Modi Guarantee

బడుగుల కోటాను ముస్లింలకు ఇచ్చే కుట్రను భగ్నం చేస్తాం

కర్ణాటకలో ఈ పని చేసిన కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణలో కూడా చేస్తానని ప్రకటించింది

వామపక్షాలతో కలిసి కేరళను ఆర్థికంగా దివాళా తీయించిన కాంగ్రెస్ ఇప్పుడు కర్ణాటక, తెలంగాణలను కూడా నాశనం చేయబోతోంది

మా కార్యకర్తల్లో ఎప్పటికీ అలసత్వం ఉండదు, ఇప్పటికీ బూత్ ల దగ్గర కనిపించేది బిజెపి కార్యకర్తలే

Modiత రిజర్వేషన్లను మన రాజ్యాంగం నిషేధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీల రిజర్వేషన్లు ముస్లింలకు ఇచ్చిందన్నారు. ముస్లింలందరినీ ఓబీసీలుగా వర్గీకరించిందని తెలిపారు. మూడవ పదవీ కాలంలో ‘ఒక దేశం, ఒక ఎన్నిక’ విషయంపై నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. ‘ఒక దేశం, ఒక ఎన్నిక’ ఒక దేశంగా మన సమయం, కృషి, వనరులు దేశ నిర్మాణానికి మరింత ఉత్పాదకంగా ఉపయోగపడేలా చూస్తుందన్నారు. ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) బిజెపి ఎజెండాలో ఒక ప్రధాన అంశమని స్పష్టం చేశారు. మతాల కోసం ప్రత్యేక చట్టాలు సమాజ ఆరోగ్యానికి హానికరం అని అన్నారు. ఒక వర్గం రాజ్యాంగ నిబంధనలతో పురోగమిస్తున్నప్పుడు మరొక వర్గం బుజ్జగింపుల కారణంగా వెనకబడిపోతే ఒక దేశంగా మనం అభివృద్ధి చెందలేమన్నారు. భారతదేశంలో యూసీసీని సాకారం చేయడానికి శాయశక్తులా కృషి చేస్తామన్నారు. బిజెపి మేనిఫెస్టోలో సాధించగలిగేవి మాత్రమే ఉన్నాయని, అమలు చేయలేని వాగ్దానాలపై నమ్మకం లేదన్నారు. గత 10 సంవత్సరాలలో దేశాభివృద్ధి కోసం ఒక బలమైన పునాదిని నిర్మించామని, ఇది ట్రైలర్ మాత్రమే అని, ఇంకా చేయాలనుకున్నది చాలా ఉందన్నారు. ఎన్డీయే 400కి పైగా సీట్లను సాధిస్తుందన్న నమ్మకాన్ని పునరుద్ఘాటించారు. ఒక ఆంగ్ల జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికలలో ప్రధానాంశాలుగా ఉన్న విషయాలపై మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు చూద్దాం.

ప్ర:మీరు 400 కి పైగా సీట్లు వస్తాయన్న ఆశాభావంతో ఉన్నారా?

జ:ఎన్నికల ప్రకటన తర్వాత ఇప్పటి వరకు 100కి పైగా ర్యాలీలు, రోడ్‌షోలలో పాల్గొన్నాను. నేను వెళ్లిన ప్రతి చోటా, అపూర్వమైన ప్రేమ, ఆప్యాయత, మద్దతును చూశాను. ప్రజల ఆదరణే 400 సీట్లు దాటే దిశగా అడుగులు వేస్తున్నామన్న విశ్వాసాన్ని కలిగిస్తోంది. మేం ఏమి అందించగలమో ప్రజలు చూశారు. వారు మంచి భవిష్యత్తును కోరుకుంటున్నారు. బిజెపికి ఓటు అంటే అభివృద్ధికి ఓటు అని వారికి తెలుసు.

రెండు దశల పోలింగ్ ముగిశాక ప్రతిపక్షాలు నిస్పృహలో మునిగిపోయాయి. మేం 400 సీట్లు లక్ష్యంగా పెట్టుకోడానికి ప్రధాన కారణం మన దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను పరిరక్షించడం. వారి రిజర్వేషన్లను, హక్కులను తొలగించి, వాటిని తమ సొంత ఓటు బ్యాంకుకు ఇవ్వాలనే ప్రతిపక్షాల కుట్రలను భగ్నం చేయడానికి మాకు భారీ మెజారిటీ అవసరం.

ప్ర: మీరు రాజ్యాంగాన్ని మార్చడం కోసమే సూపర్ మెజారిటీని లక్ష్యంగా పెట్టుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి?

జ:రాజ్యాంగాన్ని ఇప్పటివరకు గరిష్టంగా మార్చిన వారే మేం రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పడం విడ్డూరం. కానీ అలాంటి ప్రశ్న అడిగే ముందు, మీరు నా చరిత్రను గమనించాలి. నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మీరు నా పనిని, చర్యలను అధ్యయనం చేయాలి. నేను అలాంటి పని ఏమైనా చేశానా అని చూడాలి.

ప్ర:పార్టీ కార్యకర్తలు, ఓటర్లలో కూడా ఒక రకమైన అలసత్వం ఏర్పడుతుందనే భయంతో మీరు బిజెపికి 370 సీట్లు, ఎన్డీయేకి 400 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్నారా? మీరు ఓటర్లను కూడా మీతో చేర్చుకుని వారికి కూడా లక్ష్యాన్ని నిర్దేశించినట్టు కనిపిస్తోంది. కానీ ఆశాజనకమైన ‘అబ్కీ బార్ 400 పార్’ నినాదం, బిజెపికి 370 సీట్ల లక్ష్యం కూడా కార్యకర్తల్లో అలసత్వానికి దారితీసే ప్రమాదం ఉంది. దాని వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని ఎప్పుడైనా అనుకున్నారా?

జ:పార్టీ నినాదాలు ప్రజల మనోభావాలను ప్రతిబింబిస్తున్నాయి. ఇది మా కృషిని గుర్తించి, మరింత మెరుగైన మార్పును చూడాలని కోరుకునే పౌరుల సమష్టి గళం. కానీ ఈ ‘అబ్కీ బార్, 400 పార్’ నినాదం పుట్టుక చాలా ఆసక్తికరంగా, భావోద్వేగంగా ఉంది. అధికరణం 370 మాకు, మా కార్యకర్తలకు, భారతదేశ ప్రజలకు చాలా భావోద్వేగపరమైన అంశం. ఇది జరుగుతుందని ప్రజలు తరతరాలుగా ఎదురుచూస్తున్నారు. అధికరణం 370 రద్దు దశాబ్దాలుగా మా కార్యకర్తలకు చోదక శక్తిగా ఉంది. మా ప్రభుత్వం ఇలా చేయడం చూసి ప్రజలు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అధికరణం 370ని రద్దు చేసిన పార్టీకి 370 సీట్లు ఇవ్వాలనే భావన ప్రజల్లో నెలకొంది. అందుకే ఎన్డీఏకు ‘అబ్కీ బార్, 400 పార్’ అనే నినాదం వచ్చింది. ఇది ప్రజల నుంచి వెలువడింది.

నేను ఒక కార్యకర్తగా, బిజెపి శ్రేణుల్లో ఎలాంటి అలసత్వం, ఆత్మ సంతృప్తి ఉండవని గట్టిగా చెప్పగలను. మా పార్టీ అగ్రనేతలంతా నిరంతరం క్షేత్రస్థాయిలో, ప్రజల్లోనే ఉన్నారు. మా కార్యకర్తలు ఎంతో శ్రమపడుతున్నారు. నిజానికి చాలా చోట్ల మీకు బూత్‌ల వద్ద బిజెపి కార్యకర్తలు మాత్రమే కనిపిస్తారు. దేశం పట్ల ప్రేమ ఉన్న పెద్ద సంఖ్యలో ప్రజలు నగరాలు, గ్రామాలలో బిజెపికి స్వచ్ఛందంగా సమయం కేటాయించడం కూడా మనం చూస్తున్నాం. సమాజం నుంచి ఈ రకమైన మద్దతు మాకు ఎంతో సహాయపడుతుంది. లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో మాకు ఓటు వేయడమే కాకుండా, తమ పరిధిలోని ఇతరులను కూడా అలా చేయడానికి ప్రేరేపించడం కొత్త వాస్తవం.

ప్ర:ఇది చాలా అహంకారపూరితమైన ధోరణి అని, 2004 ‘ఇండియా షైనింగ్’ తరహాలో బిజెపి మరోసారి దారుణ పరాజయం దిశగా దూసుకుపోతోందని రాహుల్ గాంధీ అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? 2004లో మిత్రపక్షాలను దూరం పెట్టిన బిజెపి అందుకు భిన్నంగా ఇప్పుడు కొత్త వారిని చేర్చుకుంది.

జ:అహంకారం గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి ఎవరైనా ఉంటే అది కాంగ్రెస్ యువరాజే. అయితే ఇప్పుడు కాంగ్రెస్ కేవలం షాక్‌లు, ఆశ్చర్యాలపైనే ఆధారపడి ఉందన్నది నిజం. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఏదైనా అద్భుతం జరుగుతుందనేది వారి ఏకైక ఆశ. వారి అత్యంత అనుభవజ్ఞులైన, ముఖ్యమైన నాయకులు కూడా ఎన్నికలపై ఆశలు వదులుకున్నారు. ప్రతి ఎన్నికలు సమకాలీన అంశాలపై ఆధారపడి ఉంటాయి. వాటిని ఒకదానితో ఒకటి పోల్చడం సరైనది కాదు. 2024లో మాకు కొత్త మిత్రపక్షాలు మాత్రమే కాకుండా, అపూర్వమైన ప్రజల మద్దతు కూడా ఉంది. ఇది అద్భుతమైన విజయాన్ని ఇస్తుందని మా విశ్వాసం.

ప్ర:దక్షిణ భారతదేశంలో మీ విజయావకాశాలపై మీ అంచనా ఏమిటి? మీరు తమిళనాడు, కేరళలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కదా?

జ:అవకాశాలు చాలా బాగున్నాయి. ఇక్కడ తీవ్రంగా ప్రయత్నిస్తున్నది నేను కాదు, నిజానికి బిజెపికి అవకాశం కల్పించేందుకు దక్షిణ భారత ప్రజలే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దక్షిణాదిలో ఎక్కడికి వెళ్లినా అక్కడి ప్రజలు చూపుతున్న ఆదరణ, అభిమానం అపూర్వం. దక్షిణ భారతదేశంలోని ప్రజలు కాంగ్రెస్ లేదా ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలను మాత్రమే చూశారు. ఈ పార్టీలు అవినీతి, బంధుప్రీతి, దుష్పరిపాలన, విభజన, ఓటు బ్యాంకు రాజకీయాలు, పాలనలో చాలా తిరోగమన విధానాన్ని మాత్రమే ఎలా కొనసాగించాయో వారు చూశారు. భారతీయ సంస్కృతి, వారసత్వం పట్ల ప్రజలు వారి ఏవగింపును కూడా చూశారు. ఈ కారణాల వల్ల కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలతో ప్రజలు విసిగిపోయారు.

మరోవైపు, కేంద్రంలో మా పాలనను ప్రజలు చూశారు. మా సంక్షేమ పథకాల ప్రభావం వారికి చేరుకుంటుందని కూడా చూశారు. వారు బిజెపిలో ఆశాకిరణాన్ని చూస్తున్నారు. బిజెపిని నమ్మదగిన ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. 2019లో దక్షిణ భారతదేశంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బిజెపి ఈసారి భారీ మెజారిటీతో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది. దక్షిణాది ఫలితాలు ఈసారి అనేక అపోహలను బద్దలు కొడతాయి. మా భావజాలంతో ఏకీభవించేవారి సంఖ్య ఇప్పటికే పెరిగింది. ఇక మా ఓట్ల సంఖ్య కూడా పెరగడం మీరు చూస్తారు.

ప్ర:గత లోక్ సభ ఎన్నికల్లో బిజెపి కర్ణాటకలో దాదాపు అన్ని సీట్లు గెలుచుకున్నా అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సారి అక్కడ మీ సీట్ల సంఖ్య తగ్గిపోతుందనే మాట వినిపిస్తోంది. దీనిపై మీ అంచనా?

జ:ప్రతి ఎన్నికల్లోనూ ఈ మాట వింటూనే ఉన్నాం. మా సంఖ్య తగ్గిపోతుందని మాట్లాడే వ్యక్తులు మాకు దాదాపు 50కి మించి సీట్లు రావని జోస్యాలు చెప్పారు. కర్ణాటక ప్రజలకు, బిజెపికి ప్రత్యేక అనుబంధం ఉంది. 2019లో బిజెపి మద్దతు భారీగా పెరిగింది. ఈసారి బలమైన ఆర్థిక వృద్ధి, పటిష్టమైన జాతీయ భద్రత, బలమైన సంక్షేమ కార్యక్రమాలను అందించడంలో మా 10 సంవత్సరాల రికార్డు కర్ణాటకలోని మొత్తం 28 స్థానాలను ఎన్డీయే గెలిచేలా చూస్తుంది. జేడీ(ఎస్) చేరికతో ఎన్డీయే మరింత బలపడింది.

రాష్ట్రం అష్టకష్టాలు పడుతుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం ముఖ్యమంత్రి పదవి కోసం కొట్టుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ వాగ్దానాలను అరకొరగా అమలు చేస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేసింది. రాష్ట్రంలో పెరుగుతున్న అరాచకం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నత్తనడకతో కర్ణాటక ప్రజలు విసిగిపోయారు. విద్యుత్ కోతలు, నీటి కొరతతో వారు సతమతమవుతున్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేసినందుకు అక్కడి ప్రజలు పశ్చాత్తాపపడుతున్నారు. నిరూపితమైన మోదీ హామీపై మరోసారి విశ్వాసం ప్రదర్శించబోతున్నారు.

ప్ర:కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంలో కాంగ్రెస్ హామీలు పెద్ద పాత్ర పోషించాయి. ‘మోదీ కి గ్యారెంటీ’ వాటికి దీటైన పోటీ ఇస్తుందని అనుకుంటున్నారా?

జ:నాకు హామీ అనేది కేవలం ఒక పదం కాదు. అంతకంటే చాలా ఎక్కువ. ఇది నాకు చాలా పవిత్రమైన వ్యక్తీకరణ. ఇది నా కృషి, నా విశ్వసనీయతతో ముడిపడి ఉంది. ఇది నా జీవితాంతం ప్రజాసేవలో సాధించిన ఫలితం. నేను హామీ గురించి మాట్లాడేటప్పుడు, అది ప్రజల కోసం మరింత కష్టపడి పని చేయడానికి నన్ను కంకణబద్ధుణ్ణి చేస్తుంది. నేను నా హామీలకు అంత ప్రాముఖ్యతను ఇచ్చినప్పుడు, సహజంగా ప్రజలు కూడా దానిని గుర్తిస్తారు.

పరిస్థితులు ఎలా ఉన్నా మోదీ ఏ హామీ ఇచ్చినా నెరవేర్చడం ప్రజలు చూస్తున్నారు. నల్లా నీటి కనెక్షన్లు ఇవ్వడం నుంచి రేషన్ వరకు, పేదలకు ఇళ్ళు నిర్మించడం నుంచి ఎక్స్‌ప్రెస్‌వేల వరకు ప్రజలకు ఇచ్చిన హామీలను మోదీ అమలు చేస్తున్నారు. మోదీ హామీలకు ఎటువంటి షరతులు లేవు. కాంగ్రెస్ పార్టీకి మాత్రం దాని వాగ్దానాలు ప్రజలను మోసం చేయడానికి, వారి ఓట్లను పొందడానికి ఒక గిమ్మక్కు మాత్రమే. వాగ్దానాలను నెరవేర్చాలనే ఉద్దేశం లేదా విశ్వసనీయత వారికి లేదు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎన్నో హామీలు ఇచ్చారు. 1971లో వారి అత్యున్నత నాయకురాలు ఇచ్చిన హామీకి ఏమైందో చూడండి. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రధానులు పేదరికాన్ని తొలగించడం గురించి మాట్లాడారు కానీ దశాబ్దాలుగా ఏమీ జరగలేదు. ఇళ్లు, మరుగుదొడ్లు, నీటి కనెక్షన్‌ వంటి కనీస అవసరాలకు నోచుకోకుండా పేదలు బతుకుతున్నారు. అవినీతి నిరాటంకంగా కొనసాగింది.

ప్ర:కర్నాటకలో, ఇతర చోట్ల మతాల మధ్య చిచ్చుకు బిజెపి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్, అలాగే కాంగ్రెస్ బుజ్జగింపులకు పాల్పడుతోందని బిజెపి ఆరోపణలు చేసుకుంటున్నాయి. వీటి ప్రభావం ఎలా ఉంటుందనుకుంటున్నారు?

జ:మీడియా గమనించాల్సింది ఎవరేం చేశారో తప్ప ఎవరు ఏ ఆరోపణలు చేశారనేది కాదు. కర్ణాటకలో ఏం జరిగిందో చూడండి. బాంబు పేలుళ్లు, ఒక ఆడబిడ్డ దారుణ హత్య, భజన కీర్తనలు చేస్తున్న వారిపై దాడి… బాంబు పేలుళ్ల సందర్భంగా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నించింది. కూతురి హత్యకేసులో తండ్రి న్యాయం కోసం ఎలా తిరుగుతున్నాడో మీడియా చూపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడు అయినా ఆయనకు న్యాయం జరగడం లేదు. ఇది బుజ్జగింపు కాకపోతే ఏమిటి? కాంగ్రెస్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని, మత ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పిస్తూ చట్టాలను రూపొందించిందని చెప్పడం మత విద్వేషాలను రెచ్చగొట్టడం కాదు. మతం ఆధారంగా రిజర్వేషన్లను మన రాజ్యాంగం స్పష్టంగా నిషేధించింది, అయితే కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు బిజెపి తెచ్చిన చట్టాన్ని వెనక్కితిప్పి వాటిని ముస్లింలకు ఇచ్చింది. ముస్లింలందరినీ ఓబీసీలుగా వర్గీకరించింది. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ కూడా ఇది ‘సామాజిక న్యాయం’ సూత్రాలకు విరుద్ధమని విమర్శించింది.

తెలంగాణలో కూడా ఇదే పని చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కల్పిస్తున్న రిజర్వేషన్లను తగ్గించి మైనారిటీలకు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు ఇది రుజువు చేస్తోంది. ఈ దేశంలోని వనరులపై మైనారిటీలకు మొదటి హక్కు ఉందని చెప్పిన ప్రధాని పార్టీ నుంచి ఇంకా ఏం ఆశించగలం?

ప్ర:మూడవ పదవీకాలంలో మీరు అమలు చేయాల్సిన పనుల్లో ‘ఒక దేశం, ఒక ఎన్నిక’ అగ్రస్థానంలో ఉంటుందా? ఉమ్మడి పౌరస్మృతి సంగతేమిటి? కేంద్రం రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తుందా లేక రాష్ట్రాలకే వదిలేస్తుందా?

జ:చాలా కాలంగా ప్రభుత్వాలు జాతీయ ప్రయోజనాల కంటే ఎన్నికల ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రతి సంవత్సరం, ఎదో ఒక ఎన్నిక జరుగుతూనే ఉంటుంది. భారతదేశ ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలను పణంగా పెట్టి అయినా వచ్చే ఎన్నికల్లో గెలవడమే ఎల్లప్పుడూ లక్ష్యంగా ఉంటోంది. ఇది ఆందోళన కలిగించే అంశం. ‘ఒక దేశం, ఒక ఎన్నిక’ ఒక దేశంగా మన సమయం, కృషి, వనరులు దేశ నిర్మాణానికి మరింత ఉత్పాదకంగా ఉపయోగపడేలా చూస్తుంది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి కమిటీ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో విస్తృత సంప్రదింపులు, ‘ఒక దేశం, ఒకే ఎన్నిక’ అమలుపై పరిశోధనల తర్వాత తయారు చేసిన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ఇప్పటికే సమర్పించింది. మా మూడవ పదవీ కాలంలో ఈ విషయంపై నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటాం.

ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) కూడా మా పార్టీ ఎజెండాలో ఒక ప్రధాన అంశం. ఇప్పటికే రాష్ట్రాల్లోని బిజెపి ప్రభుత్వాలు దీని అమలుపై కసరత్తు చేస్తున్నాయి. యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. మతాల కోసం ప్రత్యేక చట్టాలు సమాజ ఆరోగ్యానికి హానికరం అని స్పష్టమైంది. ఒక వర్గం రాజ్యాంగ నిబంధనల మద్దతుతో పురోగమిస్తున్నప్పుడు మరొక వర్గం బుజ్జగింపుల కారణంగా వెనకబడిపోతే ఒక దేశంగా మనం అభివృద్ధి చెందలేం. భారతదేశంలో యూసీసీని సాకారం చేయడానికి మేం శాయశక్తులా కృషి చేస్తాం.

ప్ర:దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపిస్తూ కర్నాటక, ఇతర ప్రాంతాలలో మీ ప్రత్యర్థులు ఉత్తర-దక్షిణ విభజన సమస్యను లేవనెత్తారు. మీరు దానిలో నిజం ఉందని భావిస్తున్నారా లేక వారు తాము ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి నిధుల కోసం ఈ వాదన చేస్తున్నారని భావిస్తున్నారా?

జ:వివక్ష అనే బూచిని చూపించి తమ అవినీతి, దుష్పరిపాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించడం వారి ఉద్దేశం. భారతదేశాన్ని మరింత విభజించే తన ఎత్తుగడను అపారమైన దేశభక్తి గల కర్ణాటక ప్రజలు అంగీకరిస్తారని కాంగ్రెస్ నిజంగా భావిస్తుందా? కాంగ్రెస్ సృష్టించడానికి ప్రయత్నిస్తున్న ఈ కృత్రిమ, తప్పుడు విభజనను ప్రతి దేశభక్తి గల భారతీయుడు తిరస్కరిస్తాడు. కాంగ్రెస్, వామపక్షాల పాలనలో కేరళ దాదాపు దివాళా తీసింది. ఇప్పుడు కర్ణాటక, తెలంగాణలో కూడా అదే పని చేయాలని కాంగ్రెస్ తలపోస్తోంది. కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కేవలం ఒక సంవత్సరం మాత్రమే అయ్యింది. అభివృద్ధి చెందుతున్న దాని ఆర్థిక వ్యవస్థకు వారు ఇప్పటికే తీవ్ర నష్టం కలిగించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి, వారి వాగ్దానాల వల్ల ప్రజలకు సంక్షేమం అందడం లేదు. వాస్తవానికి వారి దుష్పరిపాలన పెట్టుబడిదారులను భయపెట్టింది. కర్ణాటక నుంచి పెట్టుబడులు తరలిపోడానికి దారితీసింది. రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 46 శాతం, స్టార్టప్‌లకు నిధులు 80 శాతం తగ్గాయి.

ప్ర:ఆస్తుల పునఃపంపిణీ కోసం ప్రస్తుతం వినిపిస్తున్న డిమాండ్లపై మీ ఆందోళన ఏమిటి? ప్రభుత్వం ప్రజల ఆస్తులను స్వాధీనపరచుకోకూడదని, అనేక దేశాల్లో విధ్వంసానికి కారణమైన మావోయిస్టు దృక్పథానికి ఈ డిమాండు అద్దం పడుతుందని మీరు చెప్పారు. మీరు దీన్ని నిజమైన ముప్పుగా చూస్తున్నారా?

జ:కాంగ్రెస్ ఈ దుష్ట ప్రణాళికను మనం ఎదో నామమాత్రం ముప్పుగా పరిగణించకూడదు, ముప్పు చాలా వాస్తవమైనది. మన దేశాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుంది. మావోయిస్టు ఆలోచనలకు, భావజాలానికి ఇది స్పష్టమైన ఉదాహరణ. కాంగ్రెస్, దాని యువరాజు, ఇటువంటి మావోయిస్టు ఆలోచనను ముందుకు తీసుకువెళ్లడం బాధాకరం. ‘ఎక్స్‌రే తీయిస్తాం’ అని యువరాజు (రాహుల్ గాంధీ) చెప్పడం మీరు చూసి ఉంటారు. ఈ ఎక్స్‌రే ప్రతి ఇంటిపై దాడి చేయడం తప్ప మరొకటి కాదు. రైతుల వద్ద ఎంత భూమి ఉందో తెలుసుకునేందుకు దాడులు చేస్తామన్నారు. కష్టపడి సంపాదించిన సంపద ఎంత అని సామాన్యుడిపై దాడి చేస్తారు. వారు స్త్రీల ఆభరణాలపై దాడి చేస్తారు. మన రాజ్యాంగం మైనారిటీలందరి ఆస్తులకు రక్షణ కల్పిస్తుంది. కాంగ్రెస్ సంపద పునర్విభజన గురించి మాట్లాడినప్పుడు అది మైనారిటీల ఆస్తులను తాకదు, పునర్విభజన కోసం వక్ఫ్ ఆస్తులను తీసుకోదు. కానీ అది ఇతర వర్గాల ఆస్తులపై దృష్టి పెడుతుంది. ఇది మతాల మధ్య ఆరని చిచ్చు పెడుతుంది.

ఇది మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. దేశానికి, ప్రజలకు హాని చేయడానికి మనం ఎటువంటి అవకాశం కల్పించకూడదు. మన దేశం, మన పౌరులలో ప్రతి ఒక్కరి సంక్షేమమే మా మొదటి, ప్రధాన ప్రాధాన్యం. మా ప్రభుత్వం మెజారిటీకి ప్రయోజనం చేకూర్చే విధానాలను రూపొందించదు, మైనారిటీలకు ప్రయోజనం చేకూర్చే విధానాలను రూపొందించడం లేదు; వివక్ష లేకుండా మన దేశం, దాని 140 కోట్ల మంది పౌరులకు ప్రయోజనం చేకూర్చే విధానాలను మేం రూపొందిస్తాం.

ప్ర:2019లో ఉజ్వల నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన వరకు సంక్షేమ పథకాలు మొదటిసారిగా పెద్ద ఎత్తున ప్రజలకు చేరువయ్యాయి. ఓటర్లు పథకాలను ఆమోదించి బిజెపికి పట్టం కట్టారు. ఈసారి పథకాలు అంత కొత్తవి కావు. పథకాల పంపిణీ ఇప్పటికీ ఓటర్లను బిజెపికి అనుకూలంగా ప్రభావితం చేసే అంశంగా ఉంటుందా?

జ:మీరు ఈసారి మా మేనిఫెస్టోను నిశితంగా పరిశీలిస్తే, మేం మా పథకాలను విస్తరించడమే కాకుండా పేదల ప్రస్తుత ఆకాంక్షలకు అనుగుణంగా వాటిని మార్చిన విషయాన్ని గుర్తిస్తారు. ఉదాహరణకు ముద్రా యోజనను తీసుకోండి. మేం ఈ పథకం ద్వారా వ్యవస్థాపక (వ్యాపార) విప్లవాన్ని తీసుకువచ్చాం. ఇప్పుడు మేం మా వ్యవస్థాపకుల (ఔత్సాహిక వ్యాపారుల) ఆకాంక్షలు, అవసరాలకు సరిపోయేలా రుణ మొత్తాన్ని రెట్టింపు చేస్తాం. ఉదాహరణకు విద్యుత్తునే తీసుకోండి. మేం మొదటిసారిగా 3 కోట్ల కంటే ఎక్కువ గృహాలు, 18,000 గ్రామాలకు విద్యుత్ చేరేలా చేశాం. ఇప్పుడు ప్రజలకు ఉచిత విద్యుత్ అందేలా చూడడానికి మేం ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనతో ముందుకు వచ్చాం. ఉదాహరణకు స్టార్టప్‌లను తీసుకోండి. మేం క్రియాశీల విధానాలను తీసుకువచ్చాం. స్టార్టప్‌లకు అన్ని రకాల మద్దతు లభించేలా చూశాం. ఇప్పుడు భారత్‌ను స్టార్టప్ హబ్‌గా మార్చాలనుకుంటున్నాం.

కనుక పథకాలను విజయవంతంగా అమలు చేసినప్పుడు మేం మా దిశను మార్చుకోమని, వాటిని కొనసాగిస్తూనే ఉంటామని మీరు గమనించవచ్చు. అయితే మేం ఆ పథకాల స్థాయిని, పరిధిని పెంచుతాం. పేదరికం నుంచి విముక్తులయ్యే పేదలు మళ్లీ పేదరికంలోకి వెళ్లకూడదు. సాధించిన ప్రగతి కొనసాగాలి. ఈ విధానం ప్రజల ఆకాంక్షలు కూడా నెరవేరేలా చూస్తుంది. వికసిత్ భారత్‌ను సాధించడంలో సహాయపడుతుంది. మా మేనిఫెస్టోలో సాధించగలిగేవి మాత్రమే ఉన్నాయి. అమలు చేయలేని తప్పుడు, అవాస్తవ వాగ్దానాలు చేయడంపై మాకు నమ్మకం లేదు.

ప్ర:ప్రజాస్వామ్యానికి ముప్పు ఉందని, దేశం ‘ఎన్నికల నియంతృత్వం’గా మారుతోందని ప్రతిపక్షాలు తరచుగా ఆరోపిస్తున్నాయి. అనేక విదేశాల్లో కూడా కొందరు ఈ ఆరోపణలతో ఏకీభవిస్తున్నారు. మీరు దీన్ని సవాలుగా చూస్తున్నారా?

జ:మన ప్రతిపక్షాలు అనుసరిస్తున్న ‘తగలబెట్టి పారిపోయే’ వ్యూహానికి ఇది ఉదాహరణ. ప్రతిపక్షాలు ఎన్నికల్లో గెలవలేక ప్రపంచ వేదికలపై భారత్ పరువు తీయడం మొదలుపెట్టాయి. వారు మన ప్రజల గురించి, మన ప్రజాస్వామ్యం, మన వ్యవస్థల గురించి దుష్ప్రచారం చేస్తారు. యువరాజుకు ప్రజల మద్దతు లేకపోయినా అధికారాన్ని పొందలేకపోయినంత మాత్రాన భారతదేశం ‘ఎన్నికల నియంతృత్వం’గా మారిపోదు. 

ఆయన ఎన్నికలలో పోరాడవలసి వచ్చినందున, భారతదేశ ప్రజల మద్దతును ఆయన పొందలేకపోయినందున భారత్ నాసిరకం ప్రజాస్వామ్యం కాబోదు. విదేశీ రాజధానులలో ఇటువంటి ఆరోపణలను నమ్మేవారు చాలా మంది ఉన్నారని నేను అనుకోను. వారు తమ దేశాల్లోని ‘సర్టిఫికేట్ దుకాణాల’ కంటే ఎక్కువ వాస్తవిక దృష్టితో ఆలోచిస్తారని నా అభిప్రాయం. నేను ప్రపంచ నాయకులతో మాట్లాడినప్పుడు మన ప్రజాస్వామ్య ప్రక్రియ, వ్యవస్థల పట్ల వారిలో నిజమైన అభిమానం నాకు కనిపిస్తుంది. వారు మన ఎన్నికల ప్రక్రియ స్థాయి, వేగాన్ని గురించి పూర్తిగా తెలిసినప్పుడు మన సామర్థ్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు.

ప్ర:2047లో ‘వికసిత్ భారత్’ గురించి మీ దార్శనికత సాకారం కావడానికి ఇంకా 23 సంవత్సరాల సమయం ఉంది. అది వాస్తవరూపం దాల్చే నాటికి మీకు దాదాపు 95 ఏళ్లు వచ్చేస్తాయి. అయినప్పటికీ మీ మద్దతుదారులకు, అనేకమంది ఇతర వ్యక్తులకు మీరు ఆ లక్ష్యానికి ప్రతీకగా ఉన్నారు.

జ:భారతదేశం వికసిత్ భారత్‌గా (అభివృద్ధి చెందిన దేశంగా) మారడం మోదీ దార్శనికత కాదు. దేశం 100వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటున్నప్పుడు అది అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలనేది 140 కోట్ల మంది భారతీయుల దార్శనికత, సంకల్పం. నా దేశ ప్రజల కలలను, ఆకాంక్షలను సాకారం చేయడానికి నేను ఒక సాధనంగా మారినందుకు నేను చాలా అదృష్టవంతుడిని. మా పని వేగం, స్థాయి దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలనే మా ఆసక్తిని ప్రతిబింబిస్తుంది. మా ‘సంతృప్త నమూనా’ ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు తీసుకువెళ్లాలనే మా నిబద్ధతను వెల్లడిస్తుంది. సాంకేతికత, కొత్త అవకాశాలకు మేం ఇచ్చే ప్రోత్సాహం మన యువ శక్తి దాని పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకునేలా చేస్తుంది. ఈ రోజు మన సరిహద్దులు గతంలో కంటే మరింత సురక్షితమైనవి, మన నారీ శక్తి సామాజిక మార్పుకు దారి తీసింది, మన మౌలిక సదుపాయాలు ప్రపంచ ప్రమాణాలను అందుకున్నాయి. మన ఆర్థిక వ్యవస్థ మరింత ఆత్మనిర్భర్‌గా మారుతోంది. గత 10 సంవత్సరాలలో, దేశం అభివృద్ధి కోసం మేం ఒక బలమైన పునాదిని నిర్మించాం. అందుకే ఇప్పటి వరకు మీరు చూసింది ట్రైలర్ మాత్రమే అని చెబుతున్నాను. నేను చేయాలనుకున్నది చాలా ఉంది. మోదీని 140 కోట్ల మంది భారతీయులు ఆశీర్వదించారని నేను మీకు హామీ ఇస్తున్నాను. వికసిత్ భారత్ కల సాకారం అయ్యే వరకు మోదీ ఆగడు .

నాగార్జున