Jitan Ram Manjhi

కేంద్రం, రాష్ట్రాల మధ్య సామరస్యంతోనే ఎంఎస్ఎంఈల అభివృద్ధి

Manjhiఎంఎస్ఎంఈల వాటా జీడీపీలో 50 శాతానికి చేరుకోవాలని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి జీతన్ రాం మాంఝీ స్పష్టం చేశారు. ఆర్థిక సహాయం లేదా క్లస్టర్ కేంద్రాలను స్థాపించడం లేదా ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను (పిపిపిలు) ప్రోత్సహించడం… దేశవ్యాప్తంగా ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేందుకు విభిన్న వ్యూహాలను అమలు చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు. గ్రామాల్లో వ్యాపారాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో అనేక సాంకేతిక, క్లస్టర్ కేంద్రాలు లేదా డెవలప్‌మెంట్ కమిషనరేట్ల ఏర్పాటు జరిగిందని తెలిపారు. చిన్న పరిశ్రమల స్థాపనను సులభతరం చేయడానికి కేవీఐసి (ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్), కొబ్బరి పరిశ్రమ, ఎన్ఎస్ఐసి (జాతీయ చిన్న పరిశ్రమల సంస్థ) వంటి సంస్థలను ఏర్పాటు చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక వృద్ధి వేగవంతమైందని అన్నారు. ఒక జాతీయ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో మాంఝీ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం (ఎస్ఎంఎస్ఈ) గురించి, దాన్ని బలోపేతం చేసే మార్గాల గురించి మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు:

ప్ర: స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ), ఎగుమతులు, కొత్త తరానికి ఉపాధి అవకాశాలకు మద్దతు పరంగా భారత్ లో ఎస్ఎంఎస్ఈ రంగం పాత్ర ఎంత ముఖ్యమైనది?

జ: ఉపాధి కల్పన, ఆర్థిక కార్యకలాపాల విషయంలో భారతదేశంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పెద్ద పరిశ్రమలకు మించిన ప్రాధాన్యం ఉంది. దేశవ్యాప్తంగా దాదాపు 25,000 పెద్ద పరిశ్రమలు ఉన్నప్పటికీ, ఎంఎస్ఎంఈ రంగంలో ఉపాధి పొందుతున్న కోట్ల మందితో పోలిస్తే అవి తక్కువ మందికే ఉపాధి కల్పిస్తున్నాయి. ఎంఎస్ఎంఈలలో మొత్తం 6 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. ఈ రంగం భారతదేశ జీడీపీలో గణనీయమైన వాటా కలిగి ఉంది. ఉత్పాదకతలో 30 శాతం వాటా కలిగి ఉంది. అయినప్పటికీ దేశ జనాభా 140 కోట్లను పరిగణనలోకి తీసుకుంటే, పేదల స్థితిగతులను మెరుగుపరచడానికి కనీసం 80-90 కోట్ల మందికి ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ ఉపాధి లక్ష్యాన్ని సాధించడానికి ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడంపై దృష్టి కేంద్రీకరిస్తున్నాం. చారిత్రాత్మకంగా భారతదేశం స్థానిక పరిశ్రమలతో అభివృద్ధి చెందింది. చేతివృత్తుల వారు, విభిన్న గ్రామీణ వ్యాపారాలు ప్రజలకు జీవనోపాధి కల్పించేవి. ప్రభుత్వ ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, శిక్షణ, ఆర్థిక సహాయం ద్వారా చిన్న సంస్థలకు మద్దతు ఇవ్వడంపై గ్రామీణ ప్రజల కోసం సమతుల్య జీవనోపాధిని సాధించడం అనేది ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. మార్కెట్ సంస్కృతిని అలవర్చుకోకుండా గ్రామీణ సంస్కృతిని మళ్లీ అలవర్చుకోవాలి.

ప్ర: దేశ జీడీపీలో ఎంఎస్ఎంఈల వాటా 50 శాతానికి చేరుకోవడం, భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా చేయడంలో చిన్న పరిశ్రమలు కీలక పాత్ర వహించే విషయంలో ప్రధాన సవాళ్లు ఏమిటి?

జ: ఎంఎస్ఎంఈల వాటా జీడీపీలో 50 శాతానికి చేరుకోవాలని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలి. ఖాదీ, కొబ్బరి, గ్రామీణ పరిశ్రమలను ప్రోత్సహించడంపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించడం, గ్రామీణ ప్రాంతాలను సాధికారీకరించి, తక్కువ ఖర్చుతో వస్తువుల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు, స్థానికంగా వస్తువుల లభ్యతను పెంచే విషయంలో ప్రభుత్వ నిబద్ధతను సూచిస్తుంది. స్థానిక అవసరాలను సమర్థంగా తీర్చుకోవడం ద్వారా భారతదేశం తన సామర్థ్యాలను పెంచుకుని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న లక్ష్య సాధనకు పునాదులు వేసుకుంటుంది.

ప్ర: అటువంటి సంస్థలను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యం అయితే వివిధ రంగాలకు చెందిన ఎంఎస్ఎంఈల కోసం విడిగా ఎలా విధానాలు రూపొందిస్తారు? కొత్త పారిశ్రామికవేత్తల కోసం పర్యావరణ వ్యవస్థను పెంపొందించడంపై మీ దృక్పథం ఏమిటి?

జ: ఈ రంగంపై గతంలో ఎవరూ పెద్దగా శ్రద్ధ చూపలేదు. అయితే, ఏ పనీ చిన్నది కాదు. ఎంఎస్ఎంఈలను విడివిడిగా ప్రోత్సహించడం, మద్దతు ఇవ్వడం చాలా కీలకం. నేడు వారికి ఆర్థిక సహాయం, శిక్షణ, ప్రచారం అవసరం. చిన్న, మధ్యతరహా పరిశ్రమలలో యువతకు ఉపాధి కల్పించడం చాలా కీలకం. ‘వ్యవసాయాన్ని పరిశ్రమగా మార్చండి, ఆధారపడటం కంటే స్వయం ఉపాధికి ప్రాధాన్యం ఇవ్వండి’ అనే సూత్రం మనకు మార్గదర్శకం కావాలి. చాలా మంది సాంప్రదాయ ఉద్యోగాలకు ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ స్వల్ప పెట్టుబడి వ్యాపారాలు కూడా విలువైనవే. గ్రామీణ ప్రాంతాలపై ప్రధాని దృష్టి సారించడం వల్ల గ్రామాల్లో వ్యాపారాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో అనేక సాంకేతిక, క్లస్టర్ కేంద్రాలు లేదా డెవలప్‌మెంట్ కమిషనరేట్ల ఏర్పాటు జరిగింది. చిన్న పరిశ్రమల స్థాపనను సులభతరం చేయడానికి కేవీఐసి (ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్), కొబ్బరి పరిశ్రమ, ఎన్ఎస్ఐసి (జాతీయ చిన్న పరిశ్రమల సంస్థ) వంటి సంస్థలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేశాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను చురుకుగా ప్రోత్సహిస్తూ అవసరమైన మద్దతు ఇస్తున్నాయి.

ప్ర: ఈ రంగంలో ఆవిష్కరణలు, కొత్త టెక్నాలజీ, ఎగుమతులకు ప్రాధాన్యం ఇవ్వడానికి మీరు ఏ ప్రణాళికలు రూపొందించారు? భవిష్యత్తు కోసం సామర్థ్యాల పెంపునకు ఏ చర్యలు తీసుకుంటారు?

జ: సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందినా ఇప్పటికీ చాలామంది చేత్తో కుట్టిన దుస్తులనే ఇష్టపడతారు. వీటిని కుట్టడం నగరాల కంటే గ్రామాల్లోనే చౌక. అందువల్ల గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టడం చాలా కీలకం. స్కిల్ ఇండియా కార్యక్రమం ఫలితంగా మన దేశం ఇప్పటికే ముఖ్యమైన నైపుణ్యాలను కలిగి ఉంది. ఇతర దేశాల నుండి పెద్దగా నేర్చుకోవాల్సిన అవసరం మనకు లేదు. సాంకేతికతను ప్రోత్సహించడం కీలకమైనప్పటికీ, గ్రామాల్లో ప్రబలంగా ఉన్న సంప్రదాయ నైపుణ్యాలను పునరుద్ధరించడం కూడా అంతే ముఖ్యం. ఉదాహరణకు, రసాయన ఎరువులకు బదులుగా కంపోస్ట్ ఎరువుకు మారడం మన దేశం మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఉదాహరణకు కొబ్బరి చిప్పల నుండి తయారైన ఉత్పత్తులకు గణనీయమైన మార్కెట్‌తో కొబ్బరి పరిశ్రమ విస్తృత అవకాశాలను కలిగి ఉంటుంది.

ప్ర: ముద్ర రుణాలు, రుణ హామీ పథకం, ప్రధానమంత్రి విశ్వకర్మ, ఇటీవల ప్రారంభించిన టీమ్ స్కీమ్ వంటి కేంద్ర పథకాలకు సంబంధించి తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి?

జ: పెద్ద సంస్థలలో అవినీతి వంటి సమస్యలను పరిష్కరిస్తూనే బ్యాంకులకు మద్దతు ఇవ్వడానికి మేం కట్టుబడి ఉన్నాం. సవాళ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం సకాలంలో సబ్సిడీలను అందజేస్తోంది. అయితే రెండు నుంచి నాలుగు నెలలు వీటి చెల్లింపులో ఆలస్యం ఉండవచ్చు. దీనిని పరిష్కరించడానికి లక్షల మంది మంది మహిళలు చురుకుగా పాల్గొంటున్న స్వయం సహాయక బృందాలకు ఎక్కువ పాత్ర కల్పిస్తున్నాం. సాధారణంగా 100-200 మంది సభ్యులతో కూడిన ఈ బృందాలు, చిన్న మొత్తాల మూలధనాన్ని పోగుచేసి రూ.10,000 నుంచి రూ.20,000 వరకు రుణాలను అందిస్తాయి. ఇవి బృందంలోనే తిరిగి చెల్లించబడతాయి. ఈ నమూనా అత్యంత విజయవంతమైనదిగా నిరూపితమైంది. సూక్ష్మ, చిన్న పరిశ్రమల బృందాలు బయటి వారిపై ఆధారపడకుండా ప్రభుత్వం నుంచి గరిష్ట ప్రయోజనం పొందేలా చూడటానికి ప్రాధాన్యమిస్తున్నాం. వ్యవసాయ క్రెడిట్ కార్డ్‌ల మాదిరిగానే, మేం ఎంఎస్ఎంఈ కార్డ్‌ల ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం. కార్డుదారులు బ్యాంకులను సంప్రదించినప్పుడు ఈ కార్డ్‌లు ఆటోమేటిక్గా రుణాల ఆమోదానికి వీలు కల్పిస్తాయి. సాంప్రదాయ బ్యాంకింగ్ మార్గాలపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ కార్యక్రమం లక్ష్యం.

ప్ర: చాలా మంది పారిశ్రామికవేత్తలు మెరుగైన సౌకర్యాల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. ఈ వలసలను నిరోధించడానికి మీరు ఏ వ్యూహాలను ప్రతిపాదిస్తున్నారు?

జ: ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా సాంకేతిక కేంద్రాలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఏదేమైనా పశ్చిమ బెంగాల్ వంటి కొన్ని రాష్ట్రాల్లో సమస్యలు తలెత్తుతాయి, ఇక్కడ అధికారం యంత్రాంగం నుంచి ఎదురయ్యే అడ్డంకుల కారణంగా భూమిని పొందడం సంక్లిష్టంగా ఉంటుంది. అటువంటి సందర్భాలలో ఈ కేంద్రాలను మరింత సహకారం అందించే రాష్ట్రాలకు మార్చాలని మేం భావిస్తున్నాం. ఎంఎస్ఎంఈల అభివృద్ధికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య సామరస్యం అవసరం. ప్రస్తుతం ఎంఎస్ఎంఈల అభివృద్ధిలో అసమతుల్యత ఉంది, ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణ భారతదేశంలో మరింత పురోగతి కనిపిస్తోంది. ఈ సమస్యకు రాజకీయ దూరదృష్టి, రాష్ట్ర నాయకత్వంతో సంప్రదింపులు అవసరం. ఉదాహరణకు, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఎంఎస్ఎంఈ కార్యక్రమాల సమర్థత, ప్రభావం గురించి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. రాష్ట్రాలలో సమానమైన అభివృద్ధికి అవకాశాలు కల్పించాలన్నదే మా ఉద్దేశం. ఆర్థిక సహాయం కానివ్వండి, క్లస్టర్ కేంద్రాలను స్థాపించడం లేదా ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను (పిపిపిలు) ప్రోత్సహించడం కానివ్వండి దేశవ్యాప్తంగా ఎంఎస్ఎంఈల వృద్ధిని ప్రోత్సహించేందుకు విభిన్న వ్యూహాలను అమలు చేయడానికి, వాటి నుంచి నేర్చుకోడానికి మేం కట్టుబడి ఉన్నాం.