార్మిక స్మృతులను రూపొందించేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇవి కార్మికుల వేతనాలకు, పారిశ్రామిక సంబంధాలకు, సామాజిక భద్రత, సంక్షేమం, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులకు సంబంధించినవి.
అంత్యోదయ స్ఫూర్తితో ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం నిరుపేదల అభివృద్ధి కోసం ప్రయత్నించడంతో నూతన శకం ఆరంభమైంది. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న ఈ దేశంలో జనమే ప్రధాన శక్తిగా తయారు చేయడానికి కంకణం కట్టుకుంది. ప్రస్తుత ప్రభుత్వం స్పష్టమైన, లక్ష్య నిర్దేశం గల సమగ్ర విధానంతో సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పాటు పడుతోంది.
ప్రతి వ్యక్తికి సదుపాయాలు అందేటట్టు చూసే దిశగా గత ఏడేళ్ల నుంచి పారదర్శక, వివక్ష రహిత విధానాలు అమలవుతున్నాయి. 2014 ఆగస్టు 28న ప్రారంభమైన జన్‌ధన్ యోజన పేదలకు ఆర్థిక వనరులు అందుబాటులో ఉంచడానికి ఉద్దేశించింది. ఈ పథకం వల్ల సమూలమైన మార్పు వచ్చింది. పేదరిక నిర్మూలనా చర్యలకు పునాదిగా ఉపకరిస్తోంది. ఇది కోట్లాది మందికి ప్రయోజనం కలగజేస్తోంది. ఇప్పటి వరకు దగ్గరదగ్గర 50 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచారు. వీటిలో రూ.18వేల కోట్ల వరకు నిలవ ఉన్నాయి. మన తల్లులు, అక్కచెల్లెల్లు ప్రమాదకరమైన పొగచూరే పద్ధతిలో వంట చేయనవసరం లేకుండా ప్రధానమంత్రి ఉజ్జ్వల యోజన ప్రారంభించారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 10 కోట్ల వంట గ్యాస్ కనెక్షన్లు అందించారు. రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి పి.ఎం.కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద రైతులకు విడతకు రూ.2,000 చొప్పున సంవత్సరానికి మొత్తం రూ.6,000 ఆర్థిక సహాయం అందుతోంది. ఈ డబ్బును నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. మురికివాడల్లో నివసించే వారి కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహ వసతి కల్పించడానికి విశిష్టమైన పథకం చేపట్టారు. వీధి వ్యాపారుల కోసం ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ నిధి (పి.ఎం.స్వనిధి) ప్రవేశపెట్టారు. పట్టణ ప్రాంతాలలో, పట్టణ పరిసరాలలో, గ్రామీణ ప్రాంతాలలో మూలధన పెట్టుబడి కింద ఏడాదికి రూ.10,000 రుణం అందజేస్తున్నారు. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆరోగ్య సదుపాయం ఆయుష్మాన్ భారత్ కేంద్ర ప్రభుత్వ వ్యయంతోనే అమలవుతోంది. దీనివల్ల 50 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఈ ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రణాళిక. పంటలు పండకపోతే వారికి బీమా అందుతుంది. ప్రకృతి విపత్తులు, చీడపీడల వల్ల పంట పండకపోతే బీమా సదుపాయం ఉంటుంది. షెడ్యూల్డ్ కులాల వారిని సాధికారుల్ని చేయడం కోసం అసీం (అంబేద్కర్ సామాజిక వినూత్న, ఇంక్యుబేషన్ మిషన్) ఏర్పాటైంది. ఇది ఎస్.సి. విద్యార్థులు వినూత్న పద్ధతులు అనుసరించడానికి, పై చదువులు చదవడానికి ఉపకరిస్తుంది. ఈ పథకం కింద 1000 మంది ఎస్.సి. యువకులకు రూ.30 లక్షలు మూడేళ్ల కాలంలో అందించారు. దీనిద్వారా వారి స్టార్ట్అప్ ఆలోచనలను వాణిజ్యపరమైన ప్రణాళికలుగా మలుచుకునే వీలుంది. అభివృద్ధికి సంబంధించిన ఈ పథకాలన్నీ పరిణామాత్మకమైనవి. అవి సమగ్రమైనవి, సమీకృతమైనవి, ‘‘నవ భారత్’’ నిర్మాణానికి దోహదం చేసేవి.
లాల్ సింగ్ ఆర్య
బిజెపి ఎస్.సి. మోర్చా జాతీయ అధ్యక్షుడు