కాలం చెల్లిన కాంగ్రెస్ వ్యూహాలు
ఊహించినట్లుగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి ప్రసంగాలపై కాంగ్రెస్ మండిపడింది. సంపదను పునఃపంపిణీ చేయాలనే కాంగ్రెస్ ఆలోచనపై ఆయన దాడి చేశారు, ముస్లింలకు కోటా అనే ఆ పార్టీ విధానాన్ని ఓటర్లకు గుర్తు చేశారు. ఈ దాడిపై కాంగ్రెస్ కలవరం అర్థం చేసుకోదగిందే కానీ, దానికి దీటైన సమాధానం చెప్పే ప్రయత్నంలో ఆ పార్టీ నాయకత్వం కనబరుస్తున్న తడబాటు గమనార్హం. యథావిధిగా బిజెపిని విమర్శించేవారు తాము ఎప్పుడూ చెప్పే అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే వందేళ్లకు పైగా చరిత్ర గల కాంగ్రెస్ ఎందుకు ఈ విమర్శల విషయంలో రక్షణాత్మక వైఖరి వహించాల్సి వచ్చింది? ఎందుకు ఆ పార్టీ ఓట్లు సంపాదించడానికి మైనారిటీ కేంద్రిత విధాన రూపకల్పన, సోషలిజం, ప్రజల్లో భయాలు సృష్టించడం అనే మూడు కాలం చెల్లిన వ్యూహాల నుంచి బయటపడలేక పోతోంది?
ముస్లింలకు రిజర్వేషన్లా?
ప్రధాన మంత్రి ‘దాడి’పై కాంగ్రెస్ గగ్గోలు పెట్టినప్పటికీ మన రాజ్యాంగ నిర్మాతలు పూర్తిగా తిరస్కరించిన మత ప్రాతిపదిక రిజర్వేషన్ల ఆలోచనను విరమించుకున్నట్లు చెప్పలేకపోయింది. ‘జాతీయ వనరులపై మొదటి హక్కు మైనారిటీలకే ఉంటుంది’ అని మన్మోహన్ సింగ్ చేసిన తప్పుడు, అనాలోచిత ప్రకటనతో తాము ఏకీభవించడం లేదని పార్టీ గట్టిగా చెప్పలేకపోయింది. తన గురించి ముస్లింలు ఎలా ఆలోచిస్తారనే కాంగ్రెస్ ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇది వారికి చాలా కాలంగా ఉన్న అలవాటు. వారి ప్రపంచ దృక్కోణాన్ని దాదాపు ముస్లిం కేంద్రితమైనదిగా చేసింది.
అది ఉమ్మడి పౌరస్మృతి అయినా, అధికరణం 370 రద్దు అయినా కాంగ్రెస్ రాజ్యాంగం ఆధారంగా తన వైఖరి తీసుకోదు. పైన చెప్పినట్టు తాను ఏ వైఖరి తీసుకుంటే ముస్లింలు సంతృప్తి చెందుతారో అదే వైఖరి తీసుకోడానికి ప్రయత్నిస్తుంది. స్వాతంత్ర్యానికి పూర్వం జాతీయ గేయం, ‘‘వందేమాతరం’’, జాతీయ పతాకం వర్ణాలపై చర్చ జరిగిన సందర్భంలో కూడా కాంగ్రెస్ ముస్లిం కేంద్రిత దృక్పథంతోనే ఒక వైఖరి తీసుకుంది. కాంగ్రెస్ ఈ కాలంచెల్లిన ఆలోచనా చట్రంలో తనను తానూ బందీ చేసుకోవడం విషాదకరం. ఈ ఓటు బ్యాంకు రాజకీయాల వ్యూహాలు ఇప్పుడు ఫలితాలనివ్వడం లేదు.
నెహ్రూ, కాంగ్రెస్, సోషలిజం
1955లో ఆవడి సమావేశాల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ‘‘సామ్యవాద అభివృద్ధి నమూనా’’ని అధికారికంగా ఆమోదించింది. 1976లో రాజ్యాంగ నిర్మాతలను పూర్తిగా విస్మరించి, కాంగ్రెస్ అనవసరంగా రాజ్యాంగ పీఠికలో ‘సామ్యవాద, లౌకికవాద’ అనే రెండు పదాలను ప్రవేశపెట్టిన విషయాన్ని ఎలా మర్చిపోగలం? అప్పటి ఇందిరాగాంధీ వ్యవహారశైలికి, నేటి రాహుల్ గాంధీ విధానానికి పెద్ద తేడా లేదు. సామ్యవాదం పట్ల జవహర్లాల్ నెహ్రూకు ఉన్న ప్రేమ బహిరంగ రహస్యం. జనవరి 22, 1955న ఆవడి కాంగ్రెస్ సమావేశాల్లో నెహ్రూ చెప్పిన మాటలను రాహుల్ గాంధీ రాజకీయాలకు మూలాధారంగా పేర్కొనవచ్చు: “మనం కావాలనుకుంటే ప్రస్తుతం ఉన్న సంపదను విభజించడానికి సోషలిజం లేదా కమ్యూనిజం మనకు సహాయపడవచ్చు. కానీ భారతదేశంలో విభజించేందుకు అసలు సంపదే లేదు, పేదరికం మాత్రమే ఉంది, దాన్నే విభజించాలి.” కానీ వెంటనే ఆయన తన మనసులోని మాటను బయటపెట్టుకున్నారు. ఆయన ఇంకా ఇలా అన్నారు: ‘‘మనం సంపదను ఉత్పత్తి చేయాలి, ఆపై దానిని సమానంగా విభజించాలి.’’ నెహ్రూ మునిమనవడు ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాడు. భారతదేశాన్ని తిరిగి గతానికి తీసుకెళ్లాలని అతను కోరుకుంటున్నాడు.
కాంగ్రెస్ ‘అన్యాయ’ పత్రం
కాలం చెల్లిన సోషలిస్టు సిద్ధాంతాలు, ఆలోచనల పట్ల కాంగ్రెస్ వ్యామోహం ఎప్పటికీ పోదు. సంపద పునఃపంపిణీ గురించి రాహుల్ గాంధీ ఆలోచన సృష్టించిన గందరగోళం చాలదన్నట్టుగా మళ్ళీ సామ్ పిట్రోడా వారసత్వపు పన్ను గురించి మాట్లాడారు. ఆ చట్టం వస్తే మరణించిన వ్యక్తి ఆస్తిలో 50 శాతం ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆయన చెప్పినట్టు ఇతరులకు పంపిణీ చేస్తుంది. నిజమే, ఈ విషయాలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో భాగం కాదు. కానీ అప్పుడు కూడా 1975 నాటి ఎమర్జెన్సీ లేదా షా బానో కేసు తర్వాత చేసిన చట్టం వారి మ్యానిఫెస్టోలలో ఎప్పుడూ కనిపించలేదు. కాంగ్రెస్ కు రహస్య ఎజెండా ఉందని విమర్శకులు అనుమానించడానికి కారణం ఉంది. ఓటర్లు తప్పనిసరిగా కాంగ్రెస్ ఆంతర్యాన్ని పసిగట్టాలి. వారి నాయకుల ప్రకటనలల్లోని అంతరార్థాన్ని గ్రహించాలి. పార్టీ ‘న్యాయ పత్ర’ అని చెప్పుకునే మేనిఫెస్టో నిజానికి ‘అన్యాయ పత్రం’ అని గ్రహించాలి.
ప్రజల్లో భయాందోళనలు
ప్రజల్లో భయాలను సృష్టించడం కాంగ్రెస్ కు అలవాటైన వ్యూహాలలో మూడవది. సోషలిజం పట్ల కాంగ్రెస్ నాయకుల తీవ్ర వ్యామోహం, రాహుల్ గాంధీ ప్రసంగాలు, ఇండీ కూటమి అధికారిక-అనధికారిక ముఖాలు, ఇప్పుడు వాటికి తోడు వారసత్వ పన్ను గురించి సామ్ పిట్రోడా ఇంటర్వ్యూలు కాంగ్రెస్ రహస్య ఎజెండా గురించిన భయాల్లో నిజం ఉందేమోనని ప్రజలు భావించేలా చేస్తున్నాయి. రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారనే ఆరోపణలతో బిజెపి గురించి ప్రజల్లో భయాలు సృష్టించేందుకు కాంగ్రెస్ శాయశక్తులా కృషి చేస్తోంది. నిజానికి ఇంతకుముందు అనేకసార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తన హయాంలో 80 సార్లు రాజ్యాంగాన్ని సవరించింది. అంతేకాకుండా చట్టం విధించిన రిజర్వేషన్ల శాతం పరిధిలోనే ముస్లింలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలన్న కాంగ్రెస్ తపన కారణంగా ఎస్సీ, ఎస్టీ, ఓబిసిలకు తీవ్రమైన అన్యాయం జరుగుతోంది. అంతేకాదు, ఇది రాజ్యాంగ విరుద్ధం కూడా.
విచారకరమైన విషయం ఏమిటంటే కాంగ్రెస్కు అధికారమే పరమావధి. భారతదేశంలో దీర్ఘమైన చరిత్ర ఉన్న ఈ పార్టీ రాజకీయ అధికారాన్ని కోల్పోగానే ఆలోచించడం మానేస్తుంది. రాజకీయ సంకల్పాన్ని కోల్పోతుంది. అధికారం ఇచ్చే ప్రయోజనాలను దండుకోవడమే మాత్రమే కాంగ్రెస్ లక్ష్యం. అధికారమే దానికి టానిక్కులా పని చేస్తుంది. పర్యవసానంగా అది సైద్ధాంతికంగా కాలం చెల్లిన, సంస్థాగతంగా చీలిపోయిన, మానసికంగా ఓడిపోయిన పార్టీగా మారిపోయింది. అయితే కొత్త ఎజెండా ఏమీ లేనప్పుడు కాంగ్రెస్ పాత ఎజెండాలపై ఆధారపడుతుంది. ఈ ఎజెండాలలో కొన్ని బయటికి స్పష్టంగా కనపడతాయి, కొన్ని రహస్యంగా ఉంటాయి.
వినయ్ సహస్రబుద్ధే,
రాజ్యసభ మాజీ సభ్యుడు