హామీల అమలు మరిచి ఓట్లు ఎలా అడుగుతారు?: కిషన్ రెడ్డి
ఇవి దేశ భవిష్యత్ కోసం జరుగుతున్న ఎన్నికలని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు. ఇచ్చిన గ్యారంటీలు, మేనిఫెస్టోలో చెప్పిన హామీలను ఎలా నెరవేర్చాలో కాంగ్రెస్‌కు అర్థం కావడం లేదని విమర్శించారు. ఈ మేరకు మార్చ్ 29న మహబూబ్ నగర్, షాద్ నగర్ లో ఏర్పాటు చేసిన బిజెపి ముఖ్యనాయకుల సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘రుణమాఫీ హామీ నెరవేర్చడంలో కాంగ్రెస్ సర్కారుకు దశ దిశ లేదు. నిరుద్యోగ భృతి, రేషన్ కార్డులపై ఎలాంటి క్లారిటీ లేదు. మహిళలకు రూ.2500 ఇచ్చే అంశం గాల్లో దీపంలా తయారైంది. ప్రతి విద్యార్థికి రూ.5 లక్షల గ్యారంటీ అన్నారు. దానికీ అతీ గతి లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ బాటలోనే నడుస్తున్నది. గతంలో కేసీఆర్ కుటుంబం.. ఇప్పుడు రాహుల్ గాంధీ కుటుంబం తెలంగాణను శాసిస్తుంది. రాహుల్ గాంధీ టాక్స్ పేరుతో కాంగ్రెస్ నాయకులు దోపిడీకి పాల్పడుతున్నారు. హైదరాబాద్ లో రియర్టర్లు, బిల్డర్లను, వ్యాపారులను రాహుల్ గాంధీ ట్యాక్స్ కోసం వేధిస్తున్నారు” అని మండిపడ్డారు.
బీఆర్ఎస్ నేతలపై చర్యలేవి?
బీఆర్ఎస్ నేతలు కబ్జాలకు, దోపిడీకి పాల్పడ్డారని గతంలో కాంగ్రెస్ నాయకులు ఆరోపించారని, ఇప్పుడు మాత్రం వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. ‘‘రేవంత్ రెడ్డి మాటలన్నీ ఉత్త మాటలే అని స్పష్టమైంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ప్రాజెక్ట్‌పై కూడా విచారణ జరగడం లేదు. రేవంత్ రెడ్డి అధికారంలో రాకముందు బీఆర్ఎస్ అవినీతిపై సీబీఐ విచారణ కోరారు. ఇప్పుడు దాన్ని పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని సీఎం రేవంత్ రెడ్డి.. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు. రాష్ట్రంలో కరువు ముంచుకొస్తుంది. అయినా కాంగ్రెస్ సర్కారుకు పట్టడం లేదు. హైదరాబాద్ సహా తెలంగాణ అంతటా తాగునీటి ఎద్దడి ఏర్పడింది. విద్యుత్ కోతలు ఉంటున్నాయి. ఈ రోజు తెలంగాణ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు అయింది. దొంగలు పోయి గజ దొంగలు అధికారంలోకి వచ్చారు. కేసీఆర్ ను దించాలనే ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేశారు. అంతే గానీ కాంగ్రెస్‌పై ప్రేమతో కాదు. ప్రతి ఎకరం మీద ఎరువులపై రూ.19 వేలు కేంద్రం సబ్సిడీ ఇస్తున్నది. ధాన్యం కొనుగోలు కోసం రూ.26 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి. హమాలీల కూలీ నుంచి ట్రాన్స్‌పోర్ట్ ఖర్చు వరకు అన్నీ మోదీ ప్రభుత్వమే భరిస్తున్నది” అని కిషన్ రెడ్డి తెలిపారు.
మోదీని గెలిపిస్తారు..
మరోసారి దేశానికి ప్రధాని కావాలని దేశ ప్రజలు నిర్ణయించుకున్నారని, తెలంగాణ ప్రజలు కూడా అటు కాంగ్రెస్ ను, ఇటు బీఆర్ఎస్ ను నమ్మే పరిస్థితి లేదని, బిజెపికే ఓటు వేస్తారని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ‘‘వచ్చే ఎన్నికల తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనపడుతుంది. కర్నాటకలో 90 శాతం ఎంపీ స్థానాలు బిజెపి గెలుస్తుంది. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోంది. కాంగ్రెస్ లో చేరాలని సీఎం రేవంత్ రెడ్డి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కోల్డ్ స్టోరేజ్ కే పరిమితమైంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. గత కాంగ్రెస్ పాలనలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగింది. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బిజెపి డబుల్ డిజిట్ సీట్లు గెలుస్తుంది. మా పాలన నాలుగు ప్రధాన అంశాలపై సాగుతుంది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానాల్లో బిజెపి గెలుపు ఖాయం” అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్, మోదీ పాలన చూడండి
నరేంద్ర మోదీ తొమ్మిదిన్నరేళ్ల పాలన.. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పాలన ఎలా ఉందో ఒక్కసారి బేరీజు వేసుకోవాలని అన్నారు. శాంతి భద్రతలు, అవినీతి, సంక్షేమం, జాతీయ రహదారులు, పెట్టుబడులు, రక్షణ రంగం బలోపేతం ఇలా అన్ని విషయాల్లో మోదీ పాలనను కాంగ్రెస్ పాలనతో పోల్చి చూసి ఓటు వేయాలని కోరారు. ‘‘నాడు పాకిస్తాన్.. భారతదేశంలో ఉగ్ర దాడులు, దొంగ నోట్ల చెలామణి ఎలా చేసిందో చూశాం. నాటి కాంగ్రెస్ పాలనలో దేశ సమగ్రత, సమైక్యతను దెబ్బ తీయాలని పాకిస్తాన్ చూసింది. దేశంలో అనేక నగరాలలో ఉగ్రవాద దాడులకు పాల్పడింది. మోదీ ప్రధాని అయిన తర్వాత పాకిస్తాన్ తొక కత్తిరించారు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేశారు. ఇప్పుడు పాకిస్తాన్ దీనస్థితిలోకి వెళ్లింది. మన సైనికులపై దాడి చేసిన ఉగ్రవాదులను సర్జికల్ స్ట్రైక్స్ తో మట్టుబెట్టారు. దేశ ప్రతిష్టను ప్రపంచ స్థాయిలో చాటిన మెునగాడు మోదీ. ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు 25,000 మంది భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చారు. పేదలకు టాయిలెట్స్ నుంచి మెుదలుకొని చంద్రమండలం వరకు మోదీ ఘనత చాటారు. మరోసారి మోదీ దేశానికి ప్రధాని కావాలి. మోదీ ప్రధాని కావాలంటే మహబూబ్ నగర్‌లో బిజెపిని గెలిపించాలి. ఈ యుద్ధంలో అందరూ భాగస్వాములు కావాలి” అని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
పార్టీలో చేరికలు
మహబూబ్ నగర్ లో నిర్వహించిన పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తల సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో పలు పార్టీలకు చెందిన నాయకులు బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. షాద్ నగర్ లో నిర్వహించిన సమావేశంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన ముఖ్యనాయకులు వారి అనుచరులతో కిషన్ రెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి వారితో మాట్లాడుతూ.. బిజెపి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని, ఇంటింటికీ మోదీ ప్రభుత్వ పథకాలు, పదేండ్ల పాలనను వివరించాలని సూచించారు.