Jan Vishwas Bill

వ్యాపారాలకు భారీ ఊరట ‘జన విశ్వాస్ బిల్లు’

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం దశాబ్ద కాలం క్రితం ప్రారంభించిన నిరంతర సంస్కరణల పరంపరలో ‘జన విశ్వాస్ 2026 బిల్లు’ ఒక కీలక ఘట్టం. ఏప్రిల్ 3న పార్లమెంటు ఈ బిల్లును ఆమోదించింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రోత్సహించిన ‘లైసెన్స్ రాజ్యం’ కాలంలో నియంత్రణ నిబంధనల పేరుతో వ్యాపారవేత్తలు, సామాన్య పౌరులు వేధింపులకు గురవ్వడం సర్వసాధారణంగా ఉండేది. అయితే, నియంత్రణలను సరళీకరించడం లేదా తగ్గించడం ఎప్పుడూ మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరుస్తుందని, ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందని రుజువైంది.

 ప్రభుత్వం తన పట్టును సడలించడం వల్ల అత్యధిక మందికి ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSMEలు) ప్రధానంగా లబ్ధి పొందాయి. గత ప్రభుత్వాల హయాంలో అడుగుడుగునా ఎదురయ్యే నిబంధనల అడ్డంకులు ఇప్పుడు తొలగిపోవడంతో, వ్యాపారవేత్తలు తమ సంస్థలను విస్తరించుకోడానికి ఇబ్బందులు తొలిగాయి. చిన్న తరహా పరిశ్రమలకు సంక్లిష్టమైన చట్టపరమైన చిక్కులను విడమర్చి చెప్పే న్యాయవాదులు ఉండరు. అందుకే క్లిష్టమైన నిబంధనల వల్ల వారు ఎక్కువగా నష్టపోతుంటారు. ఈ బిల్లు ‘ఇన్‌స్పెక్టర్ రాజ్’ భయాన్ని తొలగించడమే కాకుండా, కేవలం సాంకేతికపరమైన లేదా విధానపరమైన లోపాలకే జైలు శిక్షలు అనుభవించాల్సిన అవసరం లేకుండా వ్యాపారవేత్తలకు రక్షణ కల్పిస్తుంది. మన కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసుల గురించి మనకు తెలిసిందే. చిన్నపాటి వివాదాలను పరిపాలనాపరమైన పరిష్కారం పరిధిలోకి తీసుకురావడం ద్వారా కోర్టులపై భారాన్ని తగ్గించేందుకు ఈ బిల్లు దోహదపడుతుంది. అధికారులు విచారణలు జరిపి జరిమానాలు విధించేలా నిర్ణయాధికారాలను పొందుతారు. దీనిపై అప్పీల్ చేసుకునేందుకు ప్రత్యేక వ్యవస్థ కూడా ఉండటంతో, కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం తప్పుతుంది. కొన్ని అంచనాల ప్రకారం, దీనివల్ల కోర్టుల్లోని కేసుల్లో దాదాపు మూడొంతులు కాలక్రమేణా తగ్గిపోయే అవకాశం ఉంది.

నమ్మకమే పునాదిగా పాలన 

గతంలో చిన్నపాటి ఉల్లంఘనలను నేరంగా పరిగణించకుండా మార్పులు చేయడం వల్ల పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తల్లో ఉత్సాహం పెరిగి, వ్యాపార వాతావరణం మెరుగుపడటాన్ని మనం చూశాం. ఈ కొత్త బిల్లు దేశం ఇప్పుడు ‘నమ్మకం’ ఆధారిత పాలన వైపు వేగంగా అడుగులు వేస్తోందని స్పష్టం చేస్తోంది. ప్రజలను నేరారోపణలతో శిక్షించడం కంటే, లోపాలను సరిదిద్దే చర్యలపైనే ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. బాధ్యతాయుతమైన, నిజాయితీ గల పాలనకు నిదర్శనంగా ‘కనీస ప్రభుత్వం – గరిష్ట పాలన’ అనే సూత్రాన్ని బిజెపి ప్రభుత్వం మొదటి నుంచీ అమలు చేస్తోంది. గడిచిన మూడేళ్లలో గమనించిన లోపాలను సవరించడానికి, అవినీతికి, దళారీ వ్యవస్థకు తావిచ్చే సంక్లిష్ట నిబంధనలను తొలగించడానికి ఈ కొత్త సవరణలు దోహదపడతాయి. చట్టాలను సరళీకరించడం, నియంత్రణ ఆధారిత వ్యవస్థలను రద్దు చేయడం (ఉదాహరణకు 2012 నాటి వోడాఫోన్, కెయిర్న్ ఎనర్జీ వంటి కంపెనీలను దెబ్బతీసిన గతానికి వర్తించే పన్ను సవరణను తొలగించడం) వంటి చర్యలు అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను పెంచాయి. విశ్వసనీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా భారత్ ఎదిగేందుకు ఇవి తోడ్పడ్డాయి. ‘జన విశ్వాస్ బిల్లు’ను కూడా వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా రూపొందించారు. అనేక రంగాల్లో క్రిమినల్ శిక్షల స్థానంలో సివిల్ జరిమానాలను ప్రవేశపెట్టడం వల్ల అటు ప్రభుత్వానికి, ఇటు వ్యాపార రంగానికి రెండు విధాలా లాభం చేకూరుతుంది. ఈ బిల్లు ఏకంగా 80 కేంద్ర చట్టాల్లోని 784 నిబంధనలను సవరించడం ద్వారా దేశవ్యాప్తంగా ఒకే విధమైన అమలు విధానాన్ని తీసుకువస్తుంది. నియంత్రణ సామర్థ్యాన్ని పెంచడం, సులభతర వాణిజ్యమే దీని అంతిమ లక్ష్యం.

గుజరాత్ అనుభవం.. జాతీయ స్థాయి అమలు 

నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ‘వైబ్రంట్ గుజరాత్’ సదస్సులను నిర్వహించేవారు. ప్రభుత్వ జోక్యం కనిష్ఠంగా ఉండటం, భూసేకరణ, సబ్సిడీల పంపిణీ వంటి ప్రక్రియలను వేగవంతం చేయడం వంటి సంస్కరణలు ఆయన అప్పట్లోనే అమలు చేశారు. అప్పటి తన అనుభవాలను, ఆలోచనలను ఇప్పుడు జాతీయ స్థాయిలో అమలు చేస్తున్నారు. ఈ బిల్లు కేవలం ఒకరి ఆలోచన నుంచి పుట్టింది కాదు. దీని వెనుక 24 మంది సభ్యులతో కూడిన ఎంపిక సంఘం చేసిన లోతైన కసరత్తు ఉంది. ఈ కమిటీ 49 సార్లు సమావేశమై వివిధ మంత్రిత్వ శాఖలు, నిపుణులు, పారిశ్రామికవేత్తల నుంచి సలహాలు స్వీకరించింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, సమతుల్యమైన రీతిలో నేర నిబంధనలను తొలగించే ఈ చర్యలు చేపట్టారు.

అన్ని రంగాలకూ ఊరట

ఈ చట్టం కేవలం ఒక రంగానికి పరిమితం కాకుండా అన్ని రంగాలకూ వెసులుబాటు కల్పిస్తుంది. గత కొన్నేళ్లుగా మన ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఔషధ రంగంపై ఇది సానుకూల ప్రభావం చూపుతుంది. ‘ఔషధాలు, సౌందర్య సాధనాల చట్టం 1940’లో చేసిన మార్పుల వల్ల రిటర్నులు లేదా నివేదికలు సమర్పించడంలో జరిగే చిన్నపాటి ఆలస్యాలకు ఇప్పుడు మినహాయింపు లభిస్తుంది. ఇది కంపెనీలు అనవసరమైన కోర్టు కేసుల బారిన పడకుండా, నిజాయితీగా తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేలా ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా జెనరిక్ మందుల తయారీ, ఎగుమతుల్లో భారత్ ముందంజలో ఉన్న తరుణంలో, ఈ మార్పులు ఫార్మా కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్లో మరింత దీటుగా పోటీ పడేందుకు సహాయపడతాయి.

 పట్టణ ప్రాంతాల్లో చిన్నపాటి పౌర నియమ ఉల్లంఘనలకు జైలు శిక్షల భయం తొలగించడం వల్ల సామాన్య ప్రజలకు ఊరట లభిస్తుంది. ఇది అధికారుల చేతుల్లో ఉండే అపరిమిత అధికారాలకు కళ్లెం వేసి, అవినీతిని అరికడుతుంది. జాతీయ రహదారుల చట్టం 1956లో చేసిన సంస్కరణలు కోర్టు కేసులను తగ్గించడమే కాకుండా, మెరుగైన నియంత్రణ వ్యవస్థను నిర్మిస్తాయి. ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి రవాణా రంగంలో సరళీకృత విధానాలు మరిన్ని అవకాశాలను సృష్టిస్తాయి. మోటారు వాహనాల చట్టం 1988లో తెచ్చిన మార్పులు రోడ్డు భద్రతకు సంబంధించి తీవ్రమైన నేరాలకు, చిన్నపాటి ఉల్లంఘనలకు మధ్య స్పష్టమైన తేడాను చూపుతున్నాయి. జైలు శిక్షల స్థానంలో జరిమానాలు, పరిపాలనాపరమైన చర్యలు అమలులోకి వస్తాయి. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్టార్టప్ ఇండియా’ వంటి పథకాలకు ఈ నిబంధనల సరళీకరణ ఒక ఉత్ప్రేరకంలా పనిచేస్తుంది. ప్రస్తుతం దేశంలో 2.12 లక్షలకు పైగా గుర్తింపు పొందిన స్టార్టప్‌లు ఉన్నాయి. ప్రభుత్వ సంస్థలు వ్యాపారస్తులను కేసుల్లో ఇరికించకుండా, చిన్నపాటి లోపాలను సరిదిద్దుకునేలా సహకారం అందించడం వల్ల పెట్టుబడి వాతావరణం మరింత బలపడుతుంది. మొత్తంగా చూస్తే ఈ సంస్కరణలు ‘శిక్షాత్మక పాలన’ నుంచి ‘సహకార పాలన’ వైపు సాగుతున్న ప్రయాణం. దీనివల్ల అంతర్జాతీయ ‘వ్యాపార సౌలభ్యం’ (ఈజ్ అఫ్ డూయింగ్) ర్యాంకింగ్స్‌లో భారత్ స్థానం మెరుగుపడుతుంది. గత ఆర్థిక సంవత్సరంలో భారత ఎగుమతులు 790 బిలియన్ డాలర్లను దాటాయి. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. స్వతంత్ర భారత శతాబ్ది వేడుకల నాటికి ‘వికసిత భారత్ 2047’ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ బిల్లు ఒక కీలక అడుగు.

నమ్మకమే పునాదిగా చట్టాల సరళీకరణ 

ప్రధానాంశాలు

  • జన విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు, 2026 ద్వారా 23 మంత్రిత్వ శాఖల పరిధిలోని 79 కేంద్ర చట్టాల్లో మార్పులు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇది వివిధ రంగాలకు చెందిన 784 నిబంధనలపై ప్రభావం చూపుతుంది.
  • చిన్నపాటి విధానపరమైన లోపాలకు సంబంధించి నేరపూరిత శిక్షలను తొలగించి, వాటి స్థానంలో సివిల్ జరిమానాలు లేదా పరిపాలనాపరమైన చర్యలను ప్రవేశపెడుతుంది.
  • మోటారు వాహనాల చట్టం (1988), న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ చట్టం (1994) వంటి వాటిలో సంస్కరణల ద్వారా ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడం ఈ బిల్లు లక్ష్యం.
  • జరిమానాలు విధించే ముందు నోటీసులు, హెచ్చరికలు జారీ చేసే విధానాన్ని తీసుకురావడం ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSMEలు), ఇతర వ్యాపార సంస్థలపై నిబంధనల భారాన్ని తగ్గిస్తుంది.

 అపనమ్మకం నుంచి ఆత్మవిశ్వాసం వైపు

చాలా ఏళ్లుగా భారతదేశంలోని అనేక చట్టాలు చిన్నపాటి పొరపాట్లను కూడా తీవ్రమైన నేరాలుగా పరిగణించేవి. ఫారాలను నింపడంలో తప్పులు దొర్లినా లేదా గడువులోగా పత్రాలు సమర్పించకపోయినా, పౌరులు, వ్యాపారవేత్తలు జైలు శిక్ష వంటి కఠినమైన శిక్షలను ఎదుర్కోవాల్సి వచ్చేది. కాలం చెల్లిన ఇటువంటి చట్టాలను మార్చాల్సిన అవసరాన్ని గుర్తించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం, 2023లో ‘జన విశ్వాస్ చట్టం’ ద్వారా ఈ దిశగా తొలి అడుగు వేసింది. ఇప్పుడు జన విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు, 2026 ఆ సంస్కరణలను మరింత ముందుకు తీసుకువెళుతోంది.

నాలుగు ప్రధాన భాగాలు

ఈ బిల్లును నాలుగు ముఖ్యమైన సూత్రాల ఆధారంగా రూపొందించారు:

  1. శిక్షకు ముందు హెచ్చరిక: మొదటిసారి చేసే చిన్న తప్పులకు నేరుగా జరిమానా విధించకుండా, హెచ్చరికలు జారీ చేయడం ద్వారా సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తారు.
  2. సముచితమైన జరిమానాలు: తప్పు తీవ్రతను బట్టి జరిమానాలు ఉంటాయి.
  3. వేగవంతమైన పరిష్కారం: కోర్టులపై భారం తగ్గించేందుకు ప్రత్యేక అధికారులు, అప్పిలేట్ అథారిటీల ద్వారా పారదర్శకమైన పరిష్కార మార్గాలు ఉంటాయి.
  4. కాలానుగుణ మార్పులు: జరిమానాల విధానాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అది ఆయా కాలానికి తగినట్లుగా ఉండేలా చూస్తారు.

ఈ సంస్కరణల ప్రక్రియ 2023లో ప్రారంభమైంది. అప్పట్లో 42 చట్టాల్లోని 183 నిబంధనలను నేరరహితం చేశారు. ఆ తర్వాత, 2025 ఆగస్టులో లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లును పార్లమెంటరీ ఎంపిక సంఘానికి పంపారు. కమిటీ 49 సార్లు సమావేశమై, 13 మార్చి 2026న తన నివేదికను సమర్పించింది. కమిటీ సిఫార్సుల మేరకు ఇప్పుడు 79 కేంద్ర చట్టాల్లోని 784 నిబంధనలను సవరించేలా ఈ 2026 బిల్లును విస్తరించారు.

సామాన్యుడి ఇబ్బందులకు స్వస్తి

సామాన్య ప్రజలు నిత్యం ఎదుర్కొనే చిన్నపాటి ఇబ్బందులను ఈ బిల్లు తొలగిస్తుంది:

  • రైల్వే చట్టం: గతంలో రిజర్వ్ చేసిన బెర్త్‌ను ఖాళీ చేయకపోతే క్రిమినల్ శిక్ష ఉండేది, ఇప్పుడు దానిని రూ.1,000 వరకు సివిల్ జరిమానాగా మార్చారు.
  • కోర్టు ఫీజు చట్టం: కోర్టు స్టాంపుల విక్రయంలో మోసం లేని చిన్న పొరపాట్లకు జైలు శిక్షను తొలగించారు.
  • వైద్య రంగం: క్లినిక్‌లలో చిన్నపాటి లోపాలకు క్రిమినల్ కేసుల బదులు రూ.10,000 వరకు జరిమానా విధిస్తారు.
  • మెట్రో ప్రయాణం: మెట్రోలో ధూమపానం చేస్తే క్రిమినల్ కేసు బదులు రూ.2,000 సివిల్ జరిమానా ఉంటుంది.

ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి ఇబ్బందికరమైన వందల నిబంధనలను ప్రభుత్వం ఈ బిల్లు ద్వారా రద్దుచేసి ప్రజలకు ఊరట కల్పించింది.

జీవన సౌలభ్యం 

  • లైసెన్స్ గడువు ముగిసినా 30 రోజుల వెసులుబాటు: మోటారు వాహనాల చట్టం ప్రకారం, లైసెన్స్ గడువు ముగిసిన తర్వాత కూడా 30 రోజుల వరకు అది చెల్లుబాటు అవుతుంది. దీనివల్ల డ్రైవర్లకు లైసెన్స్ పునరుద్ధరించుకోవడానికి తగిన సమయం దొరుకుతుంది.
  • ప్రమాద బాధితులకు ఊరట: రోడ్డు ప్రమాద బాధితులు పరిహారం కోసం క్లెయిమ్ దాఖలు చేసే గడువును 12 నెలల వరకు పొడిగించే అవకాశం కల్పించారు.
  • రాత్రి వేళ బయట ఉండటం ఇక నేరం కాదు: ఢిల్లీ పోలీస్ చట్టంలోని సెక్షన్ 102(C) కింద రాత్రి పూట బయట ఉంటే అనుమానంతో అరెస్ట్ చేసే వలసవాద కాలం నాటి నిబంధనను పూర్తిగా తొలగించారు.
  • నీటి దుర్వినియోగం: బహిరంగ బావులు, ట్యాంకుల నుంచి అనుమతి లేకుండా నీటిని వాడితే గతంలో ఉన్న క్రిమినల్ శిక్ష స్థానంలో రూ.1,000 జరిమానా మాత్రమే ఉంటుంది.

వ్యాపార సౌలభ్యం

వ్యాపార సంస్థలు, ముఖ్యంగా MSMEలు చిన్న పొరపాట్లకే కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఈ బిల్లు రక్షణ కల్పిస్తుంది.

  • స్థాయిలవారీ అమలు: టీ చట్టం, కాపీరైట్ చట్టం వంటి వాటిలో తొలి తప్పునకు హెచ్చరికలు, ఆ తర్వాతే జరిమానాలు ఉంటాయి.
  • MSMEలకు మేలు: తూనికలు, కొలతల చట్టం కింద రికార్డుల నిర్వహణలో లోపాలు ఉంటే శిక్ష విధించకముందే ‘మెరుగుపరుచుకోడానికి నోటీసు’ ఇస్తారు.
  • కాలానుగుణ మార్పులు: కొబ్బరి పీచు పరిశ్రమ వంటి రంగాల్లో కాలం చెల్లిన లైసెన్సింగ్ నిబంధనలను పూర్తిగా తొలగించారు.

జన విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు, 2026 ద్వారా భారత చట్టాల్లోని కఠినత్వాన్ని తగ్గించి, పౌరులు, ప్రభుత్వం మధ్య నమ్మకాన్ని పెంచేందుకు దోహదం చేస్తుంది. చిన్న చిన్న పొరపాట్లకు జైలు శిక్షలు లేకుండా చేయడం ద్వారా అటు సామాన్యుడికి, ఇటు వ్యాపారులకు ప్రభుత్వం భారీ ఊరటనిస్తోంది.

సంత్ కుమార్ శర్మ