Hamara Sankalp Vikasit Bharat

బీఆర్ఎస్ ఉనికి కోసం కేసీఆర్ తంటాలు

లోక్ సభ ఎన్నికలలో తెలంగాణలో తాము రెండంకెల సీట్లు సాధిస్తామని చెప్పుకొంటూ సగానికి పైగా సీట్లు గెలుచుకునే లక్ష్యంతో బిజెపి పట్టుదలతో ప్రచారం చేసుకొంటుంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం తాము 8 సీట్లలో గెలవబోతున్నామని చెప్పుకొంటున్నారు. దాదాపు అన్ని సర్వేలు బీఆర్ఎస్ కు 2, 3 సీట్లకు మించి వచ్చే అవకాశం లేదని చెప్పుకొస్తుండటం గమనార్హం. ఈ సందర్భంగా కాంగ్రెస్ నుండి 20 మంది ఎమ్యెల్యేలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కలకలం రేపే ప్రయత్నం చేసినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడకు బీఆర్ఎస్ నుండి ఎటువంటి ప్రమాదం లేదని భరోసా ఇస్తూనే బిజెపి కాచుకొని కూర్చుందని, ఎపుడైనా ఆ ప్రభుత్వాన్ని కూల్చివేయవచ్చంటూ హెచ్చరించే ప్రయత్నం చేశారు.

బీఆర్ఎస్ లో ఎంపీలు, ఎమ్యెల్యేలు తమ దారి తాము చూసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్ లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన కడియం కావ్య ఆ పార్టీ నుండి గెలవడం కష్టమని గ్రహించి, కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల అనంతరం ఆ పార్టీ రాజకీయ ఉనికి ప్రశ్నార్ధకమే. అయితే, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న కేసీఆర్ జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొనే ప్రయత్నం చేయకుండా ప్రగల్భాలు పలుకుతున్నారు. కొద్ది నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలలో తిరుగుబాటు ధోరణి కనిపిస్తున్నా ఇటువంటి గాంభీర్యాన్ని ప్రదర్శించారు. ఓటింగ్ పూర్తయిన తర్వాత కూడా వందకు పైగా అసెంబ్లీ సీట్లు వస్తాయని, సర్వేలు అన్నీ ఇదే మాట చెప్తున్నాయని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల ముందు కూడా కేసీఆర్ అదే సీన్ రిపీట్ చేస్తున్నారు. సర్వేలు బీఆర్ఎస్ కే అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు. కానీ తెలంగాణలో పరిస్థితి అంతా రివర్స్ లో ఉందనే విషయం కేసీఆర్ కు కూడా తెలుసు. ఈ మాటలు చూస్తుంటే లోక్ సభ ఎన్నికల ముందు, తర్వాత కూడా పార్టీని కాపాడుకునేందుకు కేసీఆర్ నానా తంటాలు పడుతున్నట్లు కనిపిస్తోంది.

లోక్ సభ ఎన్నికల్లో గౌరవ ప్రదమైన సీట్లు కూడా రాకపోతే బీఆర్ఎస్ ఉనికి కూడా కష్టమనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఇప్పుడు 20 నుంచి 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పినట్లు భావించాల్సి వస్తుంది. అధికార పక్షం నుండి ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతిపక్షంలోకి ఎమ్యెల్యేల వలస సాధ్యమయ్యే పని కాదు. అదే జరిగితే స్పీకర్ ద్వారా అనర్హత వేటు వేయించే ప్రమాదం ఉంది. ఎన్నికలు జరిగి ఇంకా నిండా ఐదు నెలలు కూడా పూర్తి కాని తరుణంలో ఇలాంటి రిస్క్ ఎవరు చేస్తారు? ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూముల ఆక్రమణలో, ఇతరత్రా అవినీతి కార్యకలాపాల్లో నిండా మునిగిన నేతలే ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అటువంటి వారితో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేరసారాలు జరుపుతున్నట్లు చెప్పుకొంటున్నారు.

మియాపూర్ భూముల కుంభకోణంలో కేశవరావు పాత్రపై ఆరోపణలు గుప్పించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయనను దగ్గరకు తీసుకోవడం చూసాం. అలాగే ఓ హాస్పిటల్ కు విలువైన భూములను కారుచవకగా ఇవ్వడంపై ప్రతిపక్షంలో గందరగోళం చేసి, ఇప్పుడు ఆ భూములను వారికే తిరిగి కట్టబెట్టిన వైనం చూసాం. అదేవిధంగా కోకాపేట భౌముల విషయంలో ప్రదర్శిస్తున్న మౌనం కూడా ఆ వ్యవహారాలలో చిక్కుకున్న బీఆర్ఎస్ నేతలను దగ్గరకు చేర్చుకొనే ఎత్తుగడగా వెల్లడవుతుంది. ఇటువంటి తరుణంలో ఈ ప్రభుత్వం ఏడాది కూడా ఉంటుందో, ఉండదో చూడాలి అంటూ పార్టీ మారాలి అనుకునే ఆలోచన ఉన్న బీఆర్ఎస్ నేతలు పునరాలోచనలో పడేలా చేయటమే కేసీఆర్ తక్షణ వ్యూహంగా కనిపిస్తోంది. కేసీఆర్ చెబుతున్నట్లు నిజంగా కాంగ్రెస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు బయటకు పోయే పరిస్థితే ఉంటే వారంతా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి వైపు మొగ్గుచూపే అవకాశం ఉంటుంది, కానీ వలసలను నిరోధించలేకపోతున్న బీఆర్ఎస్ వైపు కాదు. 

ప్రవీణ్