ఇంధన రంగంలో భారత్ ఇప్పటికే అగ్రదేశం
దేశ విద్యుదుత్పత్తి రంగంలో పునరుత్పాదక ఇంధన వనరుల వాటా అంతకంతకు పెరుగుతోందని, 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలన్న లక్ష్యంతో భారత్ ముందుకువెళుతోందని కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. పునరుత్పాదక ఇంధన వినియోగం వల్ల 2024లో రూ.4 లక్షల కోట్లు ఆదా అయ్యాయన్నారు. పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 64 లక్షలకు పైగా కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని, ఈ ఏడాది చివరి నాటికి 75 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. స్వచ్ఛ ఇంధన రంగంలో భారత్ ఇప్పటికే ప్రపంచంలో కీలక శక్తిగా ఎదిగిందని, సౌర విద్యుత్ సామర్థ్యంలో ప్రపంచంలో మూడో స్థానంలో, పవన విద్యుత్‌లో నాలుగో స్థానంలో ఉన్నామన్నారు. ఒక ఆంగ్ల వార్తాపత్రికకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత ఇంధన రంగం, స్వచ్ఛ ఇంధన తదితర అంశాలపై మాట్టాడారు. అందులోని ముఖ్యాంశాలు:
ప్రశ్న: 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన సామర్థ్య లక్ష్యాన్ని చేరుకోవడంలో సవాళ్లేమిటి?
జ: 2025 జూన్‌లోనే దేశ స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో 50 శాతం శిలాజేతర ఇంధన వనరుల నుంచి సాధించాం. 2026 సెప్టెంబర్ నాటికి ఇది 53.54 శాతానికి చేరింది. పునరుత్పాదక ఇంధన వినియోగం వల్ల 2024లో శిలాజ ఇంధనాలు, కాలుష్య సంబంధిత ఖర్చుల్లో భారత్‌కు రూ.4 లక్షల కోట్ల ఆదా జరిగింది. సౌర విద్యుత్ ప్రాజెక్టులకు భూసేకరణ ప్రధాన సవాలు. ఇందుకోసం అనువైన భూములను గుర్తించాలని, వ్యవసాయ భూముల వినియోగ నిబంధనలను సరళీకరించాలని రాష్ట్రాలను కోరుతున్నాం. 500 గిగావాట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు గ్రీన్ ఎనర్జీ (స్వచ్ఛ ఇంధన) కారిడార్లు, విద్యుత్ ప్రసార వ్యవస్థల విస్తరణ, బ్యాటరీ నిల్వ కేంద్రాలు, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, పీఎం సూర్య ఘర్, పీఎం-కుసుమ్, జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నాం.
ప్ర2: ఏఐ, డేటా సెంటర్ల వల్ల పెరిగే విద్యుత్ డిమాండ్‌ను ఎలా తీర్చనున్నారు?
జ: దేశంలో ప్రస్తుత స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 554.54 గిగావాట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో 271 గిగావాట్ల గరిష్ఠ విద్యుత్ డిమాండ్‌ను విజయవంతంగా తీర్చాం. ఇందులో దాదాపు మూడో వంతు పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి అందించాం. కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ అంచనాల ప్రకారం, 2031-32 నాటికి డేటా సెంటర్ల విద్యుత్ అవసరం 26.3 గిగావాట్లకు చేరుతుంది. ప్రస్తుతం దేశంలో శిలాజేతర ఇంధన సామర్థ్యం 308 గిగావాట్లను దాటింది. 2030 నాటికి 500 గిగావాట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. డేటా సెంటర్ల విద్యుత్ అవసరాల్లో ప్రధాన భాగాన్ని పునరుత్పాదక ఇంధనం, నిల్వ వ్యవస్థలు, అణు విద్యుత్ ద్వారా తీర్చేందుకు అవకాశాలున్నాయి.
ప్ర: బ్యాటరీ, పంప్డ్ స్టోరేజ్ సామర్థ్యాన్ని పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
జ: 2030 నాటికి దేశానికి 60.63 గిగావాట్ల ఇంధన నిల్వ సామర్థ్యం అవసరమని కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సిఈఏ) అంచనా వేసింది. ఇందులో 18.98 గిగావాట్లు పంప్డ్ స్టోరేజ్, 41.65 గిగావాట్లు బ్యాటరీ నిల్వ వ్యవస్థల ద్వారా సమకూరాలి. బ్యాటరీల దేశీయ తయారీ కోసం రూ.18,100 కోట్లతో 50 గిగావాట్ అవర్ సామర్థ్యం కలిగిన తయారీ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాం. మరోవైపు 43 గిగావాట్ అవర్‌కు పైగా బ్యాటరీ నిల్వ ప్రాజెక్టులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. సౌర విద్యుత్ కేంద్రాలకు అనుబంధంగా నిల్వ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సూచించాం. 2035-36 నాటికి 100 గిగావాట్ల పంప్డ్ స్టోరేజ్ సామర్థ్యాన్ని సాధించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం.
ప్ర: సౌర పరికరాల తయారీలో దిగుమతులపై ఆధారపడటాన్ని ఎలా తగ్గిస్తారు?
జ: 2026 సెప్టెంబర్ నాటికి దేశీయ సౌర మాడ్యూళ్ల తయారీ సామర్థ్యం 225 గిగావాట్లకు, సౌర సెల్స్ తయారీ సామర్థ్యం 37 గిగావాట్లకు చేరింది. దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు పీఎల్ఐ (ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు పథకం), దిగుమతి సుంకాల విధానం, ఆమోదిత తయారీదారుల జాబితా వంటి చర్యలు తీసుకున్నాం. 2025-26లో రూఫ్‌టాప్ సౌర విద్యుత్, పీఎం-కుసుమ్ ద్వారా 16.3 గిగావాట్ల సామర్థ్యం అదనంగా అందుబాటులోకి వచ్చింది. ఈ చర్యలు దేశీయ తయారీని మరింత బలోపేతం చేస్తున్నాయి.
ప్ర: గ్రీన్ హైడ్రోజన్ వినియోగాన్ని పెంచేందుకు ఏ రంగాలపై దృష్టి పెడుతున్నారు?
జ: 2030 నాటికి ఏడాదికి 50 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. గ్రీన్ హైడ్రోజన్ పథకం కింద 17 కంపెనీలకు ఏడాదికి 7.56 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యానికి, మరో 15 కంపెనీలకు 3,000 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్ తయారీ సామర్థ్యానికి కాంట్రాక్టులు ఇచ్చాం. ప్రస్తుతం రిఫైనరీలు, ఎరువుల పరిశ్రమల నుంచి ప్రధానంగా డిమాండ్ వస్తోంది. భవిష్యత్తులో ఉక్కు, రవాణా, నౌకాయాన రంగాల్లోనూ వినియోగం పెరుగుతుంది. ఈ రంగాల్లో ప్రయోగాత్మక ప్రాజెక్టులు చేపట్టాం. గ్రీన్ హైడ్రోజన్ తయారీ, ఎలక్ట్రోలైజర్ల ఉత్పత్తి, ప్రత్యేక హబ్‌ల అభివృద్ధికి ప్రభుత్వం మద్దతు ఇస్తోంది.
ప్ర: అపార్ట్మెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రూఫ్‌టాప్ సౌర విద్యుత్‌ను ఎలా విస్తరిస్తారు?
జ: పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 64 లక్షలకు పైగా కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. ఈ సంఖ్యను ఏడాది చివరి నాటికి 75 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సుమారు 21 లక్షల కుటుంబాలకు కనీసం ఒక బిల్లింగ్ కాలంలో సున్నా విద్యుత్ బిల్లులు వచ్చాయి. ఇప్పటికే 18 వేల రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు రూఫ్‌టాప్ సౌర విద్యుత్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. వీటి ద్వారా 8.58 లక్షల కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నాయి. అపార్ట్మెంట్లలో ఉమ్మడి సౌర విద్యుత్ వినియోగానికి వర్చువల్ నెట్ మీటరింగ్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నాం. రూఫ్‌టాప్ సౌర విద్యుత్ విస్తరణ కోసం 100 నగరాలను గుర్తించగా, 46 నగరాల్లో ప్రత్యేక కన్సల్టెంట్లను నియమించాం.
ప్ర: ప్రపంచ స్వచ్ఛ ఇంధన తయారీ రంగంలో భారత్ పోటీతత్వాన్ని ఎలా పెంచుతుంది?
జ: స్వచ్ఛ ఇంధన రంగంలో భారత్ ఇప్పటికే ప్రపంచంలో కీలక శక్తిగా ఎదిగింది. 2014లో 76 గిగావాట్లుగా ఉన్న పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 2026 సెప్టెంబర్ నాటికి 308.02 గిగావాట్లకు పెరిగింది. సౌర విద్యుత్ సామర్థ్యంలో ప్రపంచంలో మూడో స్థానంలో, పవన విద్యుత్‌లో నాలుగో స్థానంలో ఉన్నాం. దేశంలో 184 తయారీ కేంద్రాల ద్వారా 225 గిగావాట్ల సౌర మాడ్యూళ్ల తయారీ సామర్థ్యం అందుబాటులో ఉంది. అధిక సామర్థ్యం కలిగిన ఎలక్ట్రోలైజర్ల తయారీని ప్రోత్సహిస్తున్నాం. దేశీయ బ్యాటరీ తయారీకి అవసరమైన కీలక ఖనిజాల సరఫరాను భద్రపరిచేందుకు క్రిటికల్ మినరల్స్ మిషన్ (కీలక ఖనిజాల కార్యక్రమం) ను కూడా అమలు చేస్తున్నాం.
ప్ర: బొగ్గు వినియోగం, స్వచ్ఛ ఇంధన లక్ష్యాల మధ్య సమతుల్యత ఎలా సాధిస్తారు?
జ: బొగ్గు వినియోగాన్ని ఒక్కసారిగా తగ్గించకుండా క్రమంగా, ఆచరణాత్మకంగా ఇంధన పరివర్తన చేపట్టాలి. ఆర్థిక అభివృద్ధితో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నందున బొగ్గు భవిష్యత్తులోనూ కీలక పాత్ర పోషిస్తుంది. అదే సమయంలో సౌర, పవన, జల, అణు విద్యుత్, బ్యాటరీ నిల్వ వ్యవస్థల్లో పెట్టుబడులు పెంచుతాం. బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల సామర్థ్యాన్ని మెరుగుపరచి ఉద్గారాలను తగ్గిస్తాం. రవాణా, పరిశ్రమల్లో విద్యుదీకరణ, గ్రీన్ హైడ్రోజన్ వినియోగం ద్వారా శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గిస్తాం. 2070 నాటికి నెట్‌జీరో ఉద్గారాల లక్ష్యాన్ని సాధించేందుకు ఈ సమతుల్య విధానం దోహదపడుతుంది.
ప్ర: వచ్చే రెండేళ్లలో మంత్రిత్వ శాఖ ప్రధాన ప్రాధాన్యతలు ఏమిటి?
జ: కేవలం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, విశ్వసనీయమైన, సమగ్ర స్వచ్ఛ ఇంధన వ్యవస్థను నిర్మించడంపై దృష్టి సారిస్తాం. సౌర, పవన, హైబ్రిడ్ విద్యుత్ ప్రాజెక్టుల విస్తరణ, గ్రీన్ ఎనర్జీ కారిడార్ల బలోపేతం, బ్యాటరీ, పంప్డ్ స్టోరేజ్ సామర్థ్యాల పెంపు మా ప్రధాన ప్రాధాన్యతలు. పీఎం సూర్య ఘర్, పీఎం-కుసుమ్ పథకాల విస్తరణతోపాటు దేశీయ సౌర పరికరాల తయారీ, గ్రీన్ హైడ్రోజన్, ఆఫ్‌షోర్ పవన విద్యుత్, బయో ఎనర్జీ రంగాలను ప్రోత్సహిస్తాం. డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం, మెరుగైన విద్యుత్ నిర్వహణ ద్వారా గ్రిడ్ సామర్థ్యాన్ని పెంచుతాం. ఈ చర్యలు ఇంధన భద్రతను బలోపేతం చేయడంతోపాటు ఉపాధి అవకాశాలను సృష్టించి, నెట్‌జీరో లక్ష్య సాధనకు దోహదపడతాయి.

