MannKiBaat

ప్రజలు పుకార్ల మాయలో పడొద్దు!

మార్చి 29న ప్రసారమైన ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న ప్రాంతం మన ఇంధన అవసరాలకు కేంద్రం. ఈ కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ తదితర అవసరాలకు ఇబ్బంది ఏర్పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి అందుతోన్న సహకారం, గత దశాబ్ద కాలంగా దేశంలో పెరిగిన సామర్థ్యం కారణంగా భారతదేశం ఈ పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కుంటోంది. మనమంతా సామూహిక శక్తితో ఈ సవాలును ఎదుర్కోవాలని దేశ ప్రజలందరినీ కోరుతున్నాను. ఇది దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన విషయం. కాబట్టి ఇందులో రాజకీయానికి స్థానం లేదు. ఈ విషయంలో వదంతులు ప్రచారం చేసేవారు దేశానికి చాలా నష్టం కలిగిస్తున్నారు. ఈ పుకార్ల మాయలో పడవద్దని దేశప్రజలందరినీ కోరుతున్నాను. 

జ్ఞాన భారతం సర్వే లక్ష్యం దేశవ్యాప్తంగా ఉన్న మాన్యుస్క్రిప్ట్స్ – అంటే లిఖిత ప్రతుల సమాచారాన్ని క్రోడీకరించడం. జ్ఞాన భారతం యాప్ ద్వారా ఈ సర్వేలో పాల్గొనవచ్చు. మీ దగ్గర ఏదైనా మాన్యు స్క్రిప్ట్- ఏదైనా లిఖిత ప్రతి ఉంటే ఆ ఫోటోను జ్ఞాన భారతం యాప్ లో అప్ లోడ్ చేయండి. లిఖిత ప్రతులకు సంబంధించిన సమాచారం ఉన్నా ఆ వివరాలను యాప్ లో నమోదు చేయండి. ప్రతి ఎంట్రీకి సంబంధించిన సమాచారం నిక్షిప్తం చేయడానికి ముందు ధృవీకరణ కూడా జరుగుతుంది. ఇప్పటివరకు వేలాది రాత ప్రతులను ప్రజలు పంచుకోవడం సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ సర్వే జూన్ నెల మధ్య వరకు కొనసాగుతుంది. సంస్కృతికి సంబంధించిన విషయాలను అందరికీ తెలియజేయాలని మీ అందరినీ కోరుతున్నాను.

మై భారత్ సంస్థ నిర్వహించిన బడ్జెట్ క్వెస్ట్ కార్యక్రమ లక్ష్యం దేశ యువతను బడ్జెట్ ప్రక్రియలో, విధాన రూపకల్పనలో భాగస్వాములను చేయడం. దీనితో అనుసంధానమైన క్విజ్ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 12 లక్షల మంది యువతీ యువకులు పాల్గొన్నారు. సుమారు ఒక లక్ష 60 వేల మంది యువతీ యువకులను వ్యాస రచన పోటీకి ఎంపిక చేశారు. తమ అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకున్న యువ మిత్రులందరినీ అభినందిస్తున్నాను. 

జమ్మూ కాశ్మీర్ క్రికెట్ జట్టు రంజీ ట్రోఫీ సాధించింది. సుమారు ఏడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ జట్టు రంజీని సాధించడం సంతోషించదగ్గ విషయం. ఈ అద్భుత విజయం క్రీడాకారులు ఎన్నో సంవత్సరాల పాటు సాగించిన కృషి ఫలితం. టీం కెప్టెన్ పారస్ డోగ్రా అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. రంజీ ట్రోఫీ సీజన్‌లో 60 వికెట్లు తీసిన యువ కాశ్మీరీ బౌలర్ ఆకిబ్ నబీ ప్రదర్శన గురించి ఈ రోజు దేశం మొత్తం మాట్లాడుకుంటోంది. ఈ విజయం జట్టు ఆటగాళ్లను, కోచింగ్ సిబ్బందిని, అలాగే జమ్మూ కాశ్మీర్ ప్రజలను ఎంతగానో ఉత్సాహపరిచింది. క్రికెట్ మైదానంలో ఈ అద్భుత ప్రదర్శన అక్కడి యువతలో క్రీడల పట్ల ఉత్సాహాన్ని మరింత పెంచింది. భవిష్యత్తులో ఇది ఇంకా చాలా మందిని క్రీడలలో పాల్గొనేందుకు ప్రేరేపిస్తుంది. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు క్రీడల పట్ల అపారమైన అభిరుచి ఉంది. ఈ రాష్ట్రం ఇప్పుడు ప్రధాన క్రీడా కార్యక్రమాలకు కేంద్రంగా మారుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. 

ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ప్రతిభావంతుడైన అథ్లెట్ గుల్వీర్ సింగ్ కొన్ని వారాల క్రితం న్యూయార్క్ సిటీ హాఫ్ మారథాన్‌లో మూడవ స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించారు. గంటలోపు హాఫ్ మారథాన్‌ను పూర్తి చేసిన మొదటి భారతీయ అథ్లెట్‌గా ఆయన రికార్డు నెలకొల్పారు. స్క్వాష్ క్రీడాకారిణి అయిన అనాహత్ సింగ్ స్క్వాష్ ఆన్ ఫైర్ ఓపెన్‌లో ఒక ప్రధాన అంతర్జాతీయ టైటిల్‌ను గెలుచుకున్నారు. కేవలం 17 ఏళ్ల వయసులోనే ఆమె ఈ విజయాన్ని సాధించారు. దీంతో PSA ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-20లోకి ప్రవేశించిన అతి చిన్న వయస్కురాలైన ఆసియా మహిళా క్రీడాకారిణిగా ఆమె నిలిచారు. మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అస్మిత అథ్లెటిక్స్ లీగ్‌లో సుమారు 2 లక్షల మంది అమ్మాయిలు పాల్గొన్నారు.

బెంగళూరులో ఒక బృందం ‘ప్రయోగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్’ను నిర్వహిస్తోంది. వారు పాఠశాల స్థాయిలో విజ్ఞాన శాస్త్ర విద్యను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. వారు ‘అన్వేషణ’ అనే ప్రయోగాన్ని నిర్వహించారు. ఇది 9వ తరగతి నుండి 12వ తరగతి విద్యార్థులకు రసాయన శాస్త్రం, భూ శాస్త్రం, ఆరోగ్యం వంటి రంగాలలో నూతన ఆవిష్కరణలు చేసే అవకాశాన్ని అందిస్తుంది. ఇది విద్యార్థులకు విలువైన పరిశోధన అనుభవాన్ని ఇస్తుంది. వారి ప్రాజెక్టులను ప్రచురించడానికి ఒక వేదికను అందిస్తుంది.

నాగా తెగలకు మోరుంగ్ అభ్యసనమనే సాంప్రదాయిక వ్యవస్థ ఉండేది. ఇందులో పెద్దలు తమ అనుభవాల నుండి యువతకు సాంప్రదాయిక జ్ఞానం, చరిత్ర, జీవిత నైపుణ్యాలను బోధించేవారు. కాలక్రమేణా, ఈ వ్యవస్థ ఇప్పుడు మోరుంగ్ విద్యా భావనగా పరిణామం చెందింది. దీని ద్వారా గణితం, విజ్ఞానశాస్త్రం వంటి విషయాలపై పిల్లలు ఆసక్తి కనబరిచేలా ప్రోత్సహిస్తారు. ఇందులో సమాజంలోని పెద్దలు వారికి కథలు, జానపద గీతాలు, సంప్రదాయ ఆటలతో పాటు జీవిత నైపుణ్యాలను బోధిస్తారు. ఈ విధంగా మన నాగాలాండ్ తన సాంస్కృతిక వారసత్వాన్ని సురక్షితంగా ఉంచుకుంటూనే పిల్లల విద్యను ముందుకు తీసుకువెళుతోంది. 

నేడు ఫిషరీస్, సీవీడ్ – మత్స్య, సముద్రపు నాచు రంగాలలో కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ఒడిషాలోని సంబల్‌పూర్‌కు చెందిన సుజాత భూయాన్ ఒక గృహిణి. ఆమె వినూత్నంగా ఏదైనా పని చేసి తన కుటుంబానికి మరింత సహాయం చేయాలనుకుంది. అందుకే కొన్ని సంవత్సరాల కిందట ఆమె హీరాకుడ్ జలాశయంలో చేపల పెంపకాన్ని ప్రారంభించింది. ఆమెకు వాతావరణ మార్పులు, చేపలకు ఆహారం ఏర్పాటు చేయడం, ఇంటి బాధ్యతలను సమతుల్యం చేసుకోవడం వంటివి ఎన్నో సవాళ్లను విసిరాయి. కానీ ఆమె సంకల్పం చెక్కుచెదరలేదు. కేవలం రెండు, మూడు సంవత్సరాలలోనే ఆమె తన ప్రయత్నాన్ని ఒక విజయవంతమైన వ్యాపారంగా మార్చారు. నేడు ఆమె విజయం తన సమాజంలోని మహిళలకు ఒక నవీన ఆశాకిరణంగా మారింది.

ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఒక స్ఫూర్తిదాయకమైన ప్రయత్నం జరిగింది. అక్కడ కేవలం ఒక్క గంటలోనే 2,51,000 కు పైగా మొక్కలు నాటి, ఒక కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఈ ప్రయత్నంలో వేలాది మంది పాల్గొనడం అత్యంత విశేషమైన అంశం. విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, వివిధ సంస్థల సామూహిక కృషితో ఇది సాధ్యమైంది. 

నాగాలాండ్‌లోని చిజామీ గ్రామ మహిళలు సమష్టిగా 150 రకాలకు పైగా సాంప్రదాయిక విత్తనాలను పరిరక్షిస్తున్నారు. ఈ విత్తనాలను గ్రామ మహిళలు నడుపుతున్న ఒక కమ్యూనిటీ సీడ్ బ్యాంకులో భద్రపరుస్తున్నారు. వీటిలో వరి, జొన్న, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, కూరగాయలు, వివిధ రకాల మూలికలు ఉన్నాయి. జ్ఞానాన్ని పరిరక్షించి, సంప్రదాయాలను సజీవంగా ఉంచి, భవిష్యత్ తరాలకు బలమైన పునాది వేసే ఒక ప్రయత్నమిది.

ఈ రోజు మీరు ఏ నగరాన్ని సందర్శించినా పెద్ద సంఖ్యలో ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసి ఉండటాన్ని మీరు చూస్తారు. కొన్ని సంవత్సరాల కిందటి వరకు ఇది కేవలం కొన్ని ఇళ్లపై మాత్రమే కనిపించేది. కానీ నేడు ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన’ ప్రభావం దేశంలోని ప్రతి మూలలోనూ కనిపిస్తోంది. ఈ పథకం కారణంగా గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాకు చెందిన పాయల్ ముంజ్‌పారా జీవితం ఒక పెద్ద మార్పును చూసింది. ఆమె సౌర విద్యుత్ సాంకేతికతలో శిక్షణ పొంది, 4 నెలల సోలార్ పీవీ టెక్నీషియన్ కోర్సును పూర్తి చేశారు. ఇప్పుడు ఆమె నైపుణ్యం కలిగిన సోలార్ టెక్నీషియన్‌గా మారారు. పాయల్ ప్రస్తుతం ఒక సోలార్ పారిశ్రామికవేత్తగా తనకంటూ ఒక పేరు సంపాదించుకుంటున్నారు. ఆమె సమీప జిల్లాల్లో సోలార్ రూఫ్‌టాప్ ఇన్‌స్టాలేషన్‌ పనిచేస్తూ, ప్రతి నెలా వేల రూపాయలు సంపాదిస్తున్నారు.