భారత్‌ను వెంటాడుతూనే ఉన్న జిహాదీ మనస్తత్వం
మార్చి 29న దిల్లీ పోలీసులు అహ్మద్ లోన్‌ను అరెస్ట్ చేయడం కేవలం మరో సాధారణ ఉగ్రవాద వ్యతిరేక చర్య మాత్రమే కాదు. మీడియా వార్తల ప్రకారం, దేశ రాజధానిలోని ప్రజల మతవిశ్వాసాలకు ప్రతీక అయిన ‘కాల్కాజీ ఆలయం’, వాణిజ్య కేంద్రమైన కన్నాట్ ప్లేస్ అతని దాడుల లక్ష్యాలలో ఉన్నాయి. పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న వ్యక్తుల ఆదేశాల మేరకు లష్కరే తోయిబా కోసం అహ్మద్ లోన్ భారతీయ ముస్లిం యువకులను కూడగడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనికి కొద్దిరోజుల ముందే, పలు రాష్ట్రాల్లో సమన్వయంతో జరిపిన దాడుల్లో ఐసిస్, అల్-ఖైదాతో సంబంధమున్న 12 మంది అనుమానితులను భద్రతా సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో బైక్-టాక్సీ డ్రైవర్, రెస్టారెంట్ ఉద్యోగి, లేజర్ మార్కింగ్ టెక్నీషియన్ వంటి సాధారణ వృత్తులలో ఉన్నవారు ఉండటం గమనార్హం. ఇలాంటి నెట్‌వర్క్‌లలో వారి ఉనికి ఒక చేదు నిజాన్ని నొక్కి చెబుతోంది- అది నేడు మతోన్మాదం అనేది ఒక నిర్దిష్ట రూపంలో ఉండదు; అది సాధారణ జీవితం మాటున అత్యంత రహస్యంగా కొనసాగుతోంది.
ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగిన ఘటన కాదు. గతేడాది నవంబర్‌లో దిల్లీలో కదులుతున్న వాహనంలో జరిగిన పేలుడు భారీ ప్రాణనష్టాన్ని కలిగించింది. దీని వెనుక డాక్టర్ ఉమర్ ఉన్ నబీ ఉన్నట్లు తేలింది. ఫరీదాబాద్‌లో జరిపిన తనిఖీల్లో ఏకంగా 3,000 కిలోల పేలుడు పదార్థాలు, ఆయుధాలు, బాంబు తయారీ సామాగ్రి లభ్యమయ్యాయి. అంతేకాకుండా ఫరీదాబాద్‌లోని అల్-ఫలా యూనివర్సిటీకి చెందిన మరికొందరు వైద్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉగ్రవాదులు పేదలు లేదా నిరక్షరాస్యులు కారు; వారు భారతీయ సమాజంలోని ఉన్నత విద్యావంతులు, సంపన్న వర్గానికి చెందినవారు. పేదరికం, అవకాశాలు లేకపోవడమే ముస్లింలను తీవ్రవాదం వైపు నడిపిస్తాయనే సాధారణ వాదనను ఈ ఘటనలు విరుద్ధం. అదే సమయంలో గుజరాత్ పోలీసులు డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్, అతని సహచరులను అదుపులోకి తీసుకున్నారు. వీరు ఆహారం, నీటిని కలుషితం చేసేందుకు ‘రైసిన్’ అనే ప్రాణాంతక విషాన్ని తయారు చేయడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటనలు ఒక నిర్దిష్ట పద్ధతిని, అన్నింటికీ మించి ఒక ప్రమాదకర మనస్తత్వాన్ని బయటపెడుతున్నాయి. కాబట్టి, పేదలు, ధనికులు, నిరక్షరాస్యులు లేదా విద్యావంతులు అనే తేడా లేకుండా ఎవరూ కూడా జిహాద్ విషపూరిత ప్రభావం నుంచి తప్పించుకోలేకపోతున్నారు, దీనికి మతపరమైన మూలాలు బలంగా ఉన్నాయి.
సాధారణంగా బహిరంగ చర్చల్లో ఈ పరిణామాలను ప్రస్తుత రాజకీయ కోణంలో విశ్లేషించే ధోరణి కనిపిస్తుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ‘ముస్లిం వ్యతిరేక విధానాల’కు ప్రతిస్పందనగానే ఈ ఉగ్రవాద చర్యలు జరుగుతున్నాయని కొందరు వాదిస్తారు. అయితే ఈ అతి సరళీకృతమైన విశ్లేషణ శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంక్లిష్ట సమస్యను విస్మరిస్తోంది. ఇటువంటి స్వార్థపూరిత ఆలోచనలు ఈ దీర్ఘకాలిక సమస్యకు అర్థవంతమైన పరిష్కారాలను కనుగొనకుండా పౌర సమాజాన్ని అడ్డుకుంటున్నాయి. వాస్తవానికి ఉపఖండంలోని ముస్లింలలో హిందువుల పట్ల ఉన్న ద్వేషానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇది భారతీయ జనసంఘ్ లేదా బిజెపి ఆవిర్భావానికి ఎంతో ముందే ఉంది. స్వాతంత్ర్యానికి పూర్వం గాంధీ, నెహ్రూ, పటేల్ నాయకత్వంలోని కాంగ్రెస్ పట్ల కూడా ఒక వర్గం ముస్లింలకు తీవ్ర అసంతృప్తి ఉండేది. ఆ ముస్లిం వ్యతిరేకతను ఆసరాగా చేసుకునే బ్రిటీష్ వారు దేశాన్ని విభజించి పాకిస్థాన్‌ను సృష్టించారు. స్వాతంత్య్రం వచ్చిన వెంటనే మిగిలిన భారత్‌పై జిహాదీల యుద్ధం మొదలైంది. 1947 సెప్టెంబర్‌లో దిల్లీలో జరిగిన సంఘటనలను గుర్తుచేసుకుంటే ఈ విషవలయాన్ని అర్థం చేసుకోవచ్చు. నాటి కథనాల ప్రకారం, రాజధానిలో జరిగింది కేవలం అనుకోకుండా జరిగిన అల్లర్లు మాత్రమే కాదు. భారత ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేసిన వి.పి. మీనన్ నాటి పరిస్థితుల గురించి చెబుతూ.. “కొత్తగా ఏర్పడిన స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని కూల్చివేసి, రాజధానిని స్వాధీనం చేసుకోవడానికి ముస్లింలు పక్కాగా చేసిన కుట్ర గురించిన పుకార్లతో దిల్లీ అట్టుడికిపోయింది,” అని పేర్కొన్నారు. ఇది కేవలం భయం కాదు; నిఘా వర్గాల సమాచారం ఆధారంగా చేసిన అంచనా.
నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు జె.బి. కృపలానీ ప్రకటన మరింత స్పష్టంగా ఉంది. “ముస్లింల ఇళ్లలో జరిపిన సోదాల్లో బాంబులు, స్టెన్-గన్లు, బ్రెన్-గన్లు, మోర్టార్లు, వైర్లెస్ ట్రాన్స్మిటర్లు పెద్దసంఖ్యలో బయటపడ్డాయి,” అని ఆయన రాశారు. “మసీదులు, వాటి పరిసర ప్రాంతాల నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు,” అని కూడా ఆయన తెలిపారు. అప్పటి పోలీస్ బలగాల్లో అత్యధికులు ముస్లింలే ఉండటం, వారిలో చాలామంది తమ యూనిఫారాలు, ఆయుధాలతో విధులను వదిలి వెళ్ళిపోవడం పరిస్థితిని మరింత దిగజార్చింది. ఆ రోజుల్లో దిల్లీ అంతర్గత విధ్వంస ముప్పును ఎదుర్కొంటున్న ముట్టడిలో ఉన్న రాజధానిగా మారింది. ఈ వివరాలు చాలా కీలకం. హింస ఆకస్మికంగా జరగలేదని, దాని వెనుక ముందస్తు సన్నాహాలు ఉన్నాయని – ఆ మనస్తత్వమే నేటికీ భారత్‌ను కుదిపేస్తోందని ఇది సూచిస్తోంది. విభజనను కోరి, పాకిస్థాన్ ఏర్పాటు కోసం పనిచేసిన వారిలో చాలామంది భారత్‌ను వదిలి వెళ్లలేదు. వారికి మద్దతు ఇచ్చిన రాజకీయ వర్గాలు, కమ్యూనిస్టులతో సహా, ఇక్కడే ఉండిపోయారు. విడ్డూరమేమిటంటే, కమ్యూనిజం వారు కలలుగన్న దేశాల్లో అంతరించిపోయినా, వారు విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించిన ఈ దేశంలోనే నేటికీ వారు తమ వాదనలను వినిపిస్తున్నారు. అలాంటి విచ్ఛిన్నకర శక్తులు భారత్‌ను వదిలి వెళ్ళి ఉంటే, మతపరమైన తీవ్రవాదం క్రమంగా కనుమరుగయ్యేది లేదా ఇండోనేషియా, మలేషియా వలె సాంస్కృతికంగా, నాగరికతతో ముడిపడిన రూపంలోకి మారి ఉండేది. కానీ, ‘సెక్యులరిజం’ పేరుతో మార్క్స్-మెకాలే మనస్తత్వం సహజమైన ఏకీకరణను అడ్డుకుంది. దీని ఫలితం స్పష్టంగా ఉంది: కొందరికి ప్రజాస్వామ్యం అనేది సంస్కరణకు మార్గంగా మారలేదు, కేవలం మతపరమైన గుర్తింపును విషపూరిత రూపంలో బలోపేతం చేసే సాధనంగా మారింది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఒక సందర్భంలో హెచ్చరించినట్లు, “ముస్లింలకు రాజకీయాలపై ఆసక్తి లేదు. వారి ప్రధాన ఆసక్తి మతం మాత్రమే… ముస్లిం రాజకీయాలు కేవలం హిందూ-ముస్లింల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మాత్రమే గుర్తిస్తాయి.”
వెయ్యేళ్లకు పైగా భారత ఉపఖండం మతపరమైన విద్వేషాలతో కూడిన దాడులను చూసింది. ముహమ్మద్ బిన్ ఖాసిం నుంచి ఔరంగజేబు, అహ్మద్ షా అబ్దాలీ వరకు చరిత్రలో హింస, విగ్రహ విధ్వంసం నమోదయ్యాయి. 1947 విభజన, ఆ తర్వాత కాశ్మీరీ హిందువుల వలసల చరిత్ర కేవలం గతం మాత్రమే కాదు, అది వర్తమానాన్ని నిర్దేశించే శక్తి అని గుర్తుచేస్తున్నాయి. ‘గజ్వా-ఎ-హింద్’ వంటి భావనలు తీవ్రవాద వర్గాల్లో నేటికీ వినిపిస్తున్నాయి. ఈ భావజాలమే గతాన్ని, వర్తమానాన్ని కలుపుతోంది. ఈ చారిత్రక అంశాలను వైషమ్యాలను రేకెత్తించడానికి కాకుండా, ప్రస్తుత పరిస్థితుల వెనుక ఉన్న మూలాలను అర్థం చేసుకోవడానికి ప్రస్తావించుకోవాలి. నేటి లష్కరే తోయిబా, ఐసిస్ లేదా అల్-ఖైదా వంటి నెట్‌వర్క్‌లు ప్రపంచవ్యాప్త వ్యవస్థలో భాగంగా పనిచేస్తున్నాయి. చరిత్రను అసందర్భమని కొట్టిపారేస్తే గతం పునరావృత్తం అయ్యే ప్రమాదం ఉంది. అహ్మద్ లోన్ అరెస్ట్ ఒక హెచ్చరిక. ముప్పు పొంచి ఉందని, అదే సమయంలో ప్రభుత్వం దాన్ని ఎదుర్కోగలదని ఇది సూచిస్తుంది. భారత్ తన చరిత్రను నిజాయితీగా సమీక్షించుకుని, భావజాల తీవ్రవాదాన్ని ఎటువంటి సంకోచం లేకుండా ఎదుర్కొంటేనే తన వైవిధ్యాన్ని కాపాడుకోగలదు. చరిత్ర ఒకేలా పునరావృత్తం కాకపోవచ్చు, కానీ దాని లయ ఒకేలా ఉంటుంది. ఆ లయను విస్మరించడం అంటే ఆ దుష్పరిణామాలను ఆహ్వానించడమే.
బల్బీర్ కె పుంజ్,
బిజెపి మాజీ ఎంపి

