Eatala

కబ్జాకోరులపై శివాలెత్తిన ఈటల

25 ఏళ్లకు పైగా సుదీర్ఘ రాజకీయంలో శాంతమూర్తిగా పేరుపడ్డ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ కబ్జాకోరులపై సీరియస్ అయ్యారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై చేయి చేసుకొని పేదల భూములను కబ్జా పెడితే చూస్తూ ఊరుకోనని తేల్చి చెప్పారు. దాదాపు 30 ఏండ్ల నుంచి మల్కాజ్‌గిరి ఏకశిలానగర్లో ఉంటున్న 2,076 మంది పేదల ప్లాట్లు కబ్జాపెట్టి ఓ ‘రియల్’ వ్యాపారి ఇబ్బంది పెడుతున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు పేదల పక్షాన కాకుండా ‘రియల్’ వ్యాపారులకే మద్దతుగా ఉన్నారు. దీంతో సదరు ‘రియల్’ బ్రోకర్ స్థానిక నేతలను పట్టుకొని, వందమంది గూండాలను, 10 కుక్కలను పెట్టి ఏకశిలనగర్ వాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీంతో వారు స్థానిక ఎంపీ అయిన ఈటల రాజేందర్‌ను ఆశ్రయించారు. అయినా వెనక్కు తగ్గకుండా గూండాలు వచ్చి ఎంపీ ఏం పీకుతాడు అని మహిళలను బెదిరించారు.

ఈటల రాజేందర్ ఏకశిల వెంచర్ సందర్శనకు వెళ్లిన సమయంలో ఓ చిరుద్యోగి.. రూ.40 లక్షలు పెట్టి కట్టుకున్న తన ఇల్లును కూలగొట్టాలని చూస్తున్నారని, తన ఇల్లు చూడాలని కోరారు. ఈ క్రమంలో ఈటల అటుగా వెళ్లగా, 20 మంది గూండాలు బీరు సీసాలు అక్కడ పెట్టి, తాగుతూ ఏం చేస్తారు రా అన్నట్టు చూశారు. 2 నెలలుగా తమ మీద దుర్మార్గాలు చేస్తున్నది వీరేనని బాధితులు చూపించగానే ప్రజల ఓట్లతో గెలిచిన బిడ్డగా ధర్మాన్ని కాపాడటానికి ఈటల ఆ గూండాలకు పనిష్మెంట్ ఇచ్చారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలోని 149 ఎకరాల్లో ఉన్న ఏకశిలా నగర్‌ లో జరిగిన ఈ సంఘటన తెలంగాణ వ్యాప్తంగా చర్చానీయాంశమైంది. పేదల భూములు కబ్జా పెట్టిన వారిని కొట్టడాన్ని తాను తప్పుగా భావించడం లేదని ఈటల స్పష్టం చేశారు. తన 25 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎవరిమీద చేయెత్తలేదని, బూతులు తిట్టలేదని స్పష్టం చేశారు.

జరిగిన ఘటనలపై ఈటల రాజేందర్ మాట్లాడుతూ… ‘‘మల్కాజ్‌గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలానగర్ భూములు 1985లో ఆనాడు వివిధ సంస్థలలో పనిచేసే ఉద్యోగులు ఈ భూములు కొనుక్కున్నారు. మేడ్చల్ లోని ఘట్‌కేసర్ మండలం కొర్రెముల గ్రామంలో సర్వే నంబర్ 739 నుండి 749 వరకు 149 ఎకరాల భూమి ఉంది. 1985లో ఏకశిల నగర్ కాలనీ పేరుతో గ్రామపంచాయితీ అనుమతితో 2086 ప్లాట్లను లే-అవుట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు 2076 మంది 200 గజాల చొప్పున ప్లాట్లను కొనుగోలు చేశారు. 1985-2005 వరకు ఎటువంటి ఇబ్బందులు లేవు. 2005లో ఓనర్లే 47.25 ఎకరాల భూమిని ఎం.ఏ. రాజు, ఏ. వెంకటేశ్, ఏ. విజయభాస్కర్ పేరుమీద సేల్ డీడ్ చేసారు. 2006లో ఈ ముగ్గురు భూమిని కొన్నట్లుగా దొంగ డాక్యుమెంట్లు సృష్టించారు. పంచాయతీరాజ్ డీపీఓను మేనేజ్ చేసి అవి ప్లాట్లు కాదని వ్యవసాయ భూమిగా నమోదు చేయించారు. దీనికి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేశారు. అది వ్యవసాయ భూమి కాదని 2010లో కోర్టు తీర్పునిచ్చింది. హర్ష కన్స్ట్రక్షన్ వారు ఈ లే-అవుట్‌లో 206 ప్లాట్లు కొనుగోలు చేసారు. మళ్లీ దొంగ డాక్యుమెంట్లు సృష్టించి రెవెన్యూ అధికారుల ప్రోద్బలంతో 47 ఎకరాలకు మ్యుటేషన్ సంపాదించారు. 739 నుండి 749 సర్వే నంబర్లలో ఉన్న భూమి వ్యవసాయ భూమి కాదని రాజు, వెంకటేష్, విజయభాస్కర్ తప్పుడు పత్రాలు ఇచ్చారని కోర్టు తన ఆర్డర్లో స్పష్టం చేసింది. ఇది వ్యవసాయ భూమి కాదని ప్లాట్లు అని తేల్చింది. అందుకు అనుగుణంగా అన్ని అనుమతులతో 700 మంది ఇళ్ళు కట్టుకున్నారు.

ఈ ప్రాంతంలో శ్రీనివాస్ అనే వ్యక్తి బ్యాంకులో లోన్ తీసుకుని రూ. 40 లక్షలతో ఇల్లు కట్టుకున్నాడు. అయితే, వాచ్ మెన్లుగా చెప్పుకుంటున్న 20-25 మంది గూండాలు దౌర్జన్యంగా ఆ ఇల్లును కూలగొట్టారు. ఆ తర్వాత రేకులషెడ్డును నిర్మించుకున్నా దానినీ నేలమట్టం చేశారు. రజిత అనే మహిళ తన కుమారుడితో కలిసి ఇక్కడ జీవనం కొనసాగిస్తోంది. ఆ ప్లాట్ ను సాఫ్ చేసుకుంటున్న క్రమంలో గూండాలు వచ్చి దౌర్జన్యం చేశారు. రియల్టర్లు, గూండాల దౌర్జన్యం గురించి మహిళ మా దగ్గరకు వచ్చి మొర పెట్టుకున్నారు. దాంతో బాధితులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లాం. ఆ గూండాలు వెనక్కితగ్గకుండా దౌర్జన్యంగా వ్యవహరించారు. అందుకే ఆ గూండాలపై నాలాంటి వారు చేయి ఎత్తాల్సి వచ్చింది.

1980-1990 వరకు హైదరాబాద్ చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లో పేదలు తక్కువ ధరకు ఆ భూములు కొనుగోలు చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ భూముల ధరలు పెరగడంతో రియల్టర్లు ఆక్రమణలకు పాల్పడుతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పేదల భూములు గుంజుకునే ప్రయత్నం చేయడం దుర్మార్గం. భూ అక్రమాలపై పోలీసులు, రెవెన్యూ అధికారులు సమన్వయంగా పరిష్కరించి ఉంటే.. ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కాదు. బాధితుల పక్షాన మాలాంటి వాళ్లు నిలబడి చేయెత్తే పరిస్థితి వచ్చేది కాదు. వ్యవస్థ విఫలమైనప్పుడు బాధితుల తరఫున మేం కొర్రెముల గ్రామానికి వెళ్లి గూండాలను నిలువరించాల్సి వచ్చింది. కొర్రెముల గ్రామంలో ఇప్పటికే 60-70 శాతం ప్రజలు ఎల్ఆర్ఎస్ కట్టారు. ఖబడ్డార్.. గూండాల్లారా.. ప్రజలు వాళ్లకు సంబంధించిన జాగాల్లో ఇల్లు కట్టుకుంటే వాళ్లపై దౌర్జన్యం చేస్తే గూండాలు, భూ అక్రమార్కుల భరతం పడుతాం. చీల్చి చెండాడుతాం. మహిళలను, పేదవాళ్లను ఇబ్బందిపెట్టే అధికారం మీకు ఎక్కడిది..? లక్షల మంది పేద ప్రజలకు సంబంధించి ప్లాట్లు, భూములకు సంబంధించిన వ్యవహారం ఇది. పైసాపైసా కూడగట్టుకుని చిన్న ఉద్యోగులు, ప్రజలు కొనుగోలు చేసిన భూములను ఆక్రమించడం దుర్మార్గం. ఇప్పటికైనా పోలీసు అధికారులు బాసుల కోసం బానిసల్లా పనిచేయకూడదు. ఇలా వ్యవహరిస్తే ఎంతోమంది జైలుపాలయ్యారనేది గుర్తుపెట్టుకోవాలి. బాసుల ఆదేశాలే మీకు శిరోధార్యం కాదు.. పాటించాల్సింది చట్టాన్ని, న్యాయాన్ని. మాకు వ్యక్తుల పట్ల, వ్యవస్థల పట్ల ఎటువంటి ధ్వేషం లేదు.. దుర్మార్గాలు, అన్యాయం చేస్తున్నవారి పట్లే మా ద్వేషం. కొర్రెముల ప్రజానీకాన్ని రెండుసార్లు కాపాడింది కోర్టు మాత్రమే. చట్టాల మీద సంపూర్ణ విశ్వాసం మాకుంది. పిడికెడు మంది చేస్తున్న వ్యవహారంతో వ్యవస్థనే తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాధితుల పక్షాన నిలిచిన మాపై కేసులు పెట్టడం కాదు.. 2005లో దొంగ డాక్యుమెంట్ల సృష్టికర్తలపై, దానికి సహకరించిన అధికారులు, భూములను అమ్ముకున్న ఓనర్లు, బ్రోకర్ల మీద కేసులు పెట్టాలి. మహిళల ఆత్మగౌరవాన్ని కించపర్చిన వాళ్లు, పేద ప్రజల రక్తం కళ్లజూనివారిపై ఖచ్చితంగా నాలాంటి కన్నెర్ర జేస్తారు. నాలాంటివాళ్లపై కేసులు పెడ్తారా..? తెలంగాణ ఉద్యమంలో నాపై 150 కేసులు ఉన్నాయి. ఇది మరో కేసు అవుతుంది. నా తెలంగాణ ప్రజల కోసం ఎన్ని కేసులనైనా ఎదుర్కొంటా.’’ అని అన్నారు.

అక్రమార్కుల చేతుల్లో పేదల భూములు

‘‘సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు తమ్ముళ్లు హైదరాబాద్ చుట్టుపక్కల భూములను పంచుకుంటున్నారన్న ఆరోపణలపై విచారణ జరిపిస్తే ఈ ఘటనల వెనుక ఎవరున్నారో బయటకు వస్తుంది. ఆనంద్‌బాగ్‌లో 50 ఏళ్ల నుంచి నివసిస్తున్న ఓ వ్యక్తికి సంబంధించిన 200 ఎకరాల భూమిని 300 గూండాలు ఆక్రమించుకుని, ఇల్లును, కట్టడాలను నేలమట్టం చేశారు. దీనిపై సీపీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేసినా పరిష్కరించలేదు. పోలీసులు బాసుల ఆదేశాలు పాటిస్తున్నారు తప్పితే బాధితులకు న్యాయం చేయడం లేదు. హైదరాబాద్‌లో మొత్తం ఎన్ని లే-అవుట్‌లు ఉన్నాయో ఈసీ సర్టిఫికెట్ ఉంటుంది. దాన్ని పరిశీలిస్తే భూములు వివరాలు స్పష్టంగా తెలుస్తాయి. కాళేశ్వరం మీద పెట్టిన డబ్బుల కంటే వందల రెట్లు సంపద భూ ఆక్రమణల ద్వారా నడుస్తోంది. ఇప్పటికైనా పాత గ్రామపంచాయతీ లే-అవుట్లకు సంబంధించి నోటీసులిచ్చి వ్యవసాయ భూములను రద్దు చేసి మళ్లీ ప్లాట్లన్నింటినీ పునరుద్ధరించాలని కోరుతున్నాం. గ్రామపంచాయతీల లే-అవుట్లకు ఎల్ఆర్ఎస్ స్కీం వచ్చినప్పటికీ ప్రభుత్వం దానిని సమర్థంగా, సక్రమంగా అమలు చేయకపోవడం వల్లే భూ అక్రమాల ఘటనలు జరుగుతున్నాయి. ధరణి వచ్చిన తర్వాత భూముల రెగ్యులరైజేషన్ ప్రక్రియలో లొసుగులతో పేదల భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లాయి. ప్రభుత్వ పెద్దల అండతో హైదరాబాద్‌లో లే-అవుట్లను కొల్లగొట్టిన ఘటనలపై కోర్టులు, హెచ్ఆర్సీకి, లోకాయుక్త లాంటి సంస్థలకు వెళ్లి ఫిర్యాదు చేస్తాం. న్యాయం చేయాలని కోరుతాం.’’ అని ఈటల రాజేందర్ అన్నారు. ఏకశిలానగర్‌తో పాటు బాలాజీనగర్, జవహర్‌నగర్, అరుంధతినగర్ పేదలు 6 నెలలుగా సమస్యల పరిష్కారం కోసం తిరుగుతున్నారని చెప్పారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇంత దౌర్జన్యమా? ఇంత దుర్మార్గమా? అని అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంకు ప్రజల మీద ప్రేమ ఉంటే సమగ్ర విచారణ జరిపించి ఎవరి జాగాలను వారికి ఇప్పించే ప్రయత్నం చేయాలని సూచించారు.