అపూర్వ విజయమే బిజెపి శ్రేణుల లక్ష్యం: నడ్డా
బిజెపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 6న పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా దిల్లీలోని పార్టీ జాతీయ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జన్ సంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ, జన్ సంఘ్ వ్యవస్థాపక సభ్యుడు, బిజెపి వ్యవస్థాపక అధ్యక్షుడు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ విగ్రహాలకు నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి (సంఘటన) బిఎల్ సంతోష్, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు వసుంధర రాజే సింధియా, జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ జై పాండా, జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ గౌతమ్, ప్రధాన కార్యాలయ కార్యదర్శి మహేంద్ర పాండే, పార్టీ జాతీయ మీడియా కో-హెడ్ డాక్టర్ సంజయ్ మయూఖ్ తో పాటు పలువురు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లక్షల మంది పార్టీ కార్యకర్తలకు నడ్డా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిన బూనాలని పిలుపునిచ్చారు. మన సీనియర్ నాయకులు, వేల మంది కార్యకర్తల పట్టుదల, త్యాగం, అంకితభావం వల్లనే పార్టీ స్ఫూర్తిదాయకమైన ప్రస్థానం సాధ్యమైందని నడ్డా ఉద్ఘాటించారు. అధికరణం 370 రద్దు, శ్రీరామ జన్మభూమిలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి ముఖ్యమైన విజయాలను ఉదహరిస్తూ దేశాభివృద్ధికి, 140 కోట్ల మంది భారతీయుల సంక్షేమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బిజెపి నిబద్ధమై ఉందని జగత్ ప్రకాష్ నడ్డా పేర్కొన్నారు.
ఏకాత్మ మానవతావాదం నుంచి అంత్యోదయ, అక్కడి నుంచి ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్’ వరకు పార్టీ సైద్ధాంతిక పరిణామాన్ని ఆయన గుర్తుచేశారు. బిజెపికి లోక్‌సభలో 303, రాజ్యసభలో 94 సీట్లు ఉన్నాయి. ఇవిగాక దేశవ్యాప్తంగా 1,500 మంది ఎమ్మెల్యేలు, దాదాపు 150 మంది మేయర్లు, జిల్లా, ఇతర స్థానిక సంస్థల్లో వేల మంది మంది అధ్యక్షులు, సభ్యులు పార్టీకి ఉన్నారు. ఈ విస్తృత ప్రజాప్రాతినిధ్యంతో బిజెపి దేశంలోనే అతిపెద్ద పార్టీగా నిలుస్తోంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బిజెపికి తమను తాము అంకితం చేసుకున్న వేల మంది కార్యకర్తల త్యాగాలను నడ్డా ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. వారి నిర్విరామ కృషి, నిబద్ధత బిజెపిని ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా నిలిపాయన్నారు. ‘అంత్యోదయ’ పట్ల పార్టీ నిబద్ధత, దాని సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం అనే సిద్ధాంతం ప్రజల జీవితాలను గణనీయంగా ప్రభావితం చేశాయని ఆయన పేర్కొన్నారు. ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారత్) నిర్మాణానికి సంకల్పించడం ద్వారా రానున్న ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించేందుకు బిజెపి కార్యకర్తలు కృతనిశ్చయంతో ఉన్నారని నడ్డా ప్రకటించారు.