violent protest

ప్రజాస్వామ్య సంస్థలను దెబ్బతీసే కుట్రలు ఫలించవు

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు జెన్‌-జీ తిరుగుబాట్ల గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. తాము సాధించలేని లక్ష్యాలను యువత వీధుల్లోకి వచ్చి సాధిస్తారనే ఆశతో పలు దేశాల్లోని ప్రతిపక్ష రాజకీయ శక్తులు ఎదురుచూస్తున్నాయి. మరికొందరు జెన్‌-జీ ఉద్యమాలను ఆసరాగా చేసుకుని తమ తమ దేశాల్లోని పాలక వ్యవస్థలపై పాత కక్షలు తీర్చుకోవాలని చూస్తున్నారు. కొన్ని దేశాల్లో జెన్‌-జీ ఆందోళనకారులు ప్రజల మద్దతును పొందగలిగినప్పటికీ, చెప్పుకోదగిన ఫలితాలను సాధించడంలో పూర్తిగా విఫలమయ్యారు. అల్బేనియా, బంగ్లాదేశ్, మొరాకో, ఫ్రాన్స్, మడగాస్కర్ వంటి ఒకదానికొకటి భిన్నమైన దేశాల్లో ఇటీవల జరిగిన ఉద్యమాలను పరిశీలిస్తే, అన్ని చోట్లా ఒకే విధమైన వ్యూహం పనిచేయదని స్పష్టమవుతోంది. అంతేకాకుండా, సృజనాత్మక ఆలోచనలు కలిగిఉన్నప్పటికీ, అనుభవం ఏమాత్రం లేని నిర్వాహకులు ఈ ఉద్యమాల విషయంలో తీవ్ర గందరగోళంలో ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే జెన్‌-జీ ఉద్యమాల చుట్టూ మొదట్లో కనిపించిన ఉత్సాహం క్రమంగా ప్రపంచవ్యాప్తంగా తగ్గిపోతోంది. భారత్ కూడా ఇందుకు మినహాయింపు కాదు.

సుమారు ఏడాది క్రితం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌కు చెందిన ఒక పరిశోధకుడు, బ్లాగర్ వివిధ దేశాల్లో యువజన ఉద్యమాలు విఫలం కావడానికి గల కారణాలను విశ్లేషిస్తూ ఒక వ్యాసం రాశారు. అందులోని రెండు పరిశీలనలు వాస్తవికమైనవి, విశేషంగా ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. మొదటిది.. ప్రభుత్వాలు బలహీనంగా ఉన్నప్పుడు, అంతర్గత విభేదాలతో సతమతమవుతున్నప్పుడు లేదా సంక్షోభంలో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి ఉద్యమాలు విజయవంతమవుతాయి. రెండోది, జెన్‌-జీ యువతలోని ఉత్సాహం ఉద్యమాలకు ఊపునివ్వగలదు. అయితే, శాశ్వత విజయాలు సాధించాలంటే కార్మికులు, కార్మిక సంఘాలు, వృత్తి నిపుణులు, వృద్ధతరం కూడా వాటిలో భాగస్వాములు కావాలి. చాలా ఉద్యమాల్లో వీరి భాగస్వామ్యం లేకపోవడమే ప్రధాన బలహీనతగా మారింది.

భారత్‌లో పాక్షికంగా వ్యవస్థీకృతమైన అనేక ఉద్యమాల చరిత్ర ఉంది. చివరకు వాటిని ప్రజలే తిరస్కరించారు. దీనికి నక్సలైట్ ఉద్యమమే ఒక ఉదాహరణ. హింసాత్మక పద్ధతుల ద్వారా కొన్ని ప్రాంతాల్లోని బలహీన వర్గాలపై నక్సలైట్లు కొంతకాలం ప్రభావం చూపగలిగారు. అయితే, వారి ప్రభావం కొన్ని రాష్ట్రాల్లోని పరిమిత ప్రాంతాలకే పరిమితమైంది. నక్సలైట్ భావజాలాన్ని బహిరంగంగా సమర్థించే రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల్లో ప్రజల నుంచి ఆశించిన మద్దతును పొందలేకపోయాయి. చాలాకాలంగా ఉన్న రాజకీయ పార్టీలకు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకునేందుకు ప్రయత్నించిన వారు కూడా చాలా సందర్భాల్లో విఫలమయ్యారు. రెండు దశాబ్దాల క్రితం మేధా పాట్కర్ వివిధ ప్రజా ఉద్యమాలతో సంబంధం ఉన్న నాయకులను ఒక వేదికపైకి తీసుకువచ్చి, ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజకీయ వేదికను ఏర్పాటు చేయాలని ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం ఘోరంగా విఫలమైంది. భాష లేదా ప్రాంతీయ అస్తిత్వాన్ని ప్రాతిపదికగా చేసుకుని ప్రజలను సమీకరించేందుకు కొన్ని ప్రాంతీయ పార్టీలు ప్రయత్నించాయి. అయితే, వాటి రాజకీయ ప్రభావం కూడా స్వల్పకాలానికే, కొన్ని భౌగోళిక ప్రాంతాలకే పరిమితమైంది.

భారతీయ సమాజం అస్థిరతను ఏమాత్రం ఇష్టపడదు. వాస్తవానికి ప్రస్తుత యువజన ఉద్యమంలో గతంలో ఉన్న లక్ష్య సాధన పట్ల నిబద్ధత, పరిణతి కనిపించడం లేదు. అయినప్పటికీ గత ఉద్యమాల నుంచి కొన్ని ముఖ్యమైన పాఠాలను నేర్చుకోవచ్చు. స్వాతంత్య్ర సమరయోధులు తమ కాలంలోని న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉంచడానికి బలమైన కారణాలున్నాయి. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న దాదాపు అన్ని రాజకీయ, సామాజిక పక్షాలు తమ ఉద్యమాలకు పునాదిగా ప్రజల్లో చైతన్యం కల్పించే కార్యక్రమాలను నిర్వహించాయి. స్వాతంత్య్రానంతరం కూడా వివిధ ఉద్యమాలకు నాయకత్వం వహించిన నేతలు ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు క్షేత్రస్థాయిలో ఉద్యమాలను నడిపించారు. ప్రజాస్వామ్య సంస్థలపై కృత్రిమంగా అపనమ్మకం కల్పించే ప్రయత్నాలు భారత ప్రజల ఆలోచనా విధానాన్ని సాధారణంగా ప్రభావితం చేయలేవు. ప్రధానమంత్రికి మాత్రమే ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) నియామకంపై పూర్తి విచక్షణాధికారం ఉన్న కాలంలోనూ ప్రజలు ఎన్నికల సంఘం (ఈసీఐ)పై విశ్వాసం ఉంచారు. కఠినమైన ఎమర్జెన్సీ కాలంలో కూడా న్యాయవ్యవస్థ, మీడియా, పరిమిత అధికారాలతో కొనసాగిన పార్లమెంటుపై ప్రజలు నమ్మకాన్ని కోల్పోలేదు.

మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, రాజ్యాంగ పీఠికలో భారత గణతంత్రాన్ని వర్ణించేందుకు ‘సామ్యవాద’, ‘లౌకిక’ అనే పదాలను చేర్చుతూ పార్లమెంటు చేసిన నిర్ణయాన్ని సులభంగా వెనక్కి తీసుకోవచ్చు. అయినప్పటికీ ఆ ప్రభుత్వం అటువంటి చర్యకు దిగకుండా ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని కాపాడేందుకు విశేష సంయమనం పాటించింది. అలాగే జాతీయ భద్రత దృష్ట్యా బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో సరిహద్దు తనిఖీ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన భూమిని స్వాధీనం చేసుకునేందుకు మమతా బెనర్జీ ప్రభుత్వ నిరాకరణను అధిగమిస్తూ మోదీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావచ్చు. కానీ అలా చేయకుండా రాజ్యాంగ వ్యవస్థకు లోబడి వ్యవహరించింది. ఎమర్జెన్సీ అనంతరం భారత ఓటర్లలో తమ ఓటు హక్కుపై విశ్వాసం మరింత పెరిగింది. తమ నిర్ణయం తీసుకున్నప్పుడు ఎన్నికల ద్వారా ప్రభుత్వాలను మార్చగల శక్తి తమకుందని వారికి తెలుసు.

ప్రస్తుతం మనం సమాజంలోనే కాకుండా కుటుంబాల్లో కూడా తరాల మధ్య అంతరాన్ని చూస్తున్నాం. ఒకవైపు అన్నీ తక్షణమే జరిగిపోవాలనే అసహనంతో కూడిన, ఆచరణ సాధ్యం కాని ‘ఇప్పుడే, ఇక్కడే’ అనే ఆలోచనా ధోరణి ఉంది. మరోవైపు అనుభవం ద్వారా పరిపక్వత సాధించిన పెద్దలు అనుసరించే ‘సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి’ అనే దృక్పథం ఉంది. ఈ రెండింటి మధ్య సంఘర్షణ కొనసాగుతోంది. దీని నుంచి నేర్చుకోవాల్సిన పాఠం స్పష్టంగా ఉంది. ప్రభుత్వాలను మార్చాలంటే సంవత్సరాల తరబడి కష్టపడాలి. ప్రజాభిప్రాయాన్ని నిరంతరం సమీకరిస్తూ, ప్రజల్లో చైతన్యం కల్పించాలి. ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా కనిపిస్తూ చేసే పనికిమాలిన ప్రయత్నాలను భారత్ ఎప్పుడూ తిరస్కరిస్తూనే ఉంది. ఇక్కడ అడ్డదారులకు, తాత్కాలిక మార్గాలకు చోటు లేదు.

వినయ్ సహస్రబుద్ధే,
బిజెపి సీనియర్ నాయకుడు