Hamara Sankalp Vikasit Bharat
T Cong Manifesto

గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ నయవంచన

కర్ణాటకలో ఐదు గ్యారంటీలు, తెలంగాణలో ఆరు గ్యారంటీలు మాత్రమే తమను గెలిపించాయని చెప్పుకొంటున్న కాంగ్రెస్ ఇపుడు లోక్ సభ ఎన్నికలకు ఆ పార్టీ మ్యానిఫెస్టోను పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తుక్కుగూడ బహిరంగసభలో విడుదల చేస్తూ సరికొత్త హామీల వర్షం కురిపించారు. ఇప్పటికే ఇచ్చిన ఆరు గ్యారంటీలకే దిక్కులేదు గాని, కొత్త గ్యారంటీలు ఏమిటంటూ జనం చీదరించుకుంటున్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకు వచ్చింది రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ. ఈ చట్టం ప్రకారం ఎవరైనా పార్టీ మారితే వారు తాము ఆ పార్టీ ద్వారా పొందిన అధికార పదవులను కూడా కోల్పోవలసిందే. అయితే, ఈ చట్టాలను తూట్లు పొడిచిన ఘనత కూడా ఆ పార్టీకే దక్కుతుంది. అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ నేతలు వరుస పెట్టి కాంగ్రెస్ లో చేరుతున్నారు. వారిలో ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా ఉంటున్నారు.

గతంలో తమ ఎమ్యెల్యేలను కేసీఆర్ ప్రలోభాలకు గురిచేసి అపహరించారని గందరగోళం చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అదేవిధంగా అదే బీఆర్ఎస్ నేతలను ప్రలోభాలకు గురిచేసి మరీ తమ పార్టీలో చేర్చుకొంటున్నారు. ఈ సందర్భంగా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కాకుండా తమ పార్టీ మ్యానిఫెస్టోను సైతం ఖాతరు చేయడం లేదు. అటువంటి కాంగ్రెస్ ఆ మేనిఫెస్టోను అమలు చేస్తామంటే నమ్మేదెవరు? ఒక పార్టీ గుర్తుమీద గెలుపొంది మరో పార్టీలోకి చేరేవారు తమ తమ పదవులకు రాజీనామాలు చేసిన తర్వాత మాత్రమే పార్టీలోకి చేరేలా చట్ట సవరణ తీసుకు వస్తామని మానిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించింది. పైగా, ఇతర పార్టీల నుండి వచ్చి తమ పార్టీలో చేరుతున్న నాయకులు తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాత తమ పార్టీలోకి రావాలని కూడా రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఇటువంటి మాటలన్నీ వేదికలకే పరిమితమా? అనే ప్రశ్న తలెత్తుతుంది. రాహుల్ గాంధీతో పాటు వేదిక పంచుకున్న వారిలో బీఆర్ఎస్ ఎమ్యెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి వంటి వారున్నారు. పైగా, దానం నాగేందర్ ను బీఆర్ఎస్ శాసనసభ్యుడిగా కొనసాగుతూ ఉండగానే సికింద్రాబాద్ లోక్ సభకు తమ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. 

ఒక పార్టీ ఎమ్యెల్యే మరో పార్టీ అభ్యర్థిగా ఎన్నికలలో పోటీచేయడం బహుశా దేశంలో మరెక్కడా జరిగి ఉండదు. ఈ విషయమై హైకోర్టులో వాజ్యం ఎదుర్కొంటున్నా నాగేందర్ ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్దపడటం లేదు. కనీసం రాజీనామా చేయమని అడిగే సాహసం కాంగ్రెస్ వారెవ్వరూ చేయడం లేదు. కాంగ్రెస్ లో చేరేటప్పుడు జరిగిన బేరసారాలు ఎటువంటివో తెలియదు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ నాగేందర్ వంటి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అధికార పార్టీని విడిచి ఉండటం నాగేందర్ తట్టుకోలేడు. గతంలో కాంగ్రెస్ ఓడిపోతుందని తెలుగుదేశంలోకి వెళ్లి, ఎమ్యెల్యేగా గెలిచిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఎమ్యెల్యే పదవికి కూడా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడాన్ని చూశాం. ఇక కాంగ్రెస్ అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ లోకి వచ్చారు. ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తిరిగి మాతృసంస్థకు వచ్చేసారు.

మరోవంక, ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే రేషన్ కార్డులు తప్పనిసరని చెప్పేశారు. కానీ కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు. ఇదిగో, అదిగో అనేసరికి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందనే సాకుతో తప్పించుకుంటున్నారు. వేలాది ఎకరాలలో పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతుబంధు నిధులు అందచేయక పోగా, ధాన్యం కొనుగోలులో క్వింటాల్ కు రూ 500 చొప్పున ఇస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించి ఇప్పుడా ఊసే ఎత్తడం లేదు. వంద రోజులలో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీల గురించి ఇప్పుడు కాంగ్రెస్ నేతలు మాట్లాడటం తగ్గించారు. ఫోన్ ట్యాపింగ్ అనో, మరో అంశాన్నో తెరపైకి తీసుకొచ్చి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అంశాల అమలుకు నిర్దిష్టమైన ప్రణాళిక కూడా ప్రభుత్వం వద్ద ఉన్నట్లు కనిపించడం లేదు. ధరణి పోర్టల్ గురించి మొదట్లో హడావుడి చేసినా అన్యాయం జరిగిన రైతులను ఏ విధంగా ఆదుకోవాలో ప్రభుత్వం వద్ద ఎటువంటి ప్రణాళిక ఉన్నట్లు కనిపించదు.

ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి చర్యలపై మాటలు కోటలు దాటుతున్నా ఆచరణలో నిర్దుష్టమైన చర్యలు తీసుకోవడం లేదు. స్వయంగా రేవంత్ రెడ్డి తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన నేతలను దగ్గరుండి ఇప్పుడు పార్టీలో చేర్చుకుంటున్నారు. అటువంటి వారిలో కొందరికి ఎంపీ సీట్లు కూడా ఇస్తున్నారు. అంటే, కాంగ్రెస్ లో చేరితే అవినీతిపరులకు పూర్తి రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చినట్టే.

ప్రవీణ్