Nitin Nabin

అరాచకవాద శక్తుల కుట్రలను యువమోర్చా తిప్పికొట్టాలి

bjym necభారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) కొత్త జాతీయ కార్యవర్గ తొలి సమావేశం అక్టోబర్ 29న దిల్లీలోని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లో ఉన్న బిజెపి కేంద్ర కార్యాలయంలో విజయవంతంగా జరిగింది. ఈ కీలక సమావేశంలో ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యాల సాధన కార్యాచరణ ప్రణాళికతో పాటు ‘లోక్‌తంత్ర బచావో, అరాజకతా హటావో’ (ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం, అరాచకత్వాన్ని అంతం చేద్దాం) అభియాన్ పై సుదీర్ఘంగా, కూలంకషంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ హేమంగ్ జోషి, జాతీయ ప్రధాన కార్యదర్శి హరీష్ ద్వివేదితో పాటు దేశం నలుమూలల నుంచి వచ్చిన యువమోర్చా ప్రతినిధులు పాల్గొన్నారు.

సమావేశ ప్రధాన కార్యక్రమంలో మాట్లాడిన జాతీయ అధ్యక్షుడు నబీన్ బీజేవైఎం నూతన బృందానికి అభినందనలు తెలిపారు. పార్టీ గత 40-45 ఏళ్ల చారిత్రక, సైద్ధాంతిక ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ, ఒకప్పుడు పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లలేని పరిస్థితి ఉండేదని, అయితే నేడు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బిజెపి ప్రజా సంక్షేమ పథకాలు దేశంలోని ప్రతి నగరం, గ్రామం, వీధికీ చేరుకున్నాయని పేర్కొన్నారు. బిజెపికి ఓటు వేయని వారు సైతం మోదీ మాత్రమే దేశానికి భద్రమైన భవిష్యత్తును, సరైన దిశను అందించగలరని దృఢంగా విశ్వసించే వాతావరణం నేడు నెలకొందని స్పష్టం చేశారు. ‘వికసిత్ భారత్ 2047’ చారిత్రక సంకల్పం ఈ బలమైన పునాది పైనే ఆధారపడి ఉందని, దాన్ని సాకారం చేసే అతిపెద్ద బాధ్యత యువత భుజస్కంధాలపైనే ఉందని ఆయన పిలుపునిచ్చారు.

ప్రతిపక్షాలపై విరుచుకుపడిన నబీన్, తమ రాజకీయ ఉనికి కోల్పోతున్నామనే తీవ్ర నిరాశలో ‘ఇండీ కూటమి’, దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయని విమర్శించారు. విదేశీ కుట్రల మేరకు పనిచేస్తున్న ఈ విభజనవాద శక్తులు రాజ్యాంగం, రిజర్వేషన్ల పేరుతో తప్పుడు వీడియోలను సృష్టించి అరాచకం, గందరగోళాన్ని వ్యాప్తి చేస్తూ దేశ పురోగతిని అడ్డుకోవాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఈ అవాంఛనీయ ప్రచారానికి తగిన రీతిలో జవాబిచ్చేందుకు ‘వీధులు, చట్టసభలు, సోషల్ మీడియా’ వంటి అన్ని వేదికలపై యువమోర్చా శ్రేణులు గట్టిగా నిలబడాలని ఆయన అన్నారు. విద్యా రంగంలో తీసుకొచ్చిన చారిత్రక సంస్కరణలను నబీన్ ప్రస్తావించారు. గత ప్రభుత్వాల హయాంలో మెడికల్ అడ్మిషన్లు, సీట్లు పూర్తిగా మాఫియా చేతుల్లో ఉండేవని, మోదీ ప్రభుత్వం ఈ మాఫియా రాజ్‌ను పూర్తిగా సమూలంగా నిర్మూలించిందని తెలిపారు. గతంలో ఏటా కేవలం 5,000 మంది విద్యార్థులు మాత్రమే వైద్య రంగంలోకి ప్రవేశించగలిగే వారని, నేడు 1.5 లక్షలకు పైగా యువకులు తమ ప్రతిభ ఆధారంగా విజయం సాధిస్తున్నారని వివరించారు. న్యాయ, వైద్య, ఇంజనీరింగ్, క్రీడలు, పరిశోధనా రంగాలకు చెందిన నిపుణులను పార్టీతో మరింత విస్తృతంగా అనుసంధానించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు.

యువ కార్యకర్తలకు రాజకీయ మంత్రాన్ని ఉపదేశిస్తూ, రాజకీయం 100 మీటర్ల పరుగు పందెం కాదని, అది నిరంతర కష్టంతో కూడిన సుదీర్ఘ మారథాన్ అని జాతీయ అధ్యక్షుడు స్పష్టం చేశారు. రాజకీయంలో ‘అదృష్టం’ లేదా ‘ఆకస్మిక’ విజయాన్ని తమ అదృష్టంగా భావించకూడదని, నేలపై ఉండి పోరాడే వారికి మాత్రమే దేవుని మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు. ఒక కార్యకర్త ప్రపంచాన్ని తన రెండు కళ్లతో చూస్తే, సమాజంలోని లక్షల కళ్లు నిరంతరం అతని ప్రవర్తనను అంచనా వేస్తూ ఉంటాయని గుర్తుచేశారు. సమాజంలో ప్రతికూల అభిప్రాయం ఏర్పడితే రాజకీయాల్లో వివరణ ఇచ్చుకునే అవకాశం దక్కదని హెచ్చరించారు. అందువల్ల 2029 ఎన్నికల్లో చారిత్రాత్మక విజయ పతాకాన్ని ఎగురవేయాలంటే, యువత మచ్చలేని ప్రవర్తనతో, సానుకూల దృక్పథంతో, నిరంతర ప్రజానాయకత్వంతో ప్రజల్లోకి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు.

అధ్యక్ష ప్రసంగంలో డాక్టర్ హేమంగ్ జోషి ఒక దిశ లేని రాజకీయాలను ఖండించారు. ‘దేశమే ప్రథమం’ అనే భావనను పెంపొందించడం, ‘వీఐపీ సంస్కృతి’కి స్వస్తి పలకడం అత్యంత ఆవశ్యకమని ఉద్ఘాటించారు. భారత ప్రజాస్వామ్య భవిష్యత్తు యువత భుజస్కందాలపైనే ఆధారపడి ఉందన్నారు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ నిర్మాణంలో భాగంగా యువమోర్చా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లను సందర్శించి యువతతో ప్రత్యక్ష, సానుకూల సంభాషణలు జరుపుతుందని తెలిపారు. 

యువతను ఉద్దేశించి మాట్లాడిన కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, కేంద్ర ప్రభుత్వ విద్యా, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, క్రీడా విధానాలను విపులంగా వివరించారు. బీజేవైఎం కార్యకర్తలు ఈ స్వావలంబన పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. బిజెపి ఒక సిద్ధాంత ఆధారిత పార్టీ అని, ఇక్కడ పదవులు, ప్రతిష్టల కంటే అంకితభావం కలిగిన కార్యకర్త అనే భావనకే అత్యంత ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. ‘భారత్ మాతా కీ జై’ అని గర్వంగా నినదించే నాయకత్వాన్ని యువతలో పెంపొందించాలని, సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలని ఆయన ఉద్ఘాటించారు.

సంస్థాగత సమన్వయాన్ని సమీక్షిస్తూ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి హరీష్ ద్వివేది, క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధాలకు మరింత పదును పెట్టాలని యువతను కోరారు. క్షేత్రస్థాయిలో యువతతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని, పార్టీ సిద్ధాంతాలను సమర్థంగా చేరవేయాలని, ప్రధాని ‘వికసిత్ భారత్ 2047’ సంకల్పంలో యువత చురుగ్గా భాగస్వామ్యమయ్యేలా ప్రోత్సహించాలని బీజేవైఎం కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా బీజేవైఎం జాతీయ ప్రధాన కార్యదర్శి అర్పిత అపరాజిత బడజేనా దేశవ్యాప్త ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం.. అరాచకవాదాన్ని అంతం చేద్దాం’ కార్యక్రమాలను సభకు తెలియజేశారు. ఈ భారీ కార్యక్రమాన్ని యువ సమ్మేళనాలు, క్యాంపస్ చర్చలు, జిల్లా స్థాయి ప్రజా సంబంధాల కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా వేగవంతంగా నిర్వహిస్తున్నట్టు వివరించారు.

 బిజెపి ఐటీ, సోషల్ మీడియా జాతీయ కన్వీనర్ దీపక్ మస్కే డిజిటల్ అనుసంధానంపై మాట్లాడారు. సోషల్ మీడియాలో ఏఐ టూల్స్ దుర్వినియోగం పెరగడం, తప్పుడు వార్తలు సృష్టిస్తున్న తీవ్ర సవాళ్లను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రతిపక్షాలు నడుపుతున్న తప్పుదోవ పట్టించే ప్రచారాలపై బీజేవైఎం బాధ్యులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, యువతకు సరైన, సానుకూల, ప్రామాణికమైన సమాచారాన్ని మాత్రమే చేరవేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.