పటేల్ వల్లే తెలంగాణ విముక్తి
సర్దార్ పటేల్ వల్లే నిజాం చెర నుంచి తెలంగాణ విముక్తి పొందిందని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఇరువురు నేతలు పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్. గౌతం రావు, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కర్ణాటక సహ ఇన్ఛార్జ్ డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్. రాంచందర్ రావు మాట్లాడుతూ.. దేశ సమగ్రత, సార్వభౌమాధికార పరిరక్షణ కోసం తన జీవితాన్ని ధారపోసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తూ వందలాది సంస్థానాలను ఏకం చేసి, ఆధునిక భారతదేశానికి పటిష్టమైన పునాది వేసిన ఘనత పటేల్‌దేనని పేర్కొన్నారు. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు దశాబ్దాల పాటు పటేల్ సేవలను మరుగున పరిచే ప్రయత్నం చేశాయని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ పటేల్ కు గుజరాత్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ని నిర్మించారని అన్నారు. ఆయన జయంతిని ‘జాతీయ ఐక్యతా దినోత్సవం’గా దేశవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించడం ద్వారా పటేల్ కీర్తిని దశదిశలా వ్యాపింపజేశారని తెలిపారు. తెలంగాణ విముక్తిలో సర్దార్ పటేల్ పాత్ర అజరామరమని, నేటి యువత ఆయన క్రమశిక్షణ, దేశభక్తి, నిస్వార్థ సేవలను ఆదర్శంగా తీసుకుని నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో కాంగ్రెస్‌లో మెజారిటీ సభ్యులు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌ను తొలి ప్రధానమంత్రిగా కోరుకున్నప్పటికీ, నాటి నెహ్రూ కుటుంబం అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కాలరాసి, ప్రజా మద్దతు లేని నెహ్రూను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టిందని విమర్శించారు. అదే దేశంలో తొలి ‘ఓటు చోరీ’ అని వ్యాఖ్యానించారు. నెహ్రూ విధానాలతో సంస్థానాల విలీన ప్రక్రియలో గందరగోళం ఏర్పడినా, పటేల్ సాహసోపేత నిర్ణయాలతో 550కి పైగా సంస్థానాలను భారత్‌లో విలీనం చేసి అఖండ భారత నిర్మాణానికి కృషి చేశారని కొనియాడారు. ప్రత్యేకించి హైదరాబాద్ సంస్థానంలో నిజాం ప్రైవేట్ సైన్యమైన రజాకార్ల దాడులు, దౌర్జన్యాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా నాటి ప్రధాని నెహ్రూ స్పందించలేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. పటేల్ చొరవతో ‘ఆపరేషన్ పోలో’ చేపట్టి నిజాంను లొంగదీసుకుని హైదరాబాద్‌లో మువ్వన్నెల జెండా ఎగురవేశారని గుర్తుచేశారు. జమ్ము కశ్మీర్ విషయంలోనూ నెహ్రూ తీసుకున్న నిర్ణయాలు ఆ ప్రాంతంలో దీర్ఘకాలిక సమస్యలకు కారణమయ్యాయని, సరిహద్దు ఉగ్రవాదం, యుద్ధాల వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. ప్రధాని మోదీ ఆర్టికల్ 370ని రద్దు చేసి, కశ్మీర్లో రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేయడం ద్వారా పటేల్ కలలను సాకారం చేశారని పేర్కొన్నారు. బార్డోలీ సత్యాగ్రహంలో రైతుల పక్షాన పోరాడి ‘సర్దార్’ బిరుదు పొందిన పటేల్ చరిత్రను యువత, రైతాంగం గుర్తుంచుకోవాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

