Dr K Laxman

దోషులకు శిక్షపడే వరకూ పోరాటం ఆగదు: డా. లక్ష్మణ్

Phone Tepping Dharnaఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దోషులకు శిక్ష పడేవరకూ పోరాటం ఆగదని బిజెపి తెలంగాణ స్పష్టం చేసింది.  ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సూత్రధారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ ఇందిరా పార్క్‌ వద్ద మే 31న జరిగిన బిజెపి ధర్నాలో బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డా. కె. లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ చరిత్రలో రేవంత్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండాలంటే ఫోన్‌ ట్యాపింగ్ దర్యాప్తు సీబీఐకి అప్పగించాల్సిందేననన్నారు. అరెస్ట్ అయిన వాళ్లు వాంగ్మూలం ఇచ్చినా.. మిగిలిన వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు.

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ నిబంధనలకు విరుద్ధంగా, కేంద్రం అనుమతి లేకుండా కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందన్నారు. తాను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడినని చెప్పుకున్న రేవంత్‌రెడ్డి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని నిలదీశారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కేసీఆర్ తో లోపాయికారీ ఒప్పందం చేసుకుందా..? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి ఏ మాత్రం పౌరుషం ఉన్నా.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితులను శిక్షించాలని డిమాండ్​ చేశారు. రేవంత్ రెడ్డి కుర్చీ కోసం అధిష్టానానికి లొంగిపోతారా అనేది స్పష్టం చేయాలన్నారు. బిజెపి జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ మీద కేసీఆర్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందన్నారు. లిక్కర్ కేసు నుంచి కవితను తప్పించడం కోసమే బిజెపి నేతలపై కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. బీఆర్‌ఎస్‌ నీచ  రాజకీయాలకు పాల్పడిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలను ఏ మాత్రం కాపాడినా రేవంత్ రెడ్డికి కూడా అదే గతి పడుతుందని లక్ష్మణ్‌ హెచ్చరించారు.

రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాల ఫోన్లు, చివరికి జడ్జిల ఫోన్లూ ట్యాప్ చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ బాధితుడిగా ఉన్న రేవంత్ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు.  బీఆర్ఎస్ అక్రమ సంపాదనను తరలించి పోలీస్ వ్యవస్థను కేసీఆర్ దుర్వినియోగం చేశారన్నారు. కేసీఆర్, హరీశ్ రావు డైరెక్షన్‌లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు పోలీస్ అధికారులు చెప్పారన్నారు. ఇంత స్పష్టంగా తెలుస్తున్నా ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని లక్ష్మణ్ ప్రశ్నించారు.

ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం అవుతుందని లక్ష్మణ్ జోస్యం చెప్పారు. ఎమ్మెల్యేల కొనుగోలు ఫేక్ సినిమా డ్రామా అని తానే ముందే చెప్పానన్నారు. ‘‘లిక్కర్ కేసులో కవితను గట్టెక్కించేందుకు ఎమ్మెల్యేల కేసు బయటకు తీసుకొచ్చారు. దారుణమైన స్థితికి కేసీఆర్ దిగజారిపోయారు. రేవంత్‌పై ఢిల్లీ పెద్దల ఒత్తిడి ఉంది. లేదంటే వెంటనే ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులు, పాత్ర దారులపై చర్యలు తీసుకోవాలి. కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలి’’ అని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.

‘‘కాంగ్రెస్ మోసాన్ని గ్రహించి పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజలు బిజెపికి పట్టం కడ్తారు. తెలంగాణలో కాంగ్రెస్ కంటే అత్యధిక ఎంపీ సీట్లు సాధిస్తాం. కేసీఆర్ అవినీతిని అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి పదే పదే ప్రస్తావించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాళేశ్వరం, ధరణి పేరుతో దోచుకున్నదాన్ని కక్కిస్తామన్నారు. ఇప్పడు కేసీఆర్ అవినీతి, కుంభకోణాల మీద రేవంత్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అధికారాన్ని శాశ్వత పరుచుకునేందుకు నిఘా వ్యవస్థను కేసీఆర్ దుర్వినియోగం చేశారు. ఉప ఎన్నికల్లో ఓటర్లను కొనుగోలు చేయడానికి, ప్రత్యర్థులను దెబ్బ కొట్టడానికి ఫోన్ ట్యాపింగ్ ను వాడుకున్నారు.’’ అని డా. లక్ష్మణ్ అన్నారు.

బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే పాయల్‌ శంకర్, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, మాజీ మంత్రులు మర్రి శశిధర్‌రెడ్డి, పెద్దిరెడ్డి, కృష్ణ యాదవ్, పార్టీ నేతలు రాంచందర్‌రావు, ధర్మారావు, ఆకుల విజయ తదితరులు పాల్గొన్నారు.