దిల్లీలో రచ్చకెక్కిన కాంగ్రెస్ నేతల కుమ్ములాటలు!
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అంతర్గత, బహిరంగ విభేదాల పరంపరను ఎదుర్కొంటోంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ సొంత పార్టీ సహఆరోపణలు గుప్పిస్తున్నారు. దిల్లీలో రచ్చకెక్కిన ఈ అంతర్గత కుమ్ములాటలు రాష్ట్ర కాంగ్రెస్‌ను ఇబ్బందికరమైన స్థితిలోకి నెట్టింది. అక్కడ రాష్ట్ర మంత్రి సి. దామోదర్ రాజనరసింహ, జుక్కల్ ఎమ్మెల్యే టి. లక్ష్మీకాంతారావు ఒక హోటల్లో అందరూ చూస్తుండగానే తీవ్ర వాగ్వాదానికి దిగారు. మంత్రి, ఎమ్మెల్యే ‘నువ్వెంత.. అంటే నువ్వెంత’ అన్నట్టుగా చెలరేగిపోయారు. మంత్రి ఒకడుగు ముందుకేసి ‘నాతో పెట్టుకుంటే..’, ‘ఎక్కువ మాట్లాడితే..’, ‘పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే..’, ‘ఇదే హోటల్ రూములో పడేసి కొడ్తా బిడ్డా..’ అంటూ హెచ్చరించినట్టు తెలిసింది. ఈ విషయమై ఆ మంత్రి ధోరణిని ఎండగడుతూ ఆ ఎమ్మెల్యే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు చెబుతున్నారు. ఇద్దరూ ఒకరినొకరు బెదిరించుకోవడం, ఆరోపణలు చేసుకోవడం, దుర్భాషలాడుకోవడం చూసి సొంత పార్టీ నేతలే విస్మయం చెందారు.
ఇండియా కూటమి ఆధ్వర్యంలో జరిగిన రాంలీల ర్యాలీలో పాల్గొనేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఓ ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి నియామకం, ఇతర సంస్థాగత పదవుల విషయంలో అల్పాహారం తీసుకుంటున్నప్పుడు పరస్పరం వాగ్వాదానికి దిగినట్లు చెబుతున్నారు. అయితే, జిల్లాలో ఇసుక తవ్వకాలే అసలు సమస్య అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముడుపులు పంచుకోవడంలో పరస్పరం దుర్భాషలకు దిగారని చెప్పుకొంటున్నారు. వారిని గాంధీ భవన్ కు వచ్చి, సంజాయిషీ ఇచ్చుకోమని కోరడం తప్ప ఈ విషయమై అటు ముఖ్యమంత్రి, ఇటు పీసీసీ అధ్యక్షుడు ప్రేక్షకపాత్రకు పరిమితం అవుతున్నారు. ఇదిలా ఉండగా, పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఐటీ మంత్రి డి. శ్రీధర్ బాబు వర్గానికి, మంత్రి జి. వివేక్ వెంకటస్వామి కుమారుడు, ఎంపీ గడ్డం వంశీ కృష్ణ మద్దతుదారులకు మధ్య కూడా ఉద్రిక్తతలు తలెత్తాయి. అధికారిక కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాల్లో తనను పక్కన పెడుతున్నారని ఎంపీ మద్దతుదారులు ఆరోపిస్తుండగా, ప్రోటోకాల్ పాటిస్తున్నామని మంత్రి మద్దతుదారులు వాదిస్తున్నారు. దిల్లీ ర్యాలీకి హాజరుకాని ఎమ్మెల్యేలపై క్రమశిక్షణా చర్యలను వ్యతిరేకిస్తూ వంశీ కృష్ణ ఇటీవల శ్రీధర్ బాబుకు లేఖ రాయడం, ఈ విభేదాలకు మరో కోణాన్ని జోడించింది.
నల్గొండలో, నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డిని బహిరంగంగా ప్రశ్నించారు. “ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్‌కు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారా? లేక యావత్ తెలంగాణకు ఉన్నారా?” అని ఆయన ప్రశ్నించారు. హుజూర్నగర్, కోదాడలకు నిధులు మళ్లిస్తూ మునుగోడును నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తన నియోజకవర్గాన్ని మార్చడానికి రూ. 300 కోట్లు సరిపోతాయని, నిధుల కోసం తాను ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేలా పోరాడవలసి వస్తోందని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ పరిస్థితికి తోడు, దాదాపు రూ.40 కోట్ల విలువైన పెండింగ్ అభివృద్ధి బిల్లులను ఆమోదించకపోతే, 30,000 మందితో నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని జడ్చర్ల ఎమ్మెల్యే జె. అనిరుధ్ రెడ్డి హెచ్చరించడం ఈ ఇబ్బందిని మరింత పెంచింది. నా మరణం తర్వాతే ప్రభుత్వం స్పందిస్తుందా?” అని ఆయన ప్రశ్నించారు. నిధులు విడుదల చేసి, పెండింగ్‌లో ఉన్న రోడ్డు పనులను పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలను ఆయన కోరారు.
సంస్థాగత నియామకాలు, రాజకీయ నియమావళి, అభివృద్ధి నిధుల విషయంలో విభేదాలతో, తెలంగాణలోని కాంగ్రెస్ తన సొంత శ్రేణుల్లోనే ప్రజా వ్యతిరేకతను అణచివేసే సవాలును ఎదుర్కొంటోంది. ‘ఇప్పుడున్నది అసలు కాంగ్రెస్ కాదు.. ఇది కబ్జా కాంగ్రెస్ అయ్యింది. మేం పార్టీని నమ్ముకొని ఉన్నవాళ్లం. మేమే ఓనర్లం. మాపైనే పెత్తనం చేద్దామనుకుంటున్నరు’ అంటూ సచివాలయంలోనే రాష్ట్రానికి చెందిన ఓ కీలక మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ వర్గాలలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో సాక్షాత్తు కాంగ్రెస్‌లో ఓ సీనియర్ మంత్రి, అధిష్ఠానం వద్ద ఎంతో కొంత పలుకుబడి ఉన్న మంత్రే ఇలా వ్యాఖ్యానించడం చర్చకు దారి తీసింది. మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్నవారిని కాదని ఇప్పుడు కొత్తగా చేరినవారికి సంబంధించిన పనులు పార్టీలో, ప్రభుత్వంలో అవుతున్నాయని ఆ మంత్రి తేల్చి చెప్పారు. ఎంతో చరిత్ర ఉన్న తమలాంటి వారు చెప్పినోళ్లకు కా కుండా ఇతరులకు పదవులు వస్తున్నాయని ఆ మంత్రి వాపోయారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల విషయంలో కూడా ఇప్పటికే బ్రోకర్లు రంగప్రవేశం చేశారని, గతంలో ప్రతిపక్ష పార్టీలో ఉండి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఓడిపోయిన ఓ వ్యక్తికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇప్పించడం ఖాయమైనట్టు కనిపిస్తున్నదని, దీనికి బ్రోకర్‌గా వ్యవహరించింది రాష్ర్టానికే చెందిన ఓ ఎమ్మెల్యే ఆరోపణలు గుప్పించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న రాజకీయ సవాళ్లకు తోడుగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నవంబర్ 2న హైదరాబాద్‌లో బిజెపి జరిపిన పాదయాత్రలో పాల్గొంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని, ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ, తెలంగాణను “దిల్లీలో కూర్చున్న కాంగ్రెస్ నాయకులకు ఏటీఎం”గా మార్చేశారని అమిత్ షా ఆరోపించారు. ఆయన “ఆర్ఆర్ ట్యాక్స్” అనే పదాన్ని కూడా ఉపయోగించారు. అయినా, కాంగ్రెస్ వర్గాలు కుమ్ములాటలతో మునిగిపోయి చుట్టూ ఏమిజరుగుతుందో పట్టించుకొనే పరిస్థితుల్లో లేరు.
ప్రవీణ్

