సంప్రదాయాలకు ఆధునికత.. స్థానిక ఉత్పత్తులకు ప్రపంచ గుర్తింపు!
అక్టోబర్ 25న ప్రసారమైన మన్ కీ బాత్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
దేశంలో తరతరాలుగా వస్తున్న సంప్రదాయ నైపుణ్యాలను ఆధునిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తూ, కొత్త అవకాశాలను సృష్టిస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పంజాబ్‌లోని మాల్వా ప్రాంతంలో ‘ఖేతీ విరాసత్ మిషన్’ సంస్థ చేపట్టిన ‘నవ త్రింజన్’ కార్యక్రమం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రసాయనాలు ఉపయోగించకుండా సహజ పద్ధతుల్లో సేంద్రియ పత్తిని సాగు చేస్తున్నారు. సహజ రంగులతో కూడిన పత్తిని పండించడం వల్ల వాటితో తయారయ్యే నూలు, వస్త్రాలకు అదనపు రసాయన రంగుల అవసరం ఉండటం లేదు. పర్యావరణ పరిరక్షణతో పాటు సంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు ఈ కార్యక్రమం ప్రోత్సాహాన్నిస్తోంది. నేత నైపుణ్యాలను తర్వాతి తరాలకు అందించేందుకు ఈ సంస్థ ఏర్పాటు చేసిన నేత పాఠశాల ఎంతోమంది మహిళల జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది. గతంలో కూలీగా పనిచేసిన రమన్‌దీప్ కౌర్ నైపుణ్యం కలిగిన నేత కార్మికురాలిగా ఎదిగారు. చేనేత గురించి కనీస అవగాహన లేని రేఖా రాణి తయారు చేసిన శాలువా రాష్ట్రపతికి బహూకరించే స్థాయికి చేరింది. గతంలో ఇళ్లలో పనిచేసిన సునేహా దేవి నేడు చేనేత వస్త్రాలను తయారు చేస్తున్నారు. వ్యవసాయ కూలీగా ఉన్న రజనీ కౌర్ కూడా నేత నైపుణ్యంతో కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. ఈ పాఠశాలలో శిక్షణ పొందిన మహిళలు దేశీయ సేంద్రియ పత్తితో శాలువాలు, తువ్వాళ్లు, ఇతర వస్త్రాలను తయారు చేస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు.
ప్రజల భాగస్వామ్యంతో నదికి పునర్జీవం
ప్రకృతి పరిరక్షణ, నీటి వనరుల సంరక్షణ మన సంప్రదాయాల్లో భాగమని మోదీ గుర్తుచేశారు. ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గర్వాల్ ప్రాంతంలో హేవల్ నదిని కాపాడేందుకు గ్రామస్థులు, స్థానిక అధికారులు చేపట్టిన కార్యక్రమాన్ని ప్రశంసించారు. నదిలో నీటిమట్టం తగ్గడంతో పాటు సహజ నీటి వనరులు ఎండిపోతున్న నేపథ్యంలో వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, పెద్దఎత్తున మొక్కల నాటడం వంటి చర్యలు చేపట్టారు. ఫలితంగా హేవల్ నదికి పునర్జీవం రావడంతో పాటు డజన్ల కొద్దీ సహజ నీటి వనరులు పునరుద్ధరణ పొందాయి.
స్వదేశీ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లలో ఆదరణ
పండుగల సమయంలో కొనుగోళ్లలో స్వదేశీ ఉత్పత్తులకు ప్రజలు ప్రాధాన్యత ఇస్తుండటం సంతోషకరమని మోదీ అన్నారు. ‘వోకల్ ఫర్ లోకల్’ స్ఫూర్తితో భారతీయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఆదరణ పెరుగుతోందని చెప్పారు. బీహార్‌లోని పూర్ణియా మఖానా గ్రీస్‌కు, కర్ణాటకలోని కలబురగి కందిపప్పు మాల్దీవులకు ఎగుమతి అవుతున్నాయని, తద్వారా భారతీయ రైతులకు కొత్త మార్కెట్లు అందుబాటులోకి వస్తున్నాయని వివరించారు. ఉత్పత్తుల నాణ్యతతో పాటు ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ కూడా మార్కెటింగ్‌లో కీలకమని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని గిరిజనులు ‘శబరి నాచురల్స్’ ద్వారా తేనె, మహువా, చిరోంజి, వెదురు ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. గిరిజన కళా సంప్రదాయాలను ప్రతిబింబించే వారి ప్యాకేజింగ్‌కు జపాన్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక ‘గుడ్ డిజైన్ అవార్డు’ లభించింది. మరోవైపు కర్ణాటకకు చెందిన ‘బ్యాంబూ’ స్టార్టప్ వెదురు, వ్యవసాయ వ్యర్థాలతో ప్యాకేజింగ్ మెటీరియల్‌ను తయారు చేస్తోంది. ఈ ఏడాది గాంధీ జయంతి రోజున ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ అమ్మకాలు ఒక్కరోజులోనే రూ.28 కోట్లు దాటాయని ప్రధాని తెలిపారు. గతేడాదితో పోలిస్తే రూ.1.5 కోట్లు అధికంగా అమ్మకాలు నమోదయ్యాయని చెప్పారు. ఖాదీకి పెరుగుతున్న ఆదరణతో కళాకారులు, చేతివృత్తుల వారికి ప్రయోజనం కలుగుతోందన్నారు.
మారుమూల ప్రాంతాలకూ వైద్య సేవలు
సాంకేతికతను ప్రజల దైనందిన జీవితాల్లో భాగం చేయడంలో భారత్ ముందుందని చెబుతూ, ‘ఈ-సంజీవని’ టెలీమెడిసిన్ సేవలను ప్రధాని ప్రస్తావించారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు దాదాపు 50 కోట్ల టెలీ కన్సల్టేషన్లు జరగడం సాంకేతికత, వైద్యుల సేవాభావం, ప్రజల విశ్వాసానికి నిదర్శనమన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 1.90 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేస్తున్నాయని ప్రధాని తెలిపారు. గ్రామస్థులు కూడా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారని, ఇందులో ఇ-సంజీవని కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.
మానవ మెదడుపై పరిశోధనకు కొత్త దిశ
ఇటీవల చెన్నై పర్యటనలో మద్రాస్ ఐఐటీలో ‘సుధా గోపాలకృష్ణన్ బ్రెయిన్ సెంటర్’ను ప్రారంభించిన విషయాన్ని మోదీ ప్రస్తావించారు. ఈ కేంద్రం అత్యాధునిక బ్రెయిన్ ఇమేజింగ్ టెక్నాలజీ ద్వారా మానవ మెదడుకు సంబంధించిన అధిక రిజల్యూషన్ డిజిటల్ 3డీ చిత్రాలను రూపొందిస్తోంది. రాబోయే రోజుల్లో 100 మంది మనుషుల మెదళ్లను 3డీ మ్యాపింగ్ చేసి లోతుగా అధ్యయనం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచంలోనే ఈ తరహా తొలి ప్రాజెక్టుగా దీనిని పేర్కొన్నారు. ఇందుకోసం అత్యంత శక్తిమంతమైన సూపర్ కంప్యూటర్ను వినియోగిస్తున్నారు. ఈ పరిశోధనా కేంద్రం ఏర్పాటులో ప్రభుత్వం, పరిశ్రమల రంగంతో పాటు ఐఐటీ పూర్వ విద్యార్థులు, విద్యావేత్తలు భాగస్వాములయ్యారు. అల్జీమర్స్, డిమెన్షియా వంటి వ్యాధులకు ఇప్పటికీ కచ్చితమైన నివారణ లేకపోవడంతో మానవ మెదడు పనితీరును లోతుగా అర్థం చేసుకోవడం అత్యంత కీలకమని మోదీ అన్నారు. ఈ పరిశోధనలో సేకరించే 100 మెదళ్ల డేటాను వివిధ రంగాల పరిశోధనల కోసం ఓపెన్ సోర్స్‌గా అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.
చెన్నై పర్యటనలో మెట్రోలో యువతతో సంభాషణ, ఐఐటీ మద్రాస్ సందర్శన తనకు ప్రత్యేక అనుభూతినిచ్చాయని మోదీ తెలిపారు. అక్కడి స్టార్టప్‌లు సమాజంలోని సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేస్తున్నాయని చెప్పారు. బంగారం నాణ్యతను పరీక్షించి కొనుగోళ్లలో మోసాలను నివారించే సాంకేతికత, మోసపూరితంగా బదిలీ అయిన బ్యాంకు నిధులను త్వరగా తిరిగి రాబట్టే ప్లాట్‌ఫామ్, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్‌లో కృత్రిమ మేధ వినియోగం వంటి అంశాలపై యువ బృందాలు పనిచేస్తున్నాయి. ఐఐటీ మద్రాస్ ఇంక్యుబేషన్ కేంద్రం సహకారంతో మరికొన్ని స్టార్టప్‌లు డీప్‌టెక్ రంగంలో వినూత్న ఆవిష్కరణలు చేస్తున్నాయి. సముద్రంపై ప్రయాణించగల ఎలక్ట్రిక్ వాహనం, డ్రోన్లు, ఎలక్ట్రిక్ వాహనాల కోసం వేగంగా ఛార్జ్ అయ్యే బ్యాటరీలు, రక్షణ రంగంలో కృత్రిమ మేధ వినియోగం వంటి అంశాలపై పరిశోధనలు జరుగుతున్నాయి.
ఈశాన్యంలో మళ్లీ పుంజుకుంటున్న చిరుధాన్యాల సాగు
భారతదేశం చొరవతో 2023లో అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరాన్ని నిర్వహించడం ద్వారా ‘శ్రీ అన్న’ ప్రాముఖ్యత ప్రపంచానికి తెలిసిందని మోదీ అన్నారు. ఈశాన్య భారతదేశంలో చిరుధాన్యాల సాగుకు గొప్ప సంప్రదాయం ఉన్నప్పటికీ, కాలక్రమేణా రైతులు వాటికి దూరమయ్యారు. ఇప్పుడు కొత్త ప్రయత్నాలతో మళ్లీ చిరుధాన్యాల సాగు పుంజుకుంటోందని వివరించారు. మేఘాలయలోని పశ్చిమ జయంతియా హిల్స్ జిల్లా ఖండులి గ్రామంలో చిరుధాన్యాల సాగు తగ్గిపోతున్న నేపథ్యంలో ఇద్దరు స్నేహితులు వాటితో విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయడం ప్రారంభించారు. కుకీలు, కేకులు, మఫిన్లు, శిశు ఆహారం వంటి ఉత్పత్తులను తయారు చేసి మార్కెటింగ్ చేయడంతో చిరుధాన్యాలకు డిమాండ్ పెరిగింది. దీంతో రైతులు తిరిగి వాటి సాగు చేపట్టారు. పశ్చిమ గారో హిల్స్ జిల్లా సదోల్పారా గ్రామంలో రైతు చెక్జింగ్ సంగ్మా ఆధునిక పద్ధతులతో చిరుధాన్యాలను సాగు చేస్తూ ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు గ్రామస్థుల్లోనూ అవగాహన కల్పిస్తున్నారు. నాగాలాండ్‌లోని కోహిమా సమీపంలోని కెజోమా గ్రామంలో దశాబ్దానికి పైగా నిలిచిపోయిన చిరుధాన్యాల సాగును 2024లో తిరిగి ప్రారంభించారు. ఒక తరం మొత్తం ఈ సంప్రదాయ పంట గురించి మరిచిపోయిన పరిస్థితి నుంచి గ్రామస్థులు మళ్లీ సాగు వైపు మళ్లారు. 2025లో తమ తొలి చిరుధాన్యాల పండుగను నిర్వహించారు. ప్రస్తుతం అక్కడ కూడా చిరుధాన్యాల ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. సంప్రదాయ పంటలను ఆధునిక అవకాశాలతో అనుసంధానిస్తూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తోందని ఈ ఉదాహరణలు నిరూపిస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు.

