బిజెపి రూపశిల్పి, రాజనీతిజ్ఞుడు అటల్జీ
భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి స్వతంత్ర భారతదేశంలో అత్యంత ప్రజాదరణ, గౌరవం ఉన్న రాజకీయ నాయకులలో ఒకరు. ఆయన నాయకత్వం, వ్యక్తిత్వం, వాక్చాతుర్యం, కార్యాచరణ భారతీయ జనతా పార్టీని దేశంలోనే బలమైన రాజకీయ శక్తిగా మార్చడంలో కీలకపాత్ర పోషించాయి. ఒక కొత్త పార్టీని దార్శనిక నాయకత్వం, మార్గదర్శకత్వం ద్వారా ఒక ప్రబలమైన రాజకీయ శక్తిగా తయారుచేశారు. ఆయన వేసిన ఈ పటిష్టమైన పునాదులపై బిజెపి నేడు ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. 21వ శతాబ్దపు ప్రపంచ నాయకత్వంలో కీలక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్న భారతదేశ సాంస్కృతిక, ఆర్థిక పునరుజ్జీవనానికి బిజెపి ద్వారా అటల్జీ పునాది వేశారు.
నాటి బీజమే నీదు మహావృక్షం
అటల్జీ రాజకీయ ప్రయాణం దేశం పట్ల ఆయనకున్న అచంచలమైన అంకితభావానికి, ప్రతికూల పరిస్థితుల్లోనూ అయన స్థితప్రజ్ఞతకు, సృజనాత్మకత, నాయకత్వ నైపుణ్యాలకు నిదర్శనం. విద్యార్థి దశలోనే ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో చేరడం నుంచి భారతీయ జనసంఘ్ (బీజేఎస్) వ్యవస్థాపక సభ్యుడిగా, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ (బిజెపి)ని అధికారంలోకి తీసుకెళ్లడం వరకు అటల్జీ మార్గం అంకితభావం, పట్టుదల, దార్శనికతతో నిండి ఉంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)తో ఆయనకున్న తొలి అనుబంధం ఆయన సైద్ధాంతిక పునాదిని గాఢంగా ప్రభావితం చేసింది. ఈ అనుబంధం జాతీయవాదం, పాలన పట్ల ఆయన దృక్పథాన్ని మలిచింది. 1951లో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీతో కలిసి భారతీయ జనసంఘ్ ను స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు. జనసంఘ్ ప్రారంభ రోజుల్లో, వాజ్‌పేయి ‘కాశ్మీర్ సత్యాగ్రహం’లో చురుకుగా పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో భారత పౌరులపై విధించిన ఆంక్షలను తొలగించాలని కోరుతూ ఈ ఆందోళన జరిగింది. బలమైన, సమైక్య భారతదేశం కోసం ముఖర్జీ దార్శనికతకు అనుగుణంగా ఆయన లియాఖత్-నెహ్రూ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయాలపై ఆయనకున్న స్పష్టత, నమ్మకం ఆయన్ను పార్టీలో గౌరవప్రదమైన నేతగా, జాతీయ స్థాయిలో పలుకుబడి గల స్వరంగా మార్చాయి. భారత రాజకీయాలకు కొత్త దిశానిర్దేశం చేయడానికి పునాది వేసిన ఆయన అద్వితీయ నాయకత్వ సామర్థ్యానికి ఇది నిదర్శనం.
1957లో పార్లమెంటుకు ఎన్నికైన అటల్ బిహారీ వాజ్‌పేయి టిబెట్ సంక్షోభం, 1962 యుద్ధంలో భారత్ ఓటమిపై చేసిన ప్రసంగాలు దేశంపై చెరగని ముద్ర వేశాయి. ఆయన వాక్చాతుర్యం, లోతైన విశ్లేషణ ఆయనను భారత రాజకీయాల్లో ఒక ప్రముఖ గొంతుకగా నిలబెట్టాయి. తన సమ్మోహకశక్తికి, ప్రజలతో మమేకమయ్యే అసమాన సామర్థ్యాలకు గాను ఆయన జనసంఘ్ లో ప్రముఖ నాయకుడిగా మారాడు. పరిమిత వనరులు ఉన్నప్పటికీ వాజ్‌పేయి నిరంతరం దేశమంతటా పర్యటించేవారు. ఎక్కువగా రైలు, బస్సు లేదా రోడ్డు మార్గాలలో ప్రయాణించారు. తరచుగా పార్టీ కార్యకర్తల ఇళ్లలో బస చేశారు. జనసంఘ్ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంలో ఈ క్షేత్రస్థాయి ప్రయత్నాలు చాలా ముఖ్యమైనవి.
1962లో చైనా దురాక్రమణ భారత రాజకీయాలను కీలకమైన మలుపు తిప్పింది. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో అపనమ్మకం పెరిగి, ప్రతిపక్ష నాయకుల మధ్య పొత్తులు ప్రారంభమయ్యాయి. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ నాయకత్వంలో జనసంఘ్ సంస్థాగతంగా బలపడి 1967 ఎన్నికలలో గణనీయమైన విజయాలు సాధించింది. దేశ రాజధాని ప్రాంతమైన దిల్లీలో మెజారిటీ సాధించిన జనసంఘ్ ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో బలమైన ఉనికిని చాటుకుంది. ఈ యువ ఎంపీ (వాజ్‌పేయి) ఏదో ఒక రోజు ప్రధాని పీఠాన్ని అధిరోహిస్తారని నెహ్రూ చెప్పిన కాలమిది.
పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ అకాల మరణం తర్వాత అటల్ బిహారీ వాజ్‌పేయి జనసంఘ్ నాయకత్వాన్ని చేపట్టారు. పార్టీ మౌలిక సిద్ధాంతాలకు, విస్తృత రాజకీయ పొత్తుల అవసరాల మధ్య సమతూకం సాధించడం ద్వారా ఆయన జాతీయ నాయకుడిగా స్థిరపడ్డాడు. 1971 యుద్ధ సమయంలో వాజ్‌పేయి రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వానికి పూర్తి మద్దతు ప్రకటించి పరిణతిని, జాతీయ దృక్పథాన్ని ప్రదర్శించారు. 1974లో జయప్రకాశ్ నారాయణ్ ప్రారంభించిన ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ప్రజాస్వామ్యం, న్యాయం కోసం పోరాటాన్ని బలపరిచారు. 1975-77 వాజ్‌పేయికి, జనసంఘ్ కు ఒక నిర్ణయాత్మక ఘట్టం. ఎమర్జెన్సీని, నిరంకుశత్వాన్ని వ్యతిరేకించడంలో, ప్రజాస్వామ్య విలువల పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారు. ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ రూపంలో చేసిన ప్రయోగం చివరకు విఫలమై జనతా కూటమి నుంచి జనసంఘ్ నిష్క్రమించడానికి దారితీసింది.
బిజెపి జాతీయవాద గళం
1980లో జనతా పార్టీ సంకీర్ణం విచ్ఛిన్నమైన తరువాత అటల్జీ భారతీయ జనసంఘ్ ను భారతీయ జనతా పార్టీ (బిజెపి) గా పునర్వ్యవస్థీకరించడంలో కీలక పాత్ర పోషించారు. బిజెపి మొదటి అధ్యక్షుడిగా వాజ్‌పేయి పార్టీకి సైద్ధాంతిక పునాది వేశారు. దాని జాతీయవాద మూలాలను విస్తృత జాతీయ ప్రయోజనాలతో మేళవించే ప్రయత్నం చేశారు. ఆయన నాయకత్వంలో బిజెపి సమానత్వం, భారత జాతీయవాదాన్ని మార్గదర్శక సిద్ధాంతాలుగా స్వీకరించి, పార్టీ మధ్యేవాద దృక్పథాన్ని అనుసరించింది. ఉదారవాదిగా వాజ్‌పేయికి గల పేరు, సమ్మిళితత్వానికి ఇచ్చిన ప్రాధాన్యం సమాజంలోని భిన్న వర్గాలను సంపాదించడంలో కీలక పాత్ర పోషించాయి. బిజెపి ప్రారంభ కాలంలో కష్టాలు ఎదుర్కొన్న సమయంలో ఆయన నాయకత్వం పార్టీని సజీవంగా ఉంచింది. అయన వ్యక్తిత్వం క్రమంగా పార్టీకి ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీగా ఆమోదాన్ని తీసుకువచ్చింది. 1984లో 7.74 శాతంగా ఉన్న బిజెపి ఓట్లు 1991లో 20.1 శాతానికి పెరిగాయి. దీనికి అటల్జీ నాయకత్వమే కారణం. భారత ఓటర్లకు ఆమోదయోగ్యమైన రీతిలో జాతీయవాదాన్ని ప్రదర్శించడం అటల్జీ సాధించిన గొప్ప విజయం. అతివాద నాయకులకు భిన్నంగా ఆయన ఉదారవాద, ఆచరణాత్మకత దృక్పథంతో పార్టీని ముందుకు తీసుకువెళ్ళారు. ముఖ్యంగా క్లిష్ట సమయాల్లో ఇది ఉపయోగపడింది. 1992 తరువాత, ఆయన నాయకత్వం బిజెపి రాజకీయ ఏకాకితత్వాన్ని అధిగమించడానికి సహాయపడింది. తరువాత పార్టీ ప్రాంతీయ పార్టీలతో వ్యూహాత్మక పొత్తులను ఏర్పరచుకోవడంలో విజయం సాధించింది.
సంకీర్ణ రాజకీయాల నాయకుడు
2009 వరకు 65 ఏళ్ల క్రియాశీల ప్రజాజీవితంలో అటల్జీ దాదాపు 56 ఏళ్లు ప్రతిపక్షంలో, తొమ్మిదేళ్లు మాత్రమే అధికారంలో గడిపారు. ఆయన రాజకీయ జీవిత ప్రయాణం భవిష్యత్తులో స్వచ్ఛత, సిద్ధాంతాల రాజకీయాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది. 1990వ దశకంలో ఆయన నాయకత్వం బిజెపికి ఒక పెద్ద మలుపు. సంకీర్ణ రాజకీయాల సంక్లిష్టతలను ఎదుర్కోవడంలో అటల్జీ సామర్థ్యం 1996లో భారత ప్రధాని అయినప్పుడు స్పష్టమైంది, అయితే కేవలం 13 రోజులే ఆయన అధికారంలో ఉన్నారు. కానీ ఇన్ని రాజకీయ సంక్లిష్టతలు ఉన్నప్పటికీ పార్లమెంటులో అటల్జీ చేసిన ప్రసంగం దేశంలోని విస్తృత ప్రజానీకాన్ని భావోద్వేగాలకు గురిచేసి వారి మనస్సులో చెరగని ముద్రవేసింది. ఈ రాజకీయ ద్రోహానికి ప్రజలు 1998లో తమ ఓట్లతో సమాధానం చెప్పడంతో అటల్జీ మళ్లీ అధికారంలోకి వచ్చారు. 1998 నుంచి 2004 వరకు 20కి పైగా పార్టీల సంకీర్ణాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో వాజ్‌పేయి ప్రత్యేక రాజకీయ సామర్థ్యాన్ని ప్రదర్శించారు. భారత రాజ్యాంగంలోని ప్రజాస్వామ్య స్ఫూర్తిని, సమగ్రతను అంగీకరిస్తూ అందరినీ కలుపుకుపోవడానికి ఇదొక విశిష్ట ఉదాహరణ. సంకీర్ణ ప్రభుత్వాలు సహజంగా బలహీనంగా ఉంటాయనే అభిప్రాయాన్ని ఆయన నేతృత్వంలోని స్థిరమైన ప్రభుత్వం తొలగించింది. ఆయన నాయకత్వంలో 1998 సార్వత్రిక ఎన్నికలలో బిజెపి సీట్ల వాటా గణనీయంగా 182కు పెరిగింది, ఇది ఆయన విస్తృత ప్రజాదరణకు, దార్శనికతకు నిదర్శనం.
సంస్థాగత నిర్మాణ నైపుణ్యం
బిజెపిలో ఐక్యతను పెంపొందించడంలో అటల్జీ నాయకత్వం కీలకం. పార్టీలోని భిన్న దృక్పథాల మధ్య తరచూ ఆయన సమన్వయకర్తగా వ్యవహరించేవారు. ఆయన మితవాద వైఖరి బిజెపి జాతీయవాద పార్టీగా, కాంగ్రెస్ కు మెరుగైన, మరింత విశ్వసనీయమైన ప్రత్యామ్నాయంగా ఎదగడానికి తోడ్పడింది. ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన చరిత్రాత్మక ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అవినీతి రహిత, స్వచ్ఛమైన, పారదర్శక పాలన బిజెపికి మచ్చలేని స్వచ్ఛమైన పార్టీ అనే గుర్తింపును ఇచ్చింది. స్వర్ణ చతుర్భుజి హైవే ప్రాజెక్టు, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన భారతదేశ మౌలిక సదుపాయాలలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. అనుసంధానతను పెంపొందించడం, ఆర్థిక వృద్ధిని పెంచడం లక్ష్యంగా చేపట్టిన వివిధ ప్రాజెక్టులు అభివృద్ధి దృక్పథం కలిగిన పార్టీగా బిజెపి ప్రతిష్టను పెంచాయి. లాహోర్ బస్సు సర్వీసు, పాకిస్తాన్ తో ఆగ్రా శిఖరాగ్ర సమావేశం, భారత్-ఇజ్రాయెల్ సంబంధాలతో సహా సహా అటల్జీ ముఖ్యమైన విదేశాంగ విధాన కార్యక్రమాలు శాంతి, అభివృద్ధి, చర్చల పట్ల ఆయన అంకితభావానికి, దౌత్యనీతికి నిదర్శనంగా నిలిచాయి. కార్గిల్ యుద్ధం వంటి సవాళ్ళు ఉన్నప్పటికీ, అటల్జీ రాజకీయ చతురత అంతర్జాతీయంగా భారత్ స్థాయిని మెరుగుపరిచింది. 1998లో అణు పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయం భారతదేశ వ్యూహాత్మక స్వాతంత్ర్యాన్ని చాటిచెప్పింది. ఇది ఆయన్ని నిర్ణయాత్మక నాయకుడిగా నిలబెట్టింది. ఉజ్వలమైన వక్తృత్వానికి పేరుగాంచిన వాజ్‌పేయి ప్రసంగాలు తరచూ ప్రజల మనస్సులపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. సంక్లిష్టమైన సమస్యలను సరళమైన, కవితాత్మక శైలిలో వివరించగల సామర్థ్యం ఆయనను తన కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకులలో ఒకరిగా చేసింది. సమాజంలోని వివిధ వర్గాల నుంచి బిజెపికి మద్దతు కూడగట్టడంలో ఆయన ఆకర్షణ కీలక పాత్ర పోషించింది.
వారసత్వం, దీర్ఘకాలిక ప్రభావం
బిజెపికి అటల్జీ చేసిన సేవలు వినూత్నమైనవి, విప్లవాత్మకమైనవి. ఆయన పదవీకాలం బిజెపిని ఒక అట్టడుగు రాజకీయ పార్టీ నుంచి భారతదేశ రాజకీయ గమనాన్ని రూపొందించగల బలీయమైన శక్తిగా మార్చింది. ఆయన నాయకత్వంలో బిజెపి రాజకీయ ఆమోదాన్ని పొందడమే కాకుండా నరేంద్ర మోదీ వంటి ప్రపంచస్థాయి నాయకుల నాయకత్వానికి పునాది వేసింది. సైద్ధాంతిక నిబద్ధత, ఆచరణాత్మక పాలన కలగలిసి ఉండాలనే వాజ్‌పేయి దార్శనికత బిజెపికి మార్గదర్శక సూత్రంగా ఉండి, దాని వ్యూహానికి, విధానానికి ప్రేరణగా నిలుస్తుంది. బిజెపికి అటల్జీ చేసిన సేవలు వెలకట్టలేనివి. భారతీయ జనసంఘ్ ను ఆధునిక రాజకీయ పార్టీగా మార్చడం నుంచి భారత్ ను దాని పరివర్తన సంవత్సరాలలో నడిపించడం వరకు, ఆయన దార్శనికత, నాయకత్వం ఇప్పటికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. ఆయన వారసత్వం కేవలం బిజెపిని అధికార శిఖరానికి తీసుకెళ్లిన నాయకుడిది మాత్రమే కాదు, ప్రగతిశీల, సమ్మిళిత, అంతర్జాతీయంగా ప్రతిష్ట సంపాదించిన భారతదేశాన్ని ఊహించిన రాజనీతిజ్ఞుడి వారసత్వం. అటల్జీ వారసత్వం బిజెపి పాలనా శైలి, భావజాలంలో ప్రతిబింబిస్తుంది, ఇది ఆయనను భారత ప్రజాస్వామ్యానికి, రాజకీయ చతురతకు శాశ్వత చిహ్నంగా చేస్తుంది.
అరుణ్ సింగ్,
బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి