LKG Students

విద్యార్థుల సమగ్రాభివృద్ధికి భరోసా

ప్రతి సంవత్సరం కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమై పాఠశాల తలుపులు తెరుచుకున్నప్పుడు, భారతదేశం తన సామూహిక సంకల్పానికి సంబంధించిన అత్యంత గంభీరమైన దృశ్యాన్ని వీక్షిస్తుంది. పర్వతాల నుంచి తీరప్రాంతాల వరకు, మహానగరాల నుంచి మారుమూల పల్లెల వరకు లక్షల మంది పిల్లలు — కొన్నిసార్లు కఠోరమైన వ్యక్తిగత పరిస్థితులను అధిగమించి — సరికొత్త ఉత్సాహంతో, కొత్త ఆకాంక్షలతో, అపారమైన అవకాశాలతో తమ తరగతి గదుల్లోకి అడుగుపెడతారు. ఇది నిశ్శబ్దంగా సాగే ఒక శక్తిమంతమైన జాతీయ సన్నివేశం. ఈ ఏడాది కూడా సుమారు 2 కోట్ల మంది చిన్నారులు ఒకటవ తరగతిలో చేరారు. ఇది కేవలం ఒక అంకె మాత్రమే కాదు, దేశం ఆశలకు, సమష్టి కర్తవ్యాలను చిహ్నం. జాతీయ విద్యా విధానం (NEP) 2020 కేవలం బట్టీ పట్టే చదువులకు స్వస్తి పలికి అన్వేషణ, అవగాహన, సమగ్ర వికాసానికి పెద్దపీట వేసింది. ప్రతి విద్యా సంవత్సరం ఆ దార్శనికతను సాకారం చేసే దిశగా వేసే ఒక అర్థవంతమైన అడుగు.

బాలవాటిక, పునాది విద్య

‘బాలవాటిక’ అమలుతో ప్రాథమిక-పూర్వ (ప్రీ-స్కూల్) విద్య ఇప్పుడు అధికారిక పాఠశాల వ్యవస్థలో అంతర్భాగమైంది. దీనివల్ల పిల్లలు ఒకటవ తరగతిలోకి ప్రవేశించే సమయానికి మెరుగైన సంసిద్ధతను, బలమైన పునాది నైపుణ్యాలను కలిగి ఉంటారు. ఒక బిడ్డ పాఠశాలలో అడుగుపెట్టడం అనేది జ్ఞానంతో సమాజంతో జీవితకాల బంధానికి నాంది పలుకుతుంది. ఈ ప్రయాణం ఆనందమయ అభ్యాసంగా, క్షేమంగా, ఆత్మీయతతో కూడినదిగా ఉండేలా పాఠశాలలు చూడాలి. పాఠశాల తొలిరోజు ఎప్పుడూ సాధారణంగా ఉండదు. అందులో కొత్త ఆరంభాల పట్ల ఉండే సంకోచం, సంతోషం కలగలిసి ఉంటాయి. చిన్నారుల్లో పెద్ద భావోద్వేగాలు ఉంటాయి, ఆసక్తితో కూడిన వారి కళ్ళు సరికొత్త ప్రపంచాన్ని చూస్తాయి. పిల్లలు సురక్షితంగా ఉన్నామని, తమకు గుర్తింపు ఉందని భావించినప్పుడు, వారు భయాలను, సంకోచాలను వదిలిపెడతాడు. వారిలో జిజ్ఞాస వికసిస్తుంది, ఆత్మవిశ్వాసం నిలకడగా పెరుగుతుంది. తొలి విద్యా సంవత్సరాలు ఆటపాటలు, అన్వేషణ, ఆవిష్కరణల చుట్టూ తిరగాలి.

ఉపాధ్యాయుల పాత్ర

అభ్యాస ప్రక్రియలో సంబంధాలు చాలా కీలకం. ఒక శ్రద్ధగల ఉపాధ్యాయుడు బిడ్డ భవిష్యత్తునే మార్చగలడు. ఆదరణతో కూడిన తరగతి గది మౌనాన్ని భాగస్వామ్యంగా, ఆ భాగస్వామ్యాన్ని ఆత్మవిశ్వాసంగా మారుస్తుంది. ఒక బిడ్డను నిజంగా గుర్తించి, విన్నప్పుడు, వారి కుతూహలం ధైర్యంగా మారుతుంది. ఈ తొలి సంవత్సరాల అభ్యాసంలో పునాది స్థాయి అక్షరాస్యత, సంఖ్యా జ్ఞానంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. నిపుణ్ భారత్ కార్యక్రమం ద్వారా భారత్ ఒక కచ్చితమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. రెండవ తరగతి ముగిసే సమయానికి ప్రతి బిడ్డ అవగాహనతో చదవగలగాలి, ప్రాథమిక లెక్కలు చేయగలగాలి. ఇక్కడ దృష్టి సమాధానాలను గుర్తుంచుకోవడంపై కాకుండా, భావనలను అర్థం చేసుకోవడంపై ఉంటుంది.

సమగ్ర వికాసం, ఆరోగ్యం

ఈ దార్శనికత కేవలం విద్యా విషయాలకే పరిమితం కాదు. కళలు, క్రీడలు, విలువలు అభ్యాస ప్రక్రియలో ముఖ్యమైన భాగాలు. విద్య అనేది కేవలం మెదడును మాత్రమే కాదు, శరీరాన్ని, హృదయాన్ని కూడా తీర్చిదిద్దాలి. శారీరక శ్రమ, పోషణ పాఠశాల జీవితంలో అంతర్భాగం. ఆరోగ్యంగా ఉన్న బిడ్డ మెరుగ్గా నేర్చుకోగలడు. ప్రపంచవ్యాప్తంగా పిల్లల జీవనశైలి గణనీయంగా మారింది. మారుతున్న ఆహారపు అలవాట్లు, తగ్గుతున్న శారీరక శ్రమ ఆందోళన కలిగిస్తున్నాయి. భారత్ దీనిపై క్రియాశీలకంగా స్పందిస్తోంది. పాఠశాలల్లో తప్పనిసరి వ్యాయమ విద్య, స్థూలకాయాన్ని నివారించేందుకు ‘ఆయిల్ బోర్డులు’, ‘షుగర్ బోర్డులు’ వంటి చర్యలు, పోషకాహార నాణ్యతపై దృష్టి సారించిన ‘పీఎం-పోషణ్’ పథకం పాఠశాలలను ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు నడిపిస్తున్నాయి. సాంకేతికత విద్యాభ్యాసానికి గొప్ప సాధనమే అయినప్పటికీ, సోషల్ మీడియా ప్రభావం వల్ల స్క్రీన్ టైమ్ (ఫోన్, టీవీ, కంప్యూటర్ చూసే సమయం) పెరగడం, ఏకాగ్రత తగ్గడం, మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇది ప్రపంచవ్యాప్త సమస్య. సాంకేతికతను విషయాలు నేర్చుకోవడానికి ఒక సాధనంగా ఉపయోగించాలే తప్ప, అది ఏకాగ్రతను దెబ్బతీసే అంశంగా మారకుండా పాఠశాలలు, కుటుంబాలు చూడాలి. అదేవిధంగా పిల్లల మానసిక, భావోద్వేగ ఆరోగ్యం చాలా ముఖ్యం. మునుపటి తరాల కంటే నేటి తరం పిల్లలు సంక్లిష్టమైన ప్రపంచంలో జీవిస్తున్నారు. ఒత్తిడి లేని వాతావరణాన్ని సృష్టించడం పాఠశాలలు, తల్లిదండ్రులు, సమాజాల ఉమ్మడి బాధ్యత.

వారధులుగా ఉపాధ్యాయులు 

సంస్కరణలు కేవలం విధాన పత్రాల ద్వారా పిల్లలకు చేరవు; అవి ఉపాధ్యాయుల ద్వారానే ఆచరణలోకి వస్తాయి. విద్యావిధానంలో పరివర్తనకు వారే నిజమైన రూపశిల్పులు. బహుభాషా వాతావరణంలో బోధిస్తూనే, బిడ్డ మాతృభాషను గౌరవించడం, దానిని అభ్యాస సాధనంగా ఉపయోగించడం చాలా ముఖ్యం. దీనివల్ల బిడ్డ తన మూలాలను కోల్పోకుండా, ఆత్మవిశ్వాసంతో విద్యా ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ప్రతి విద్యార్థి మానసిక స్థితిని గమనిస్తూ, వారి సామర్థ్యాలకు అనుగుణంగా బోధించాలని నేను ఉపాధ్యాయులను కోరుతున్నాను.

తల్లిదండ్రుల పాత్ర 

విద్య అనేది పాఠశాల గేటు వద్ద మొదలై అక్కడే ముగిసేది కాదు. ఇల్లే మొదటి పాఠశాల, తల్లిదండ్రులే తొలి గురువులు. పిల్లల్లో పఠనాసక్తిని ప్రోత్సహించడం, వారి సందేహాలను ఓపిగ్గా వినడం జ్ఞాన సముపార్జనకు పునాది వేస్తాయి. పిల్లలకు సరైన పోషకాహారం, తగినంత నిద్ర, శారీరక శ్రమ ఉండేలా చూడాలని నేను తల్లిదండ్రులను కోరుతున్నాను. పిల్లల విజయాన్ని కేవలం మార్కులతో కాకుండా, వారి ఆత్మవిశ్వాసం, దయాగుణంతో కొలవండి. అభ్యాసం అనేది ఒక ఆనందదాయకమైన ప్రక్రియ అనే నమ్మకాన్ని కలిగించడమే తల్లిదండ్రులు బిడ్డకు ఇచ్చే గొప్ప బహుమతి. విద్య అనేది ప్రభుత్వం, పాఠశాలలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజాల ఉమ్మడి బాధ్యత. ప్రతి బిడ్డకు గుర్తింపు లభించాలి, వారి గొంతు వినిపించాలి. మన విద్యా వ్యవస్థ నిజమైన విజయం కొద్దిమంది ప్రతిభావంతులను తయారు చేయడంలో లేదు, నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి బిడ్డ ఆత్మవిశ్వాసంతో, సంతోషంగా నేర్చుకోవడంలో ఉంది. 2047 నాటికి ‘వికసిత భారత్’ను నిర్మించే సారథులు నేడు మన తరగతి గదుల్లోనే ఉన్నారు. వారు ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి మనం వారికి బంగారు రెక్కలను ప్రసాదిద్దాం.

ధర్మేంద్ర ప్రధాన్,
కేంద్ర విద్యాశాఖ మంత్రి