02

ఐఐటీ హైదరాబాద్‌తో కేంద్ర బొగ్గు, గనుల శాఖ ఒప్పందం

రూ.98 కోట్లతో సెంటర్ ఆఫ్ క్లీన్ కోల్ ఎనర్జీ & నెట్ జీరో (CLEANZ) పేరుతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు కోలిండియా, ఐఐటీ హైదరాబాద్‌ మధ్య ఒప్పందం మార్చ్ 7న కుదిరింది. బొగ్గు రంగంలో సంస్కరణలు తీసుకొచ్చి పరిశోధనలకు పెద్దపీట వేసేందుకు, సెంట్రల్ మైన్ ప్లానింగ్ & డిజైన్ ఇనిస్టిట్యూట్ లిమిటెడ్ (CMPDI) కింద స్వతంత్ర పరిశోధన మరియు అభివృద్ధి వ్యవస్థను ఏర్పాటు చేయాలనేది కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆలోచనలో భాగంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఈ ఎంఓయూ కుదిరింది. ఈ సందర్బంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ‘‘దేశంలో బొగ్గు ప్రాధాన్యత పెరుగుతూ వస్తోంది. అన్ని రంగాల్లో, భారతదేశ అభివృద్ధిలో బొగ్గు కీలక పాత్ర పోషిస్తోంది. 72 శాతం విద్యుత్ మన దేశంలో బొగ్గు ద్వారానే ఉత్పత్తి చేసుకుంటున్నాం. స్టీలు, సిమెంట్, అల్యూమినియం, పేపర్, టెక్స్ టైల్, హెవీ ఇండస్ర్టీ రంగాల్లో బొగ్గు కీలక పాత్ర పోషిస్తోంది. బొగ్గు ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. బొగ్గు వినియోగంలో ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉంది. బొగ్గు నిల్వల విషయానికొస్తే 5వ స్థానంలో ఉంది. కోలిండియా ప్రపంచంలోనే నంబర్ వన్ కంపెనీ. బొగ్గు ఉత్పత్తి ద్వారా అనేక రాష్ట్రాల్లో రెవెన్యూ అందజేస్తున్నాం. రైల్వే శాఖలో బొగ్గు రవాణా ద్వారా 50 శాతం ఆదాయం సమకూరుతోంది. క్లీన్ కోల్ ఎనర్జీ, నెట్ జీరో కర్బన ఉద్గారాలు లక్ష్యంగా సరికొత్త సాంకేతికత అభివృద్ధి చేసేందుకు సెంట్రల్ మైన్ ప్లానింగ్ డిజైన్ ఇన్ స్టిట్యూట్ ద్వారా పరిశోధన పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. ఇందులో భాగంగా నేషనల్ సెంటర్ ఫర్ కోల్ అండ్ ఎనర్జీ రీసెర్చ్ ను ఏర్పాటు చేశాం. దేశంలోని ఐఐటీలతో కలిసి ఈ సెంటర్ పని చేస్తుంది. ఇందులో భాగంగా క్లీన్ కోల్ ఎనర్జీ, నెట్ జీరో పేరుతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ఐఐటీ హైదరాబాద్ స్థాపించింది. క్లీన్ కోల్ టెక్నాలజీ, బొగ్గు వినియోగంలో ఆధునిక సాంకేతిక అభివృద్ధి చేసే విషయంలో ఐఐటీ హైదరాబాద్‌ను ఎంఓయూ చేసుకున్నాం. నెట్ జీరో లక్ష్యాలను చేరుకునేందుకు కటింగ్ ఎడ్జ్ సాంకేతికతలను అభివృద్ధి చేయడం, సుస్థిరంగా బొగ్గును ఎలా వినియోగించుకోవాలనే దానిపై ఐఐటీ పని చేస్తుంది. భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలకు క్రిటికల్ మినరల్స్ అవసరం ఉంది. క్రిటికల్ మినరల్స్ ను గుర్తించేందుకు ఐఐటీ హైదరాబాద్ కూడా సాంకేతిక సాయం అందజేస్తుంది. కోలిండియా ఉద్యోగులకు కూడా సమీప భవిష్యత్తులో ఐఐటీ హైదరాబాద్ లో శిక్షణ అందించాలని చూస్తున్నాం.